నటరాజ రామక్రిష్ణ గురువు నాయుడుపేట రాజమ్మ.
ఆమె తన జీవితాన్ని శ్రీ కాళహస్తీశ్వరునికి అంకితం చేసిన పుణ్యవతి. క్షేత్రయ్య పదాలను గానము చేయాల్సిన తీరు తెన్నులను, అభినయ విధానములను, వాటిని ముగ్ధ మనోహరముగా రామక్రిష్ణకు ఆమె నేర్పారు.
అప్పటి వరకూ ఆనాటి సంఘం లో నర్తకీ, నర్తకులకు ఛీత్కారాలు ఎదురయ్యేవి. వారి అమేయ కృషి కారణాన – ప్రజా బాహుళ్యములో ఆరాధించబడే స్థాయికి నాట్య కళను ఉచ్ఛ స్థితికి చేరుకున్నది.
నటరాజ రామక్రిష్ణ సునిశితంగా పరిశీలనలు చేసి, ఆకళింపు చేసుకున్నాడు. తత్ఫలితముగా, ఆంధ్ర లోకానికి నటరాజ రామక్రిష్ణ – నాట్య శాస్త్ర సంబంధమైన విశేషాల రచనలకు శ్రీకారం చుట్టారు. నాట్యములోని అగణిత విశేషాలనూ, అమూల్య వ్యాస, గ్రంధ సంపుటీ, సంకలనాలు 40కు పైగా పుస్తకాలు ఆయన కలమునుండి తెనుగువారికి అందినవి.
* * * * *
1951 లో భారత కోకిల సరోజినీ నాయుడు కు సోదరుడుహరీంద్ర నాథ్ ఛటోపాధ్యాయ్ విజయవాడ లోక సభ నియోజకవర్గమునుండి నుండి గెలిచారు. ఒక సభలో నటరాజ రామక్రిష్ణ క్షేత్రయ్య పదములకు నాట్యం చేసారు. అవి ఏవంటే…
1) “ఎందుకు వచ్చేను కోప; మెవరెమన్నారు?
అందుకిందుకు సరి; ఆయెరా మువ్వ గోపాలా!…..”
2) “ఇందెందు వచ్చితివిరా;
అల దాని ఇల్లు;
ఈ వీధి కాదు; పో పోరా!;
మందర గిరి ధరుడైన,
మా మువ్వ గోపాలా!
కుందరదన మది కోరి
ఇందు వచ్చితివా……..”
నటరాజ రామక్రిష్ణ అభినయ విన్యాసాలను, తిలకించిన హరీన్ ఉప్పొంగిపోయారు. నటరాజ రామక్రిష్ణ అభినయమును చూసిన ముచ్చట పడ్డారు. “నీ కళ చిరకాలమూ వర్ధిల్లాలి. రెండు బాణీలను చక్కగా అభినయించి చూపినావు. ఇది చాలా అసాధారణ విషయము” అంటూ పొగడారు.
నటరాజ రామక్రిష్ణ నర్తనము సుప్రసిద్ధ కవి, రచయిత, సినీ నటుడు, పొలిటికల్ లీడర్ ఐనట్టి హరీంద్ర నాథ్ ఛటోపాధ్యాయ ప్రశంసలను పొందిందీ, అంటే, భావి జీవితంలో ఆదర్శప్రాయమైన జీవన మార్గాన్ని ఎంచుకుని, గమ్యాన్ని చేరిన కళా తపస్వి నటరాజ రామక్రిష్ణ- అని సూచన.
* * * * *
నటరాజ రామకృష్ణగారి తల్లి దండ్రులు – రామమోహనరావు, దమయంతి. శిల్ప కళను అధ్యయనం చేస్తూన్న సోదరుడు శ్యామసుందర్ కుడిభుజంగానిలువగా, లక్ష్య సాధనకై ఏ మాత్రమూ వెనుకంజ వేయకుండా ముందుకు సాగిన మహనీయుడు నటరాజ రామక్రిష్ణ
1923 మార్చ్, 21 న బాలి ద్వీపములో జన్మించిన నటరాజ రామకృష్ణ 07 జూన్ 2011 నాడు కీర్తి శేషులైనారు.
నటరాజ రామక్రిష్ణ తన “నర్తన మురళి” poem లో సాంద్ర మనో కేదారాలను పరిచాడు.
“విశ్వవ్యాప్తమైనట్టి నీ విశ్వ రూపము ఆ చిన్ని నీటి బిందువులో – చూడగలిగిన నా జీవితమే ధన్యము, ఓ క్రిష్ణ కిశోరా!” అని భక్తితో అనుకున్నారు.
ఆంద్ర నాట్యము, పేరిణీ నాట్యము, నవ జనార్దన పారిజాతము “మన ఆంధ్రుల ప్రాచీన లలిత కళా సంపద.” అని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఆ మహానుభావుని చేతి చలువే కదా!
పునర్జన్మనంది, మరల తెలుగు నాట జన్మించి, తెలుగు కళా జగత్తుకు మరిన్ని వెలుగులను ప్రసాదించాలి ఆయన.
అందుకే – నటరాజ రామక్రిష్ణ అభిలాష ఖచ్చితంగా నెరవేరాలి!
“త్రిభువనాలను నర్తనమాడించు నీవు;
నాట్యమాడుచుండగా;
తాళధారినై;
నేను;
నిన్ను ఆడించే హక్కు;
నాకివ్వు, స్వామీ”
అంటూ నంద కిశోరుని _ విలువైన చిన్న కోరిక కోరారు నటరాజ రామక్రిష్ణ.
“కృష్ణా! నీవు మరల నన్ను-
ఈ ప్రపంచానికి పంపాలనుకుంటే-
జ్ఞాపకము ఉంచుకో స్వామీ!,
నర్తకునిగా మాత్రమే పుడతాను”
అని రాసుకున్నారు.
అందుకే నటరాజ రామక్రిష్ణ అభిలాష ఖచ్చితంగా నెరవేరాలి!