ఎవరో అనుకుంటూ, తలుపు తీస్తే, పక్కింటి పద్మావతమ్మ గారు. రండి..రండి..అంటూ ఆహ్వానించింది శార్వరి.
“ఆ(..ఏం లేదమ్మా, శార్వరీ! వచ్చిన సంగతి చెప్పి వెళ్ళిపోతా. మా బంధువులావిడ వాల్మీకి రామాయణం పూర్తిగా పారాయణ చేసుకుందట…సాయంత్రం నల్లకుంట రామాలయంలో పదిమంది ముత్తైదువులకు తాంబూలం అదీ ఇవ్వాలనుకుందిట. నీకు వీలౌతుందా? సాయంత్రం రామాలయానికి రాగలవా? ఆ రామాలయం తనకి చాలా అచ్చొచ్చిన ఆలయమట…అక్కడే ఇవ్వాలనుకుంది. మనవాళ్ళైతే బాగుంటుందని తన ఉద్దేశం. ఐదున్నర అలా వెళ్తే సరిపోతుంది. నేనూ వెళ్తున్నాను. నీవూ రాగలవా?” అడిగిందావిడ.
“అయ్యో, అంతకంటేనా! తప్పకుండ వస్తానండీ. ఉండండి..కాస్త కాఫీ..”
“వద్దమ్మా..వెళ్ళాలి. ఏంలేదు..కరోనా అని అందరూ భయపెట్టేస్తున్నారు కదా! తీరా ఎవరూ రాకపోతే ఎలా అని మనకు తెలిసిన వాళ్ళకే చెప్పాను. తప్పకుండా వచ్చేవాళ్ళకన్న మాట! ఎక్కువసేపేమీ ఉండఖ్ఖర్లేదు కూడా! సరే మరి…వెళ్ళిరానా!’ అంటూనే వెళ్ళిపోయారు పద్మావతమ్మగారు.
సాయంత్రం గుడిలో…
శార్వరికి చీరా, రవికే, పళ్ళతో తాంబూలం ఇచ్చిన కనకమ్మగారిని చూస్తుంటే అచ్చం ఆ సీతమ్మవారినే చూస్తున్నట్టే అనిపించింది.
ఎంత సౌమ్యత, ఎంత ఆప్యాయత! ఎంత నెమ్మదితనం ఆమె మాటల్లో!
వాల్మీకి శ్రీమద్రామాయణం ఇప్పటికి యాభై సార్లు పారాయణం చేసిందట ఆ పుణ్యశాలి!
నిండైన చీరె కట్టు, ముక్కున మెరుస్తున్న వజ్రం ముక్కుపుడక, చేతులకు రెండ్రెండు బంగారు గాజులు, మెడలో మంగళసూత్రంతో పాటూ, మరో బంగారు దండ…ద్దగా నగలపైన వ్యామోహం వున్నట్టే లేదు!
ఆవిడను చూడగానే పాదాభివందనం చేయాలనిపించే విగ్రహం.
“అమ్మా..సాక్షాత్తూ ఆ సీతమ్మవారినే చూస్తున్నట్టుందమ్మా..మిమ్ములను చూస్తుంటే! మిమ్మల్నో మాట అడగవచ్చా?” అంది శార్వరి.
“తల్లీ, నేనేదో రామాయణం పారాయణం చేసినంత మాత్రాన ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పగలననుకోవద్దు. కానీ చిన్న చిన్న విషయాలంటే నా అనుభవం మీద చెప్పగలనంతే!” అన్నారావిడ నిండుగా నవ్వుతూ.
“నేనూ అంతేనండీ! రామాయణంలో మంచీ, చెడూ పాత్రలన్నీ ఉన్నాయి కదా! కేవలం మంచిని హైలైట్ చేసేందుకే చెడు పాత్రలను నిర్మించారా, స్వభావ రీత్యా కూడా అవి అటువంటివేనంటారా?”
ఇంకా మధ్యప్రదేశ్ లోని విదిషా ప్రాంతంలో రావణ్ అన్న గ్రామం ఇప్పటికీ అదే పేరుతో ఉంది. అక్కడ ఇప్పుడు కూడా రావణున్ని పూజిస్తారు తెలుసా? ఇంకోసంగతి – రావణుని చెల్లెలు శూర్పణఖ అసలు సీతా హరణానికి కారణమంటారు కదా?
శ్రీలంకలో గంగాసుదర్శని పేరుతో శూర్పణఖ వారసురాలొకావిడ ఉందట! నేనూ పేపర్ లో చదివానులే! భవిష్యవాణి బాగా చెబుతుందట. సునామీ గురించి, చాలా ముందుగానే హెచ్చరించిందట యీవిడ. ఇండోనీషియా ప్లేన్ క్రాష్ గురించి కూడా చెప్పిందట. ఆమెకు ముక్కు, చెవులపై గాట్లున్నాయట కూడా!
