చుప్పనాతి – భాగం 7

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4]

 

‘అవును..నిజమే..తాను ఒకప్పటి గంధర్వ కన్యే!

లేకపోతే, తనకిన్ని విద్యలు ఎలా వస్తాయి?

ఈ జన్మలోనైతే విశ్వవసు బ్రహ్మ , కైకసిల పుత్రిక తాను. రావణ బ్రహ్మ, కుంభకర్ణుడు, విభీషణుని తరువాతి సంతానం. ఖర దూషణులు తన తరువాతి వారు.

ఇచ్చ వచ్చినప్పుడు కామ రూపాలు ధరించటంతోపాటూ, ఇంకా, దేశ భాషా జ్ఞానం, వ్రాసే పద్ధతుల జ్ఞానము, రత్న పరీక్ష, వృక్షాలగురించిన జ్ఞానము, ఆకర్షణము, మోహనము, వేటాడటంలో నేర్పు, రతి శాస్త్రము, స్వర వంచన – ఇలా ఎన్నెన్నో విద్యలూ వచ్చేశాయి తనకు.

దాదాపు ఇవన్నీ గంధర్వుల విద్యలేనని అమ్మమ్మ తాటకి అంటూ, తనని గారాము చేసేది. మారీచ సుబాహులు మామయ్యలు కదా! మారీచ మామయ్య కూడ ఇలా స్వర వంచన విద్యలో ఆరితేరిన వాడే కదా!

కానీ అందమైన తన పేరు మీనాక్షిని శూర్పణఖ అని ఎవరు, ఎందుకు మార్చేశారో, ఇప్పటికీ అర్థం కాని విషయమే.

చేపల వంటి కళ్ళతో, చెంగుచెంగున ఎగిరే తనకు గోళ్ళు మాత్రం ఎందుకలా చాటల్లా ఉండేవో!

కళ్ళ అందాన్ని వదిలేసి, మామూలు కన్నా పెద్దగా వికారంగా అనిపించే గోళ్ళకే ప్రాముఖ్యతనిస్తూ, తనని ఏడిపించటానికి, శూర్పణఖ ..శూర్పణఖ..అని చిన్నప్పటినుంచే, ఆ పదానికర్థం తెలియని నాటినుంచే ముద్దుగా పిలిచి పిలిచీ, చివరికి, అచ్చతెనుగు లో శూర్పను చుప్పగానూ, నఖను నాతి గానూ చేసి, చుప్పనాతిగానే పిలవటం మొదలెట్టేశారు పుట్టింట్లో. తెలిసీ తెలియని వయసులో ముద్దు ముద్దుగా పిలిచే పేరే, అసలైన పేరైపోతుందని తనకానాడే తెలియదే!! ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ పేరునుండి తాను తప్పించుకోలేక పోయింది.” ఉసూరుమంది మీనాక్షి మనసు.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 పేరు సంగతటుంచి, తన విద్యలన్నీ ప్రదర్శిస్తూ సమవయస్కుల్లో తానో విలక్షణ శక్తి సంపన్నురాలినని విర్రవీగుతున్న సమయంలొనే విద్యుజ్జిహ్వునితో పరిచయమేర్పడింది. తనకు వచ్చిన యీ విద్యలన్నిటినీ ప్రదర్శిస్తూ, పెళ్ళికిముందు విద్యుజ్జిహ్వుని, తానెంతగా సంతోషపెట్టేదో!

అడవుల్లో వున్న రకరకాల వృక్షాల గురించిన వివరాలు అలవోకగా చెబుతుంటే, తన ప్రియుని కన్నుల్లో ఎంత ఆరాధనో! రకరకాల రీతుల్లో శృంగార కేళిలో మెప్పిస్తుంటే, ఎంత ముచ్చటో! పక్షుల మాటలను తమ భాషలో విడమరచి చెబుతుంటే, ఎంత గౌరవమో!

తనపట్ల అతనికున్న యీ ఆరాధనను చూసే కదా తాను అతన్ని అంతగా ప్రేమించింది?

అప్పటికే పెద్దన్నయ్య రావణుడు ఇటు భూలోకాన్నే కాదు అటు దేవతాలోకాన్నీ గడగడలాడించే దానవేంద్రునిగా పేరు ప్రఖ్యాతులు తన సొంతం చేసుకున్నాడు.

