బంధువులు పోయిన బాధలో ఉన్న ఆ స్త్రీలకు మీనాక్షి మాటలు తెగ నచ్చాయి.
“ఐతే సరే. ఇప్పుడే వెళ్ళిరా. జయమగు గాక!” అని సాగనంపారిద్దరూ.
కానీ జయ మెవరిదౌతుందో వాళ్ళకేమెరుక?
*****
సుడిగాలిలా మీనాక్షి లంకకు చేరుకుంది.
అంతటా ప్రశాంతత.
అక్కడ రావణుని రాజ్యమైన జన స్థానంలో పదునాల్గు వేలమంది రాక్షసుల మరణానికి ఏడుపులు పెడబొబ్బలతో నింగి కంపిస్తుంటే, ఇక్కడ అంతా ప్రశాంతత.
అసలేమీ జరగనట్టు!
ఇంతకంటే విచిత్రమెక్కడైనా ఉంటుందా?
మరింత ముందుకెళ్ళింది మీనాక్షి.
దివ్యమైన వస్త్రాలు, అలంకారాలు పుష్ప మాలలూ ధరించి, మంత్రులతో సేవింపబడుతూ, బంగారు సిం హాసనంపై కూర్చుని వున్న గొప్ప తేజోశాలి, తన సోదరుడైన రావణున్ని చూసింది మీనాక్షి.
వచ్చీ రావటంతోనే రావణుని వైభవాన్ని పరుష వాక్కులతో తూలనాడటం మొదలెట్టింది.
EXPLORE UNTOLD HISTORY
అటు ఒఖ్ఖ రాముడు, పదునాల్గు వేలమంది నీ సైన్యాన్ని ఖర దూషణులను కూడా తానొక్కడే మట్టుపెట్టాడే! నీ రాజ్యమైన దండకారణ్యంలోని మునులందరికీ అభయమిచ్చి వారికి క్షేమం చేకూర్చాడే! జనస్థానాన్ని ఓడించాడే! ఆ సంగతి నీకింకా తెలియలేదా? ఎంత విచిత్రం? ఔనులే! నీవు ‘నేను స్వతంత్రుణ్ణి. నేను అజేయుణ్ణి. నేను మృత్యువుకే మృత్యువును’ అని విర్రవీగుతూ కూర్చుని వున్నావు కానీ, నిజానికి నీవు ఇతరుల అధీనంలోనే ఉన్నావు. వాళ్ళేమి చెబితే అదే నమ్ముతున్నావు. ఇలా ఉంటే, రేపు నీవాళ్ళనుకున్న వాళ్ళే నిన్ను గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టేయగలరు. అసలు రాజు అంటే ఎవరినీ అవసరానికి మించి నమ్మకూడదంటుంది రాజనీతి. రాజన్నవాడు తన నీడనే తాను నమ్మకూడదు. అటువంటిది, కళ్ళుమూసుకుని నిద్రపోతున్న నిన్ను నా అన్నగా అంగీకరించాలనే అనిపించటం లేదు. ఛీఛీ!”
అని అంటూ సభాసదుల ముందే రావణున్ని అవమాన పరచింది.
అమాత్యుల ముందే తనను ఒక పురుగులాగా తీసి పడవేసిన మీనాక్షిని చూసి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు రావణాసురుడు.
“ఎవడా రాముడు? ఏమిటి అతని బలం? చూడటానికి ఎట్లా ఉంటాడు? అతని పరాక్రమమెటువంటిది? అసలు ఇతరులు ప్రవేశించటానికి చాలా కష్టమైన దండకారణ్యంలోకి ఎలా ప్రవేశించాడు?” అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
రాముని రూపగుణ విశేషాలు ఎటువంటివి? అని అడగగానే మీనాక్షి మళ్ళీ రాముని సౌందర్య వాహినిలో కొట్టుకు పోయింది.
“అహా! ఆజానుబాహువు. విశాలాక్షుడు. నార చీరలను, కృష్ణాజినాన్ని ధరించాడు. ఐనా సరే మన్మధునితో పోటీ పడే సౌందర్యం సుమా! తన అమ్ముల పొదినుండీ ఎప్పుడు బాణలు తీస్తాడో, ఎప్పుడు వేస్తాడో నాకసలు కనబడనేలేదు. నేనేమిటి ఎవరూ కనిపెట్టనేలేరు. ఆ బాణాల చేత సైన్యం ప్రాణాలు కోల్పోయి కింద పడటం మాత్రమే కనిపించింది. ఇలా ఖర దూషణులతో పాటూ పదునాల్గు వేలమంది సైన్యాన్నీ కేవలం ఒక ముహూర్త కాలంలో సంహరించి, అక్కడి మునులకు అభయమిచ్చేశాడు. స్రీనైన నన్ను మాత్రం చంపేందుకు సందేహించి చంపకుండా వదిలి పెట్టేశాడు.” కాస్త ఊపిరి తీసుకున్నట్టు ఆగింది.
రావణుడు, కోపంతో ఎర్రబారిన ముఖంతో తీష్ణంగా ఆమె గాయపడిన ముక్కునూ, చెవులనూ చూస్తున్నాడు – “మరి ఇదేమిటి?” అన్నట్టు.
“నా ముక్కూ చెవులూ పోవటానికి కారణం నీపై నాకున్న ప్రేమే! అదెలాగంటావా? చెబుతున్నా విను.
ఆ రామునికో తమ్ముడున్నాడు. అతనూ అన్న వలెనే పరాక్రమశాలి. బుద్ధిమంతుడు కూడా. ఎప్పుడూ అన్నను అంటిపెట్టుకునే ఉంటాడు. అన్నకు బహిః ప్రాణమనుకో! రెండవ లక్ష్మీదేవిలా అందంగా, జనస్థానానికే దేవతలాగా ఉంటుంది ఆ రాముడి భార్య. ఆమె విదేహ రాజ కుమారి అట! పేరు సీత. దేవతల్లో కానీ, గంధర్వుల్లోకానీ, యక్ష కిన్నర కింపురుషులలో ఆఖరికి మనుషుల్లో కూడా ఎవరిలోనూ ఇటువంటి అందగత్తెను నేను చూడలేదనుకో! ఆమెను పొందగలిగితే ఇక దేవేంద్రుని కంటే కూడా గొప్పవానిగా జీవించవచ్చు. అటువంటి ఆ సీతను, నీకు భార్యగా చేద్దామని ఆశ పడ్డాను సోదరా! నీకోసం…కేవలం నీకోసమే నేను ప్రయత్నించాను. అంతే! ఆ క్రూరుడు లక్ష్మణుడు నా అవయవాలను ఖండించి నన్నీ విధంగా వికృతం చేశాడన్నయ్యా.
నీకోసం నేనెంతగా ఆశ పడ్డానో అంతగా భంగపడ్డాను కూడా! ఇదే కారణంగా ఖర దూషణులు కూడా ఆ రాముడిపై దండెత్తి వెళ్ళారు. ప్రాణాలు కోల్పోయారు. ఆ సుందరాంగి కోసం రాముడు ఎంతటి వీరాధివీరులనైనా మట్టుపెట్టేందుకు వెనుకాడడంటే, ఆమె అందాన్ని ఊహించుకో మరి! ఇక ఆలోచించకు. ఆమెను నీవు పొంది తీరవలసిందే. విజయం నీదే అన్నా! కుడి కాలు ముందు మోపి ఇక బయలుదేరు.”
మీనాక్షి ఇలా సీత అందాన్ని వర్ణించి ఉన్న విషయాన్ని దాచి – “నేనామెను నీకోసం తీసుకు వచ్చే ప్రయత్నంలోనే ఇలా ముక్కూ చెవులూ కోల్పోయాను. నీకోసమే చేశానిదంతా ” అనగానే చెల్లి మీద ప్రేమ పొంగి పొరలింది రావణునికి.
అంతేకాదు – జనస్థానం తనది. అక్కడే యీ విధంగా విలయ తాండవం చేసిన ఆ మానవాధముణ్ణి మట్టుపెట్టి తీరవలసిందేననుకున్నాడు కూడా.
సహజంగానే కామ పిపాస ఉన్న రావణునికి సీత పిచ్చెక్కించేంత అందగత్తె అనగానే ఆ మాట మరింత బాగా నచ్చింది. ఈ కారణాలన్నింటితో ఇక వెనుదిరిగి చూసుకోనేలేదు రావణుడు.
ఆవిధంగా మీనాక్షి కోర్కె నెరవేరేందుకు మార్గం సుగమమైంది.
కానీ, అన్న రావణుడు మళ్ళీ మేనమామ మారీచుని వద్దకే వెళ్ళాడని తెలిసి సగం నీరుగారిపోయింది మీనాక్షి.
అక్కడేమి జరుగుతుందో? మారీచ మామయ్య మళ్ళీ అన్న మనసు మార్చి వెనక్కి పంపించివేస్తే తన పథకం పారేదెలా?
ఇటువంటి ఆలోచనలతో మనసు పీచుపీచుమంటూనే ఉంది.
అందుకని క్షణక్షణమూ వివరాలు తనకు అందేలా వార్తాప్రసారానికి తగిన ఏర్పాటు చేసుకుంది.
(ఇంకా ఉంది…)