చుప్పనాతి – భాగం 3

Spread the love
Like-o-Meter
[Total: 8 Average: 4.1]

 

“శార్వరీ! ముందుగా నీకు అభినందనలు. ఎవరూ స్పృశించని సబ్జెక్ట్ ఎన్నుకున్నందుకు! నాకు తోచిన తరహాలో నేనూ కాస్త నీకు సాయపడాలనుకున్నాను. అసలు నీవీ సబ్జెక్ట్ తీసుకుని ఏదో రాద్దాం అనుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే, మన దేశ సంస్కృతిలోనే ఆ వెసులుబాటుంది. నీకు తెలుసా…మనందరమూ దాదాపు తిట్టుకునే రావణునికీ, శకునికీ, దుర్యోధనునికీ కూడా గుళ్ళున్నాయి. ఆశ్చర్యం కదా! కాన్ పూర్ దగ్గర, విదిషా లోనూ, రాజస్థాన్ లోనూ రావణుని గుళ్ళున్నాయ్. ఇక కేరళలో ‘పవిత్రేశ్వరం’ అన్నచోట శకునికీ, ‘పొరువజ్హం’ అన్న చోట దుర్యోధనునికీ పూజలు జరుగుతాయి. శకుని కూర్చున్న ఒక సింహాసనంలాంటిది ఉందట అక్కడ.  భారత యుద్ధం తరువాత శకుని మోక్షంకోసం తపించి, అక్కడ దేహ త్యాగం చేశాడట తెలుసా!

ఇక దుర్యోధనుని గురించి – అతడు అరణ్యవాసం చేస్తున్న పాండవుల ఆరా తీసేందుకు అన్ని ప్రాంతాలూ జల్లెడ పడుతున్నాడట. మలనాడ పర్వత శ్రేణుల సౌందర్యానికి ముగ్ధుడైపోయాడట. అక్కడ ఒక కల్లు తీత పనివాడి దగ్గర కల్లు కూడ తాగి మైమరచిపోయాడట! అక్కడో గుడి ఉంటే, ఆ గుడికి ఎన్నెన్నో వందల ఎకరాల భూమిని దానం చేశాడట కూడా. అందుకని, అక్కడి వాళ్ళందరికీ దుర్యోధనుడు దేవుడే అంటూ “సంకల్పం” అనే పూజా విధానంలో దుర్యోధనుని పేరు తలచుకుని పూజలు మొదలెడతారట.

మనాలీ లో హిడింబా టెంపుల్ ఉంది తెలుసా నీకు! మేము చూశామోచ్! అందమైన ప్రకృతి మధ్య ఆ టెంపుల్ ఉంది శార్వరీ. మేమక్కడ జడల బర్రె మీద ఎక్కాం. అదో ఫన్ లే! ఇంతకీ విషయమేంటంటే..భీముని భార్య కదా ఆమె. కానీ ఆమె రాక్షసి.  పాండవుల అరణ్యవాసంలో భీముని చేతిలో ఆమె సోదరుడు తండి మరణిస్తే, ఆమె తాను ఒంటరిననీ, భీముడు తనని పెళ్ళిచేసుకునేలా ఒప్పించమని కుంతిని వేడుకుంటుందట. కుంతి జాలిపడి భీముణ్ణి ఒప్పించి పెళ్ళి చేస్తుందట. అద్దీ ఖద.

విలన్లుగా మనమంతా భావించే వీళ్ళందరికీ ఇండియాలో గుళ్ళున్నాయమ్మాయ్! నువ్ నాసిక్ లో చూసిన శూర్పణఖ మందిరమూ అటువంటిదే. ఎటువంటి సందేహాలూ పెట్టుకోకుండా..గో అహెడ్! మీకందరికీ హాప్పీఎస్ట్ ఉగాది వన్స్ అగైన్. ఆఆ….వచ్చే..పిల్లల గోల వినబడుతోందా!! (నవ్వు) చూశావా శార్వరీ..కార్తీక్ కి ఇష్టం కదా..పిల్లలిద్దరికీ కూడా ఆలూ ఉంటే చాలు ఇంకే వంటకమూ అఖ్ఖర్లేదు. ఆలూ వేపుడూ, ఆలూ సాంబారూ..ఇదీ యీ రోజు వంట!! ఒకతనితో కర్రీస్ తెప్పించుకునేదాన్ని. ఈ కరోనా భయంతో అతన్నీ వద్దనేశాను. వంట తంటా కూడా ఉందివాళ. ఉంటా మరి.”

