పూల మొక్కలకు నీళ్ళందిస్తున్న సీతను దూరం నుంచే చూసిందోసారి.
ఆవుల చెంత ఆత్రంగా పాలు త్రాగుతున్న లేగ దూడలను కన్నీటి తెరల మధ్య వీక్షిస్తున్న సీతను చూసిందింకోసారి.
మగ, ఆడ జింకల సల్లాపాలను విస్ఫారిత నేత్రాలతో ఆమె గమనించటం చూసింది మరోసారి.
కానీ..కానీ…ఆ చూపులలో ఎటువంటి బాధా లేదు.
ఆ వదనారవిందంలో, విషాద ఛాయలు లేవు. ఆ నడవడి లో తడబాటు లేదు.
అన్నివేళలా, ఆమె పెదవులేదో మంత్రోచ్చారణ చేస్తున్నట్టే ఉంది.
ఆ పెదవుల కదలికను పరీక్షగా పరిశీలిస్తే తెలిసింది, ఆమె రామ నామాన్నే ఎల్ల వేళలా జపిస్తూ ఉన్నదని.
తనకింతటి శిక్ష విధించిన శ్రీరాముని పై ఆమెకేమాత్రం కోపం లేదనీ, పైపెచ్చు మరింత గాఢంగా ఆ నామాన్ని మననం చేసుకుంటూ, మరింత ఆనందాన్ని అనుభవిస్తున్నదని!
“ఎంత శాంత సుందరాలా దృక్కులు? ఎంతటి శీతల కల్పవృక్ష ఛాయలా దృక్కులు? ఎంతటి పవిత్రతామందిరాలాదృక్కులు? ఆ చూపులకే బందీ ఐపోయాడు కదా ఆ పుంసాం మోహన రూపుడు! ఈ శాంత సుందరిని ఇప్పుడా చూడటమిలా? ఊహూ.. ఇప్పటి అనుభవమే కాదిది. ఈమె జీవితంలో ఎన్నెన్ని సంఘటనలు జరిగిపోయాయో తెలియదూ తనకు!
ఇప్పటిదాకా జీవితంలో ఎన్ని ఒడుదుడుకులను చూసింది ఈమె! తాను భూపుత్రికనని ఎన్ని సార్లో చెప్పుకునేది వివిధ సందర్భాలలో! అంటే, ఒకరకంగా ఓర్పుకూ, సంయమనానికీ, వైవిధ్యానికీ, అలాగే దృఢ సంకల్పానికీ కూడా తన ఆదర్శం భూమాతే అని చెప్పుకోవ టం కాక మరేమిటి? ఎందుకలా చెప్పుకునేదో కానీ, యీమె జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు, ఏమాత్రం ఊహించలేనివి కూడా జరిగిపోయాయి. వాటిలో తన పేరూ కొన్నిటిమీద ఉండటం బాధాకరమే. ఐనా ఎంత నిబ్బరం యీమెలో? తన పతిదేవుడు రాముణ్ణే తలచుకుంటూ, ఎన్నెన్ని కష్టాలను అలవోకగా యీదేసిందీవిడ?”
ఇక నిలువలేక పోయింది మీనాక్షి.
EXPLORE UNTOLD HISTORY
తడబడుతున్న అడుగులతో సీత ముందుకు వెళ్ళి కుప్పకూలిపోయింది.
ఆమెను చూసిన వెంటనే గుర్తుపట్టింది సీత.
అప్పుడూ, ఇప్పుడూ కూడా సీతలో అదే శాంత సుందర దరహాసం.
పశ్చాత్తాపాశ్రువులతో ఆమె పాదాలను కడిగింది మీనాక్షి.
కళ్ళతోటే అడిగింది మీనాక్షి “ఏమిటీ దారుణ”మని.
దానికి మాత్రమే సీత నోరు విప్పి సమాధానం చెప్పింది – ”నీది ప్రతీకార చర్య. దానికి అంతం లేదు. పోనీ అటు రాముడేమైనా సుఖంగా ఉన్నాడా? లేదే! ఎవరికైనా, ఇవన్నీ తప్పవు. ప్రకృతి మాత్రమే సత్యం. నేను ప్రకృతి బిడ్డను. రాగ ద్వేషాలకు అతీతంగా ఆ ప్రకృతిలో లయమైపోయేందుకే నిరీక్షిస్తున్నాను. నాకిప్పుడు కోపమూ, విద్వేషమూ వంటి రాగ ద్వేషాలేవీ లేవు.” అని నవ్వేసింది.
సీత స్థితప్రజ్ఞత, మానసిక పరిపక్వత చూసి ఆశ్చర్యపోయింది మీనాక్షి.
నెమ్మదిగా కదిలి ముందుకు వెళుతూ సీత అంది – “అంతా కర్మ ఫలమే! నేనేమీ కుంగిపోవటం లేదసలు. నీవూ అంతే. పైపెచ్చు, నీకు ఆ పరమశివుని ఆదేశమైనా ఉంది, దాన్ని గుర్తు చేసుకుని ఆ విధంగా నీ లక్ష్యాన్ని సాధించుకో. ఇక నా సంగతా? మా తల్లే చూసుకుంటుంది.” అంటూ ముందుకు కదలిపోయింది.
మీనాక్షికి అప్పుడు గుర్తుకు వచ్చింది – ఆనాడు, ఖర దూషణుల వధానంతరం, ఆ మగత నిద్రలో ఏమి చూసింది తాను? బ్రహ్మ తనను విష్ణువు అవతారోద్దేశానికి సహకరించమనటం, శివుడు పదివేల సంవత్సరాలు నీళ్ళల్లో తపస్సు చేస్తే, ద్వాపర యుగంలో కుబ్జగా తనని శ్రీరాముడు స్వీకరిస్తాడనటం కూడా గుర్తొచ్చింది.
ఇప్పటికి జ్ఞానోదయమైంది తనకి! అదీ తాను ద్వేషించిన సీత ద్వారానే.
ఎంత వింత!
సీత మాటలనే ఆదేశంగా స్వీకరించి తపస్సు కోసం జలధిలోకి ప్రవేశించింది మీనాక్షి.
మరీ చిత్రంగా, ఇప్పుడు మీనాక్షికి సీత మీద కోపమే లేదు.
తన పేరును మోసానికి ప్రతీకగా, మిటుకులాడికి ప్రత్యయంగా వాడుతున్నారన్న అవమాన భారమూ లేదు. అసలు గత కాలమంతా ఆమెలో తుడిచిపెట్టుకుపోయింది.
శారీరిక సుఖానుభవాలే జీవితమని నమ్మి, వాటికోసం వెంపర్లాడే సాధారణ ప్రాణి కాదామె ఇప్పుడు.
శరీరాన్ని నడిపే ఆత్మ ప్రాధాన్యతను గుర్తించి, ఆత్మ సంస్కారాన్ని పెంపొందించుకునేందుకే జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సత్యాన్ని గుర్తించిన సంస్కారి.
ఆమె ఇప్పుడు, స్వాతి చినుకుకోసం ఎదురుచూస్తున్న ముత్యపు చిప్ప.
గతజన్మ అనుభవాల కొలిమిలో కాలి కాలి నిగ్గుదేరిన బంగారం.
స్వచ్ఛ సుందరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉన్న ఆత్మ మాత్రమే.
ఆత్మ పరమాత్మల పవిత్ర సమాగమం కోసం, ఆ శ్రీమహావిష్ణువు ప్రేమపూర్వక కరస్పర్శ కోసం, పదివేల సంవత్సరాలేమిటి పది కోట్ల సంవత్సరాలైనా ఏ స్థితిలోనైనా తపస్సు చేయగల ఆత్మ స్థైర్యం ఆమెలో నిండిందిప్పుడు.
ఆమె ఇప్పుడొక పరిపూర్ణ జీవాత్మ మాత్రమే.
(ఇంకా ఉంది…)