అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా?

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.5]

అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా?

akhanda bharatam nijama kada

కొన్నేళ్ళ క్రితం వెండి డానిగర్ అనే షికాగో యూనివర్సిటి ప్రొఫెసర్ వ్రాసిన “The Hindus : An Alternative History” అన్న పుస్తకాన్ని చదివాను కానీ నిశితంగా పరిశీలించలేదు.

ఒక్కొక్క భాగాన్ని చదివిన తర్వాత కాస్తంత అంతర్మథనం చేసుకొని నా ముఖపుస్తకం గోడ పై (Facebook wall)లో ఓ మూడు వ్యాఖ్యలు ఉంచాను వాటిని ఇక్కడ సంగ్రహం చేసిపెట్టాను. ఈ క్రమంలో భాగంగా కొద్దిమంది నూతన మిత్రులు, ఔత్సాహికులు దొరకడం సంతోషించదగ్గ విషయం. వారిలో సురేశ్ కొలిచాల గారు ఒకరు. సురేశ్ గారు వెండీ డానిగర్ వ్రాసిన “The Hindus : An Alternative History పుస్తకంపై తమ అభిప్రాయాల్ని ఈమాట.కామ్ లో హిందూమత చరిత్రలో ప్రత్యమ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? అన్న శీర్షికతో సంకలనం చేసారు.

సురేశ్ గారి వ్యాసం నా ప్రతిస్పందనను మాలిక.ఆర్గ్ లో ఉదారవాదం Vs. తత్వవాదం అన్న పేరుతో వ్రాసాను.

ప్రస్తుత వ్యాసం పై నా వ్యాసానికి కొనసాగింపుగా భావించవచ్చు.

 

* * * * *

  1. హిందూదేశ చరిత్ర

మొదటగా అందరికీ తెలిసిన విషయం – హిందు అన్న పదం భారతీయ పదం కాదు.

దేశాలను జయిస్తూ వచ్చిన గ్రీకులు సింధూనది ఆవలి తీరాన ఉన్న ప్రాంతాన్ని వారి భాషలో ఇండోస్ అని పిల్చినట్టుగా, ఆపై పర్షియన్లు, అరబ్బులు మొదలైనవారు “హిందూ” పదాన్ని విరివిగా వాడినట్టు వికిపెడియా ఇచ్చే సమాచారం. మరీ లోతుగా చరిత్రలోకి వెళ్ళలేను కాబట్టి వికిపెడియా సమాచారాన్ని బట్టి చూసినా “హిందు” అన్న పదం ఒకానొక నదికి విదేశీయులు పెట్టుకొన్న పేరే గానీ దానికి ఎలాంటి మతపరమైన, ఆధ్యాత్మిక సంబంధమైన లేక భౌగోళికమైన సమగ్రత లేదు.

ఇక వెండీనే తన పుస్తకంలో ఉదహరించినట్టుగా హిందూయిజమ్ అన్న పదాన్ని బ్రిటీషువారు చలామణిలోకి తెచ్చారు. ఇస్లాంను అనుసరించేవారిని ముస్లింలు, క్రీస్తును అనుసరించేవారిని క్రిస్టియన్లు, బుద్ధుణ్ణి అనుసరించేవారు బుద్ధిస్టులు అన్నంత సులభంగా నానా దేవుళ్ళని, సిద్ధాంతాలనీ అనుసరించే భారతీయుల్ని పిలువలేనితనం వల్ల బ్రిటీషువారు “హిందూయిజా”న్ని పుట్టించారు.

ఇక అసలు విషయంలోకి వెళ్ళేముంది భారతదేశ సమగ్రత, సమైక్యత పై ఉన్న కొన్ని వాదనల్ని చూసి వెళదాం. ఎందుకంటే “హిందూ” మత “చరిత్ర” చెప్పాలంటే మొదట ’హిందూ’దేశ చరిత్రను తలస్పర్శిగానైనా స్పృశించడం అవసరం.

అఖండ భారతదేశం మిథ్యా స్వప్నమా?

’హిందూ చరిత్ర’ లో మొదటగా చర్చించాల్సిన విషయం –  అఖండ భారతం (One India) గురించి.

