చుప్పనాతి – భాగం 1

Spread the love
Like-o-Meter
[Total: 11 Average: 4.5]

 

 

‘వంశీ…వంశీ…’

పొగలు కక్కుతున్న కాఫీని నెమ్మదిగా సిప్ చేస్తూ హోటల్ రూం సిట్ ఔట్లో పచార్లు చేస్తున్న వంశీధర్ ఆ పిలుపుతో కాఫీ అక్కడే టీపాయ్ మీద పెట్టి రూంలోకి పరిగెట్టాడు.

బాత్రూంలో నుంచీ శార్వరి పిలుస్తోంది.

“ఏంటి? కాఫీ తాగుతున్నానోయ్ సిట్ ఔట్ లో. వినపడలేదు’ అంటూ బాత్ రూం తలుపు పై టక టకా శబ్దం చేశాడు.

‘నా సెల్ అప్పటినుంచీ మోగుతూనే ఉంది వినపడలేదా?? ఆఫీస్ నుంచేలే. అబ్బబ్బ..ఓ రెండు రోజులు సెలవు తీసుకుంటే చూడు ఎంత గొడవో?’

‘అందుకే అన్నాను.సెల్ పట్టుకురాకు అని. వింటేనా? ఆ అన్నా ఊ అన్నా ఇలా ఫోన్ చేస్తూ సెలవును కూడా ఎంజాయ్ చేయనివ్వరు మీ ఆఫీస్ వాళ్ళు! ఏదైనా అవసరమొస్తే నా ఫోన్ ఉందికదా అంటే నువ్వూ నా మాట విన్లేదు.’

‘సరే సరే..ముందా ఫోన్ ఎవరు చేశారో చూడు. నే వచ్చేస్తున్నాను.’

‘నువ్వే వచ్చి చూడు తల్లీ! ‘మేడం ఫలానా పూర్ణచంద్ గారు రికార్డింగ్ కి వచ్చారు. కాంట్రాక్ట్ సంతకం చేయించుకున్నాను. ఇంకా ఏమైనా..అని దీర్ఘాలు తీస్తాడు మీ ప్రొడక్షన్ అసిస్టంట్. వోచర్ మీద సంతకం చేయించుకున్నారా? అని నువ్వే గుర్తు చేయాలి. ఆ మాత్రం తెలీదూ వాళ్ళకి? గవర్న్ మెంట్ ఉద్యోగాలిలాగే ఉంటాయి మరి! ఎంత సర్వీసైనా ప్రతిరోజూ కొత్తే కొందరికి! అదే మా దగ్గరైతేనా ఇటువంటి బేసిక్ థింగ్స్ తెలీనివాళ్ళని మరుసటిరోజే ఇంటికి పంపించేస్తారు..అంతే!’

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

విసురుగా బాత్ రూమ్నుంచీ బైటికొచ్చి, టవల్ తల చుట్టూ చుట్టుకుంటూ శార్వరి అందుకుంది

‘అబ్బబ్బ. నీకెప్పుడూ ఇదే పని! నా జాబ్ అంటేనే నీకు అంత చిన్న చూపు! ఏం చేస్తాం? ఐనా ఆ మాటటుంచి, సంగీత సాహిత్య సాంస్కృతిక రంగాలకు మా ఆకాశవాణి , దూరదర్శన్ చేస్తున్న సేవముందు మీ మృదులాంత్ర ఉద్యోగాలు ఏపాటి చెప్పు? ఓ బాలమురళి, ఓ యమ్మెస్, ఓ వసంత కుమారి, ఓ పన్నాలాల్ ఘోష్, ఓ చౌరసియా, ఓ నేదునూరి, ఓ మాండొలిన్ శ్రీనివాస్…వీళ్ళింకా సంగీత రసహృదయాల్లో పదిలంగా ఉన్నారు, ఇంకా పదికాలాలపాటు ఉంటారంటే మా ఆకాశవాణి పుణ్యమే కదా!”

