చెప్పులు కుట్టే అబ్బి నేర్పిన జీవిత పాఠం

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 3.7]

తెలుగు కథ చెప్పులు కుట్టే అబ్బి నేర్పిన జీవిత పాఠం

మా మహానగరంలో ఒక ప్రముఖ కూడలి వద్ద ఉన్న చెట్టు క్రింద ఒక వ్యక్తి  గత నాలుగు నెలలుగా తెగిన చెప్పులు కుట్టడం, బూట్లు పోలిష్ చేయడం ద్వారా తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు .

ఉదయంనుండి సాయంత్రం వరకూ ఉంటాడు.

నేనూ అతని సేవలు రెండు మూడు సార్లు పొందాను.  

ఒక రోజు సాయంత్రం అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక షాప్‍లో మా ఆవిడ చీరలు కొనడానికని వెళితే నేను బయట చెట్టు కింద చల్లగా ఉండడంతో ఆ వ్యక్తి  పక్కనే నుంచొని గమనించడం మొదలుపెట్టాను.

సుమారుగా 40 నిముషాలు అక్కడ గడిపాను.  ఒక ఆరుగురు కస్టమర్స్ వచ్చారు. అందరూ చిన్న చిన్న రిపైర్స్ కోసమే. టక్కున చేసి ఒక 10-20 రూపాయలు తీసుకొని పంపిచేసాడు. నేను చూస్తుండగానే ఓ ఎనభై రూపాయాలు సంపాదించాడు.

కూడలి అనువుగా ఉండడంతో ఎక్కువమంది అక్కడికి వచ్ఛి ఆయన సేవలు పొందుతున్నారు. ఉండబట్టలేక అడిగేశాను – “రోజుకు ఎంత సంపాదిస్తావు?” అని.

“సరాసరి రోజుకు 400-500 వరకూ సార్!” అని చెప్పాడు అతను.

ఒక్కో రోజు వెయ్యి కూడా సంపాదించిన సందర్భాలు ఉన్నాయట. అంటే 26 రోజులకు 450 చొప్పున (సరాసరికి మరో సగటు) నెలకు  రూ. 11,700/- సంపాదిస్తాడు. 

ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి అతను చెప్పిన ఈ మాటలు నాకు ఆనందాన్ని కలిగించాయి:

palnati bharatam dhvani telugu podcast featured image

“నెలకు 26 రోజులు ఈ చెట్టు ఇచ్చే నీడే నాకు ఇల్లు. అందుకని నేను దీనికి రోజూ కొన్ని నీళ్ళు తెచ్చి చెట్టు మొదల్లో పోస్తాను. ఆ తరువాతే నా దుకాణం పెట్టి తెరిచి పని మొదలు పెడతాను. ఈ చెట్టు మీద ఉండే కొన్ని పిట్టలు కూడా నాకు చుట్టాలే. వాటికి నేను తినే తిండిలో రెండు ముద్దలు పెడతాను.  చల్లగాలిని ఇచ్చే ఈ చెట్టు నాకు సేద తీరుస్తుంది. కూడు తిన్నాక కొంత సేపు పెట్టి మూసేసి పడుకుంటాను. అలాగని గుర్రెట్టి నిద్రపోను” అన్నాడు నవ్వుతూ.

నేనూ నవ్వాను. అతను కొనసాగించాడు…

“ప్రతి ఆదివారం ఎంతోమంది ఈ సెంటర్ కి వచ్చి చాలసేపు గడుపుతారు షాపింగ్ అనో ఏదో వంకన. ఈ బిజీ సెంటర్ నుంచి దూరంగా వెళ్లి పని చేసి సమయం చిక్కినపుడు మల్లె ఈ సెంటర్‍కు వచ్చి ఇక్కడే అదుగో ఎదురుగా ఉన్నటిఫిన్ సెంటర్‍లో నచ్చింది తింటారు. ఇక్కడకు రావడానికి అందరికీ ఇష్టం. ఇక్కడే నాకు రోజూ పని.  నావరకూ నా వృత్తి గొప్పదే. పెట్టుబడి చాల తక్కువ, కష్టం ఉన్నా తట్టుకోలేనంత ఎక్కువ కాదు. మంచిగా సాగిపోతున్నాయి రోజులు దేవుడి దయవల్ల !”

సాభిప్రాయంగా తలాడించాను నేను. “ఇంకా…” అన్నాను సంభాషణను పొడిగించే నిమిత్తం.

“సాయంత్రాలు భలే సందడి గా ఉంటాయి సార్. చిన్న పిల్లలూ, పెద్దోళ్ళూ ఇళ్ళకు పోతూ ఉంటారు. మధ్యలో ఇక్కడ ఆగి ఏవో ఒకటి కొనుక్కొని వెళ్తారు. చల్లని గాలి ఈ ట్రాఫిక్ పొగను దూరం చేసి మంచి గాలి ఇస్తుంది. అయినా ఈ ట్రాఫిక్, దాని రొద నాకు అలవాటు అయిపొయింది.

మా ఆవిడ రోజూ మజ్జిగ అన్నంలో నంజుకోడానికి బెల్లం ముక్క పెడుతుంది. బెల్లం రెండుపూటలా తింటే ఈ దుమ్ము గాలి ఏవీ చేయదట! రోజూ నేను దుకాణం మూసేసి నా సైకిల్ వెనక ఆ పెట్టిని కట్టేసుకొని, మా ఇంటికి మా బుడ్డోడికని ఏదో ఒక సరుకు తినడానికి తీసుకొని వెళ్తా.  మా ఇంటిదానికి పూలు కూడా. నాకైతే ఎక్కడా బెంగా, కంగారూ, భయం ఉండవు. ఉదయం ఎలా సంతోషంగా వస్తానో అంతకంటే సంతోషంగా ఇంటికి వెళతాను.” అని ముగించాడు.

*****

ఈ మాటలు  విన్నాక అనిపించిది ఈ కార్పొరేట్ లోకంలో ఇంత సంతోషంగా పనికి వచ్చి రెట్టించిన సంతోషంతో ఇంటికి వెళ్ళగలగడం ఎన్ని management theories  మోడల్స్ ఇంప్లెమెంట్  చేస్తే సాధ్యమో అని!

ఈ చిన్న వృత్తినిపుణిడికి తన వ్యాపారపు భవిష్యత్ పై బెంగలేదు. ఎంతో కొంత సంపాదిస్తున్నాడు. అందులో ఏదో కొంత దాస్తున్నాడు. ఇన్సూరెన్స్  పోలిసీలు లేవు. mediclaim- cashless ఫెసిలిటీ లేదు. బోనస్ లేదు. PF లేదు. ESI లేదు. జీతంతో కూడిన సెలవులు లేవు. LTC  లేదు.

అయినా ఎంత భరోసా! ఎంత సంతోషం! ఎంత సంతృప్తి!

ఎవరో ఒకరు తన సేవను వెదుక్కునివస్తారన్న నమ్మకం. ఏ ప్రభుత్వ పథకాలపై ఆధారపడకుండా తన శ్రమపై ఆధారపడాలన్న సంకల్పం. కుటుంబ బాధ్యతల పట్ల శ్రద్ధ. భార్యాబిడ్డల పట్ల ప్రేమ.

ఈ చెప్పులు కుట్టే అబ్బి నిజమైన స్వేచ్ఛాజీవి. నిత్యసంతృప్తుడు.

అతనికి ధన్యవాదాలు చెప్పి రేపటి నా కార్పొరేట్ జీవితం అనే పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోవడానికి సిద్ధమయ్యాను.

*****

stree vijayam history documentary in telugu

Your views are valuable to us!