“అఖండ భారతం” అన్నది ఒక కల మాత్రమేనని, పూర్వ-ప్రస్తుత దేశ పరిస్థితులు (రాజకీయ & సామాజిక) ఈ భావనను బలపరచేవిగా లేవని పలువురు చెప్పగా విన్నాను. మన దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పొందివుందేగాని ఎప్పుడూ ఏకదేశంగా (One country) గా లేదని ఈ “ఏక భారతం” (One India) స్వాతంత్రోద్యమ కాలంలో పుట్టి, పెరిగి, పెద్దదయిందేగానీ ప్రాచీనమైనది కాదని వారి వాదన. అందుకు వారు ఉటకించే ఆధారాలేవంటే:

  1. స్వాతంత్రం రావడానికి పూర్వం, ఆ తర్వాత కొద్దికాలం పాటు కొనసాగిన కొన్ని వందల రాజ్యాలు/సంస్థానాలు.
  2. ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాలలోని వ్యక్తుల శారీరక, మానసిక, సాంస్కృతిక వ్యత్యాసాలు.
  3. తతిమా భారతంతో పోలిక లేని శారీరక, మానసిక, సాంస్కృతిక అంశాలు గల ఈశాన్య రాష్ట్రాలు.
  4. భాషా వ్యత్యాసాలు, ఆచార వ్యత్యాసాలు ఇంకా ఇలాంటివెన్నో.

పై వాదనను విన్న తర్వాత ఆ సదరు వాదన ఎంత వరకు నిజం? ఇంతకూ “భారతం”, “భారతీయత” అంటే ఏమిటి? వాటికి నిర్వచనాలు, కొలమానాలు ఉన్నాయా? ఉంటే అవేమిటి? వాటిని విడివిడిగా చూస్తే ఏమనిపిస్తుంది అలానే పజిల్లో ముక్కలను పేర్చినట్టుగా పేర్చి చూస్తే ఎలాంటి అర్థం దొరుకుతుంది? – ఇన్ని ప్రశ్నలు నన్ను వేధించాయి. దొరికిన సమయాన్ని, దొరకబుచ్చుకున్న సమాచారాన్ని క్రోడీకరించి ఈ క్రింది సమాధానాలను రాబట్టుకొన్నాను.

గమనిక: ఇవి నా వయ్యక్తికాభిప్రాయాలు. ఇవే సిద్ధాంతాలని చెప్పడం లేదు.

భారతదేశం – ఇండియా – ఏది సరైన పేరు?

పురాణాల ప్రకారం ప్రాచీన భారతదేశం 56 స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నట్టు తెలుస్తోంది.

“ఛప్పన్నారు దేశాలు” అని వీటినే చాలామంది పేర్కొనడం జరుగుతోంది. “అంగ, వంగ, కళింగ…” అని మొదలయ్యే ఈ రాజ్యాల పేర్లను పరికిస్తే 56 ప్రత్యేక జాతులే ఒక్కొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకొన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాజ్యాలలో కేరళ, తమిళ, ఆంధ్ర, మహారాష్ట్ర, కాశ్మీర పేర్లతో ఈనాటికీ ఆయా రాష్ట్రాలున్నాయి. ప్రాచీన విదర్భ ఇప్పుడు మహారాష్ట్రలో భాగం. కామరూప దేశాన్ని ప్రస్తుతం “అస్సోం”గా పిలుస్తున్నాం. కళింగ దేశమంటే ఇప్పటి ఒడిషా అలానే వంగదేశం (పశ్చిమ) బెంగాల్. సింహళ దేశం మాత్రం భారతదేశం నుండి విడివడి ప్రత్యేక దేశంగా మారింది…బ్రిటీషువారి దయవల్ల!

