చుప్పనాతి – భాగం 4

Spread the love
Like-o-Meter
[Total: 8 Average: 4.5]

 

“శార్వరీ…ఓ శార్వరీ దేవీ…రజనీ…శ్యామా…విభావరీ! ఇన్ని పేర్లతో పిలుస్తున్నా లేవటమే లేదేంటి నువ్వు?” గట్టిగా కుదుపుతున్నాడు వంశీ.

గబుక్కున లేచి కూర్చుంది శార్వరి.

“ఔనా! చాలాచేపటినుంచే లేపుతున్నావా? సారీ…అదేమిటో..మొద్దు నిద్ర పట్టేసింది!’ సారీ ఫేస్ పెట్టింది శార్వరి.

“అదే! నీకు కొన్ని రోజులుగా కుంభకర్ణుని ఫామిలీతో దోస్తీ కుదిరిందిగా! ఆ ప్రభావం కూడా ఉంటుందిలే” నవ్వుతూ ఆటపట్టిస్తూ, చేతికి గ్రీన్ టీ గ్లాస్ అందించాడు కూడా.

“ఛ..అదేం లేదు కానీ..వంశీ..నీకో గమ్మత్తైన సంగతి చెప్పాలి” అంది శార్వరి.

“ఆఆ..ఎదురు చూస్తున్నా డియర్ హనీ! ఓ నెల రోజులనుంచీ నీవు చెప్పేవన్నీ హాట్ హాట్ వార్తలేగా! చెప్పు త్వరగా!”

“కలలను నువ్వు నమ్ముతావా చెప్పు?”

“అదంతా ట్రాష్! నీ మనసులో సుళ్ళు తిరుగుతున్న భావాలనూ విషయాలనూ తనదైన పద్ధతిలో నీ ముందుంచుతుంది నీ బుర్ర.”

“మరి అబ్దుల్ కలాం బాగా కలలు కను అని ఎందుకన్నారు? వాటిని సాకారం చేసుకో అని కూడా అన్నారు కదా! అంటే, నీ కలలను రూపొందించుకోవటమూ నీవే చేయాలి. వాటిని నిజం చేసుకోవటానికి కృషీ నీవే చేయాలి అనే కదా అర్థం!” ఆగిపోయింది శార్వరి.

“ఊ ..ఊ.. అలాగని ఎప్పుడూ నీలాగ పగటి కలలు కంటూ కూర్చుని ఆ కలల్లో చూసినవన్నీ నిజం కావాలని కోరుకోవటం మూర్ఖులు చేసే పని.” శార్వరి టీ కప్పు తీసుకుని లేచాడు వంశీ.

వంశీ వెనకాలే నడుస్తూ అంది శార్వరి.

“అది కాదు వంశీ! నేనీ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తుంటే ఆ సంగతులే కలల్లోనూ వస్తాయి సరే. నేనూ ఒప్పుకుంటా. కానీ నేనిప్పుడు చూసిన కల గురించి చెబితే నేను చెప్పేది నిజమని నీవు ఒప్పుకుని తీరాలి.”

“సరే మహాతల్లీ! చెప్పు నీ స్వప్న సారాంశం!” కూర్చున్నాడు వంశీ.

శార్వరి ఉత్సాహంగా తన కల గురించి చెప్పింది.

ఎంతో ఉత్కంఠత తో చెప్పింది.

నిజంగానే ఇదేదో మిస్టరీలాగే అనిపించింది వంశీకి.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
  శార్వరిని నిరుత్సాహ పరచటం ఇష్టం లేక భుజమ్మీద తట్టి – “వండర్ఫుల్! గో అహెడ్ హనీ…చూద్దాం! నువ్వీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే నీవెనక నేనూ ఫేమస్ ఐపోతానేమో! ఇప్పుడిక కలలలోకం నుంచీ ఇలమీదికి వద్దామా?? అలా స్టోర్స్ దాకా వెళ్ళొద్దామా?? ప్రొవిషన్స్ తెచ్చుకుందాం. ఇంటి బైట కరోనా. ఇంట్లో నీ కల్లోనూ మరో కరోనా! హే భగవాన్! ముఝే బచానే కేలియే కుఛ్ కరోనా”

వంశీ ధోరణికి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ, తయారవటానికి వెళ్ళింది శార్వరి.

