మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను ఆసక్తి రేకెత్తించిన ఉప ఎన్నికలు ముగిసాయి. 18 అసెంబ్లీ సీట్లలో 15, ఒక పార్లమెంటు సీటును కైవసం చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ గెలుపు కూడా అత్తెసరి మెజారిటీతో కాకుండా అద్భుతమైన మెజారిటీతో కైవసం చేసుకుంది. వెర్రి గొర్రెల మందలా, గుడ్డెద్దుల్లా జనాలు వోట్లు వేసి అవినీతిపరులను గెలిపించారని కొందరు ఆక్షేపిస్తే, మరికొందరు ఇదో నీటి బుడగలాంటి సానుభూతి గెలుపుగా అభివర్ణించారు. ఎవరెలా ఏడ్చినా, కాంగ్రెస్ తెలుగుదేశంలకు కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లతో వైయస్సార్ పార్టీ గెలిచిందనేది సుస్పష్టం. ఎవరి పార్టీకి అనుగుణంగా వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి కాబట్టి, ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లా, సానుభూతిగా వచ్చిన ఓట్లా అనే లెక్కలు ఇప్పుడిప్పుడే తెమల్చరు.
వైయస్సార్ మరణం దరిమిలా, గత రెండున్నర ఏళ్ళుగా అసలు రాష్ట్రంలో ఓ ప్రభుత్వం ఉన్నదా అనే సందేహం కలిగేంతగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతున్నది. రోశయ్య పగ్గాలు పట్టిన సమయంలో రేగిన తెలంగాణా చిచ్చు ఆరనే లేదు. ఆ తర్వాత కుర్చీ ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నత్తకన్నా నాలుగింతల నిదానంగా నడుస్తుండటమే కాకుండా రోజుకో అవినీతి పుట్ట పగులుతూ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరౌతున్నది. ఈయన ప్రభుత్వంలో దాదాపుగా మచ్చలేని మంత్రంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జగన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సెలవిచ్చిన పెద్దలు, మద్యం మాఫియాకు సంబంధించి బొత్స విషయానికొచ్చేసరికి తెరచాటు వ్యవహారాలతో చట్టానికి పని పెట్టనేలేదు! బహుశా బొత్స కూడా రెఫు జగన్ తో కలిస్తే, చట్టం తన పని తాను చేసుకోటానికి బయలుదేరుతుందేమో!
ఇక అసలు విషయానికి వద్దాం. జగన్ ను సానుభూతి ఓట్లే గెలిపించాయంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే, ఈ సానుభూతి ఓట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇందిరా గాంధీ పోయినప్పుడు రాజీవ్ గాంధీకి వచ్చినంతగా, రాజీవ్ గాంధీ పోయినప్పుడు కాంగ్రెస్ కు రాలేదు. బహుశా, రాజీవ్ పోయినప్పుడు గాంధీ పుత్రులు ఎన్నికల రాజకీయాల్లో లేకపోవటం కారణం అయ్యుండవచ్చు అని సరిపెట్టుకున్నా, ఎంటీఆర్ పేరుతో పార్టీలు పెట్టి అడ్రస్ గల్లంతైన లక్ష్మి పార్వతి, హరికృష్ణలు కూడా కేవలం సానుభూతి వల్లే ఓట్లు రాలవనే తెలుసుకొని ఉంటారు. అలానే 2003 లో అలిపిరి ఘటనతో సానుభూతి సంపాదించుకోవాలని చూసిన చంద్రబాబు నాయుడుకు కూడా నిరాశే మిగిలింది. జగన్ కు సానుభూతి ఓట్లు పడ్డాయంటే, ఏ ఏ కారణాలతో పడ్డాయనుకోవాలి?? ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి చనిపోయాడనా? ఆ ముఖ్యమంత్రి మరణించిన తర్వాత జగన్ ను వారసుడిగా ప్రకటించి ముఖ్యమంత్రి చేయలేదనా? కోర్టుల్లో కేసులు పెట్టారనా? సి.బి.ఐ.తో అరెస్టు చేయించారనా? అసలు సానుభూతి ఓట్లు పడటానికి పైన చెప్పిన ఒక్క కారణమైనా సరైనదని అనిపిస్తోందా?
సాథారణంగా రాజకీయాల్లో కొత్త పార్టీ వస్తున్నదంటే, దాన్ని అణగదొక్కటానికే అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా అరిచే పార్టీలను ఎవరూ పట్టించుకోరు. ఉదాహరణకి లోక్ సత్తాలాంటి పార్టీలన్నమాట. కానీ, కొత్త పార్టీ కరుస్తుందనే అనుమానముంటే, దానికి పాతర వేయటానికే చేయని ప్రయత్నం అంటూ మిగలదు. అలా చరిత్రలో కనుమరుగైన పార్టీలు చాలానే ఉన్నాయి. అటువంటిదే ప్రజారాజ్యం కూడా. ప్రజారాజ్యంలో కోవర్టులను ప్రవేశపెట్టి, ఆ నేతలచేతే చిరంజీవిపైన దుమ్మెత్తి పోయించి, డబ్బులకు సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు గుప్పించి, చిరంజీవిని భయపెట్టి కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు! ఇలాంటి సామ దాన బేధ దండోపాయాలన్నీ జగన్ విషయంలో వికటించాయి. సై అంటే సై అన్న జగన్ ప్రజల అభిమానాన్ని గెల్చుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, తనని ఒక్కడిని చేసి అందరూ యుద్ధం ప్రకటించారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటంలో జగన్ కృతకృత్యుడయ్యాడు. ఇది కూడా జగన్ కు అనుకూలించిన మరో అంశం.
ఈ ఎన్నికల సందర్భంలో ప్రజల ముందు ఉన్న ఛాయిస్ లు మూడు. అసమర్ధులు, అవినీతిపరులతో నిండిన ప్రభుత్వానికి ఓటు వేయడమా, ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మకంగాను, నిర్మాణాత్మకంగాను వ్యవహరించలేక అవకాశవాది పార్టీగా ఉన్న తెలుగుదేశానికి ఓటు వేయడమా, సమర్ధుడిగా భావించబడుతున్న, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు ఓటు వేయడమా? ప్రజలు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు. ఈ తీర్పు సానుభూతికో మరోదానికో అంటగట్టాలనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఫలితాలను సక్రమంగా సమీక్షించుకుని, ఆచరణలో మార్పు చూపించగలిగినప్పుడే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రధాన ప్రతిపక్షానికి 2014 ఎన్నికలు ఆశావహంగా ఉండే అవకాశాలున్నాయి.
ఏదేమైనా, దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త శకం మొదలయ్యింది. అంతా ఒకే తాను ముక్కలే అయినా, మన రాజకీయ నాయకుల్లో నిజాయితీపరులని ఏరటం గొంగట్లో తింటు వెంట్రుకలు ఏరటం లాంటిదే అయినా, కొత్త పార్టీ కనుక ప్రజలు జగన్ కు ఓ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని జగన్ 2014 వరకు ఎలా అందిపుచ్చుకోగలడో కాలమే చెప్పాలి. ఎ టు జెడ్ లాంటి కాంగ్రెస్ పార్టీలలా కాకుండా, వైయస్సార్ కాంగ్రెస్ తన ఉనికి చాటుకుంటుందని, తిరిగి కాంగ్రెస్ లో కలిసిపోదని, ప్రజలకు సరైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని ప్రస్తుతానికి ప్రజలు ఆశిస్తున్నారు.