అలా భారత భూభాగం 56 దేశాలుగా విభజింపబడివుందన్న దాంట్లో ఎలాంటి అనుమానమూ లేదు. ఇది నిజం కాదని చెప్పే అవసరమూ లేదు. ఎందుకంటే ఇప్పటి రాష్ట్రాలే అప్పటి దేశాలుగా ఉండేవని భావించి చూస్తే చాలు. అలా పురాణాల్లోని ఛప్పన్నారు దేశాలు కాలక్రమంలో, గతానుగతికంగా ఈ విశాల దేశాలన్నీ సామ్రాజ్యాలుగా, స్వత్యంత్ర సంస్థానాలుగా, చిట్టిపొట్టి జాగీర్లుగా విడిపోయాయి.

ఇలా విడిపోయి, పోరాడుకొని, సంధించేసుకొని, సంబంధాల్ని ఇచ్చిపుచ్చుకొంటూ బ్రతికేస్తున్న భారత రాజులు-రాణులు-సంస్థానాధీశుల తలవ్రాతలు ముస్లిం, పాశ్చాత్యుల దండయాత్రలు, విజయ పరంపరలతో దశాదిశల్ని మార్చేసుకొన్నాయి. ఆ వలస పాలకుల కాలంలోకి వెళ్ళే ముందు సదరు రాజ్యాల మధ్య కలహాలు, స్నేహాలు, ఒడంబడికల వంటి రాజకీయ విషయాలు కాక మరేదైనా ఏకసూత్రత ఉండిందా అన్నదాన్ని పరిశీలించాలి. అందుకు సాంస్కృతిక, సామాజిక, సాహిత్య నేపథ్యాలను పరిశీలించడం ద్వారా ఏకసూత్రతను కనిక్కోవచ్చునని నా అభిప్రాయం.

ఆ మేరకు అత్యంత సంక్షిప్తంగా చూస్తే…

సాంస్కృతిక నేపధ్యం:

భౌగోళికంగా ఎన్నో రకాల శీతోష్ణ పరిస్థితుల్ని కలిగిన ఈ దేశంలో సాంస్కృతికత ఒక అంతఃసూత్రంలా కనబడుతుంది. అది కూడా ఆధ్యాత్మికత ద్వారానే. దేశాలు వేరైనా పండుగలు, పబ్బాలు, పర్వదినాలు, ఉత్సవాలు ఒకే రీతిలో, దాదాపు ఒకే రోజున నిర్వహింపబడేవి. మళ్ళీ వీటిలో కూడా కొన్ని ప్రాంతీయమైన తేడాలుండేవి గానీ స్థూలదృష్టితో చేసే పరిశీలనలో వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆవిధంగా భారతభూమిలో ఆధ్యాత్మికమైన సాంస్కృతిక ఏకసూత్రత ఉండేది.

సామాజిక నేపధ్యం:

ఏ దేశానికి గాని, సంస్థానానికి గాని వెళ్ళినా నాలుగు వర్ణాల వ్యవస్థ ఉండేది. స్థలీయమైన ఇతర ఉపవర్ణాలు/జాతులు ఉండేవి. ఎన్నో వృత్తులు అన్ని చోట్లా కనబడేవి, భాషాపరమైన పేర్ల మార్పిడితో కూడి.

సాహిత్య నేపధ్యం:

సంస్కృత భాష రాజ్యమేలిన ఆ రోజుల్లో సంస్కృత కావ్యాలు విరివిగా వ్రాయబడ్డా అవన్నీ కూడా రామాయణ, భారత, భాగవతాల వంటి ఆధ్యాత్మిక రచనల తరువాతే. ఆ కాలంలో భారతభూమి లోని “ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా” వేద, పురాణ, ఇతిహాసాలే చదవబడేవి. పురాణాల్లో ’భరతవర్షం’, ’భరత ఖండం’ వంటి సూటైన పేర్లే గాక ’పుణ్యభూమి’, ’కర్మభూమి’ వంటి విశేషాలు కూడా కనబడతాయి.

