పార్లమెంటు ప్రాంగణంలో ఎన్.టి.ఆర్. విగ్రహం ఏర్పాటు విషయంపై పెద్ద దుమారమే రేగుతున్నది. అటు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ. ఇవ్వటం ఒక విశేషమైతే, ఇటు విగ్రహం ఏర్పాటుపై ఎన్.టి.ఆర్. కుటుంబసభ్యులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవటం మరో విచిత్రం!
తెలుగు ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో అజరామరం చేసిన ఎన్.టి.ఆర్. నిత్యస్మరణీయుడే అనటంలో ఎటువంటి అనౌచిత్యం లేదు. ఏనాడూ పార్లమెంటు సభ్యుడు కాకపోయినా, దేశస్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేసి ప్రతిపక్షాలను సంఘటితం చేసి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్.టి.ఆర్. చేసిన కృషి అనితరసాధ్యమనేది కూడా మనం మర్చిపోకూడదు. అయినా, తెలుగువాడిగా ఎన్.టి.ఆర్. పై ఉన్న అభిమానాన్ని పక్కనపెట్టి, ఇప్పటి నేపథ్యంలో కొన్ని విషయాలు నిజాయితీగా, నిష్కర్షగా మాట్లాడుకుంటే బాగుంటుంది.
నైతిక విలువలన్నిటికీ తిలోదకాలిచ్చిన నేతలు రాజ్యాలేలుతున్న కాలం ఇది. దేశ స్వాతంత్ర్యానికి పోరాడిన త్యాగధనులను, ప్రజలకు స్ఫూర్తిగా నిలచిన నేతలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, వారు బోధించిన విలువలన్నీ తుంగలో తొక్కేసిన తర్వాత, వారి విగ్రహాలు, పటాలు పెట్టటంవలన ఉపయోగం ఏముంది?
దేశ స్వాతంత్ర్యంకోసం, దేశ సంక్షేమం కోసం అసువులు బాసిన మహనీయులకు, అధ్యాత్మిక, కళా, సాంస్కృతిక వారసత్వ సంపదలుగా జ్ఞాన ప్రదీప్తులై, దీప్తిధారులై స్ఫూర్తిదాయకులైన మహానుభావులకు విగ్రహాలు పెట్టటంలో ఎంతమాత్రమూ తప్పులేదు. వారి వారసత్వాన్ని గర్వంగా చెప్పుకోటానికి, భావిపౌరులకు వారి గురించి తెలియపరచటానికి ఆమాత్రం చేయటం అవసరమే.
కానీ, 1980 తర్వాత దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోని నాయకుడు లేడు. కుల, మత, ప్రాంతీయ వాదాలతో ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోని నాయకుడు లేడు. ఆ మహామహుల పక్కన, ఇప్పుడు ఈ నాయకులకి కూడా చోటు కల్పించటమా? మురసోలి మారన్లు, దేవీ లాల్సు, ఎంజీ రామచంద్రన్లు… వీళ్ళ పక్క ఇప్పుడు ఎన్.టి.ఆర్.! రేపు వైయస్సార్లు, థాక్రేలు, మాయవతీలు, ములాయంలు, లాలూ యాదవులు, కరుణానిధులు, జయలలితలు!
ఆల్రెడీ, “విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి” టైపులో ఉలుకు పలుకు లేకుండా లోక్ సభ, రాజ్య సభలలో తిష్టవేసుకుని కూర్చున్న ఎం.పి.లు వందల సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి తోడుగా ఇప్పటికే మన పార్లమెంటు ప్రాంగణంలో 48 విగ్రహాలు, 84 చిత్రపటాలు ఉన్నాయట! ఎవరు ఎవరికి స్ఫూర్తి? పార్లమెంటులో ధర్నాలు చేసుకోటానికి తప్పించి ఈ విగ్రహాల వల్ల వీసమెత్తైనా ఉపయోగం కనిపిస్తుందా?
ఆ మాటకొస్తే, బయటపెట్టే విగ్రహాల ఉపయోగం మాత్రం ఏముంది? మన రాష్ట్రమే చూసుకుంటే నడిరోడ్డు మీదే విగ్రహాలు దిగబెడుతున్నారు. అసలు రోడ్డు ఉన్నా లేకపోయినా విగ్రహాలు మాత్రం ఉండితీరాల్సిందే. ఒకప్పుడు విగ్రహాలు పెట్టిన చోట్లు పెద్ద సెంటర్లయ్యేవి. ఇప్పుడు పెద్ద సెంటర్సులోనే విగ్రహాలు పాతేస్తున్నారు! ఒకప్పుడు, ఫలానా సినిమా హాలు ఎక్కడ ఉంది అంటే, బోసుబొమ్మ సెంటర్ దగ్గరనో, భగత్సింగ్ సెంటరు పక్క సందు అనో చెప్పుకునేవాళ్ళు. కనీసం ముష్టివాళ్ళో, ముసలీ ముతకో సాయంత్రాలు ఆ మహానుభావుల విగ్రహాల నీడలో సేదదీరేవాళ్ళు.
ఇప్పుడో! ఫలానా బస్టాండ్ దగ్గర ఉన్న ఎన్.టీ.ఆర్. విగ్రహమా, ఫలానా హోటల్ దగ్గర ఉన్న వైయస్సార్ విగ్రహమా అని అడుగుతున్నారు. అంతే కాదు, విగ్రహం పెట్టటమే కాకుండా, 24 గంటల సెక్యూరిటీ కూడా ఆ విగ్రహానికి కావాల్సివస్తున్నది! – పిట్టలు రెట్టలు వేయకుండా, ఎగస్ పార్టీవాళ్ళు రంగులు పులమకుండా!
అయిదేళ్ళు పరిపాలించినా, ప్రజలు మర్చిపోతారేమోననే అనుమానంతో ఊరూరా విగ్రహాలు పెట్టించుకున్న మాయావతులే దేశం నిండా ఉన్నారు. మాననీయులే అయితే, ఏ విగ్రహాలు లేకుండానే ప్రజల మనసుల్లో పదికాలాలపాటు నిలచిపోతారు; రుద్రమదేవి, కృష్ణదేవరాయలు, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, యోగి వేమన, కందుకూరి, గురజాడ….ల మాదిరిగా. మన్నికేలేని నాయకుల విగ్రహాలు పెట్టినందువల్ల ఉపయోగం వీసమెత్తు ఉండదు.