గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం?

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 5]

గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం? – వ్యాసాలు

గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం?

భారతదేశంలోని మూలనివాసులుగా చెప్పబడుతున్న వారి సంస్కృతి, సంప్రదాయలను ధ్వంసం చేస్తున్నది ఎవరు?


గమనిక: ఈ వ్యాసంలో ఉపయోగించిన మూలవాసులు, మూలసంస్కృతి అన్న పదాలు వామపక్ష భావజాలం నిర్వచనం ప్రకారం కాకుండా భారతదేశంలోకి విదేశీ మతాలు ప్రవేశించక ముందునుంచి ఉన్నటువంటి వైదిక మరియు వైదికేతర స్థానిక సంస్కృతిసంప్రదాయాల సంకీర్ణ వ్యవస్థ అన్న దృక్కోణంలో వాడబడ్డాయి. పాఠకులు గమనించ ప్రార్థన – ఆవకాయ సంపాదక బృందం.


మూలసంస్కృతి – ధ్వంసం – కొన్ని ఉదాహరణలు

మూలసంస్కృతి ధ్వంసానికి చెప్పదగ్గ పెద్ద ఉదాహరణ – మన దేశపు ఈశాన్య రాష్ట్రాలు. అక్కడ ఒకప్పుడు వెదురు ఆధారిత సాంప్రదాయ జీవితం వర్ధిల్లింది. అక్కడి ప్రజలకు  ప్రకృతి పట్ల ఆరాధనా భావం ఉండేది. కానీ కాలక్రమంలో అవన్నీ అంతర్ధానమయ్యాయి. ఈనాడు ఈశాన్య రాష్ట్రల్లో monilithic culture వ్యాపించివుంది.

ఈ ధ్వంసానికి ఎవరెవరు కారణాలో శాంతంగా ఆలోచిస్తే దొరక్కపోదు. కానీ ఓ పదేళ్ళ క్రితం అరుంధతీ రాయ్ Outlook మేగజైన్ లో రాసిన Gandhians with Guns అన్న వ్యాసంలో హిందూ శక్తులు గిరిజన ప్రాంతాల్లో తమ మతవ్యాప్తికి పాల్పడుతూ వారి సంస్కృతిని నాశనం చేస్తున్నట్లు వ్రాసారు. తెలుగు ప్రాంతాల ఉదాహరణలతో పై వాదనలోని నిజాలేమిటో చూద్దాం.

తెలుగు ప్రాంతాలు – మూలసంస్కృతి – ధ్వంసం

ఈ అధ్యయనం కోసం 1925 సంవత్సరం అంటే ఆరెస్సెస్ స్థాపించబడిన సంవత్సరంని ప్రామాణికంగా తీసుకుందాం. ఎందుకంటే, లెఫ్ట్ లిబరల్ మేధావుల దృష్టిలో అప్పటినుంచే హిందూమత వ్యాప్తికి బీజాలు పడ్డాయి కనక!

శ్రీశైలం క్షేత్రం ఉన్న నల్లమల గిరిజనులు (చెంచులు) పరిరక్షిస్తున్నట్లు, అక్కడ పూజల్లో పాల్గొన్నట్లు శతాబ్దాల నుండి చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

భద్రాచలం దాటి ఉన్న పర్ణశాల నిర్వహణ అంతా గిరిజనులదే. అది వంశపారంపర్యంగా (1925 కి చాలా ముందు నుండీ) కొనసాగుతోంది.

అరకు, బొర్రా తదితర ప్రాంతాల్లో సీతారాములు తిరిగిన ఆనవాళ్ళను అక్కడి స్థానిక గిరిజనులే బయటివారికి పరిచయం చేసారు.

కోయదొరలచే జోస్యాలు చెప్పించే శక్తి ఆరెస్సెస్ కి ఉంది అని అంటే యువ కోయల్ని వదిలేయండి ఓ తొంభై ఏళ్ళు పైబడిన కొండ దొర కూడా ఆ అన్నవాళ్ళని వెంటబడి తరిమి కొడతాడు. ఎందుకంటే, అతడు ఆ విద్యను తన తాత దగ్గర నేర్చుకొని ఉంటాడు గానీ పట్టాణాల్లో ఉండే వైదిక జ్యోతిష్కులనుండి మాత్రం కాదు. మరొమాటలో చెప్పాలంటే వెంటబడి తరిమే ఆ తొంభైయేళ్ళ తాత 1925 నాటికి ఏ నలభై, యాబై ఏళ్ళ వాడో అయి ఉంటాడు.

అంటే, శతాబ్దాల తరబడి గిరిజనులకీ, హిందువులకూ దేవతా సంబంధమైన నమ్మకాలతో సహా అనేక సమాచార మార్పిడులు, ఒకరి నమ్మకాన్ని ఒకరు గౌరవించుకుంటూ రావడం జరిగింది. కొన్ని నమ్మకాలు ఉమ్మడిగా కాక విడిగాను, ప్రత్యేకంగానూ ఉండొచ్చు. వాటితో ఆ ఇద్దరికీ పేచీ లేకుండా ఉండివుండొచ్చు. ఇది శతాబ్దాల చరిత్ర వల్ల తెలిసే వాస్తవం.

ఒకరకంగా చెప్పాలంటే శైవులూ, వైష్ణవులూ, గ్రామదేవతల ఆరాధకులూ, శక్తి ఆరాధకులూ లాగే గిరిజనులు కూడా ప్రకృతి ఆరాధకులు. ఈ సారూప్యం వల్లనే హిందువులు, గిరిజనులు ఒకరికొకరు ఎదురు పడ్డప్పుడు ఎవరి దేవుడు ఎవరికీ అభ్యంతరం కాలేదు.

ఈ రకమైన సంబంధాల వల్ల గిరిజన సంస్కృతి దెబ్బతిన్నాదా? దెబ్బతినే అవకాశం ఉందా?

మేడారం సమ్మక్క-సారక్క జాతర, విశాఖ జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతర, ఆదిలాబాద్ నాగోబా జాతర, ఇవన్నీ గిరిజన ఉత్సవాలు. వీటిని హిందూ ప్రచారం ఏమైనా దెబ్బ తీసిందా?

హిందూ మత ప్రభావం వల్ల ఒకవేళ బ్రాహ్మణ పూజారులు ఆ జాతరల్లో మంత్రాలు చదివితే దానిని గిరిజన సంస్కృతికి దక్కిన గౌరవం గా చూడాలి గానీ అందులో నాశనమయ్యేది ఏమిటి?

మూల సంస్కృతి – హిందూయేతర మతాలు – ఘర్షణ

మరి గిరిజన ప్రాంతాల్లో క్రైస్తవం ప్రచారం చేసే ఏ పాస్టరునైనా “ఈ మోదకొండమ్మ జాతర చూస్తే మీకు ఏమి అనిపిస్తుం”దని అడిగి చూడండి!

అతడి సమాధానంగా “యెహోవా ఒక్కడే దేవుడు. జీసస్ ఆయన కుమారుడు. ఇంకే దేవుణ్ణీ నమ్మకూడదు. వీరిలో ఎంతమందిని ఈ విశ్వాసానికి (జాతరకి) దూరం చెయ్యగలనా అని ఆలోచిస్తున్నాను.” అని అంటాడు.

అబ్బే, ఏ పాస్టరూ ఇలా అనడు. క్రైస్తవం వల్ల గిరిజన సంస్కృతికి ఏ ముప్పూ లేదు అంటారా? ఆ విషయ అంటే, “క్రైస్తవం స్వీకరించిన గిరిజనులు, మోదకొండమ్మకి పూజలూ చెయ్యొచ్చు, జాతరా చెయ్యొచ్చు” అని ఒక పాస్టరు చేత చెప్పించండి.

మేస్రం జాతి గిరిజనులు నిర్వహించే నాగోబా జాతర అడవి పరిరక్షణకి సంబంధించిన ఆరాధన. దీని గురించి క్రైస్తవులు ఏమంటారు!

“సృష్టిని పూజించకూడదు. అది పాపం. సృష్టికర్తనే పూజించాలి” అని అంటారు.

అంటే మేస్రం జాతి గిరిజనులు క్రైస్తవులైన తర్వాత నాగోబా జాతరని చేయకూడని ఘోర పాపం అని నమ్ముతారు కనుక ఆ పాపం చెయ్యకుండా అడ్డుకుంటారు.

ఇప్పుడూ చెప్పండి – గిరిజన జాతరలో వేదపండితుడు వేదం చదవితే గిరిజన సంస్కృతికి నష్టమా? అసలు ఆ జాతరే తప్పు, ఆ దేవతే లేదు అని నమ్మితే నష్టమా?

సోషల్ మీడియా చర్చలు సరే. ఒక్కసారి క్రైస్తవం వ్యాపిస్తున్న గిరిజన గ్రామాలకు వెళ్ళి, అక్కడ కుటుంబంలో ఒకరు క్రైస్తవం స్వీకరిస్తే, మిగిలినవాళ్ళు గిరిజన సంస్కృతిలో జీవించాలనుకుంటే ఆ కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉందో చూసి రండి.

ఈ విషయంలో Pastors చాలా చక్కటి విజన్ ఉన్నవాళ్ళు. ఒకరు మారిన కుటుంబాల్లో కలతలు గురించి ప్రసక్తి వస్తే, వారి సమాధానం, “ఈ లోకం కన్నా పరలోకం ముఖ్యం. కుటుంబం కన్నా దేవుడు ముఖ్యం. అంచేత, అందరూ దేవుడి మార్గం తెలుసుకొనే క్రమంలో ఇలాంటివి సహజమే” అంటారు.

నేను చెప్పినది నిజం అవునో కాదో మీ ఊరి పాస్టరు గారిని అడగండి!

*****

dhvani telugu podcast appధ్వని పాడ్కాస్ట్ యాప్ – వందల కొద్ది ఆడియోలను ఉచితంగా వినండి

Your views are valuable to us!