ఉత్తరాంధ్ర కళారూపం – భామాకలాపం వీధిభాగవతం

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 5]

ఉత్తరాంధ్ర కళారూపం – భామాకలాపం వీధిభాగవతం

పరిచయ వాక్యాలు

మా ఉత్తరాంధ్రా ప్రాంతంలో భాగవతం అనేది ఒక వీధిప్రదర్శన కళారూపం.

కేవలం ఒకటి రెండు గంటల్లోనే వేదిక తయారు చేసుకోవచ్చు. పది పన్నెండు అడుగుల దూరంలో నాలుగు బలమైన గుంజలు చదరంలా కట్టి, పైన తాటాకుల పైకప్పు వేసి, ఆ పందిరికి మూడువైపులా తెర కట్టెస్తే, ఆ పందిట్లోనే భాగవత ప్రదర్శన ఉంటుంది. పందిరి నాల్గోవైపు, రెండు కాగడాల వెలుగులో, రాత్రి భోజనాల తరువాత మొదలెట్టి తెల్లగా తెల్లారేవరకూ సాగే ప్రదర్శన.

తొలినాళ్ళలో కేవలం శ్రీకృష్ణుణ్ణి కేంద్రబిందువుగా చేసుకొని సాగే కథారూపాలే ఉండటం వలన దీనిని భాగవతం అనేవారు అని నా నమ్మకం. పోను పోనూ వీధిలో పందిరి కింద గానం, వచనం ద్వారా వేషాలు వేసుకున్న కళాకారులు ఏ కథని ప్రదర్శించినా దాని పేరు భాగవతం అయి కూర్చుంది. ఉదాహరణకి, శివుడి కోసం వాదించుకొనే గంగా-గౌరీ సంవాదాన్ని ప్రదర్శించే శివభాగవతం లాంటివి కూడా మా ప్రాంతంలో ఉన్నాయి.

గత శతాబ్దంలో సాంఘిక అంశాలపై కూడా భాగవతాల ప్రదర్శన మొదలైంది. ఆవిధంగా జాలారి భాగవతం అనే పూర్తి వినోదాత్మక ప్రదర్శన, కమ్యూనిస్టు భావజాలంతో కూడిన భూమి భాగవతం (బూంబాగోతం) కూడా మొదలయ్యాయి. దరిమిలా, వార్తాపత్రికల్లో “అవినీతి భాగోతం” లాంటి న్యూస్‌హెడ్డింగులూ వచ్చాయి.

ఇప్పుడు అసలు భాగవత కళారూపం తూర్పుభాగవతం – భామాకలాపం కి వద్దాం.

సిద్దేంద్రయోగి మనకు అందించిన కూచిపూడిలో ప్రదర్శించే భామాకలాపం లో సాహిత్య, సంగీత, నాట్య, భాషా ప్రమాణాలు ఎక్కువ. ప్రదర్శించేవారికీ, చూసేవారికీ ఎంతో విద్వత్తు కావాలి. ఏర్పాట్లు ఎంతో ఖర్చుతో కూడినవి. అందుకే వాటిని జమిందారుల ఆస్థానాల్లోనో లేదా టిక్కెట్లు అమ్మే పద్ధతినో పట్టణాల్లోనే తప్ప పల్లెల్లో ప్రదర్శించేవారు కాదు.

పల్లెల్లో కూడా ఈ కళని ప్రదర్శించాలనే ఉత్సాహం ఉన్న వారు (దాదాపు 150-200 ఏళ్ళ క్రితం కావచ్చు) ఈ ప్రక్రియని మరింత సరళవంతం చేసి, క్లిష్టమైన కృతులను, కీర్తనలనూ సరళ పదాలతో తిరగరాసి, బాణీలు కట్టి, తగిన మద్దెల, హార్మోనియం, తాళాలు కొడుతూ ఉండే వంత పాటలూ అన్నీ సమకూర్చి ఈ కళారూపాన్ని రూపొందించారు. వీటిని “దరువులు” అంటారు (అంటే నాటకంలో పద్యాలు లాగా, భాగవతంలో “దరువులు” ఉంటాయి).

ఈ కళని ప్రదర్శించే ప్రధాన పాత్రధారి (సత్యభామ వేషధారి) కి గాత్రం, సంగీత పరిజ్ఞానం, నాట్యం, అభినయం ఇవన్నీ వచ్చి ఉండాలి.

vijayanagara empire history video

SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY

పదం పదానికీ వంతపాట వలన దరువులు పాడేటప్పుడు ముఖ్య కళాకారుడికి అలసట తగ్గి ఏకబిగిన 3-4 గంటలు, ఆ తరువాత ఒక గంట విశ్రాంతి తీసుకొని మరో 2-3 గంటలూ ప్రదర్శన ఇవ్వగలిగే స్టేమినా ఉంటుంది.

ప్రేక్షకుల్లో ఒక మోస్తరు విద్వాంసులు డజను మంది ఉంటే, నిరక్షరాస్య ప్రేక్షకులు వందమంది వరకూ ఉండొచ్చు. దరువులు గానం చేసేటప్పుడు ఆ పదాల కూర్పు, ప్రాస సొగసు, గూడార్ధాలూ పండితులను రంజింపజేస్తే, ఆ బాణీ, అభినయం, వెనుక ఉండే వాయిద్యాలు అందరినీ అలరించేవి.

“దరువు” పూర్తి అవగానే కళాకారుల వచన సంభాషణలో అదే మళ్ళీ చెప్పటం వలన గానం అర్ధం కాని జనాలు కూడా కథ అర్ధం చేసుకొనేవారు. ఇందులో సత్యభామ పాత్రధారి ఒక్కరే ఆడవేషం వేసుకొని అభినయం చేసేది. సత్యభామకి చెలికత్తె “మాధవి” పాత్ర కూడా పురుషుడి వేషంలోనే ఉంటూ సంభాషణ వలన మాత్రమే ఆ పాత్ర “మాధవి” అనే చెలికత్తె అని తెలుస్తుంది.

భామాకలాపం భాగవతాన్ని పోషించే కనీస బృందం – భామ వేషధారి, మాధవి, ఇద్దరు వంతపాటదారులు (వీరినే హంగుధారులు అంటారు), ఒక హార్మోనియం, ఒక మద్దెల, చివరగా కృష్ణపాత్రధారి (కృష్ణుడి పాత్రధారి కి ఏ ప్రాముఖ్యతా ఉండదు).

కాగడాల బాధ్యత గ్రామస్తులది. గ్రామ రజకులు కాగడాలు కట్టేవారు. వారి దగ్గర ఉండే పాత నూలు గుడ్డలను సన్నని పీలికలు గా చేసి గట్టిగా మెలిపెట్టి, జానెడేసి పొడవున్న తాళ్ళలా చేసి, కర్రకి చుట్టి, అడుగున తడి ఎర్రమట్టి పూసి రోజంతా ఎండబెట్టి, సాయంత్రం కాగడా పైభాగాన్ని నూనెలో నానబెట్టి వెలిగిస్తే, రాత్రంతా భగభగా మండుతూ పందిరి అంతా వెలుగునిచ్చేవి. కాగడా వెలుగు తగ్గినప్పుడు మళ్ళి నూనె పోసేవారు.

క్లుప్తంగా భాగవత ప్రదర్శన క్రమం

1. గణపతి ప్రార్థన: గ్రామస్తుల్లో ఒక పదేళ్ళ పిల్లాడిని పద్మాసనంలో కూర్చోబెట్టి, తనని రెండుచేతులూ తొండంలా ఎత్తి పట్టుకోమని చెప్పి మీదన దుప్పటి కప్పి గణపతి ప్రార్థన చేసేవారు. ఈ గణపతి ప్రార్థన అనేది రెండూ నిమిషాల్లో ముగించవచ్చు లేదా అరగంట సాగదీయవచ్చు. సాగదీయవలసిన సందర్భాల్లో హాస్యపాత్ర “మాధవి” హంగుదారులలో ఒకడు సంభాషించుకుంటూ ఈ గ్రామం పేరు, భాగవత ప్రదర్శన సందర్భం చెప్పి, ప్రదర్శనకి సహకరిస్తున్నవారిని పొగుడుతారు.

2. ఆ తర్వాత ప్రేక్షకులకు అడ్డంగా తెర పెట్టేక సత్యభామ ప్రవేశం. తెరవెనుక సత్యభామ (తన పేరు చెప్పకుండా) తన గొప్పతనం చెప్పుకున్నాక, మాధవి తెరముందుకి వచ్చి, “సరేగాని ఓయమ్మా, నీ పేరు చెప్పవూ…” అని అడుగుతాడు. అప్పుడు, “భామనే… సత్యా.. భామనే...” అంటూ పాడుతూ ఉండగా తెర ఒక్కో అంగుళం కిందికి దింపుతూ మొదట కిరీటం, ఆపై నుదురు, అలా మెడ వరకూ వచ్చినప్పుడు రెండు కాగడాలూ దగ్గరగా తెచ్చి, ఆ మధ్యలో వెలిగే మొహం కనపడగానే, కాగడాలపై గుగ్గిలం పొడి చల్లుతారు. గుగ్గిలం రేణువులు క్షణకాలం పాటు మెరిసి సత్యభామ మొహాన్ని మరింత జిగేల్మనేలా చేసేక అప్పుడు తెర పూర్తిగా తీసేస్తారు.

