సెలెబ్రిటీలు – బహుముఖ ప్రజ్ఞ – సామాజిక స్పృహ

Spread the love
Like-o-Meter
[Total: 11 Average: 4.5]

 

సెలెబ్రిటీ అంటే ఎవరు?

సెలెబ్రిటీ అనగా ఒక రంగంలో తమ బహుముఖ ప్రజ్ఞ వల్ల, అసాధారణ ప్రతిభ వల్ల పేరు తెచ్చుకున్నవారు.

అక్కడ కూడా అదృష్టానికున్న పాత్ర తక్కువకాదు. కొంతమందికి ఇంతకన్నా ఎక్కువ ప్రతిభ ఉన్నా దురదృష్టం వల్లో, దుష్టశక్తులవల్లో అనామకులుగానూ, పక్కవాద్యాలుగానూ మిగిలిపోతారు.

సరే, ఎలా ఐనా సెలబ్రిటీలకు ఆ రంగంలో ఉన్న గుర్తింపుని నేను ప్రశ్నించను.

సమస్యల్లా సదరు సెలెబ్రిటీ తనకు ఏమాత్రం పరిచయంలేని రంగంలో మిడిమిడి జ్ఞానంతో ఇచ్చే స్టేట్మెంటులకు మీడియా అతి ప్రాముఖ్యతను ఇవ్వడం. అలా ఇచ్చి సమాజానికి చేసే చేటు గురించే నా బాధ. వారికి (లేని) సామాజిక స్పృహ ఆపాదించి వారి మద్దతుని గొప్పగా భావించే వారి గురించే నా బాధ.

దీనికి బీజం ఎక్కడ పడింది అంటే – పల్స్ పోలియో లాంటి ప్రోగ్రాముకి కొంతమంది సెలెబ్రిటీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఉచితంగా చేసిన ప్రచారం వల్ల డాక్టర్ల పని సులభం అయింది. ఎక్కువ ప్రచారం వల్ల అవగాహన పెరిగి పోలియో దాదాపు దేశం నుండీ అంతర్ధానం అయింది.

ఆ విధంగా మంచికోసం మొదలైన సెలిబ్రిటీల ప్రచారం తరువాతి కాలంలో వ్యాపార ప్రకటనల రూపంలోనూ, ఇప్పుడు సెన్సేషనే ఒక ఒక వ్యాపార దినుసుగా మారిన రోజుల్లో టిఆర్పీ రేటింగు కోసం ఏదో ఒక సామాజిక అంశం పై సెలెబ్రిటీని కదిపి, ఆ సెలెబ్రిటీకి ఏమాత్రం పరిజ్ఞానం లేని అంశంపై అభిప్రాయం అడిగి, ఆ (తప్పుడు) అభిప్రాయాన్ని ప్రజల్లో వ్యాపింపజేస్తున్నారు.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

*****

సెలబ్రిటీల్లో అత్యధికంగా అజ్ఞానాన్ని వెదజల్లేది సినీనటులు.

బహుశః వారి వద్ద అధికంగా ఉన్నదే వారు వెదజల్లగలరనుకుంటా!

ఇందులో కూడా నిజాయితీ తో కూడిన అజ్ఞానాన్ని కొంచెం క్షమించవచ్చు. కానీ తెరమీద వల్లించే నీతులన్నీ తాము నిజనీవితంలో ఆచరిస్తున్నట్టు ప్రకటించి, సమాజంలో మరింత క్రేజ్ సంపాదించుకొని, తాము సినిమాల్లో విలన్లుగా చిత్రించిన వాళ్ళకే కొమ్ము కాసే సెలెబ్రిటీల వల్ల సమాజానికి జరిగిన నష్టం ఊహించలేనిది.

అంటే కార్పోరేట్ హాస్పిటల్స్ దోపిడీని సినిమాలో రఫ్ఫాడించేసి, అలాంటి హాస్పిటలున్న కుటుంబంతో వియ్యమందటం లాంటివి.

