అప్పుడే పుట్టి ఉంటే …

Spread the love
Like-o-Meter
[Total: 11 Average: 4.6]

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కథలు లో “అప్పుడే పుట్టి ఉంటే” కథ చాలా విశిష్టమైనది. తెలుగు భాషలో వచ్చిన కాల్పనిక చారిత్రిక (చిన్న) కథల్లో ఇది అగ్రభాగాన నిలువగలదని మా అభిప్రాయం. ఆలస్యమెందుకు వెంటనే చదవండి “అప్పుడే పుట్టి ఉంటే…”


 

ఈ యేడు మహర్నవమినాడు రాయలవారు భువన విజయంలో మనుచరిత్ర నందుకుంటున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకీ పాకిపోయింది.

అటు కళింగం నుంచీ, గౌతమీ తీరాన్నుంచీ, ఇటు కావేరి నుంచీ, మధుర నుంచీ, కవీశ్వరులేమీ, గాయకులేమి, విద్వాంసు లేమి, ఎక్క డెక్కడివారూ విజయనగరానికి కొన్ని దినాలకి ముందుగానే వచ్చి విడిది చేశారు. ప్రభాత సమయంలోనూ, ప్రదోష కాలంలోనూ, తుంగభద్రా తీరాన్నీ విఠల స్వాముల కల్యాణమండంలోనున్నూ వీరందరి గోష్ఠులూ ఎంతో కలకలం చేస్తున్నాయి.

కొంత కనుచీకటి పడ్డాక, ఈ విద్వత్కవులలో కొందరు రసికులు సాహసించి, పగలు తిరగడానికి వీలులేని వాడల్లోకి చొరబడడమూ జరుగుతుంది.

అప్పాజీ, సాళువ తిమ్మరుసయ్యవంటి సామంతులు గృహాంగణాలు ఈ యేడు ఉన్నంత సందడిగా అదివరకు ఎప్పుడూ లేవు.

ఇక వచ్చిన కవులలో సగం మంది పెద్దన్న గారి ఇంటనే దిగారు. పింగళి సూరన్న ఎప్పుడు విజయనగరం వచ్చినా, తాతగారి ఇంటనే దిగడమూ, తన కవిత్వ ధోరణి ఆయనకు వినిపించి రంజింప జేయడమూ ఉండనే ఉంది. ఆనాటి ఉదయం నుంచీ అతడు వాకిట్లో నించి లోపలికీ, లోపలి నుంచి వాకిటిలోకీ తిరుగుతూనే ఉన్నాడు.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

*****

అంతలోనే వీథి మొగను కాహళ ధ్వనులు మోగుతాయి గుర్రపు గిట్టల ధ్వనులతో కలిసి.

అంతలో, ముందు ఇద్దరూ, వెనకాల శకటంలో అప్పాజీ, మహాకవి మందిర ప్రాంగణంలో దిగుతారు.

సూరన్న ఆవేశానికీ, సంతోషానికీ మేర లేదు.

పెద్దన్న గారు వాకిట్లోకి వస్తారు. గడియకో, మరో గడియకో రాయలవారు అక్కడికి వేంచేస్తున్న రనిన్నీ, ఊరేగింపు మహోత్సవం అక్కడినుంచి తరలి ఆ కొలువు కూటం దాకా సాగుతుందనిన్నీ, మహాకవులతో అప్పాజీ మనవి చేస్తాడు.

బంగారు కుండలాలూ, జలతారు సేలువలూ సవరించుకొని, కవులూ, పండితులూ రాయలవారి రాకకై మొగసాలలో ఎదురు చూస్తుంటారు.

అంతలో మంగళవాద్య ధ్వనులు మరీ మోగిపోతాయి.

మహారాజ ప్రాసాదం నుంచి రాయలవారు బయలుదేరినట్లు, కొంతదూరం వచ్చినట్లు, మరికొంత సమీపించినట్లు, సేవకులు పరుగెత్తి వచ్చి చెప్తూంటారు.

మరి ఇక కొంత సమీపించినట్లు, మొదట వర్షామేఘ గర్జనలాగ, తరువాత మహాసముద్ర ఘోషలాగ, విజయనగర ప్రజలు చేసే జయజయ ధ్వానాలు దగ్గిరగా దగ్గిరగా వినబడతాయి.

అంతలో వీధీ ముఖాన సందడి, ఒక కనురెప్పపాటు నిశ్శబ్దం.

రాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశ్వర మూరు రాయర గండ శ్రీకృష్ణదేవ రాయలు అల్లసాని పెద్దనా మాత్యుల గృహాంగణంలో, మంత్రి సామంతులతో వేంచేసి ఉంటారు. ముందు అప్పాజీ, అచ్యుతదేవరాయలూ, నంది తిమ్మన్నా, మాదయ్యగారి మల్లన్నా నడుస్తుంటే పింగళి సూరన్న చెయ్యి అందుకుని వచ్చి బంగారపుటడ్డల పల్లకీలో పెద్దన్నగారు కూర్చుంటారు.

మంగళ వాద్యాలు మ్రోగుతూనే ఉంటాయి.

అంతలో కవిరాజరాజు శ్రీ కృష్ణదేవ రాయలు ముందు నిలబడి, పల్లకీ తన చేతితో ఎత్తుతాడు.

తక్షణం కొందరు సామంతులూ, కొందరు కవులూ పల్లకీ బొంగులకు భుజాలు తగిలిస్తారు.

అల్లసాని పెద్దన కూర్చున్న పల్లకీని మోస్తున్న కృష్ణరాయలు - ఊహాచిత్రం
అల్లసాని పెద్దన కూర్చున్న పల్లకీని మోస్తున్న కృష్ణరాయలు – ఊహాచిత్రం

“ఆహా, ఏవి మహాప్రభువు! ఓహో, భోజుడేనా ఇలాగ చేశాడని విన్నామా! విద్వజ్జనుల పరిశ్రమ విద్వాంసులకే తెలుస్తుందన్నట్లు, మహాకవుల గొప్పతనం మహా కవులకే తెలుస్తుంది” అంటూ నంది తిమ్మన్నా, ధూర్జటీ మొదలైన కవీశ్వరులు ఆ గౌరవం తమకి జరిగినట్లే సంతోషిస్తారు.

సందడిలో కొంత వెనక్కి జరిగి, దిట్టలైనవారే కొందరు కవులు పెదవి విరిచి ధుమధుమ లాడుతూ ఉంటారు. వారిలో సంకుసాల నృసింహకవి ఉన్నాడా? అయినా ఈ ఆనంద సమయంలో వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పను.

*****

ఆహా! ఏమి ఊరేగింపు.

ముందు వందల కొద్దీ రౌతులు. తర్వాత సుఖంగా, చల్లగా పాడే తంజాపురి సన్నాయి కూటం. ఆ తరవాత, ఒకసారి నరాలకి వేడెక్కించీ, ఒకసారి కళ్ళల్లో మెరుపులు పుట్టించే, భట్టుకవుల స్తుతి పాఠాలు. పిమ్మట కంచి నుంచి వచ్చిన కామసుందరి మేళం. ఆ వెనక వేద మంత్రాలు పఠించే వైదికబృందం. ఆ వెంటనే మంత్రులతో, సామంతులతో, దండనాథులతో, కవులతో, పండితులతో, గాయకులతో, రాయబారులతో, శ్రీకృష్ణదేవరాయలు.

వారిలో అడిగో, ఆ వృద్ధతేజస్వి అప్పాజీ, నిప్పుకణాల లాగ, కత్తి మొనలలాగ ధధగలాడే రెండు కళ్ళూ, వేయికళ్ళుగా నాలుగు వైపులా పరికిస్తూ!

ఆ విశాలమైన ఛాతీ, భుజాలూ, బుగ్గమీసాలూ, సాళువ తిమ్మరసయ్య.

కోటేసినట్లు చక్కని ముక్కూ, పండుతమలపాకు వంటి శరీరచ్ఛాయా, కర్పూరపు తాంబూలం బుగ్గలో ఉంచే, రాయల వారితో మాట్లాడుతూ నడుస్తున్నవాడు నంది తిమ్మన్న.

ఆప్రక్కన నిష్కలంకమూ, నిశ్చలమూ అయిన చల్లని ముఖంతో ధూర్జటి.

అతని వెనకాలనే, మొలలో నుంచి బంగారపు పొడుంకాయ తీస్తున్నవాడు మాదయగారి మల్లన.

ఆయనకి ఎడవమ్వైపున ఆ అపరంజి కుండలాలూ, ఆకుపచ్చ సేలువా రామభద్రుడు. అతనికి కుడివైపున ఆ చక్కని జిలుగు పట్టు వలువలతో తీరిచిన కురులతో ముంగురులూ అలవోక నడకతో, ఆ యువకవి రామరాజ భూషణుడు.

అతని పక్క కందుకూరి రుద్రయ్య.

అతను వంగి వంగి, తల ఒకపక్కకు ఓరగా వంచి మాట్లాడుతున్నాడే, ఒక యువకునితో, అతను రామలింగ కవి; ఇంకా రామకృష్ణకవి కాలేదు. అతని నడకలో ఏమి నిర్లక్ష్యం! ఆ విశాల ఫాలమూ ఒక్కసారి మేఘాల్లాగా, ఒకసారి మెరుపుల్లాగా అయిపోయే ఆ కళ్ళూ “శారదనీరూపము” అన్నట్లు ఎలా గున్నాడో!

అతని వెనుక రాధామాధవ కవి, ఎల్లన.

అదుగో, వెనుకనుంచి తొందరగా ముందుకు తోసుకుని భట్టుమూర్తి వద్దకు వచ్చినవాడు బండారు లక్ష్మీనారాయణ. రాయలవారి అంతఃపురంలో సంగీతపు గురువు. అతని చేతిలో గ్రంథం “సంగీత సూర్యోదయం” ఏమో!

అతనితో కూడా వచ్చినవాడు బయకారపు రామయామాత్యుడు అనే గాయకుడూ, దండనాథుడూ “స్వరమేళ కళానిధి” ఆస్థాన గాయకులకు వినిపించడానికి వచ్చినవాడు.

అల్లడుగో, కొంచెం దూరాన నడుస్తూ, ఏదో ఆలోచిస్తున్నట్లూ, వ్యూహం పన్నుతూ ఉన్నట్లు, వేళ్ళు తిప్పుతూ వస్తున్నవాడు బొడ్డుచర్ల తిమ్మన్నగారు. ఇటువంటి చతురంగపు ఆటగాడు ఆ దినాల్లో లేడు. కవీశ్వర దిగ్దంతు లనుపించుకొన్న కృష్ణరాయలవారి యొద్దకుపోయి, వారితో చదరంగం ఆడుతూ ఉంటే ఈ చిన్న తిమ్మన్నగా రంటేనే, మహారాయలు చాలా సంతోషించి, కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా ఈయనకు ధారవోసి ఇచ్చారు.

ఇతని ప్రక్కన ఆ పొడుగాటి జుట్లూ, ఆ రంగురంగుల దుస్తులూ వాళ్ళు నట్టువ నాగయ్య, నట్టువ తిమ్మయ్యగార్లు. రాయలవారి సమక్షాన రాయలవారే రచించిన సంస్కృత నాటకం జాంబవతీ కల్యాణం ప్రదర్శించడానికి వచ్చారు.

ఇక ఆ పండితకూటంలో వారే, గీర్వాణ కావ్యకర్తలు దైవజ్ఞ విలాస కావ్యకర్తలు కొండవీటి విద్వత్కవి సార్వభౌములు లక్ష్మీధరులవారు. వారు వ్యాసతీర్థులు. అతడు రాజనాథ డిండిముడు. “ఇరుసమయి విళక్కన్” రచించిన తమిళ కవిరాజు, హరిదాసు అతడు. అతని పక్కనే రాయలవారి ఉత్కళయాత్రను వర్ణించిన కుమార సరస్వతి. చాటు విఠలనాథుడు ఆ కర్ణాటక కవి. ఆ తేజస్వు లిద్దరూ, పురందర దాసూ, కనకదాసునూ. కర్ణాటక కవిరాజులు కలిసి నడుస్తున్న ఆ ముగ్గురూ – గుబ్బి మల్లనార్యుడు, నంజుండయ్యా, లింగమంత్రీ.

ఓహో, ఓహో, ఆంధ్ర కర్ణాటక తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగం అది.

దక్షిణాపథం అంతా ఒక సుందర సంస్కారబంధం కట్టి పెట్టిన దినాలవి.

*****

ఊరేగింపు వీథి తిరుగుతుంది.