‘ఏమన్నా అంటే వాళ్ళందరి పేర్లూ చెప్పి నా నోరు మూయిస్తావు. కానీ, వీళ్ళందరినీ ప్రపంచానికి వ్యాపింపజేస్తున్న సాఫ్ట్వేర్ మాదేనని మరచిపోకమ్మాయ్!”

‘ఆ….చాల్చాలు. ఇంక త్వరగా తయారవ్వు. ప్లీజ్…బోలెడు గుళ్ళు చూడాలి నాసిక్ లో! సాయంత్రమేగా మనం బయలుదేరాల్సింది! ఆ…..నేన్నీ బట్టలు తీసిపెడ్తాగా!! ‘

వంశీ కూడా టైం చూసుకుంటూ బాత్ రూంలోకి జొరబడ్డాడు.

 


శార్వరి, వంశీధర్ ఇద్దరికీ ఏడడుగుల బంధం ఏర్పడి నాలుగేళ్ళైంది. ఇంకా సంతానం లేదు.

వంశీ సాఫ్ట్ వేర్ ఉద్యోగం. శార్వరి ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వాహకురాలు.

ఇద్దరూ హైద్రాబాద్ లోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ సెలవులు దొరకటం మహా కష్టం. ఎప్పుడైనా దొరికితే, ఇద్దరూ శార్వరికి ఇష్టమైన విహార స్థలాలకో, వంశీ కి ఇష్టమైన పుణ్య క్షేత్రాలకో వెళ్ళిపోతుంటారు.

అక్కడి గుళ్ళలో దేవుళ్ళకు తమకో బుల్లి బుజ్జాయినిమ్మని వరపడి మరీ కోరుకుంటుంటారు. కారణం, ఇద్దరూ వాళ్ళిళ్ళలో తామొక్కరే సంతానం కావటమే!! అందువల్ల పిల్లలు ఇద్దరిళ్ళకూ అపురూపం.

అతనికి  శివ క్షేత్రాలంటే చాలా ఇష్టం. ఇద్దరిదీ ప్రేమ వివాహం కావటం వల్ల, శార్వరికూడా అతని ఇష్టాఇష్టాలకు అనుగుణంగా నడచుకుంటుంది.

స్వతహాగా శార్వరికి స్త్రీ స్వాతంత్ర్యం, కొత్త విషయాలపట్ల పరిశోధనాసక్తి, పర్యటనాసక్తి ఓ పాలు ఎక్కువ! ఆమె గుణగణాలు తెలిసినవాడూ, ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చేవాడు వంశీ. ఏదైనా విషయం గురించి వాదోపవాదాలప్పుడప్పుడూ చేసుకున్నా, శృతిమించకుండా చూసుకుంటుంటారు ఇద్దరూ కూడా. భారతీయ కుటుంబ వ్యవస్థ పట్ల ఇద్దరికీ ఉన్న అవగాహనే అందుకు కారణం.

ఈసారి, వంశీ కోరిక ప్రకారం, నాసిక్ లో దిగి ముందు త్రయంబకేశ్వర దర్శనం చేసుకున్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా కొనియాడబడే యీ పుణ్య క్షేత్ర కొత్త నిర్మాణం శివాజీ మహారాజ్ సైన్యాధిపతి బాజీరావు నిర్మించాడంటారు..మన్మధుణ్ణి మట్టుపెట్టిన శివుణ్ణి ముక్కంటిగా కొలవటం తెలిసిందే. స్వయంభూ క్షేత్రమిది. మూడు లింగాలు ఒకే పాణివట్టం మీద ఉండటం, నందీశ్వరునికి విడిగా మందిరముండటం – గౌతమ మహర్షి అహల్యల తపస్సు వల్ల శివుని జటాజూటం నుండీ గంగ, గోదావరిలా ఇలకు దిగిరావటం – ఈ కథలన్నీ మరోసారి చర్విత చర్వణం చేసుకున్నారిద్దరూ.

‘మరి అంత పవిత్రమైన అహల్యకు గౌతముని శాపం, రాముని వల్ల శాప విముక్తి – వీటి గురించి శార్వరి చర్చ మొదలెట్టబోతుంటే వంశీ ఆపేశాడు.

‘అమ్మా మహాతల్లీ!! నీ వాదనలన్నీ ఇక్కడ కాదు. హైద్రాబాద్ లో!! పుణ్య క్షేత్రమని మాత్రమే చూడు దీన్ని, ప్రస్తుతం!!’ అని నవ్వుతూనే ఆపేశాడు వంశీ శార్వరిని.

‘ఇదిగో మరో పదినిముషాల్లో..మనం బుక్ చేసుకున్న కార్ వచ్చేస్తుంది..నీ సింగారం మొదలెట్టు ఇంక!’

వంశీ మాటలకు ఉడుక్కుంటూ..అందుకుంది శార్వరి..’అబ్బబ్బ..ఎన్ని మాటలంటావో చూడు..కాస్త తేలిగ్గా ఏదో క్రీం రాసుకుని, లిప్ గ్లౌస్ వేసుకుంటానో లేదో..ఇలా మేకప్ మేకప్ అంటూ ఆటపట్టిస్తావ్ గానీ..నీవేం తక్కువా?? పాంటూ, ఆ కలర్ కి తగ్గ షర్టూ..పైగా కూలింగ్ గ్లాసులూ, బూట్లూ..సెంటూ..అబ్బో..!! చూస్తూనే ఉన్నాగా అయ్యగారి సంగతి!!’ చిరుకోపంతో కొరకొర చూస్తూంది శార్వరి.

‘ఆ…ఆ….అదిగో! ఆ కొరకొర చూపులు చూసే కదా నేను ఫిదా ఐపోయింది! శారూ, మై డియర్!’  – మోకాళ్ళమీద నిలబడి ప్రేమ ప్రకటన చేసే భంగిమలో కూర్చునాడు వంశీ.

భళ్ళున నవ్వేసింది శార్వరి.

‘ఆహా..వచ్చిన పని మర్చిపోయేలా ఉన్నారు మహానుభావా! అదిగో కార్ వచ్చినట్టే ఉంది..సెల్ మోగుతుందిందాకట్నించీ…పద పద..తెల్ల రాముడూ, నల్ల రాముడూ..ఇంకా శూర్పణఖ మందిరమట..ఆహా..ముఖ్యంగా అది చూడాలి. త్వరగా తెములు బాబూ!’

మరో ఐదు నిముషాల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని కిందకు దిగి కార్లో బయలుదేరారు – నాసిక్ సందర్శనం కోసం.

మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ కి హైద్రాబాద్ బయలుదేరాలి మరి.

కార్ నాసిక్ వీధుల్లో ప్రవేశించింది.

ఎటు చూసినా బస్సులూ, కార్లూ, స్కూటర్లూ, మోటర్ సైకిళ్ళూ, సైకిళ్ళూ… ఎవరి పనుల్లో వాళ్ళు సమయానికి కళ్ళెం వేసేందుకన్నట్టు పరుగులు పెడుతున్నారు.

కార్ డ్రైవర్ , హిందీలో తాము చూడబోయే ప్రదేశాల గురించి చెబుతున్నాడు. వంశీ ఆసక్తిగా వింటున్నాడు. శార్వరి, కారును ఆపమంది ఉన్నట్టుండి.

కారణం, అక్కడక్కడా అమ్ముతున్న తాజా పచ్చి సెనగపప్పు మొక్కలు.

‘ఇప్పుడేగా హోటల్ లో పోహా తిని వచ్చాము. అంతలోనే ఏంటి??’ అని విసుక్కున్నాడు వంశీ.

‘ కొంచెంగానేలే..తాజా తాజా శనగ పప్పు కదా! ఎంత బాగుందో!’ అంది పదిరూపాయల కట్ట ఒకటి కొనుక్కుని.

కార్ డ్రైవర్ చెప్పాడు,’ఇక్కడ ఈ పంట ఎక్కువే’ అని.

ముందుగా తెల్ల రాముని గుడికి తీసుకెళ్ళాడు. తెల్ల రాముడు అంటే, పాలరాతి విగ్రహాలే! చూడ ముచ్చటగా ఉన్నాయి.

‘ఏది ఏమైనా, దక్షిణ భారతంలోని నల్ల రాతి విగ్రహాలలోని ఆకర్షణే వేరు ‘ అంది శార్వరి ఆ మూర్తులను చూస్తూ.

‘అమ్మా తల్లీ! ఇక్కడ అడుగడుగునా రామస్పర్శతో పులకించిన నేలే ఉన్నది. శిల్ప సౌందర్యం మాట అటుంచి సీతారాముల దాంపత్య సౌందర్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చూడాలిక్కడ. బేలూరూ, హళేబీడులను గుర్తు తెచ్చుకుంటే ఎలా??’ అన్నాడు వంశీ సమాధానపరుస్తూ.

‘అది సరేలే..బాగానే ఉందనుకో..అబ్ కహా చలేంగే భైయ్యా ?’ అడిగింది డ్రైవర్ని.

‘రామగుండం ‘అన్నాడు డ్రైవర్.

‘మానే? (అంటే)’ – వంశీ ప్రశ్న.

డ్రైవర్ హిందీలో చెప్పాడు. ఆ చోట సీతా రామ లక్ష్మణులు స్నానాలు ఆచరించేవారట!

కారు పరుగందుకునేంతలో ‘భైయ్యా..థోడా రుకో నా ..’ అంది శార్వరి హడావిడిగా.

‘అబ్బబ్బా.. ఏంటి శారూ..మాటిమాటికీ కారు ఆపుతుంటే..ఇహ మనం సాయంత్రం బయలుదేరినట్టే!’ విసుక్కున్నాడు వంశీ.

‘అరె..అటు చూడండి. ఆ ఉట్ట్లు ఎంత బాగున్నయో కదా! మన ఇంట్లోకి చిన్న కిట్టయ్య వచ్చేసినట్టేననిపిస్తోంది నాకైతే. రంగు రంగుల ఉట్లు..ఎంచక్కా ముద్దొస్తున్నాయో! ఆ ఉట్టి మధ్యలో చిన్ని ప్లాస్టిక్ కుండ కూడా ఎంత బాగా అమర్చారో! బుజ్జి కుండకు యీ అలంకరాలు కూడా భలే అమిరాయి. వంశీ! ఇంట్లో టీవీ దగ్గర అటూ ఇటూ పెడతా..’ మాట్లాడుతూనే కార్లోంచీ దిగేసింది శార్వరి.

అప్పుడు చూశాడు వంశీ.

నిజంగానే బాగున్నాయి.

చిన్న కిట్టయ్య ఇలాంటి ఉట్లు బద్దలు కొట్టే కదా, పాలూ పెరుగూ దొంగిలించి, తన స్నేహితులతో కలిసి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించినది ద్వాపర యుగంలో.

రామావతారంలో అంతా ధీర గంభీర మూర్తిగా అవతార ప్రణాళికను అమలు పరచినా, కృష్ణావతారంలో చిలిపి చేష్టలతో అందరి మనసులనూ అలరిస్తూనే గీతాచార్యునిగా కూడా మానవాళికి మహనీయమైన సందేశాన్నీ అందించాడు ఆ కృష్ణ పరమాత్మ.

వంశీ యీ ఆలోచనల్లో ఉండగానే పసుపు, ఎరుపు, నీలం. ఆకుపచ్చ రంగుల్లో ఏకంగా నాలుగు ఉట్టీలు పట్టుకొచ్చేసింది శార్వరి – ఒక్కొక్కటి నూటాయాబై మాత్రమే అంటూ.

‘అనుకుంటూనే ఉన్నా! రెండేరెండంటూ ఓ పదైనా పట్టుకొస్తావని! ఐనా మనం వెళ్ళేది బస్సులోనో ట్రైన్ లోనో కాదమ్మా…ఫ్లైట్ లో! బరువు సంగతి చూసుకోవద్దూ?’

‘ఆ…ఫరవాలేదులే..నా రెండు చూడీదార్లు, కారీ ఆన్ లగేజ్ లో సర్దేస్తాను. ఇంతకీ చెప్పు ..ఎంత బాగున్నాయి కదా?’

‘బాగానే ఉన్నాయిలే కానీ, మరో రెండెందుకు మహాతల్లీ?’

‘మా ఫ్రెండ్ హైమ కోసం.’

‘ఓహో! ఇంకా సరోజా, మణీ, గీతా  వాళ్ళను మర్చిపోయావే? నేవెళ్ళి పట్టుకొస్తా!’ వంశీ మాటల్లో కొంటెదనం.

వంశీ చేతిమీద కాస్త గట్టిగానే గిల్లింది శార్వరి..కోపంగా!

‘ఓ మై గాడ్’ అని అరవబోతూ ఆపుకున్నాడు వంశీ…డ్రైవర్ వ్యూ మిర్రర్ నుంచీ తమవైపే చూస్తున్న సంగతి గమనించి.

‘ఓహ్..సారీ! గట్టిగానే గిచ్చానా? మరేంచేయను..నామీద జోకులమీద జోకులు పేలుస్తుంటే!’ జాలిగా మొహం పెట్టేసింది శార్వరి కన్నీటి దోబూచులాటలో.

‘ఛ…ఛ…అదేం లేదులే! నిన్ను ఆట పట్టిద్దామని అంతే. ఇంతకీ, భయ్యా ఔర్ కిత్నా దూర్ హై రామగుండం??’ అడిగాడు వంశీ డ్రైవర్ ని.

‘బస్..అభీ పహుంచ్ గయే సాబ్’ కార్ ఎక్కడ ఆపాలో చూసుకుంటున్నాడతను.

‘రామగుండం – మన దగ్గర థర్మల్ కేంద్రం ఉంది కదా! ఇక్కడుండేది ఆధ్యాత్మిక థర్మల్ కేంద్రమన్నమాట! రామనామ మనే విద్యుత్తుతో భారతీయ సంస్కృతిని తరతరాలుగా సుసంపన్నం చేస్తున్న ధార్మిక కేంద్రం! ఆహా….చూశావా శారూ…మాటలెలా వచ్చేస్తున్నాయో!’ గర్వంగా చూశాడోసారి వంశీ శార్వరి వైపు.

‘అబ్బ..ఎంత బాగా చెప్పావో! కానీ ఇక్కడి రామగుండం అనే కేంద్రంలో సీతారాములు స్నానాదులు చేసేవారట మరి!’ కొంటెగా అంది కూడా.

‘నీవెప్పుడూ ఇంతేనోయ్..నేనేమన్నా ఏదో పెడార్థాలు తీస్తావు.’ కోపం వచ్చేసింది వంశీకి.

‘తమాషాకి అన్నానులే….నేనిందాక ఉట్ట్లు తెచ్చినప్పుడు నన్నాటపట్టించావుగా! చెల్లుకు చెల్లు…సరిపోయింది. పదలోపలికెళ్దాం’ – వంశీ భుజమ్మీద సుతారంగా కొట్టి చేతిలో చేయి కలిపి లోపలికి లాక్కెళ్ళింది శార్వరి.

అక్కడ ఆ చిన్న నీటి కొలనులో దిగి కాసిని నీళ్ళు నెత్తిమీద చిలకరించుకున్నారిద్దరూ, స్నానంచేసిన పుణ్యమొస్తుందని.

(ఇంకా ఉంది…)

Your views are valuable to us!