వికారి నామాన్ని విడనాడి, మరులొలికే శార్వరిగా, యామినిగా, రజనిగా..అంటే..రాతిరి అనే పేరుతో, మామిడి తోరణాల మధ్యా, కోకిలా రావాల మధ్యా, రసరమ్యంగా విచ్చేసి, కొలువు తీరింది తెలుగు వత్సరం శార్వరి.

కరోనా భయానికి ఇళ్ళనుంచీ బైటికి వెళ్ళేందుకే హడలిపోతున్నారు ప్రజలు.

ఏ ఉగాదులు లేవు ఏ ఉషస్సులు లేవు అని కవి వాపోయినట్టు పండుగ రోజుల్లోనూ ఇల్లు కదలటానికి కూడా వెరచే రోజులు.

ఐనా ముందే అనుకున్నట్టు మల్కాజిగిరిలో ఉన్న శార్వరి అమ్మ గారింట్లో ఉగాది పచ్చడి, మామిడి కాయ పులిహోర, వడలూ, బొబ్బట్లూ, పనస పొట్టుకూరా, కంది పచ్చడీ, అప్పడాలూ, గట్టిపెరుగులతో పండగ భోజనం కానిచ్చి, సాయంత్రం నాలుగింటికి తమ ఇంటికి చేరుకుని ఇద్దరూ అలా నడుం వాల్చారోలేదో మణి నుంచీ ఫోన్ మోగింది.

“ఇప్పుడు నీకు ఫోన్ చేసే కారణం, మొన్నొకనాడు లైబ్రరీ కి వెళ్ళినప్పుడు, నీ చుప్పనాతి గురించి కాస్త విషయం దొరికింది. నీకు ఉపయోగపడుతుందికదా అని వెంటనే రాసుకున్నాను. ఇదిగో వాట్సప్ చేసాను ఆ మాటర్..చూసుకో..గుడ్ లక్..ఉంటామరి..బై”

శార్వరికి ఎంతో సంతోషం.

తన ఫ్రెండ్స్ అందరూ, ఇన్నిరకాల తనని ప్రోత్సహిస్తుంటే ఇక ఆలోచించటం మంచిది కాదనిపించింది.

కలం త్వరగా పట్టవలసిందే!

ఉత్సాహంగా వాట్స్ అప్ ఓపన్ చేసింది శార్వరి.

@@@@@

పంచవటి అన్న పదం – పంచ, వటి అన్న రెండు పదాలతో ఏర్పడింది.

పంచ అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు . రెండూ కూడ ఐదు సంఖ్య గలవే. ఇలా ఐదు సంఖ్యగల జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల వాటిక – పంచవటి.

మనిషి జీవితంలో అన్ని పనులూ ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల మీదే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడీ పంచవటి అన్న చోట రాముడు కుటీరం ఏర్పాటు చేసుకున్నాడంటే అతడు వ్యవహార క్షేత్రంలోకి ప్రవేశించాడు అనటం.

పర్ణశాల – ఓ రకంగా పణ శాల. అంటే, వ్యాపారము లేదా వ్యవహారము లేదా ఇచ్చిపుచ్చుకునే చోటు. ఇక్కడ కూడా అదే జరుగబోతున్నది అనటమే.

గోదావరి తీరాన పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు.

గోదావరి నది – గో అంటే చేతన. వ అంటే దానము. వరి అంటే శ్రేష్టమైనది. చేతనను దానం చేసేందుకు ఉత్తమోత్తమ స్థానమిది అన్నమాట.

శూర్పణఖ – ఇది కూడా రెండు పదాల కలయిక. శూర్పా ఇవ నఖా అస్యా: చేటలవంటి నఖములు అనగా గోళ్ళు కలిగినది అని అర్థం.

చేటలు తమంత తాము పని చేయవు. వాటి తో పని చేయించే చేతులు లేదా శక్తి కావాలి. మనిషి శరీరం కూడా ఒక యంత్రమే. ఆ యంత్రాన్ని సముచిత రీతిలో నడిపేందుకు శరీరం రూపంలో ఉన్న యంత్రానికంటే భిన్నమైన ఒక శక్తి, ఒక ఆత్మ అవసరం. అలాకాక, యీ శరీరమే నేను (అంటే యీ యంత్రాన్నే నేను అన్న పద్ధతిలో వ్యవహరిస్తే, దాన్ని ఖండిత యోచన అనవచ్చు) శరీరమూ, ఆత్మా వేరని గ్రహించాలి అని దీని సారాంశం.

పురాణాల్లో దీనినే దితి అన్నారు. దితి నుండీ దైత్యులు పుట్టారు కదా! వేదాల్లో యీ దితినే శూర్పము అన్నారు. దితి: శూర్పం, అదితి: శూర్పగ్రాహీ అంటే దితి అంటే చేట. శూర్పగ్రాహి అంటే చేటను గ్రహించునది. అదితి శూర్పగ్రాహి అనే కదా అర్థం!

నఖము అంటే ఒక రకంగా ఆయుధంగా కూడా బంధించటానికి ఉపయోగించేది. శరీర చేతన మనిషిని బంధించి ఉంచే గుణం. శరీరమే నేననుకునే గుణం.

ధనము, వైభవమూ వంటి ఆకర్షణలకు సులభంగా లొంగిపోవటమే మనిషి గుణం దానికోసం ఎన్ని వేషాలైనా వేసేందుకు సిద్ధమై పోతాడు అతడు. నిజానికి శరీరము, ఆత్మ – రెండింటి మధ్యా తేడాను గుర్తించటం మనిషికి అవసరం. దాన్ని గుర్తించనిదే శూర్పణఖ. తన ఇష్టాన్ని తీర్చుకునేందుకు ఎన్ని వేషాలైనా వేసేందుకు వెనుకాడదు శూర్పణఖ. దేహాసక్తి శూర్పణఖ. దేహాభిమానం రావణుడు.

శూర్పణఖ, సీతను తినేందుకు ఆమె పై లంఘిస్తుంది. ఇక్కడ నేను, నాది అన్న స్వార్థ భావనలు ప్రకోపించినప్పుడు పోటీ, ఈర్ష,అసూయ కూడ విజృంభిస్తాయి. అప్పుడు మనిషిలోని పవిత్రత, శుచిత (సీత)లను కూడా అవి మింగివేసేందుకే ప్రయత్నిస్తాయి.

@@@@@

అంతా చదివి, శార్వరి ఆశ్చర్యానికి అంతే లేదు.

“నాన్ ఋషి: కురుతే కావ్యం అన్నారుగా పెద్దలు ఏనాడో. వాల్మీకి మహర్షి యీ కావ్యాన్ని సృష్టించినప్పటి నుంచీ ప్రపంచంలో మూడవ వంతుకు యీ రామాయణ వ్యాప్తి జరిగిందంటే సామాన్యమైన విషయం కాదు. సముద్రమంత ఈ కావ్య సౌందర్యంలో ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి అవగాహన చేసుకుంటారో అంతవరకూ కూడా వారు లాభపడతారు.

కథ, కథా సంయోజనం, పాత్రల విశ్లేషణ, సంభాషణలు, మరీ ముఖ్యంగా ఎవరెవరి వాదాన్ని బట్టి వారి వారి పద్ధతుల్లో సమాధానాలు కూడా చొప్పించబడటంలోనే ఉంది అసలు రహస్యమంతా!

పాత్రల పేర్లకు కూడా ఓ రకమైన సాంకేతికత. భిన్న భిన్న వ్యక్తిత్వాలు. ఇవన్నీ వాల్మీకి పటిష్టంగా ఆలోచించి వ్రాశారు కాబట్టే సార్వకాలిక, సార్వజనీనమైన విలువలతో అలరారుతున్నదీ కావ్యం”

అని అనుకుంటూ, వంశీకి కూడా యీ విషయం చెప్పేందుకు లోపలికి వెళ్ళింది.

సరిగ్గా అప్పుడే ఇంటి తలుపు పై టక టక కొట్టిన శబ్దం.

(ఇంకా ఉంది…)

 

Your views are valuable to us!