వేసవి జాతర

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

వేసవి శెలవలు వచ్చేసాయ్. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల దగ్గరకు పరుగో పరుగు. లేదంటే పెళ్లిళ్లు, దావత్ లు , టూర్లంటూ  పరుగో పరుగు. అదీ కాదంటే ఎక్కడైతే ఏంటి టివి ఉంటే చాలు అతుక్కుపోడానికి అన్నట్లు ఉంటున్నది ఈమధ్య.  పిల్లలు శెలవలకు వస్తే రకరకాల ఆటలు, పాటలు, పొలాల్లో పరుగులు, ప్రకృతిలో పరవశం….ఇలాంటివన్నీ నేడు కరువైపోయి కేవలం ఎలక్ట్రానిక్ మాధ్యమాల ప్రసారాల బారికి వదిలేయడం అన్నింటికంటే సులువుగా ఈ పోటీ ప్రపంచంలో తయారైంది. ఎవరికీ పిల్లల మనస్సుల గురించి, వాళ్ల మేధోవికాసానికి  సహజసిద్ధమైన  చేయూతనివ్వగలిగే తీరిక, ఒపిక లేకుండా పోతున్నాయి. 

ఈ నేపధ్యంలో జహీరాబాద్ జనవిజ్ఞానవేదిక తలపెట్టింది వారంరోజుల  ” వేసవి పిల్లల జాతర ” సుమారు ముప్పైమంది పిల్లలకు ఏప్రిల్ 22 నుండి 28వరకు జహీరాబాద్ పట్టణంలోని విశాలమైన , పచ్చదనం విరసిల్లే ఎం.ఆర్.హెచ్.ఎస్ . ప్రాంగణంలో 22న మొదలైంది ఈ జాతర. ఆటలు, పాటలు, మ్యాజిక్ , తోలుబొమ్మలాట, కొల్లేజ్ వర్క్ (పేపర్ పై రకరకాల వస్తువులతే 3-D వర్క్) , చిత్రలేఖనం, బంకమట్టితో బొమ్మలు చేయడం వంటి పిల్లల మనసుకు హత్తుకునే ఎన్నో కార్యక్రమాలతో సాగుతున్నది. 

టీచర్లు, తల్లిదండ్రులు , పత్రికలు ఎంతో  హర్షిస్తున్న ఇలాంటి జాతరలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, ఇంకా మరెన్నో సృజనాత్మక కార్యక్రమాలతో జరగాలని మేం ఆశిస్తున్నాం.

  
                 మెరుపు మెరిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే
                 అది మీకే మీకే అని ఆనందించే పిల్లల్లారా , పిట్టల్లారా
                 మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు
 
అన్న శ్రీ శ్రీ మాటలు కొంతైనా నిజం చేయాలని మా సంకల్పం. నిజంగానే ఈ జాతరలో పాల్గొన్న పిల్లలు  ప్రతిరోజూ ఆసక్తిగా  ,  డుమ్మా కొట్టాలన్న ఆలోచన కలలో సైతం రాకుండా ,   పాల్గొనడం చూసి ఆనందం గాక మరేమిటి!

” ఆటలంటే మాకిష్టం , పాటలంటే మాకిష్టం   .. ఆటలకన్నా పాటలకన్నా ……… అల్లరిపనులే మాకిష్టం” అంటూ   ఒకరోజు…
” ఎంతో మంచిది మా టీచర్ .. మాకిస్తొందొక గుడ్ ఫ్యూచర్  .. లాఫింగ్ టాక్స్ అండ్ లవింగ్ లుక్స్ .. లైక్ ఎ మమ్మీ మై టీచర్ “.. అంటూ  మరోరోజు….
” మేం పిల్లలం రేపు పెద్దలం రేపటి సమాజాన్ని రూపుదిద్దుతాం ” ………..   అన్న జైసీతారాం పాటతో రోజూ అలరిస్తున్న పిల్లల్ని చూస్తూ మైమరచిపోతున్నామంటే నమ్మండి.
“ఏం తాబేలు మామా..  పరుగు పోటీ పెట్టుకుందామా ” అని వ్యంగంగా అంటూ చివరకు పోటిలో నిద్రపోయి బొక్కబోర్లా ఒడిపోయిన కుందేలు – తాబేలు కధని తోలుబొమ్మలాడిస్తూ  పిల్లలు చెప్తున్న దృశ్యాన్ని నిజంగా కండ్లతో చూడాల్సిందే!

పిల్లల ప్రపంచంలోకి మనం కూడా వెళ్లి పిల్లల ఇష్టాల్ని వెలికితీసి , కలిసిపోయి , సేదతీరి .. వాళ్ల వికాసంలోనే అభ్యుదయం కూడా చూసేందుకు       సంవత్సరంలో కొద్దిరోజులన్నా కేటాయించాలని అలాంటి పనులు అన్ని చోట్లా మరింతగా జరగాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ….
 

Your views are valuable to us!