వియ్యమందటం వ్యక్తిగత జీవితం అంటారా? నేను అనేదీ అదే.

నటనలో భాగంగా వారు వల్లించే నీతులను వారి వ్యక్తిగత జివితానికి ఆపాదించి ఆరాధించవద్దు. ఆ నటుడికి కార్పోరేట్ మోసాలమీద ఎటువంటి ఏవగింపూ లేదని, తెరమీద ప్రదర్శించిన ఏవగింపు అంతా నటనలో భాగమని తెలుసుకోవటం ఇక్కడ ముఖ్యం.

ఒక ఉదాహరణ

ఇదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చింది అంటే, మొన్ననే ఒక సినిమా చూసాను. రైతుల భూముల కోసం వారి తరపున నిలబడ్డ హీరో, శీతలపానీయాల కంపెనీ మాఫియాతో అలుపెరగని పోరాటం చేసిన సినిమా అది.

అదే హీరో గతంలో శీతల పానీయాల కంపెనీ వ్యాపార ప్రకటనలో నటించడమే కాక అందులో పురుగుమందుల అవశేషాలున్నట్టు దుమారం చెలరేగినప్పుడు, వారి ఫేక్టరీలో తిరుగుతూ, వారిచ్చిన బోటల్ తాగుతూ – “ఈ ఫేక్టరీలో తయారయ్యే శీతల పానీయంలో విషపదార్ధాలు లేవు, నేను తాగుతున్నాను మీరు తాగొచ్చు” అని ఆ కంపెనీ పట్ల భరోసా కలిగించాడు.

ఆ వ్యాపార ప్రకటన వచ్చిన సందర్భంలోనే ఒక జిల్లా కలెక్టర్ విద్యార్ధులతో మాట్లాడుతూ – “శీతలపానీయాలు ఆరోగ్యానికి హానికరం, వాటిని ప్రోత్సహించే నటులు అజ్ఞానులు” అన్నందుకు సదరు హీరో అభిమానులు ధర్నా చేసి కలెక్టర్ తమ హీరోని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండూ చేసారు.

ఆ వ్యాపార ప్రకటన తర్వాత పదేళ్ళకు అనుకుంటా రైతుల తరపున శీతలపానీయ కంపెనీతో పోరాడే సినిమా వచ్చింది.

*****

నటులు చక్కగా నటించగలరు. అందుకు వారిని అభినదించాలి. ఆరాధించకూడదు. ఒకవేళ ఆరాధించినా నటనా కౌశలాన్నే ఆరాధించాలి కానీ, తెర మీద డైలాగులను, వారి వ్యక్తిత్వానికి ఆరాధించకూడదు.

వారి వృత్తిలో భాగంగా రీల్ లైఫ్ లో నీతులు వర్ణిస్తారు. రియల్ లైఫ్ లో వారికి డబ్బు కావాలి అందుకు వారిని తిట్టుకోనక్కర్లేదు.

ఈ ద్వంద్వ ప్రవృత్తి వారి తప్పు కాదు. తొలి ఫ్రేములో సాధువు వేషం వేసిన నటుడే, చివరి ఫ్రేములో రాక్షసుడి వేషం వేయొచ్చు. నా చిన్నప్పుడు ఒకటో హరిశ్చంద్రుడే, కాటిసీనుకి ముందు వీరబాహుడి వేషం వేసి, హరిశ్చంద్రుణ్ణి కొనుక్కోవటం చూసాను.

అది వారి వృత్తి ధర్మం.

*****

One thought on “సెలెబ్రిటీలు – బహుముఖ ప్రజ్ఞ – సామాజిక స్పృహ

  1. నేను ఫైవ్ స్టార్స్ ఇద్దమనుకున్నాను. ఒక స్టార్ కొట్టకా లైకో మీటర్ ఆగి పోయింది..స్టార్స్ హివః లైట్ చేయబడటం లేదు ఎందుకు..
    మీ వ్యాసం అద్భుతం గా ఉంది..మీ అభిప్రాయం తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

Your views are valuable to us!

%d bloggers like this: