వార్తలందు అసలు వార్తలు లేవయా!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఒక అత్యాచార నిందుతుడి పై వార్తను  ది  హిందూ దినపత్రిక 11/03/2013 న పతాక శీర్షికగా ప్రచురించడం చూస్తుంటే, సంచలనం అనే వ్యాపార దృక్పధానికి లొంగని వారు ఎవ్వరూ లేరు అని తెలిసిపోయింది.

మొన్నటి రోజున అన్ని చానళ్ళూ బిట్టి అనే నేరస్థుడి వార్తను చూపిందే చూపి చెప్పిందే చెప్పి ఊదరగొట్టెసాయి. ఈరోజు తీహార్ జైల్లో మరో నేరస్థుడి ఆత్మహత్యను ఒక గొప్ప వార్తగా చూపుతున్నాయి. రేపు ఇదే వార్తను మరికొంత పరిశోధించి ప్రముఖ వార్తగా పత్రికలూ ప్రచురిస్తాయి.   ఇది మన దిన పత్రికల, వార్తా ఛానళ్ళ దుస్థితి.  ఇది మన సమాచార వ్యవస్థలో ఉన్న ఒక విధమైన మానసిక – సమాచార దారిద్ర్యానికి పర్యవసానమే! 

దేశంలో అసలు సమస్యలు లేనట్లే ఒకే వార్తను బ్రేకింగ్ న్యూస్ పేరిట ఎన్నో సార్లు బ్రేక్ చేసి, తునాతునకలు చేసి, ఆఖరికి ప్రజలకు ఇక గుర్తుంచుకోలేని రీతిన ప్రసారం చేసి మరొక సంచలన వార్త దొరకగానే పాత వార్తను వదిలి కొత్తదానిని  పట్టుకోవడం పరిపాటి అయిపొయింది.  ఈ వైపరీత్యం గురించి మీడియావాళ్ళతో సహా అందరకూ తెలుసు. కాని వ్యాపారం ముందు అన్నీ దిగదుడుపే!
 
రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు వారి పార్టీల తరపున చేసిన వాగ్దానాలు, ఆపై వాటి అమలు అనే స్థితి పై మనకు వార్తలు రావు. మరొక ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో వార్తా పత్రికలు, పార్టీల వారిగా చేసిన ఎన్నికల వాగ్దానాలు వాటి అమలుపై కూలంకషంగా పరిశోధన చేసి (స. హ. చట్టాన్ని సద్వినియోగం చేసుకొని) గణనాంకాలతో సహా ప్రచురిస్తే అదీ నిజమైన సమాజహితమైన, ప్రజారంజకమైన వార్త .
అలాగే దేశంలో వయోవృద్ధుల స్థితిగతులపై సమగ్ర సర్వేలు జరిపి వారి దుస్థితిని తెలియచేయడం అసలైన వార్త. ఇలా చెప్పుకుపోతే ఎన్నో వార్తలు సేకరించకుండానే మిగిలిపోయాయనే విషయం తేటతెల్లమౌతుంది. వాటి గురించి ఎవరికీ పట్టదు ఎందుకంటే నిజమైన పని చేయవలసి రావడం.  ఒక నేరస్థుడి మూలాలు శోధించడానికి ఉన్న ఆత్రుత ఒక సామాజిక సమస్యకు ఉన్న మూలాలను వెలికి తీయడానికి మన వార్తా సంస్థలకు లేకపోవడం శోచనీయం.
 
ఎన్నో వార్తా సంస్థలు వార్తలను వ్యాపార వస్తువులుగా భావించి ఏది తమ వ్యాపారాన్ని వృద్ది చేస్తుందో దానినే ప్రధాన వార్తగా సేకరించి, ప్రచురించి, ప్రసారం చేసి పబ్బం గడుపుకోవడం ఈనాడు మనం అందరం చూస్తున్నదే. మనకు సమస్య తెలుసు. దానికి కారణం కూడా తెలుసు. కాని నిర్ణయాధికారం మాత్ర్హం కొద్దిమందికే ఉంది.  మనం అనుకుంటున్నా ప్రజాస్వామ్యం అన్నిచోట్లా ముఖ్యంగా వార్తా సంస్థల నిర్వహణలో, వాటి నియంత్రణలో లేనేలేదు. మనం నివసిస్తున్న ప్రదేశంలోనే అనేక సమస్యలు ఉన్నాయి. వాటికి చక్కని పరిష్కార మార్గాలు కూడా ప్రజల వద్దే ఉన్నాయి వాటి గురించి ఎవరికీ పట్టదు. 
 
సమాజానికి ఎంతో మేలు చేసే చెరువులను యథేచ్ఛగా కబ్జా చేసి, లేదా కలుషితం చేస్తుంటే అది ప్రధాన వార్త కాదు. ఎందుకంటే నీరు ’కొనుక్కోవాలి’ అనే భావన!! ఎంత అనారోగ్యకరమైన ధోరణిలో మన వార్తా సంస్థలు పనిచేస్తున్నాయో తలచుకొంటే చాల అసహనం కలుగుతుంది. నగరాలలో, పల్లెలలో, చిన్న చిన్న పట్టణాలలో ఉన్న చెరువులు నూతులు అలాగే వాటి ద్వారా ప్రవహించే కాలువలు, నదులు గురించి వాటి పరిరక్షణ గురించి మనకు వార్తలు దొరకవు!  
మన రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సంక్షోభం గురించి రోజువారి వార్తలు ప్రచురించే సత్తా, సమయం, సంకల్పం ఎన్ని వార్తా సంస్థలకు ఉంది? ఒక సామాజిక సమస్య పరిష్కృత య్యె వరకూ దాని తాలూకు వార్తలను ప్రజలకు చెప్పే బాధ్యత వార్తా సంస్థలు తీసుకోవు. ఎందుకంటే ఆ వార్తలు అభివృద్దికి మాత్రమే దారితీస్తాయి కానీ సంచలనాలకు కావు.
 
సమస్యలు సమస్యలుగా ఉండిపోతేనే రాజకీయాలు, వార్తలు ఉంటాయి అనే ఒక ఘన సిద్ధాంతం ఈ నిర్లక్ష్యానికి పునాది కావచ్చు. అప్పుడేప్పుడో ఇందిరాగాంధి హయాంలో మొదలైన ’గరీబీ హఠావో’ అనే నినాదం ఇప్పటికీ చెల్లుబాటు అవుతోందంటే ఆ ఘనత మన రాజకీయ వ్యవస్థకే దక్కాలి. దానితో పాటు వార్తా సంస్థలకు కూడా దక్కాలి. మన బ్రతుకులు ఎంత నినాదమయాలో, శుష్కప్రియాలో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదహారణలు కావాలా?
 
అదీ భోగట్టా!

Your views are valuable to us!