కొన్ని ఉదాహరణలు:

1. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరమ్

తం భూమిమ్ దేవనిర్మితమ్ పుణ్యభూమి ప్రచక్షతే

 

2. అత్రాప భారతం శ్రేష్ఠమ్ జంబూద్వీపే నామ్న

యతో హి కర్మభూరేషా యతోన్య భోగభూమయః

 

3. దుర్లభమ్ భారతే జన్మ పౌరుషస్య చ వా పశోః

విసర్గస్య చ వా జంతోః వృక్షపస్తనయోరపి

ఇవి కాక, ఆచారాల రీత్యా చూస్తే ప్రతిరోజూ ఆహ్నికానుష్టానలలో, పూజ-వ్రత-దానాదుల్లో చేసే సంకల్పాల్లో “భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే….” అని చెప్పడం ప్రాచీనంగా వస్తున్నదే.

కాశ్మీరు నుండి సింహళం వరకూ కొద్దిపాటి స్థల మార్పులు (నదీ తీరాలు, క్షేత్రాలు మొ.) తప్ప భారతదేశానికి సంబంధించిన ప్రధాన భౌగోళిక వివరాలు మారేవి కావు.

ఇక్కడ ఉదహరించాల్సిన మరో ముఖ్య శ్లోకం ఉంది. ఇది విష్ణుపురాణం నుండి గ్రహించింది.

ఉత్తరమ్ యత్సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణామ్

వర్షమ్ తద్భారతం నామ భారతి యత్ర సంతతిః

సంక్షిప్తానువాదం: దక్షిణ సముద్రానికి ఉత్తర హిమాలయాలకు మధ్య విస్తరించివున్న ఈ భూఖండానికి భారతమని పేరు, ఇక్కడి నివాసులకు “భారతి” అని పిలువబడతారు.

అంటే భరతభూమిలో పుట్టిన “సంతతి”కి  (3వ శ్లోకంలో పేర్కొన్న అన్ని జీవరాశులకు) “భారతి” అనేది సామాన్య నామం. ఆవిధంగా భౌగోళికపరంగా దేశదేశాలుగా విడిపోయినా, ఈ భూభాగంలో ని ప్రజలందరూ ఒకే సంతతిగా పరస్పరం గుర్తించుకొనేవారన్న మాట! ఈ మాట ఎంత ప్రాచీనమైనదవుతుందో “భారతదేశ”మనే ఏకీకృత భావానికీ అంతే వయసు!

కావున ’భారతి’లున్న దేశాన్ని ’భారత’ అని పిలవడంలో ప్రాచీనతతో బాటు ఏకత్వాన్ని సూచించడం కూడా అవుతుంది.

పై ఉదాహరణల ద్వారా అర్థమైయ్యేదేమిటంటే ఏక భారతం (One India) అన్నది స్వాతంత్రోద్యమ కాలం నాటి భావన కాదని, దానికి పూర్వంలోనే అంటే అనేక సహస్రాబ్దుల నుండీ సామాజిక-సాంస్కృతిక-సాహిత్య-ఆచార-వ్యవహారాల ద్వారా వ్యక్తమవుతుండేది.

రాజకీయాలన్నవి అల్పాయుష్యాలు గనుక “ఏక భారతం” అన్నది రాజకీయ ఫలితాంశం కాలేదు.

భారతదేశం – లౌకికత:

ప్రాచీనతను ఆధారంగా చేసుకుని ఆయా భాషల్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బహుశా సెక్యులరిజమ్ ఒత్తిడి వల్ల కాబోలు ’ఇండియా’ అన్న భారతీయేతర పేరునే ఎక్కువగా వాడుతున్నాయి.

సనాతనం అన్నది సాంస్కృతిక పరంపరగా కాకుండా ’హిందూత్వం’ అన్న ఒక అతివాద రాజకీయంగా ముద్ర పడి, అనవసరమైన దాడులకు గురౌతూ ఉంది. ఈ వైపరీత్యానికి అధికారం కోసం అర్రులు చాచే రాజకీయ పార్టీలు, వాటి నాయకులు, వారి చెంచాలే కారణం.

చరిత్ర ఎరుగని కాలం నుండి ఈ దేశంలో పుట్టిన అన్ని రకాల భావనలు, ఆచారాలను, పద్ధతులను వదుల్చుకోవడమో, రూపుమాపడమో సెక్యులరిజమ్ అని అనిపిస్తోంది.

