వాడు చచ్చాడు!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

వాడు చచ్చాడు! 26 నవంబరు, 2008 ముంబాయిలో జరిగిన తీవ్రవాదుల దాడిలో పట్టుబడిన దుర్మార్గుడు దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చచ్చాడు. దాదాపు మూడు రోజులు ముంబాయిని అల్లకల్లోలం చేసి చిన్నపిల్లలని కూడా చూడకుండా కనిపించిన వారందరినీ కాల్చిపారేసిన దుర్మార్గుడు ఎట్టకేలకు చచ్చాడు. నేర నిరూపణకు గాను నాలుగు సంవత్సరాలు కొన్ని కోట్ల ప్రజాధనంతో వాడిని మేపి చివరికి వాడికి ఉరి శిక్షను అమలు చేసింది మన ప్రభుత్వం. నిజానికి మరో నరకాసురుడు చచ్చాడన్నంతగా మనమందరం జరుపుకోవాల్సిన మరో దీపావళి పర్వదినం ఇది.

వాడికి ఉరిశిక్ష అమలుచేయటానికి నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టిందనేది ఓ ప్రధాన ప్రశ్న కాదు. ఎందుకంటే ప్రజల సహనాన్ని న్యాయస్థానాల కంటే మన రాజకీయ నాయకులే ఎక్కువగా పరీక్షిస్తున్నారు. తీవ్రవాద నిరోధంలో మనకున్న సమస్యల్లా మన రాజకీయ నాయకుల బాధ్యతా రాహిత్యమే. కసబ్ అరెస్టు దరిమిలా జరిగిన కొన్ని సంఘటనలు మనం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ముందుగా అప్పటి హోం శాఖా మంత్రి (శివరాజ్ పాటిల్), అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంఘటన తదనంతరం ఇచ్చిన ప్రకటనలు, ప్రసంగాలు మన దౌర్భాగ్య పరిస్థితులకు అద్దం పడతాయి. పాటిల్ మహాశయులవారికి తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడతారని ముందే తెలుసుట. కాని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందో తెలియక చర్యలు చేపట్టలేదట! తమని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చంపేస్తారోనని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునే ఈ నాయకులకు ప్రజల ప్రాణాల విలువ ఎలా తెలుస్తుంది? ఇక మన ప్రధాని గారు మాత్రం పాకిస్తాన్ వైపు వేలు చూపించి చేతులు దులిపేసుకున్నారు! పోటా వల్ల ఓ మతం వారిపై దాష్టీకాలు పెరుగుతాయని, పార్లమెంటులో పోటా పీకేసి, మోకా తెచ్చిన ఘనులు. అది మాత్రం తెచ్చి సాధించినదేముంది, పాకిస్తాన్ ను వేలెత్తి చూపటం తప్పించి?

అతనికంటే ఘనులైన అంతూలేలు, దిగ్విజయ్ సింగులు ఆ సమయంలో ఇచ్చిన వివాదాస్పద ప్రకటనలు కూడా గుర్తుతెచ్చుకోవాలి. అంతూలే ప్రకారం అప్పటి ఎ.టి.సి. ఛీఫ్ హేమంత్ కర్కరేను హత్య చేయించటానికి హిందు తీవ్రవాదులు ఆడిన నాటకమట ఆ ముంబాయి దాడులు! ఆయనకు తోడుగా దిగ్విజయ్ సింగ్…. దాడులు జరగటానికి కొన్ని రోజుల ముందు హేమంత్ కర్కరే ఆయనతో మాట్లాడి ఏవో చెప్పి వాపోయారట! జరిగిన దాడులను ఖండించటంపోయి, ఆ నెపంతో రాజకీయ నాటకాలకు తెర లేపే ఇటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో ప్రజల, దేశ భవిష్యత్తు ఏరకంగా ఉంటుందో ఊహించటం కష్టమేమీ కాదు.

వారం పదిరోజుల క్రితం ఇప్పటి మన హోం మంత్రి సుశీల్ షిండే గారు, భారత్ లో పర్యటించబోయే పాకిస్తాన్ క్రికెట్ టీమును మనం స్వాగతించాలని చెబుతూ, రాజకీయాలకు క్రీడలకు ముడిపెట్టకూడదని ఉపదేశం చేసారు! ముంబాయి దాడులు జరిగిన క్షణం నుంచి ఈరోజు ఉరి శిక్ష అమలు జరిగిన దాకా, ఆ దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయమున్నదని ప్రధాన మంత్రి నుంచి అప్రధాన మంత్రుల వరకు ఎవరో ఒకళ్ళు రోజూ కోళ్ళై కూస్తూనే ఉన్నారు. రెండు నెలలకోసారి పాకిస్తాన్ కు ఆధారాలు పంపుతూ, కసబ్ పాకిస్తాన్ వాడే అని ఒప్పుకోమని పాకిస్తాన్ ను దేబిరిస్తూనే ఉన్నారు. ఆ కారణంతోనే, దాడులు జరిగిన తక్షణం పాకిస్తాన్ తో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నామని ప్రకటించారు. మరి ఈరోజు సుశీల్ షిండే గారు తీవ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్ ప్రమేయంలేదని సర్టిఫికెట్ ఇచ్చినట్లు భావించాలా?

దాదాపు గత ఆరు దశాబ్దాలుగా ఇటువంటి విషమపరిస్థితుల్లో మనం మగ్గుతూనే ఉన్నాం. నిజానికి, తీవ్రవాదుల దాడులవల్ల కన్నా, మన రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, అలసత్వం, రాజకీయ కారణాల వల్ల మనం ఎక్కువ నష్టపోతున్నాం. తీవ్రవాదాన్ని దునుమాడటంలో నిర్మాణాత్మక వైఖరి లేక ప్రపంచానికి అలుసైపోతున్నాం. ఈనాడు దేశ ప్రజలకు కావల్సింది అభద్రతాభావంతో కూడిన జీవనం కాదు. ప్రజలకు ఆ మాత్రం చేయలేని ప్రభుత్వాలు, ప్రజా నాయకులు నిరర్ధకం.

Your views are valuable to us!