మొన్నోదినాన మంచంమీద పండుకోని సుట్ట కాలుత్తా వుండా. మా ఇంటిది బైట కట్టమీన కూకోని బియ్యం సెరగ్తాండాది.
వో పోరగాడొచ్చి “ఆంటీ! మీ తాత వుండాడా?” అని జోరుగా అరిసిండు.
“మా తాత యెవడ్రా” అని ఇంటిది గట్టిగా అర్సింది. “గదే ఆంటీ మీ ఇంటి యజమాని” అన్నాడు పోరగాడు.
“ఆరినీ! మా ఆయన నాకు తాతెట్టైండ్రా?” అని మల్లీ అర్సింది మా ఇంటిది.
“నీకేమో జుట్టు నల్లంగుందాయ. ఆయన్కెమో వూడిపోగా మిగిలింది తెల్ల జుట్టే గదో?” అని సెప్పి “మా అయ్య పిలత్తాండాడని నీ తాతకి సెప్పు ఆంటీ” అని ఎల్లిపోనాడు.
లోనికొచ్చినాంక ఇహ సూస్కో మా ఇంటి ఇల్లాలి నవ్వు.
నవ్వతది. ఆగిపోతది. నా మొగం సూత్తది. తలకాయ దించుతది. నవ్వతది. ఆగిపోతది.
“యెహె! అంత నవ్వమాక నీ తొర్రిపల్లు సూడలేక సత్తున్నా” అన్నా నేను.
“తాతగొరొ! జర ఎల్లుండ్రి గోపాలం అయ్య పిలత్తాండాడు” అని సెప్పి నవ్వుకుంటా ఎల్లింది ఇల్లాలు.
రెండు నిమిసాలు దొర్లినయోలేదొ ఉన్నపాలిగా నాకు కోపముర్క బట్టినాది. మా సంటిది అద్దం ముక్కోటి తెచ్చి నా ఎదరకున్న ఇస్టూలు మీద పెట్టిపోయింది. అద్దంముక్కలో నా ముక్కాలు బాగం మొకం తొంగిసూత్తాంది. దాని తలకాయపైన సొగం ఎంట్రికలు రాలిపోతే మిగిలిన సొగం తెల్లంగ మిరమిరలాడ్తాన్నాయి. ఆడ్నుంచి లేసి పక్కనబోయి కూకొన్నా.
ఆడ కూకొన్నాక కోపం సెంగడబింగడ ఎగ్రబట్టినాది.
ఎదరగా బీరువా వాకిలికున్న నిలువాటి అద్దంలో నా మొత్తం మొకం పిచ్చిగా సూత్తా అగుపడ్నాది. “ఆంటీ! నీ తాత” అన్న పోరగాడు ఎనకాల్న నవ్వతాన్నట్టు అనిపింసినాది.
ఛస్! అని లేసి బైటపోయి కట్ట మీన కూకొన్నా.
“తాతా! ఈ ఎడ్రెసు ఏడొస్తదో సెప్పరాదె!” అని బ్యాగు తగిలింసుకొన్న పిలగాడోడు అడిగిండు. మొగం తిప్పేసుకోని “నాకు తెల్వదు పోరా” అన్నా.
తలవాకిలి కాడ నక్కి నిల్సున్న ఇల్లాలు కిచకిచ నవ్వింది.
“కోతి లెక్కన గట్లెందుకే నవ్వతా” అని సిరాకు పడినా.
“కూతురి పెల్లింకా సేకండానే తాతైన నిన్ను సూసి…” అని సెప్పిపోయింది.
కండ్లు మూస్కోని గమ్మునుండిపోనా.
సల్లంగా నా సెయ్యికేదో తగిల్నాది. సూస్తే పక్కింటి సిన్నది. మూడేళ్ళుంటది. సేతిలో సిన్న సంచీ.
“తాతా! బొమ్మలున్నయ్. ఆడుకొందామా” అంది.
నిజం సెప్పొద్దు పిల్ల మొగం సూడంగానే నా కోపం కట్ట దిగి లగెత్తిపోనాది.
“యేమాటాడు కొందాం సిట్టీ” అన్నా.
“ఊ…నువ్వేమో సిన్న పిలగాడివి. నేనేమో అమ్మ!” అంది.
నే ఎగ్రి గంతేసినా.
అహా….తెల్వకడగతాండా….నే గంతేస్తే మీకు నవ్వు రాలేదు గందా !!!
*****