నాకూ ఇవన్నీ తెలిసి ఆశ్చర్యమైంది. కానీ, అనిపించిందొక్కటే. పుట్టుకతో ఎవరూ చెడ్డవాళ్ళు కారు. కొన్ని సందర్భాల్లో వారి చర్యల వల్ల అనుకోకుండా, అరిష్టాలు జరిగిపోతుంటాయి అని. ఇంకో సంగతి! రావణున్ని యక్షునిగా కూడ పరిగణిస్తారు కొందరు.
సాక్షాత్తూ రామచంద్రుడే రావణున్ని, ‘మహా బ్రహ్మన్’ అని సంబోధిస్తాడు. అంటే రాములవారు కూడ అతని గొప్పతనాన్ని గౌరవించినట్టే కదా! అందుకని, పాత్రలే ఐనా, వ్యక్తులే ఐనా వారివల్ల నష్టం ఎంతవరకు జరిగింది అన్న కోణంలో అలోచించి మాత్రమే మంచీ చెడు అని విశ్లేషించుకోవచ్చు.
చెడు పాత్రలనే నిర్ణయించుకున్నప్పుడు వారిని మనదైన పద్ధతిలో విశ్లేషించుకుంటూ, మన పెద్దలు చెప్పిన ‘శివేత రక్షతయే’ అంటే శుభం కాని ఇతరముల నుంచీ సమజాన్ని రక్షించే విధంగా కావ్యాలను, ఇతిహాసాలను పరిగణించాలి. అంతే కానీ, నేటి వాదాలకు అనుగుణంగా అంటే స్త్రీ వాదాలనీ, దళిత వాదాలనీ వాటికి ఆపాదిస్తూ బేరీజు వేయటం తగదని నా అభిప్రాయం. నీవెందుకు అడిగావో, నా మనసులోనుండీ యీ మాతలెందుకిలా వచ్చాయో…అదిగో గుడిలో ఉన్న ఆ సీతారామచంద్రులకే ఎరుక తల్లీ!”
శార్వరి కళ్ళల్లో నీళ్ళు పెల్లుబికాయి.
సాక్షత్తూ ఆ సీతమ్మే కనకమ్మగారి చేత యీ మాటలు పలికించిందనిపించింది.
శూర్పణఖను యీవిడ చెప్పిన దిశగా విశ్లేషిస్తే బాగుంటుందని, ఆ రాములవారే ఆదేశించినట్టనిపించి.
మరోసారి, ఆమెకు పాదాభివందనం చేసి సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళబోతుంటే – “అమ్మా శార్వరీ, ఓ రెండు నిముషాలు ఆగుతావా?” అని అడిగారు కనకమ్మ గారు.
గడియారం చూసి – “ఫరవాలేదండీ..ఆగుతాను” అన్నది శార్వరి.
కనకమ్మ గారు తమ డ్రైవర్ ని పిలిచి, ఏదో చెప్పారు.
అతగాడు తుర్రున బైటికి వెళ్ళిపోయాడు.
శార్వరి గుడి ప్రశాంత వాతావరణాన్నీ, అక్కడి రావి, వేప మొక్కల దగ్గర ఏర్పాటు చేసిన వేదిక మీద ముగ్గులూ, ఆంజనేయ స్వామి విగ్రహమూ, కొంతమందే ఐనా మనసులో స్తోత్రాలు చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యం, రాముల వారి ముచ్చటైన మూల విరాట్ మూర్తులను చూసుకుంటూ “శ్రీరామ రామ రామేతి” శ్లోకం మనసులొనే మననం చేసుకుంటున్నంతలోనే కనకమ్మ గారి డ్రైవర్ వారి కారులోనుండీ ఏదో పుస్తకం తెచ్చి ఇచ్చాడు.
ఆమె పుస్తకం మొదటి పేజీలో ఏదో వ్రాసి, శార్వరిని పిలిచి చేతికిస్తూ అన్నారు – “చాలా సంవత్సరాల క్రితం, మా వారు నారాయణాచార్యుల వారి పర్యవేక్షణలో నేనీ గ్రంధం వ్రాశాను తల్లీ! నీకోసమే కాబోలు మా దగ్గర రెండు మూడు కాపీలింకా ఉన్నట్టున్నాయి. నీవేదో ప్రయత్నం చేస్తున్నావు కదా! అది విని ఎంత ఆనందించానో! దీనిలో రామాయణ స్త్రీ పాత్రల గురించిన కొన్ని విశేషాలున్నాయి. నీకు ఉపయోగపడతాయేమో చూడు. విజయోస్తు తల్లీ.”
ఆర్ద్రమైన మనసుతో అందుకుంది శార్వరి.
ఆ పుస్తకం పేరు ‘రామాయణ రమణులు’
“ఆహా! ఎంతటి భాగ్యం తనది” అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిన వెంటనే దీన్ని చదివి తీరాలని నిర్ణయించేసుకుంది కూడా.
ఇంటికి వెళ్ళిన వెంటనే గుడిలో కనకమ్మ గారి ద్వారా విన్న విషయాలను పూస గుచ్చినట్టు వంశీకి వివరించింది శార్వరి.
పనిలో పనిగా ఆమె వ్రాసిన గ్రంధం కూడా చూపించింది వంశీకి.
తను కూడా ఆశ్చర్యపోయాడు.
“చూశావా, నేనంటూనే ఉన్నా కదా, కాగల కార్యం గంధర్వులే చేస్తారని! నీకు మరింత మంచి సోర్స్ కూడ దొరికింది. కనకమ్మగారు నీపాలిటికి నిజంగా కనకమ్మగారే, హనీ!” అన్నాడు నవ్వుతూ.
“వంశీ! నిజంగా నీకు థాంక్స్ చెప్పాలి. అభిప్రాయ భేదాలున్నా నన్నీ విషయంలో తప్పు పట్టక ప్రోత్సహిస్తున్నందుకు” శార్వరి కళ్ళల్లో నీళ్ళు.
వంశీ చలించిపోయాడు.
కాస్త సీరియస్సైనట్టుందనిపించింది వాతావరణం!
“కూల్..కూల్ హనీ..నేను ప్రోత్సహించటానికి మరో మతలబుందమ్మాయ్!” అన్నాడు గట్టిగా నవ్వుతూ .
శార్వరి కళ్ళల్లో ప్రశ్నార్థకం.
“ఊహించు…” ఊరిస్తూ అన్నాడు వంశీ.
“అబ్బా…నేనెళ్ళి ఆ పుస్తకం మొదలెట్టాలి. నువ్వే త్వరగా చెప్పు.” అంది శార్వరి.
“అదే…ఆ సీతమ్మవారి దయ వల్ల నాకు కూడా రాములవారిలాంటి బాబో, చుప్ప….ఓ మై గాడ్…కాదు కాదు..సీతమ్మలాంటి పాపో పుట్టకపోతారా అని ఆశ!”
సిగ్గుల మొగ్గే అయింది శార్వరి.
మరుసటి రోజు…
’రామాయణ రమణులు’ పుస్తకం తీసుకుంది చేతుల్లోకి శార్వరి.
“శ్రీరామ రామ రామేతి..రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే
ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు…కనకమ్మ”
అని ముత్యాల కోవ వంటి అక్షర పంక్తులతో ఆశీర్వదించారు కనకమ్మగారు మొదటి పేజీలో.
అప్రయత్నంగానే కళ్ళకద్దుకుని మొదటి పుట తిప్పింది.
ఎటువంటి పీఠికా లేదు. కేవలం రెండే మాటలు – “పరమ తారక నామ రామ చంద్రుని పాదారవిందాలకు అంకితం”
తరువాత “ఈ గ్రంధ రచనలో దిశానిర్దేశం చేసిన నా పతిదేవులకు సేవింపులు” అని మరో పుట.
కనకమ్మ గారి పట్ల గౌరవం పెరిగిపోయింది శార్వరిలో.
అనుక్రమణికలో సీత, కౌసల్య, అనసూయ వంటి పాత్రలందరి తరువాత శూర్పణఖ అని చూడగానే ఇక ఏమీ ఆలోచించకుండా ముందా విశ్లేషణ చదివేసింది. చాలా కొత్త విషయాలున్నాయందులో!
తన దగ్గరున్న ఫైల్ లో తాను వ్రాసి పెట్టుకున్న విషయాలను కూడా క్రోడీకరించుకుని రచన మొదలెట్టాలి. యే కోణం నుంచీ మొదలుపెడితే ఆ పాత్రకు కాస్తైనా న్యాయం చేసినట్టౌతుందో అర్థం కావటం లేదు. అలాగని వాల్మీకాదులేదో తప్పు చేశారని కాదు కానీ, వాల్మీకి అనంతర రామ సంబంధ వృత్తాంతాలలోని విషయాల నేపథ్యం లో శూర్పణఖను విశ్లేషించటం తన పద్ధతిగా నిర్ణయించుకుంది కనుక ఒక ప్రయోగం చేయటంలో తప్పు లేదనిపించింది. పైగా అలాంటి ప్రయోగాలు చేసిన వారి ఆలోచనలను కూడా ప్రస్తుత సమాజం ఒక రకంగా ఆహ్వానించి, ఆ పద్ధతిలో ఆలోచించిన ఋజువులు కొన్ని తనకు దొరికాయి కూడా.
అలా ఆలోచిస్తుంటే, హఠాత్తుగా తన కళ్ళముందొక మార్గం విస్పష్టంగా కనిపించింది. అలా ఆ ఆలోచనా మార్గంలో వెళ్తున్న కొద్దీ, ఆ మార్గాన వెళ్ళేందుకు తగిన సంవిధాన పద్ధతులు కూడా అవంతకవే అవగతం కావటం మొదలైంది.
ఇంకేముంది! శార్వరి లేఖిని రచనాలోక విహారం, బంగారు దారుల్లో రసరమ్యంగా మొదలైపోయింది.
(ఇంకా ఉంది…)