అఖండ భారతదేశం – ఆధ్యాత్మిక కోణం

భృ భరణే అన్న ధాతువు నుండి భారత శబ్దం పుట్టింది. భృ అంటే భరించడం/ధరించడమని అర్థం. దేన్ని ధరించడం? అని ప్రశ్నించుకుంటే “జ్ఞానాన్ని” అని శాస్త్రం చెబుతోంది. ఇదెలా సాధ్యమని మళ్ళీ అడిగితే – “భకారో జ్ఞానవాచి” అన్న సూత్రం ప్రకారం భ = జ్ఞానం అవుతుంది. ఇప్పుడు ఈ ’భ’కారాన్ని తరువాతి పదమైన ’రత’ శబ్దంతో చేరిస్తే భరత = జ్ఞానాన్ని ధరించిన అన్న అర్థం సిద్ధిస్తుంది. భారత అన్నది పుంలింగమై, భారతి అన్నది స్త్రీలింగమై – స్త్రీ పురుషులిద్దరికీ అన్వయిస్తుంది.

జ్ఞానానికి, భక్తికి, ప్రేమ మొదలైనవాటికి లింగం భేదం లేదు. కనుక ’భారత’ అన్న పదం మతపరమైనదో లేక లింగపరమైనదో కాక ఒకానొక అమోఘ గుణాన్ని సూచించే విశేషణమే. ’జ్ఞాని’ అన్న పదం లౌకికం కాదా?

అఖండ భారతదేశం – పౌరాణిక నేపథ్యం

హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం|

తం భూమిం దేవనిర్మితం పుణ్యభూమి ప్రచక్షతే||

 

అన్నవిధంగా హిమాలయాల నుండి ఇందు సరోవరం (హిందూ మహాసముద్రం) వరకూ విస్తరించివున్న దేశాన్ని ప్రాచీనకాలం నుండి కూడా ’భారత’ అన్న పేరుతోనే పిలిచేవారని పురాణాల నుండి స్పష్టమవుతుంది.

అయితే ’భారత’ అన్నది ఈ దేశానికి వచ్చిన రెండవ పేరు. దానికి పూర్వం ఈ దేశాన్ని ’అజనాభ’ అని పిలిచేవారు. మరి ఈ పేరు మార్పు ఎప్పుడు, ఎవరి వల్ల, ఎందుకు వచ్చిందని వివేచిస్తే, భాగవత పురాణంలో సమాధానం దొరుకుతుంది.

స్వాయంభూ మనువు పుత్రుడు ప్రియవ్రతుడు. అతని పుత్రుడు నాభి. అతని పుత్రుడు ఋషభ. ఈ ఋషభునికి జన్మించిన వందమంది పుత్రుల్లో పెద్దవాడు భరతుడు. సంసారంపై విరక్తి కలిగిన ఋషభుడు పరివ్రాజకుడు అనగా సన్యాసి అవుతాడు. దానికి మునుపు తన పెద్దకుమారుడైన భరతునికి రాజ్య పట్టాభిషేకం చేస్తాడు. ఈ భరతుడు మహా గొప్ప పరిపాలకునిగా కీర్తిని పొందుతాడు. అతని గౌరవార్థం ఈ సమస్త దేశాన్ని ’అజనాభ’ అని కాకుండా ’భారత’మని పిలవడం మొదలయింది.

శ్రీశుక ఉవాచ

భరతస్తు మహాభాగవతో యదా భగవతా-
వనితలపరిపాలనాయ సంచింతితస్తదను-
శాసనపరః పంచజనీం విశ్వరూపదుహితర-ముపయేమే

తస్యాము హ వా ఆత్మజాన్ కార్త్స్న్యేనా-
నురూపానాత్మనః పంచ జనయామాస భూతాదిరివ
భూతసూక్ష్మాణి సుమతిం రాష్ట్రభృతం సుదర్శన-
మావరణం ధూమ్రకేతుమితి

అజనాభం నామైతద్వర్షం భారతమితి యత
ఆరభ్య వ్యపదిశంతి – (శ్రీమద్భాగవతం, పంచమ స్కంధం, సప్తమ అధ్యాయం)

 

ఇదే విషయాన్నే మార్కండేయ పురాణం పునరుద్ఘాటిస్తోంది:

ఋషభాత్ భరతో జజ్ఞే యో వీరః పుత్రశతాగ్రజః

సోऽభిషిచ్యాథ భరతం పుత్రం ప్రావ్రాజ్యమాస్థితః

హిమాహ్వం దక్షిణం వర్షం భరతాయ న్యవేదయేత్

తస్మాత్తద్ భారతం వర్షం తస్య నామ్నా విదుర్భుదాః

 

ఇలాంటి ఉల్లేఖనే వాయుపురాణంలో కూడా వస్తుంది.

జీవానాం భారతే వర్షే తతోऽయం గుణనామకః” అన్న బ్రహ్మపురాణ వాక్యం కూడా కలియుగ ప్రారంభానికి పూర్వమే ’భారత’ అన్న పేరు ఈ దేశానికి ఉన్నట్టుగా తెలుస్తోంది.

అఖండ భారతదేశం – వైజ్ఞానిక కోణం

పురాణాలే కాకుండా ప్రాచీన భారతీయులు వ్రాసిన స్వతంత్ర రచనల్లో కూడా ’భారత’ అన్న పేరు స్థలసూచకంగా వాడబడింది. ఉదాహరణకు, ఆరవ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త వరాహమిహిరుడు తన ’బృహత్సంహిత’లో ’నక్షత్ర కూర్మాధ్యాయ’మనే 14వ అధ్యాయం ఆరంభ శ్లోకంలో ఇలా అంటాడు:

నక్షత్రత్రయవర్గైరాగ్నేయాద్యైర్వవస్థిథైర్నవధా|

భారతవర్షే మధ్యప్రాగాది విభాజితా దేశాః||

 

పై శ్లోకానికి భట్టోత్పల వృత్తిలో ఇలా అర్థ వివరణ చేసారు:

నక్షత్రత్రయేణ నవవర్గస్తైర్నక్షత్రత్రయవర్గైః | ఆగ్నేయాద్యైః కృతికాద్యైర్నవధా నవభిః ప్రకారైర్వవస్థితైః | క్వ భారతవర్షే| మేరోర్దక్షిణదిగ్భాగే భారతవర్షం తత్ర వ్యవస్థితైః | తత్ర చ మధ్యప్రాగాది విభాజితా దేశాః | మధ్యదేశే మధ్యభాగే భారతవర్షాऽన్యే దేశాః ప్రాగాదినా పూర్వాదిక్రమేణ విభాజితా విభాగేన స్థాపితా వక్ష్యమాణవిధానానేతి |

పై వ్యాఖ్యానానికి స్థూలంగా తెలుగు అనువాదం చేస్తే ఇలా అర్థమవుతుంది – “మేరుపర్వతానికి దక్షిణదిక్కున భారతవర్షం నెలకొనివుంది. అక్కడ మధ్య, తూర్పు మొదలైన దేశాలుగా (ప్రాంతాలుగా) విభాగించబడినది.”

ఇక్కడ ’దేశాలు’గా చెప్పబడిన ప్రాంతాలు ఈనాటి ’రాష్ట్రా’లతో సరిపోలుతాయి. కనుక దేశం అన్న పదం Nation అన్న అర్థంలో కాక State or Province అన్న అర్థంలో వాడబడిందని అర్థం చేసుకోవచ్చు.

ముగింపు:

అఖండ భారతదేశం అన్నది ప్రాచీనకాలం నుండి నేటి కాలం వరకూ అవిచ్ఛిన్నంగా భారతీయుల ఆలోచనల్లోను, ఆచరణలోను ఉంటూ వచ్చింది. ఈ దేశపు సంస్కృతిని, సాహిత్యాన్ని, సంప్రదాయాలను నమ్మనివారికి మాత్రమే అఖండ భారతదేశం 1947 తర్వాతనే పుట్టుకొచ్చినట్టు అనిపిస్తోందన్నది నా అభిమతం.

 

@ @ @ @ @

 

 

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

 

One thought on “అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా?

Your views are valuable to us!

%d bloggers like this: