బ్లాక్ లో సినిమా టికెట్స్ అమ్మడం, ఇంటెర్వల్లో సమోసాలు అమ్మడం ఉపాధిగా పెట్టుకున్న కాశీకి కొత్త ఉపాధి వెతుక్కోవడం చాల కష్టమైంది. కానీ రోజులు గడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పదు కదా! సినిమా హాళ్ళలో తినుబండారాలు అమ్ముకొనేవాళ్ళు, పార్కింగ్ రుసుము వసూలు చెసేవాళ్ళు అందరూ ఒక్కసారిగా నిరుద్యోగులు అయిపోయారు. ఇది సామన్య సినిమా హాళ్ళనే ఉపాధి స్థానాలుగా నమ్ముకున్న వాళ్ళ స్థితి.
కాశీ కి మొదటి మూడు నెలలూ ఉన్న డబ్బులతో గడచిపోయాయి. ఆ తర్వాత ఇంట్లో సరుకులు నిండుకోవడం మొదలైంది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుదు వాళ్ళు కరోనా వలన బడి మూతబడి ఇంట్లోనే ఉంటున్నారు. “అది కావాలి…ఇది కావాలి” అని అడుగుతూనే ఉన్నారు.
సమోసాలు టోకుగా వేసి అమ్మేవాడు దుకాణం బంద్ చేసేసాడు. ఆ వ్యాపాతి ఒకవేళ అంగడి నడిపినా ప్రజలు బయటి తిండి తినడం మానేసారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమిచేయాలో తోచక కాశి, అతని భార్య వసంత సతమౌతుంటే అనుకొకుండా పక్కవీధిలో ఉన్న కాశీ బామ్మ వచ్చింది.
రావడమే తడవు మొదలెట్టింది – “ఏరా సినిమాహాళ్ళు మూతపడ్డాయి కదా మరి ఎలా నడుపుతున్నవ్ ఇల్లు?”
“అదేనే ఏమిచేయాలో తోచడం లేదు?” నీళ్ళు నమిలాడు కాశీ.
“కరోనా మనుషులు ఆలోచించడంలో కూడా మార్పులు తెస్తుందటగా…” బామ్మ చెప్పడం ఆపింది.
“కరోనా కాదే కరోనా వల్ల రాబడి పోగొట్టుకొన్న నాలాటి వాళ్ళు తప్పక ఇంకో మార్గం వెతుక్కోవాలి, లేదంటే భుక్తి గడవదు.” కాశీ కటువుగా చెప్పాడు.
“మరి ఏమి చేద్దామనుకుంటున్నవ్?”
“నువ్వు చెప్పవే ఏమి చెయ్యమంటావ్?” విసుగ్గా అన్నాడు కాశీ.
“నీ భార్య వంట బాగా చేస్తాది. బజ్జీల బండి పెట్టుకో. కానీ కరోనా భయం వల్ల అమ్మకాలు ఔతాయా? ఏమో? కూరగాయలు అమ్ముకో ఇంటింటికీ సప్లై చేయి? నీకా ఆ వ్యాపారం తెలియదు. ఇళ్ళల్లో పనిమనిషుల్ని కూడా మానిపించేస్తున్నారు! ఎలా ఇప్పుడు?” బామ్మ చెప్పడం ఆపింది.
ఇవే ఆలోచనలు కాశీకి, వసంతకూ వచ్చాయి. కాని అవి పరిష్కారాలుగా కనబడలేదు.
ఇంట్లో సరుకులు కేవలం 10 రోజులకే వస్తాయి. చేతిలో పని లేదు. రాబడి లేదు.
ఇళ్ళ కట్టుబడి కూడా ఈమధ్య బాగా తగ్గిపోయింది. ఇటువంటి అనూహ్యమైన సమయంలొ ఏమి చేయాలో తోచక తబ్బిబ్బు ఔతున్నాడు కాశి.
’బుర్రకు పదునుపెట్టే సమయం వచ్చింది’ అని భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడ్డారు.
కాశికి ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
గతంలో తన మిత్రుడు కత్తులకు, చాకులకు పదునుపెట్టేవాడు. వాడి దగ్గర పదునుపెట్టే యంత్రం ఉండేది. దూరంగా కనిపిస్తున్న అపార్ట్మెంట్లు చూస్తుంటే కాశికి తనుచేయబోయే పని కళ్ళకు కట్టినట్లు కనిపించింది.
“బామ్మా! మాయావిడి అంది కదా బుర్రకు పదును పెట్టే సమయం వచ్చింది అని. పదును పెట్టే యంత్రం కొని కత్తులకు, చాకులకు, కూరగాయలు కోసుకునే వాటికి పదును పెట్టడం ఒక్కటే నాకు దిక్కు ఇప్పుడు.” అని చకచకా చెప్పేసాడు.
అనుకున్నదే తడవు తన మిత్రుడికి ఫోన్ చేసి వివరాలు కనుకున్నాడు. తన భార్య వసంత దగ్గర ఉన్న చెవిపోగుల పై దృష్టి మళ్ళింది. ఎలా అడగాలా అని తటపటాయిస్తున్నాడు.
ఫోన్లో కాశి మాట్లాడుతున్నపుడు శ్రద్ధగా వింది వసంత.
అన్యోన్య దాంపత్యానికి పెద్ద చదువులు అవసరంలేదు, ఈ సమస్య నాది కూడా అని ఆలోచించగలిగే పరిపక్వత ఉంటే చాలు. అది వసంతలో ఉంది.
కాశి దగ్గరకు వచ్చి వసంత మెల్లిగా అంది – “నువ్వు ఏమి అనుకోకపోతే ఒక మాట చెబుతాను. కోపం తెచ్చుకోనని మాట ఇయ్యి” అని అడిగింది.
“ఇప్పుడు కోపం తెచ్చుకొని సాధించేది ఏముంటదే చెప్పు!” అని మెల్లిగా అన్నాడు కాశి.
వెంటనే తన చెవిపోగులు తీయడం మొదలుపెట్టింది. కాశికి అర్థమైపోయింది. కళ్ళ నీళ్ళు గిర్రున తిరిగాయి.
బామ్మ చూస్తుందని తెలిసికూడా వెంటనే కాశి వసంతను అక్కున చేర్చుకున్నాడు. వసంతకు చెవుపోగుల కంటె విలువైన ప్రేమ దక్కినందుకు చాల సంతోషం కలిగింది.
“ఏంటయ్యా నువ్వు! ఇల్లు గడవాలంటే ఏదో ఒకటి చేయాలిగదా? బంగారం ఇలా మనకు ఉపయోగపడడం మన అదృష్టం అనుకుందాం. నువ్వు ఆరోజు అలా కొనపోతే ఈరోజు ఇలా మనకు ఉపయోగపడేదా? మళ్ళీ నువ్వే కొందువుగాని!” అని కాశి చెతిలో తన చెవిపోగులు పెట్టింది.
వాటి వెనుక దాగిన ప్రేమ, ఘటనలు ఇప్పుడు వసంతకు గుర్తుకి రాలేదు కాని కాశి మనసుని నింపేసాయి.
*****
అప్పటికింకా వారిద్దరికీ పెళ్ళై ముచ్చటగా మూడు నెలలు మాత్రమే అయ్యింది.
ఉగాది పండుగకు వసంతకు చెవిపోగులు చేయించాలని రాత్రి పగలు ఒవెర్ టైం పనిచేసి వచ్చిన ఓ.టి డబ్బులతో ఉగాది ముందు రోజు కూకట్పల్లి బజారుకు వెళ్ళి అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన లక్ష్మీ జ్యూయలరి కి వెళ్ళాడు.
చమట కంపు కొడుతూన్న కాశిని చూసి ఆ షాప్ లో ఉన్న సేల్స్ పర్సన్ ఒక్కసారిగా అసౌకర్యానికి గురైయ్యాడు. అంతలోనే తమాయించుకొని “ఏమి కావాల”ని కొంచం అసహనంగానే అడిగాడు.
కాశి ఆయన పడుతున్న అసౌకర్యం గమనించి “అయ్యా, నేను ఫ్యాక్ట్రీ నుంచి నేరుగా వచ్చేసాను. మరోలా అనుకోకండి. రేపు ఉగాది కదా రాత్రికే మేము ఊరికి వెళ్తున్నం. తొందరగా కొనుక్కోవాలి.” అని అన్నాడు.
కాశి అమాయకతకు అంగడి యజమాని సంతోషించాడు. సేల్స్ మ్యాన్ కు నగలు చూపించమని పురమాయించాడు.
అంగడి యజమానికి, కాశీకి మాటలు కలిసాయి.
వసంత గురించి గొప్పగా చెప్పుకున్నాడు కాశీ. భార్యపై ఆ కార్మికుడికి ఉన్న ప్రేమ తెలిసి ఆ సేల్స్ పర్సన్ కు ముచ్చట వేసింది.
“నీ పేరు?” అని అడిగాడు.
“అయ్యా, నా పేరు కాశి”
“నా పేరు మధు. నీకు మంచి ధర ఇప్పిస్తాను మా మేనేజర్ తొ మాట్లాడి” అని చెప్పి కాశి ఎంచుకున్న చెవిపోగులు తీసుకొని లోపలికి వెళ్ళాడు.
కాశి చాల సంతోషపడ్డాడు.
అనుకున్న ధర కంటె ఒక ఆరు వందలు తక్కువకు చెవిపోగులు కొన్నాడు కాశి.
“మధుగారు మీ సహాయానికి థాంక్స్” అని చెప్పి ఉత్సాహంగా బయలుదేరాడు.
*****
తెల్లారేసరికి కొవ్వూరు వచ్చేసింది.
అత్తారింటికి మొదటి పండక్కి వెళ్ళడం భలే సరదాగా ఉంది. కొవ్వూరు దగ్గర పశివేదల ఊరి చివర ఒక పూరి గుడిసె రైతు కూలీలు వాళ్ళు.
స్నానం చేసాక అత్తమ్మ దగ్గరికి వెళ్ళి కొత్తగా కొన్న చెవిపోగులు తన చేతిలో పెట్టి “మీ అమ్మాయికివ్వండి” అని చెప్పాడు.
తన కూతురుపై అల్లుడు చూపిస్తున్న ప్రేమకు తనకు ఇస్తున్న గౌరవానికి ఆమె కళ్ళు మెరిసిపోయాయి.
“ఇటు రావే వసంతా” అని పిలిచింది.
వసంత అమ్మదగ్గరకు వచ్చింది.
“కళ్ళు మూసుకో” అన్న అమ్మ మాటకు ఆశ్చర్యపోతూ “ఎందుకూ?” అని వసంత అడిగింది.
“చెప్పింది చేయవే”
వసంత కిక్కురుమనకుండా కళ్ళు మూసుకొంది.
“చేతులు చాపు”
చేతులు చాపింది వసంత.
తన కూతురు చేతుల్లో బంగారు చెవుపోగులు పెట్టింది.
అక్కడే ఉండి చూస్తున్న వసంత తండ్రి కళ్ళు చెమర్చాయి.
ఆ సమయంలో వాళ్ళ మనసుల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళ ముఖాల్లో ప్రతిఫలించింది.
*****
ఆ చెవిపోగుల తాలూకు బిల్లు తీసుకొని కాశి కూకట్పల్లిలో ఉన్న లక్ష్మీ జ్యూయలరికి వెళ్ళాడు.
లోనికి వెళ్ళగానే అతనికి మధు కనిపించాడు. మధు కూడా కాశిని గుర్తుపట్టాడు.
ఉభయకుశలోపరి అయ్యాక వచ్చిన విషయం చెప్పడు కాశి.
అమ్మితే కానీ రోజులు గడవని స్థితి కాశిదని తెలుసుకొని చాలా బాధపడ్డాడు మధు.
అదృష్టం ఏమిటంటే బంగారం ధర బాగ పెరగడంతో కాశి కొన్నదానిన్నా ఐదు వేలు ఎక్కువే వచ్చాయి. డబ్బు తీసుకొని వెళ్లబోతున్న కాశితో మధు ఇలా అన్నాడు:
“నేనుంటున అపార్ట్మెంటు పెద్దది. నీకు ఎక్కువ కష్టమర్లు దొరకొచ్చు. నువ్వు నీ యంత్రాన్ని మా బ్లాక్ కి తీసుకొనిరా. నేను సెక్యూరిటికీ నీ గురించి చెప్పిట్టివుంటాను. మా బ్లాక్ లోనే నువ్వు నీ కొత్త వ్యాపారం మొదలుపెడుదువు.”
కాశి ఆనందగా చేతులు జోడించి మధుకు నమస్కరించాడు.
*****
“ప్రయత్నమేవ అగ్రజం” అని ఆర్యోక్తి.
ప్రయత్నం చేస్తేనే ఫలం దక్కుతుంది. అది ఎటువంటిదైనా మనం అనుకున్నంతగా ఫలితం రాకపోయినా అది ఫలితమే. ఒక్కోసారి మన అర్హతను బట్టి మనం ఊహించని ఫలితం రావొచ్చు. మన ఆత్మ ఎంత అనాదియో కర్మ కూడా అంతే అనాదియైనది. అదే జరిగింది కాశి విషయంలో.
రోజుకి ఒక అపార్ట్మెంట్ బ్లాక్ లో తన సానపట్టే యంత్రాన్ని తీసుకొని వెళుతున్నాడు. రోజుకి కనీసం పదిమంది కస్టమర్లు వస్తున్నారు. ఒక కత్తికి పదును పెట్టడానికి 20 రూపాయలు తీసుకొంటున్నాడు. ఆలెక్కన రోజుకి సగటున 200 నుంచి 300 వరకూ వస్తున్నాయి. కొన్ని రోజులు ఇంకా ఎక్కువే వస్తూంది.
ఇలా మొదలైన కాశి నూతన ప్రస్థానం ఒక మలుపు తిరిగింది.
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
*****
అనుకోకుండా ఒకరోజు మధు కాశీకి ఫోన్ చేసాడు.
“కాశి, నీ భార్య వసంత పది వరకూ చదువుకుంది అన్నావు కదా. మా దుకాణంలో ఒక ఖాళీ ఉంది. ఒకసారి నువ్వూ నీ భార్యా వచ్చి నన్ను కలవండి.” అన్నాడు.
ఇంటికి వెళ్ళి విషయం వసంతకు చెప్పాడు. బామ్మ అప్పుడు అక్కడే ఉంది. “మరి పిల్లలూ?” అని వసంత అంటే బామ్మ కలగచేసుకొని “పిల్లల్ని నేను చూసుకుంటాను నువ్వు లక్షణంగా ఉద్యోగానికి వెళ్ళు” అంది.
కాశికి ఆ సమయంలో బామ్మ ఓ అమ్మవారిలా కనిపించింది. బామ్మకు కాశి ఇప్పటివరకూ ఏ సహాయమూ చేయలేదు. బామ్మ కూడా అడగలేదు.
మర్నాడే వసంతను తీసుకొని లక్ష్మీ జ్యూయలరి షాప్ కి వెళ్ళాడు.
“ఎవమ్మా నువ్వు ఇక్కడ ఇచ్చే పనిని చేయగలవా?” అని అడిగాడు మధు.
వసంత తన ఎంతో మర్యాదగా “తప్పకుండా చెస్తానండి. నాకు కొంచం తర్ఫీదు ఇప్పించండి” అని వేడుకోలుగా చెప్పింది.
“మా మేనెజెర్ నిన్ను ఇంటెర్వ్యూ చేస్తారు. సెలెక్ట్ అయితే నాకు చెబుతారు” అన్నాడు మధు.
అక్కడ నుంచి మనేజర్ రూంకి వెళ్ళింది వసంత. మధు దగ్గరే ఉన్నాడు కాశి. ఒక పదిహేను నిముషాలలో బయటకు వచ్చింది వసంత.
మధు మనేజర్ రూంకి వెళ్ళాడు.
వసంత ను చూసి కాశి – “బాగా మాట్లాడావా? అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధనం చెప్పావా?” అని అడిగాడు.
“నాకు తెలిసిది చెప్పాను. మంచిగానే చెప్పానని అనిపించింది.” అని అంది వసంత.
ఇంతలో మధు వారిదగ్గరకు వచ్చాడు.
“వసంతా! ఎప్పటినుంచి నువ్వు పనికి వస్తావు?” అని అడిగాడు.
వసంత చేతులు జోడించి “నేను సిద్ధంగా ఉన్నాను. చాలా థాంక్స్ మధు గారు” అని చెప్పింది. ఆమెకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నయి. కాశి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.
మధు ఇది గమనిస్తూ కాశి భుజంపై చేయి వేసి “మంచివాళ్ళకు మంచే జరుగుతుంది. నీ భర్యకు నెలకు పది వేలు జీతం. కటింగులు పోనూ చెతికి 8500 వస్తాయి. మంచి రోజు చూసి జాయిన్ చేయి” అని చెప్పాడు.
వయసులో పెద్దవాడైన మధు కాళ్ళకు మొక్కారు వసంత, కాశి.
మధు వాళ్ళను నివారిస్తూ “నేను చెసింది ఏమీ లేదు. మీ మంచితనమే మీ అర్హత అన్నాడు.”
అక్కడే ఉన్న ఇతర సిబ్బంది వసంత కాశిల వంక అభినందిస్తున్నట్లు చూస్తూ ఉన్నారు.
// శుభం //