వీథి దాటినదాకా ఇక్కడ పెద్దన్నగారి గృహ ప్రాంగణంలో గవాక్షంలో నుంచి, వెయ్యికళ్ళతో చూస్తూ గర్వమూ, అడకువా మూర్తి కట్టినట్లున్నదే ఆమె, మహాకవి ఇల్లాలు.

ఊరేగింపు విజయనగర రాజవీథుల్లో ఏలాగున సాగిందో తోవలో రాయలవారికీ మహాకవికీ హారతులు ఎలాగ ఇచ్చారో, శ్రీ శఠకోపయతుల మఠం వద్ద పల్లకీ నుంచి దిగి, కవీ, రాజు, గురుదేవ చరణాలపై ఎలాగ శిరస్సులు ఉంచారో భూలోక దేవేంద్రుల సుధర్మాస్థానంలో, నిండోలగంలో, మనుచరిత్రము ఎలాగ పెద్దన్నగారు పఠించారో పఠిస్తున్నప్పుడు “ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమారతకు క్రౌంచాచల రాజ మయ్యె” అన్న పద్యంతో గద్గదిక ప్రారంభమై “హితుడవు, చతురవచోనిధి వతుల పురాణాగమేతిహాస కథార్థస్మృతి యుతుడ వాంధ్ర కవితా పితామహుడ వెవ్వరీడు పేర్కొన నీకున్” అన్న పద్యం దగ్గరకి వచ్చేసరికి మహాకవి కంఠం రుద్ధమై ఎలాగ చదవలేకపోయిందో, తర్వాత పఠనానంతరం, కవిపండితులందరూ ఆంధ్రకవిత్వ చరిత్రలో నవయుగం మనుచరిత్రతో ప్రారంభమైనదని ఎలాగ కీర్తించారో ఎప్పుడూ ఎవ్వరినీ పూర్తిగా కీర్తించని తెనాలి కవే పెద్దనా మాత్యులకు పాదాభివందనం ఎలాగ చేశాడో – ఈ గాథంతా నాటి సాయంకాలము అల్లసాని వారి ఇంట్లో కూర్చున్నవారందరికీ సూరన్న మరీ మరీ వర్ణిస్తున్నప్పుడు, ఆ ఇల్లాలు తిరుగుతూ, ఆగుతూ వింటుంది.

ఆ రాత్రి – భార్యా, సూరన్నా, తానూ ముగ్గురే కూర్చున్నప్పుడు పెద్దన్న గారొక విశేషం చెప్పారు.

ఉదయం సభ అయిపోయిన తరవాత రాయలవారి రహస్య మందిరంలోకి రమ్మని పెద్దన్నగారికి పిలుపు వచ్చింది. ఆయన వెడ్తాడు. వెళ్ళేసరికి రాయలవారు నిలబడి ఉంటారు. మహాకవి రాగానే మహారాయలవారు ఆయన్ని తన కౌగిలింతలో గాఢంగా హత్తుకుంటాడు. ఇద్దరి కళ్ళల్లో ఒక్క చినుకు కరిగి బుగ్గల మీదికి జారుతుంది. రాయలు మాట్లాడలేదు. కవి మాట్లాడలేదు. రాయలవారు అంతఃపురంలోకి వెళ్ళిపోతారు. అల్లసాని వారు ఇంటికి వచ్చేస్తారు.

ఈ గాథ వింటున్నప్పుడు సూరన్న బుగ్గలు తడిసి పోయేయి.

పెద్దన్నగారి భార్య మనసు ఎలాగుందో?

మరునాడు కవులందరికీ అల్లసాని వారి ఇంట విందు.

పెద్దన్నగారి భార్యను చూచి “వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు సుద్ది యౌ నతని గృహిణి” అంటాడు రామకృష్ణకవి. “మా అక్కగారు ప్రవరుని గృహిణి వంటిదే; కానే మా బావ మాత్రం ప్రవరుడు కాడు; మాయాప్రవరుడు కాని” అని వెంటనే తిమ్మకవి అంటాడు. అందరూ నవ్వుతారు. “అవునా?” అన్నట్లు పెద్దన్న ఆమె వైపు చూస్తాడు. ఆ అదితిదేవి చిరునవ్వుతో వడ్డిస్తూనే ఉంటుంది. రామకృష్ణకవి కళ్ళు మెరుస్తాయి.

తర్వాత, పెద్దన్నకు ప్రవరుని మీద కన్నా వరూధిని మీద ఎక్కువ ఇష్టం అనీ వరూధినినీ గంధర్వుణ్ణి కలిపిన దాకా కవిగారికి తోచలేదనీ, అంతగా వేటా యుద్ధమూ ఎలాగ వర్ణించారండీ, రాయలవారితో వెళ్ళినప్పుడు చేసేరా అనీ, “ఈ నగరంలో వరూధిని ఏ వీధిని ఉందో చూడాలి, అంత జీవం ఉట్టిపడుతున్నట్లు మాట్లాడిందనీ,” ” వరూధిని ఎవరో తెలిసినా, ఆమెకిప్పుడు తాతగారి వయస్సే దాదాపు ఉంటుంది, గనక మీకు లాభం లేద”నీ – ఇలాగ రకరకాలుగా కవులందరూ మాట్లాడతారు. ఎక్కువ మాటలు సూరన్నవి. మధ్య మధ్య ఒక్కొక్క మెరుపు రామకృష్ణ కవిది.

అవి గొప్ప రోజులు, ముఖ్యంగా కవులకు.

మరి కొన్నాళ్ళు జరిగాక, రాయలవారే, వారి మందిరానికి కవుల్నందరినీ ఆహ్వానిస్తారు. పారశీక రాయబారులు వస్తారు. వారి వల్ల కానుకలు గొంటారు. తరువాత రాయలు “ఆముక్తమాల్యద” వినిపిస్తారు. ఆ వైదుష్యానికీ, ఆ ప్రతిభకీ, ఆ నవ్యతకీ, ఆ లోకజ్ఞతకీ అందరూ ముఘులౌతారు.

ఆ రాత్రి నంది తిమ్మనగారి ఇంట రాయలవారి మహాకావ్యాన్ని ప్రశంసిస్తూ రామకృష్ణ కవి

  “ఆ నిష్ఠానిధి” గేహసీమ నడిరే యాలించినన్ మ్రోయు, నెం
  తే నాగేంద్రశాయాను పుణ్యకథలున్ దివ్యప్రబంధాను సం
  ధానధ్వానము నాస్తి శాక బహుతా నాస్త్యుష్ణతా నాస్త్యపూ
  పో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలున్”

అన్న పద్యం ఉత్సాహంగా చదువుతాడు.

రామకృష్ణకవి అసాధ్యుడు. సూరన్న కూడా. ఒక్కసారి వింటే మంచి పద్యం వీళ్ళిద్దరికీ కంఠస్థంగా వస్తుంది.

పెద్దన్న, తిమ్మన్న, ధూర్జటి, మల్లన్నగార్లకిన్నీ వీరిద్దరూ యుఅవకులే అయినా, వీరి అభిరుచి అంటే చాలా గౌరవం. ఈ యువకవులు మెచ్చుకుంటే కలిగే ఆనందం వాళ్ళకు ఏ పండితులు మెచ్చుకున్నా కలిగేది కాదు.

ఒక సాయంకాలం తుంగభద్రా తీరాన్ని పెద్దన్నగారు మొదలుకొని కవులందరూ సమావేశమౌతారు.

విరూపాక్షస్వామి ఆలయ శిఖరం మీద బంగారపు కాంతులు అల్లుకుని ఉంటాయి.

తుంగభద్ర కాస్త ఒళ్ళు విరుచుకుంటూ కునుకు పట్టే ముందులాగ కూనిరాగం తీస్తుంది.

పంపా సరోవరం నుంచి కాబోలు లేతగాలులు వచ్చి విజయనగరంలో చొరబడుతున్నాయి.

తుంగభద్రలో దిగి, తామ్రపాత్రంలో నీరు నింపుకుంటున్న ఒక యువతిని చూచి, రుద్రయకవి తూలిపడి కూర్చుంటాడు. కూర్చుని ఆమె వైపు చూసి,

  ఎన్నడు నేరిచెన్ బెళుకు లీ చెలి కన్నులు! కారు కమ్ముల
  న్నన్న కురుల్! పిరుందు పటువై పటువైఖరినిప్పిడింగదా!
  మొన్న గదమ్మ పిన్నమొనమొల్కలు, నేడివె ముద్దులాడి లే
  జన్నులు గొప్పవై పయడ సందున దాగుడుమూతలాడేడిన్!

అందరూ భేష్ భేష్ అంటారు. సంకుసాల ఆ మెప్పులు సహించలేడు.

  యతివిటుడు గాక పోవునే అస్మదీయ
  కావ్యవైరాగ్య వర్ణ నా కర్ణనమున!
  విటుడు యతి కాకపోవునే వెస మదీయ
  కావ్య శృంగార వర్ణనా కర్ణనమున!

అని అహంకారంతో చదువుతాడు.

అతన్ని హేళన చెయ్యడానికి లాగ ఆవంత అనీ ఆనని కొంటెనవ్వుతో బడాయిగా నిలబడి

  లింగనిషిద్ధు కల్వల చెలింగని, మేచకకంధురున్ త్రిశూ
  లింగని, సంగతాళి లవలింగని, కర్దమ దూషితన్ మృణా
  లింగని, కృష్ణ చేలుని హలింగని, నీలకచన్ విధాతృనా
  లింగని, రామలింగ కవి లింగని కీర్తి హసించు దిక్కులన్

అని తెనాలి కవి జబ్బలు చరుచుకుంటూ చదువుతాడు.

ఇంతలో సాయంకాలం సంధ్యాసమయంగా మారుతుంది.

భట్టుమూర్తి గొంతు సవరిస్తాడు. చటుక్కున తుంగభద్ర గలగల మంటుంది. ఆ అలల్లో ఏదో కదులుతుంది. గిరక ఒడిలో బిడ్డలాగ.

  “జలకము లార్చి, పాండు జలజచ్ఛద పాళీక గప్పి తమ్మి సం
  కుల తెలిదేనె లుగ్గిలిడి, క్రొందరగల్ కదలించు లేత తొ
  ట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ, కో
  మల కుముదా గతాళికుల మంజురవంబున జోలపాడుచున్”

అంటూ చదువుతాడు. అందరూ హాయి హాయి అంటారు.

రామకృష్ణ కవి “ఏది సంగీతం లేకుండా కాస్త ఆ పద్యం తిరిగి చదువు”మంటాడు. భట్టుమూర్తి మళ్ళీ చదువుతాడు. భేష్ అంటారు అందరూ.

సంధ్య రాత్రిగా మాసిపోయినా, ఆ రోజున కవులు ఒక పట్టాన కదల లేదు.

“ఇప్పుడు రాయలవారు ఏమి చేస్తుంటారో?” అంటారు ఒకరు.

“ఈ రాత్రివేళ ఏం జేస్తుంటారని చెప్పను? ఎక్కడ ఉంటారని చెప్పను?

భోజకన్యా సరిద్రాజహంసము, సత్య
   భామా శుకీకేళి పంజరంబు,
జాంబవతీనిశా చంద్రోదయంబు, కా
   ళిందీ సరోజి నేందిందిరంబు,
భద్రా కలాపినీ పావృడంబుదము, సు
   దంతా రసాలలతా పికంబు,
మిత్రవిందావనీ చైత్రాగమము, లక్ష
   ణాహార యష్టిక నాయకంబు,
షోడశ సహస్ర కామినీ స్తోమధేను
   కా రిరింసా మదోత్కట వారణేంద్రము”

అంటాడు తిమ్మ కవి.

అనగానే ప్రక్కన ఘల్లుమని నవ్వుతున్న నవ్వు వినబడుతుంది.

అందరూ తూలిపడతారు. “రాయలవారే ఏం చెప్మా! ఏమో!”

దక్షిణదేశానికి సార్వభౌములు మారివేషంతో తనకు ప్రియతములైన ప్రజల కోసం తిరుగుతారని ప్రతీతి.

ఈ కవులకన్న ఆయనకు ప్రియు లెవ్వరు?

అప్పుడు పుట్టి ఉంటే…ఇవన్నీ చూసేవాణ్ణి కదా.

ఎందుకు చూడనూ?

అప్పుడు పుట్టి ఉంటే, నేనే పెద్దన్ననై పుట్టు ఉందును!

*****

2 thoughts on “అప్పుడే పుట్టి ఉంటే …

  1. Excellent. It’s a matter of strange coincidence as I am now writing a book of historical fantasy like this idea. In my book PB Shelley finds himself in Vijayanagaram during the Rayalu’s reign. I’d like to send the chapters for your feedback, which I value much.

Your views are valuable to us!

%d bloggers like this: