నవపాషాణం మరియు నామక్కల్ క్షేత్రాలు
ప్రాచీనులు తీర్థ శబ్దాన్ని వివరిస్తూ “తీర్థ శబ్దో ముఖ్యతహ్ పావనేషు వర్తతే” – “తీర్థ శబ్దానికి ముఖ్యమైన అర్థం పవిత్రర” అని చెప్పారు. భగవంతుడిని, ఆయన మహిమల్నూ అన్వేషిస్తూ సాగడమే “తీర్థాటన” అని చెప్పారు (తద్గవేషణాయ అటనమేవ తీర్థాటనం).
సప్రామాణికాలు, సమకాలీనాలైన తత్వ విషయాల్ని చింతన చేస్తూ, ఆయా ప్రాంతాల్లోని భగవద్రూపాల్ని ధ్యానిస్తూ, అక్కడక్కడే ఉన్న నదులు, తటాకాల్లో పుణ్యస్నానాలను చేస్తూ పోవాలి. అలా కాక కేవలం మనోరంజనం కోసం పిక్నిక్ లా వెళ్ళకూడదని చెప్పారు. అలా వెళ్ళేవారు మూఢులని చెప్పారు. (తదేవ కర్తవ్యం కుశలేన, న తు మూఢాభిమత తీర్థాటనమితి).
పరదైవమైన విష్ణువు కూడా రామ, కౄష్ణాది రూపాల్లో వచ్చినప్పుడు అనేక తీర్థయాత్రల్ని చేసాడు. తీర్థయాత్రల్ని ఎలా చెయ్యాలన్నదాన్ని మనలాంటి మందమానవులకు తెలియజెప్పేనిమిత్తమే భగవంతుడు తీర్థయాత్రల్ని చేసాడు. “పానేన్యప్యవగాహనేనన మనసా ధ్యానేన గానేనవా” అని చెప్పినట్లు ప్రతి తీర్థపర్యటనలోను ఆ క్షేత్రంలోని పుణ్య జల పానం, ఆ స్థలపురణాన్ని అవగాహనం చేసుకుని, అక్కడి భగన్మూర్తి లీలని మనసా ధ్యానిస్తూ, గానం చెయ్యడమే తీర్థయాత్రలోని ముఖ్యాంశాలు.
పాండవులే మొదలైన భాగవతోతములు కూడా అనేకమార్లు తీర్థపర్యటనలు ఈ రీతిలో చేసారు. “యద్యదాచరతి శ్రేష్ఠః స్తత్తదేవేతరో జనః” అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు
మనమూ ఆ మహామహుల్ని యథామతి, యథాయోగ్యంగా అనుకరించాలి.