వ్యక్తిత్వాల ఘర్షణ

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కొద్దిరోజుల క్రితం నేనొక విషయంలో పాలుపంచుకోవాల్సి వచ్చింది. ఆ విషయం క్రిటికల్గా మారడానికి గల కారణాలను, నా ఆలోచనలను రాతపూర్వకంగా ఉంచుదామని అనుకొని రాస్తున్నాను.

నాకు తెలిసినవారి అమ్మాయి B.E. Electrical చదివింది. తండ్రి హటాత్తుగా చనిపోవడంతో కుటుంబ బరువు, బాధ్యత ఈ అమ్మాయి పైనే పడింది. పెద్ద డిగ్రీ చేతిలో ఉన్నా ఉద్యోగం దొరకడం కొద్దిగా కష్టమైంది. నాలాంటి తెలిసినవారందరి ద్వారా ప్రయత్నిస్తే ఒక కంపెనీలో మైంటెనెన్సు ఇంజనీరుగా పోస్టింగ్ దొరికింది. అమ్మాయిలకు తగిన ఉద్యోగము కాకపోయినా, ధైర్యం చేసి చేరింది. ఆ కంపెనీలో మేనేజరుగా పనిచేసే వ్యక్తి కూడా మా కుటుంబానికి తెలిసినవారే కావడంతో అమ్మయి గురించి ప్రత్యేకంగా చెపాము.

ఒక సంవత్సరం పని చేసాక ఉద్యోగం కన్ఫర్మ్ అయింది, మంచి ఇంక్రిమెంట్ కూడా వచ్చింది. అంతా బాగుందనుకొన్న సమయంలో ఆ అమ్మాయి హటాత్తుగా ఉద్యోగం మానేసినట్లు తెలిసింది. వెంటనే కాకపోయినా కొద్దిరోజుల తర్వాత ఆ అమ్మాయిని విచారించాను.

ఆ అమ్మాయి ప్రకారం ఒకరోజు ఆ మేనేజర్ బాగా కోప్పడి తిట్టారట. అంతేకాక జనరల్ మేనేజర్ దగ్గర కంప్లైంట్ కూడా చేసారట. ఆ జనరల్ మేనేజరు వెంటనే ఫోన్ చేసి తిట్టడమే కాకుండా ఇకపై నువ్వు జనరల్ షిఫ్ట్ లో కాకుండా మధ్యాహ్నం షిఫ్ట్ లో రావాలని చెప్పారంట. దానికి ఒప్పుకోను వీలుకాక రాజీనామా చేసిందట. ఒకరోజులోనే గొడవ ఇంత పెద్దదై రాజీనామా దాకా వెళుతుందా అని నాకు అనిపించింది. ఆ అమ్మాయిని ఓదార్చి, ధైర్యం చెప్పి వచ్చేసాను.

మనసు ఉండబట్టలేక ఆ మేనేజరుకే నేరుగా ఫోన్ చేసాను. ఆయన సాయంత్రం ఫోన్ చేసి వివరంగా చెప్తానని అన్నారు. అన్నట్టే సాయంత్రం ఫోన్ చేసి ఆయన వంతు వివరాలు ఇచ్చారు.

ఆ మేనేజర్ ప్రకారం, మామూలుగా మైంటెనెన్స్ ఇంజనీర్లుగా అబ్బాయిలనే తీసుకొంటారట. దీనివల్ల రాత్రి షిఫ్ట్ కు సమస్య ఉండదు. కానీ ఈ అమ్మాయిని తీసుకున్నందువల్ల మిగిలిన ఇద్దరు ఇంజనీర్లు సెకండ్ మరియు నైట్ షిఫ్ట్ లలో మాత్రమే పని చెయ్యాల్సి వచ్చింది. ఈ మేనేజర్ వారికి నచ్చచెప్పి పని చేయించేవారంట.

గొడవ జరిగిన రోజు మేనేజర్ లీవులో ఉన్నారంట. అంతలో వాళ్ళ సప్లయర్ ఒకరి నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఐటంస్ పార్సెల్లో వచ్చాయి. Rs.500/- కట్టి డెలివరీ తీసుకోవాలి. మేనేజర్ ఆ అమ్మాయిని ఐదువందలు కట్టేసి తీసుకోమని చెప్పారట. మరుసటిరోజు తను రాగానే ఆ అమ్మాయికి ఐదువందలూ ఇచ్చేసి కంపెనీ నుండి తను క్లైమ్ చేసుకొంటానని చెప్పారట. దానికి ఈ అమ్మాయి ఒప్పుకోలేదట. “నా దగ్గర వందరూపాయలే ఉందని” చెప్పింది. దానికి ఆ మేనేజర్ పక్కనే ATM ఉంది కదా డ్రా చేసి ఇవ్వు…ఆ మెటీరియల్ అర్జెంటుగా కావాలి అని చెప్తే “నా అకౌంటులో కూడా డబ్బులు లేవు” అని ఆ అమ్మాయి చెప్పింది. మేనేజర్ కు కోపం వచ్చి “నీకు పని ఇచ్చి, నెలకు పద్నాలుగువేల జీతమిచ్చి ఆదుకొన్న కంపెనీ కోసం ఐదు వందలు ఖర్చు పెట్టలేవా? ఆ మెటీరియల్ ఎంత ఇంపార్టెంటో తెలిసీ డెలివరీ తీసుకోకుండా డ్రామాలు ఆడ్తావా?” అని తిట్టి, దగ్గర్లోనే నివాసముంటున్న మరో ఎంప్లాయీకి ఫోన్ చేసి ఆయన చేత ఐదు వందలు ఇప్పించి డెలివరీ తీసుకొన్నారట.

ఈ సంఘటన జరిగిన మూడురోజులకు జనరల్ మేనేజర్ సైట్ విజిట్ కు వచ్చినప్పుడు ప్రతి ఎంప్లాయి పెర్మామెన్స్ గురించీ ఆరా తీస్తున్నప్పుడు లోకల్ మేనేజర్ అమ్మాయి గురించి చెప్పి “ఈ ఒక్క విషయం మాత్రం నాకు నచ్చలేదు” అని చెప్పారంట. వెంటనే జి.ఎం. ఆ అమ్మాయిని పిలిపించి అలా చెయ్యకూడదని, సీనియర్ల సలహాలను పాటించాలని చెప్పారు. ఒకసారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారం రోజులు సెకండ్ షిఫ్ట్ లో రావాలని జి.ఎం. చెప్పారట. ఇదీ ఆ మేనేజర్ నాకు చెప్పిన విషయం.

రెండు వైపులా తప్పొప్పులు ఉన్నట్టు నాకు అనిపించింది. ఒక మేనేజరుగా, అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన ఈ చిన్న విషయాన్ని జి.ఎం. లెవల్ వరకూ తీసుకెళ్ళకుండా ఉండవలసింది. అలాగే ఆ అమ్మాయి కూడా మరీ అంత పిసినారిగా కాకుండా హుందాగా వ్యవహరించవలసి ఉండాల్సింది.

“నీ దగ్గర ఉన్న డబ్బులు కంపెనీ ఇచ్చిందని” మేనేజర్ చేసిన ఆర్గ్యుమెంటు ఒకరకంగా సరినే. “నేను కష్టపడ్డాను కనుక కంపెనీ ఇచ్చింది. అది నా డబ్బు. నా ఇష్టప్రకారమే వాడతాను” అని ఆ అమ్మాయి చెప్పిందీ సరినే.

అప్పటిదాకా ఒద్దికగా ఉన్న ఇద్దరు వ్యక్తులు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఒక్కోసారి వ్యక్తిత్వాల ఘర్షణ ఎలాంటి ఇబ్బందికరంగా పరిణమిస్తాయనడానికి పై సంఘటన మంచి ఉదాహరణ. 

@@@@@

Your views are valuable to us!