3. తదుపరి, మాధవి ప్రేక్షకుల తరపున అడుగుతున్నట్టు, సత్యభామ తండ్రిపేరు అడిగితే, “సత్రాజిత్తూ.. బాలనై… ముద్దూ బాలనై..” అంటూ తండ్రి వైభవాన్నీ, తండ్రికి తానెంత ముద్దుబిడ్డనో చెప్తుంది. నీ భర్తపేరు చెప్పు అంటే, కాసేపు సిగ్గు అభినయించి, “వాసిగా శ్రీ ద్వారకాపురి…” అని తాను శ్రీకృష్ణుడి భార్యనని చెప్తుంది.

4. పరిచయం పూర్తి అయ్యాకా, ప్రస్తుతం శ్రీకృష్ణుడు సత్యభామని నిర్లక్ష్యం చేస్తున్నట్టు తెలిపే సన్నివేశం ఉంటుంది.

5. అప్పుడు, సత్యభామ విరహం చూడలేని చెలికత్తె మాధవి, కృష్ణుణ్ణి పిలవటానికి వెళ్ళినట్టు, పందిరిలో అటూ ఇటూ నడిచి, కృష్ణుడిని అనేక నామాలతో పిలుస్తూ, పందిట్లో ఓమూల ఉన్న కృష్ణుడి దగ్గరకు వెళ్లగానే “ఏం మాధవరాయా..” అంటాడు. ఇక్కడ మాధవి కాస్తా “మాధవుడు” అనే చెలికాడుగా మారుతాడు. కృష్ణుడితో సంభాషణ అయ్యేకా మళ్ళి సత్యభామ వద్దకు వచ్చి, “స్వామివారికి నీవవరో తెలీదన్నారమ్మా..” అని అనగానే సత్యభామ ఒకప్పుడు తాను గీచిన గీత దాటని కృష్ణుడు ఇప్పుడు తానెవరో తెలీదనగానే ఆశ్చర్యం, కోపం, బాధ అన్నీ తెలిసే దరువులూ వచనాలూ ఉంటాయి.

6. ఆ తర్వాత సత్యభామమీద కృష్ణుడి అలుకకి కారణం ప్రేక్షకులకు తెలుస్తుంది. భామ-మాధవి-మాధవుడు-కృష్ణుడు మధ్య మరిన్ని రాయబారాలు నడిచి, సత్యభామ వేడుకోళ్ళు అయ్యక, కృష్ణుడు వచ్చి సత్యభామతో కలిసి నాట్యం చేయటంతో ముగుస్తుంది.

ముందే చెప్పినట్టు, ఇందులో కృష్ణుడి పాత్ర నామమాత్రం. ఎంత నామమాత్రం అంటే, కృష్ణుడి పాత్రకి కావలసిన అర్హతలు ప్రదర్శన సమయంలో కన్నా ప్రదర్శన బయటే ఎక్కువ ముఖ్యం. ఆ అర్హతలు, వంట రావటం, కళాకారుల సామగ్రి మోయటంలో సాయం చేయటం వగైరా వగైరా.

కృష్ణుడు మాట్లాడవలసిన సంభాషణలు అతి తక్కువగా ఉంటాయి. బృందంలో ఎవరు లేకపోయినా సాధ్యం కాని ప్రదర్శన, కృష్ణపాత్రధారి లేకపోతే, గ్రామస్తుల్లో ఒకరికి మొహానికి నీలం రంగు, పింఛం ఉన్న కిరీటం పెట్టి, వేణువు పట్టుకోమని చెప్పి ప్రదర్శన లాగించెయ్యగలరు.

హాస్య సన్నివేశాలకు ఒక ఉదాహరణ

కృష్ణుడు: మాధవరాయా, ముల్లోకాలూ పదునాల్గు భువనములూ నాయందే ఉన్నవి. నా చిన్నతనమున నా తల్లి యశోదకు నోరు తెరచి చూపించితిని.

మాధవుడు: స్వామీ ఇప్పుడు ఒకసారి నోరు తెరుస్తారా?

కృ: ఎందుకు మాధవరాయా?

మా: నిన్నరాత్రి నుండీ మా గేదె కట్టు తెంపుకొని పరిపోయింది. ఎంత వెతికినా కనిపించట్లేదు. మీరు నోరు తెరిస్తే,  అది ఎవరి పొలంలో ఉందో చూసుకొని అక్కడికి వెళ్ళి తోలుకువస్తాను!

మాధవి పాత్ర చేత ఒక అరగంట కాలక్షేపం చేయించేటప్పుడు తెర పట్టుకొని – “ఇదుగో వచ్చే మాధవీ…అదుగో వచ్చే మాధవీ..” అనే పాట పాడూతూ ఉంటే, తెర తీయకముందే, మాధవి ఒకసారి తెర అటునుండీ, ఇంకోసారి తెరకి ఇటునుండీ మొహం ప్రేక్షకులకు చూపించి, నవ్విస్తూ ప్రవేశిస్తాడు.

తెర తీసేకా హంగుదారులలో ఒకడు మాధవితో సంభాషిస్తూ హాస్యం పండిస్తాడు. మాధవి తన గతం చెప్తూ – “ఆళ్ళకీళ్ళకి కయ్యం పెట్టి చెప్పూ దెబ్బలు తింటీ కొన్నాళ్ళూ…” లాంటి పాటలతో హాస్యం పండిస్తాడు.

ఇక్కడే, మాధవి, తనకూతురిని అత్తారింటికి పంపే సన్నివేశాన్ని ప్రదర్శిస్తారు. అందులో కూతురికి అత్తవారింట్లో మెలగవలసిన పద్దతులు చెప్పే దరువు – “నీ అత్త మామలూ నిన్నేమి అన్నా… కదురు ఎర్…ర్రగ కాల్చీ కంట్లోనా గుచ్చూ…తోటికోడలి బిడ్డ కూటికేడిస్తే…. పీటచెక్కా పెట్టి పెడతూడాగొట్టూ…. ఇంటిమొగవారైన నిన్నేమి అన్నా… ఇంట్లొ పరుండాబెట్టి… ఇల్లు తగలాబెట్టి… మళ్ళీ రావమ్మా….” ఇలా మాధవి చెప్పే బుద్ధులు వింటూ జనం నవ్వుతారు.

ఇంకోచోట, జీవితంలో తాను కష్టాలకు విరక్తి చెంది ఆత్మహత్యా ప్రయనం చేసేనని చెప్తూ “దుడ్డుల్లాంటి మెతుకుల్లో.. మడ్డి లాంటి పాలు పోసుకొని.. బెడ్డల్లాంటి బెల్లమ్ముక్కలు నంచుకుని తిన్నాను. ఐనా సరే నాప్రాణం పోలేదు” అని తన ఆత్మహత్యా ప్రయత్నం, అది విఫలం ఐన సంగతీ చెప్తుంది.

సత్యభామకీ, కృష్ణుడికీ మధ్య రాయభారం నడిపేటప్పుడు, మాధవి తిండి ద్యాసవల్ల మరచిపోతే అప్పుడు సత్యభామ కృష్ణుడికి లేఖ రాస్తుంది. ఆ లేఖ పండితులు వినటానికి ఎంతో బావుంటుంది.

ముగింపు వాక్యాలు

ఇవన్నీ ఇప్పుడెందుకు గుర్తొచ్చాయంటే, ఈ కళ యొక్క సాహిత్య విలువ తెలియని రోజుల్లో ఎన్నోసార్లు చూసాను. ఈ మధ్య అదే బృందంతో గుంటూరులో తూర్పుభాగవతాన్ని ప్రదర్శింపజేసారు. ఆ ప్రదర్శనని “యూట్యూబ్” లో ఉంచిన సాహిత్యాభిమాని శ్రీ రహ్మానుద్దిన్ షేక్ గారు మమ్మలిని మా చిన్నతనాలకు తీసుకెళ్ళారు.

ఆ ప్రదర్శన 6 భాగాలుగా (అన్నీ కలిపి 80 నిమిషాలు ఉండొచ్చు) ఉంది. వీలు ఉన్నవారు చూడవచ్చు.

ఈ వీడియోలో ఉన్న సత్యభామ పాత్రధారి శ్రీ బొంతలకోటి సాంబమూర్తి అంత ఉత్సాహంగా ప్రదర్శన ఇచ్చేనాటికి 70 ఏళ్ళ వయసు పైబడింది. ఈ ప్రదర్శన జరిగిన ఏడాదిలోపే ఆయన స్వర్గస్తులయ్యారని తెలిసింది. కేవలం కళాతృష్ణ మాత్రమే ఆ వయసులో వారిని అంత ఉత్సాహంగా ఉంచి ఉండొచ్చు.

మొదటిసారి దరువులు వినేవారికి అందులో పదాలు పట్టుకోవటం కష్టం అవుతుంది. కానీ భావం తెలిసిపోతూ ఉంటుంది. ప్రజల్లో డిమాండు కోల్పోయిన కళని డెబ్బై ఏళ్ళ కళాకారులు ఎలాంటి తపనతో ప్రదర్శించి ఉంటారో ఊహించి ఈ వీడియోలు చూడండి.

ఒకసారి ప్రయత్నించండి.

 

Your views are valuable to us!