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

తాననుకున్న ప్రోగ్రాం సంగతెటున్నా తాననుకున్న సబ్జెక్ట్ ప్రాజెక్ట్ తన చేతిలోనిదే కాబట్టి ఇప్పుడిక దానిమీదే దృష్టంతా పెట్టవచ్చుననుకుంది శార్వరి. రాత్రి వంశీ కిష్టమైన దోసావ, ములక్కాడల పులుసూ, తనకిష్టమైన కేరట్ కర్రీ…ఇద్దరూ ఆడుతూ పాడుతూ కలిసి వండేసుకుని, టీవి లో అత్తారింటికి దారేది సినిమా ఎంజాయ్ చేస్తూ భోజనం ముగించారు.

వంశీ బెడ్ రూం లోకి వెళ్ళాడు. తాను వంటిల్లు సర్దుకుని సాయంత్రమే కట్టిపెట్టుకున్న సన్నజాజి మాలను చేతిలో పట్టుకుని బెడ్ రూంలోకెళ్ళిందీ లేదో – ‘అందాల రాక్షసివే..’ పాటందుకున్నాడు వంశీ.

“ఓమ్మోవ్..జరంతొస్తవా??’

ఎవరబ్బా తననిలా పిలుస్తున్నది? పైగా ఆ గొంతులో ఏదో కోపం కూడా! వెనుదిరిగి చూసింది శార్వరి.

కాస్త దూరంగా, ప్లాస్టిక్ పదార్థాల చెత్త సంచీల పక్కన కూర్చుని వుందో ముసలావిడ.

తనతో ఏదో పరిచయమున్నట్టే పిలుస్తూందే? అప్రయత్నంగా అటుకేసి అడుగులు పడ్డాయి.

“అప్పుడెప్పుడో, నాచేతికో ఐదు రూపాలయలిచ్చి మల్లీ వొచ్చినప్పుడు పాతచీరలు తెచ్చిస్తనన్నావ్? ఏదీ రాకనేపోతివి? పైగా ‘అవ్వా! నీ కత జెప్పు పత్రికలో రాస్తనని గూడ వాద జేసినవే! మల్లీ ఇప్పుడొచ్చి, నన్ను దెల్వనట్టెల్లిపోవుడు? ఏంది కత? గదేంది గట్ల జూస్తవ్ పిచ్చిదాని లెక్క? నిద్రబోతున్నవా ఏంది? జరంత కల్లు తెర్సు బిడ్డా…ఇది కలా నిజమా ఎరికైతలేదా ఏంది నీకు? ఏదైంతె ఏంగానీ, నేంజెప్పేది మంచిగిను!”

తన మీద ఏదో అధికారమున్నట్టే మాట్లాడుతోందీవిడ? ఎవరైవుంటుంది? సమయానికి వంశీ కూడా రాలేదు.

“నా కత నేంజెప్పుడేంది గాని అప్పుడెప్పుడో ఒకాయన అడిగితే జెప్పిన..ఆయన రాసిండు..నీకు సమజైతదిలే! నన్ను దల్చుకొని జదవాలె మల్ల!’ అంటూనే, తన తొడ కింద నుంచీ ఒక పాత బైండు పుస్తకం, పేజీలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నది ఇచ్చి, కిసుక్కున నవ్వింది బోసి నోట్లో ఉన్న రెండు మూడు వంకర పళ్ళూ తొంగి చూసేలా.

ఆ పుస్తకాన్ని వణుకుతున్న వేళ్ళతో తెరిచింది శార్వరి.

అదేమిటో! ముందంతా గజిబిజిగా అనిపించిన ఆ వ్రాతంతా రాను రాను తనకు అలవాటున్న తెలుగు భాషగా మారిపోతుంటే ఆశ్చర్యంగా ఉంది శార్వరికి.

చూపులు అక్షరాల వెంట పరుగందుకున్నాయి.

@@@@@

“అందరికీ నమస్సులు. నా యీ ముందుమాటను మంచి మనసుతో చదవమని నా వినయపూర్వక మనవి. ఒక దుష్ట పాత్రగా నేను మీకంతా బాగా సుపరిచితురాల్ని – రామాయణం ద్వారా. నా పేరు వింటే చాలు శరీరమంతా కంపరం పుట్టేస్తుంది మీకంతా. కానీ నా అసలు మనసేమిటో మీకు తెలియాలనే యీ నా యత్నం. వాల్మీకి మహర్షి తన రామాయణానికి నా పాత్ర ఎంత అవసరమో అంత మాత్రమే చెప్పి ఇక నన్ను ప్రస్తావించలేదు. కనుక మీరూ నన్ను ఆ విధంగానే మీ ఊహల్లో నిలుపుకున్నారు సహజంగానే. ఒక కావ్య సృష్టిలో ఇవన్నీ సహజమే! ఆ మహాకవి తాను సమాజానికి తన కథ ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో అంతవరకే ఆయా పాత్రలను పోషించటం కూడా యుక్తి సంగతమే కదా! సమాజంలోని మంచీ, చెడూ ప్రతిఫలించేందుకు కొన్ని పాత్రలను ప్రతీకలుగా కవి స్వీకరించటాన్ని తప్పు పట్టలేము.

ఈ సంగతి అటుంచి ‘పుంసాం మోహన రూపాయ’ అని కీర్తింపబడే రాముని దివ్య సౌందర్యానికి దాసోహమన్న మీవంటివాళ్ళంతా నాకు ఆప్తులే.! ఇంతకీ నా పేరేమిటని కదా మీ సందేహం. పేరు ముందే చెప్పేస్తే భయపడతారేమోనన్న సంకోచం నాకేమాత్రం లేదు. రామాయణ కథకో మలుపు ఇచ్చిన పాత్రల్లో నేను ముఖ్యురాల్ని. ఓ రకంగా నన్ను దానవ కులనాశకి అని కూడా అంటుంటారు.

నా పేరు మీనాక్షి.

ఎంత మంచి పేరుకదా! కానీ ఈ పేర్లు మటుమాయమైపోయి, చాటల్లాంటి గోళ్ళున్నదానిగా ప్రసిద్ధమైపోయాను. అంతేనా?  కేవలం కామప్రకోపంతో ముందు రాముణ్ణీ తరువాత లక్ష్మణున్నీ మోహించాననీ, సీత నాకూ రామునికీ అడ్డుగా ఉందని, ఆమెను చంపబోయాననీ కూడా చెబుతారు. అవమానం తరువాత నా అన్నదమ్ములందరి దగ్గరా అబద్ధాలే చెప్పాననీ, సీతాహరణానికి కారణమయ్యానని దుమ్మెత్తి పోస్తారు.

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మీరే కదా అంటారు! అందుకే నా అప్పటి ప్రవర్తనకు కూడా పూర్వాపరాలు ఉంటాయని నమ్మాలి మీరు. నా గోడెవరికి చెప్పుకోను? అంతా అరణ్య రోదనమేనా? నా ఆవేదనకు సమాధానం దొరికింది. వాల్మీకి తదనంతర కవులలో కొంతమంది భిన్నంగా చిత్రించి, నా పాత్రకూ కాస్త తళుకులద్దారు. అటు తరువాత ఆధునిక సాహిత్యంలోనూ కొంతమంది ఆ ప్రయత్నం చేశారని తెలిసింది. కానీ, కొంతమంది మరీ విపరీత రీతుల్లో, నన్ను చిత్రించటం బాధ కలిగించింది. నన్ను నేనుగా సాహిత్య దర్పణంలో చూసుకునే అపురూప క్షణాలు అసలు వస్తాయా అని గోళ్ళే కాదు చూపులను కూడా చేటలుగా చేసుకుని ఎదురు చూస్తుంటే ఒక వ్యక్తితో పరిచయమై, తాను అజ్ఞాతంగానే ఉంటూ, నా మనోగతాన్ని నాదైన రీతిలో చిత్రించగా, ఇదిగో యీ పుస్తకంలో భద్రపరచటం జరిగింది.

శార్వరీ, నీకు నా కథ పట్ల ఉన్న ఆసక్తిని గమనించాను. అందుకే ఇది నీదగ్గరకు వచ్చింది. ఇందులో ఉన్న భాషేదో నీకు అర్థం కావటం లేదనుకున్నావ్ కదా ముందు? మళ్ళీ కాసేపటికి మీ తెలుగులోనే స్పష్టంగా కనబడింది. అంటే, నా ప్రభావం నీపై పడ్డది గమనించు. కంగారేమీ లేదు. ఆ విద్యలను దేశభాషా జ్ఞానం, లిపికర్మ అంటారు. అవి కూడా మా గాంధర్వ విద్యలల్లోనివే. ఇందులోని భాష నీకనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుందని గుర్తు పెట్టుకో.

అన్నట్టు, నేను నీ కలల్లో కనిపించటానికి కారణం మా మేనకోడలు ఇచ్చిన ప్రేరణే. మేనకోడలు అనగానే అలా ప్రశ్నార్థకం పెట్టావేంటమ్మా ముఖంలో? అదే మా ధర్మాత్ముడైన సోదరుడు విభీషణుని కుమార్తె త్రిజట గురించి నేనంటున్నది. ఆమె కలలో తాను చూసిన శుభ సమాచారం చెప్పి సీతమ్మను సంతోషపెట్టింది కదా! అసలు త్రిజటాస్వప్నం గాయత్రీమంత్రమే సుమా అన్నారట సువిఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మగారు. అసలు స్వప్నాలను నేనూ నమ్ముతాను తెలుసా! ఈ రచనను తీరిగ్గా చదివి, నిర్ణయం తీసుకో!! నాకు నీ ద్వారా కాస్తైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో…మీనాక్షి.”

(ఇంకా ఉంది…)

Your views are valuable to us!