తమకు ఓ రకంగా శత్రు వర్గానికి చెందిన కాలకేయ కుటుంబానికి చెందిన విద్యుజ్జిహ్వునితో తన వివాహానికి ఒప్పుకోలేదు తన అన్న రావణుడు. తానూ వెనక్కి వెళ్ళేందుకు ససేమిరా అంది. వదిన మండోదరి చొరవతో ఎలాగో పెళ్ళైతే అయింది. కానీ ఆ అచ్చటా ముచ్చటా తీరక ముందే, అన్న రావణాసురుణి చేతిలో ప్రమాదవశాత్తూ, తన భర్త విద్యుజ్జిహ్వుడు మరణించాడు.

తనకు కోపం కట్టలు తెంచుకుంది.

“నీకు మొదటినుంచే నా పెళ్ళి ఇష్టం లేదు కాబట్టే ఇలా పథకం ప్రకారం నా భర్తను మట్టుపెట్టావ్. నా సంసార జీవితాన్ని ఛిద్రం చేశావు. నా ప్రేమను దూరం చేశావు. నాదన్నది నాకు కాకుండా చేశావు. కాబట్టి నీకూ, నీక్కావాలనుకున్నది దొరకదంతే” అని శాపనార్థాలు పెట్టింది.

రావణుడు ఎటూ చెప్పలేక – “ఇదిగో! నిజమే నావల్ల పొరపాటే జరిగింది. ఖర దూషణులుండే చోట నీకిష్టమొచ్చిన రీతిలో స్వేచ్ఛగా బ్రదుక”మని పంపించేశాడు.

స్వేచ్ఛగా అంటే – అన్ని రీతులా అని తన అర్థం.

*****

అది పుష్య మాసం.

గోదావరీ తీరం.

సాల, తాల, తమాల పనస, మామిడి, పున్నాగ వృక్షాలపై వివిధ పక్షుల కలకూజితాలతో రమణీయంగా వున్నదా ప్రదేశం.

అప్పుడప్పుడూ అక్కడున్న చందన, కింశుక, పాటల వృక్షాలనుండి వీచే మలయ సమీరాలు హాయినిస్తున్నాయి.

ఆ సుందర ప్రకృతిని వీక్షిస్తూ, పులకిస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తున్న వేళ అక్కడో నవ్వు వినిపించింది తనకు.

ఎంత తీయని నవ్వది!

వేయి వేణువుల మధుర నాదంలా వినిపించింది. కోటి వీణల మంజుల గానంలా వినిపించింది. అమర గానఝరిలా మైమరపింపజేసింది.

“నీవెప్పుడైనా ఇలా నవ్వగలిగావా?” అని తనను ప్రశ్నిస్తున్నట్టే ఉందా మృదుమంజుల హాసం.

ఎవరిదీ నవ్వు?

ఎంత ఉత్కంఠ తనలో!

మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ, ఆ వృక్షాల మధ్యనుండీ అడుగుల చప్పుడు కూడా రానివ్వకుండా ముందుకు కదులుతున్నది. కానీ తనకు కనబడటమే లేదు! తానెటూ కామరూపి కనుక ఒక చిలుక రూపం ధరించి, ఎగిరి పైనున్న కొమ్మలపై కూర్చుని, నలువైపులా దృష్టి సారించింది.

అప్పుడు కంటపడిందీ భూపుత్రి.

అదిగదిగో…అక్కడున్నదో పర్ణకుటీరం! పొందికగా, అందంగా ఏర్పాటు చేసిన ఆ పర్ణకుటీరం ముందు ఒక చోట కూర్చుని ఉన్నదా మనోజ్ఞ స్త్రీ మూర్తి!

ఆమెకు కాస్త దగ్గరగా, అక్కడే అటూ ఇటూ తిరుగుతూ, అక్కడున్న గడ్దిని నాజూకుగా మేస్తున్న జింక జంటలను ఎలాగైనా పట్టుకోవాలని అమె చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఆమె మంజుల హాసాలు. అవి ఆమె దగ్గరగా వచ్చినట్టే వచ్చి, చిక్కకుండా దూరం వెళ్ళిపోతున్నాయి. అలా దూరమైనప్పుడల్లా ఆమె కాస్త నిరాశ చెందినట్టు ఆగి మళ్ళీ అలాగే వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది.

ఆమె సాత్విక సౌందర్యమూ, లేలేత దరహాసమూ మనోహరాలే కాక పవిత్రతకూ నిలయాలుగా తోస్తున్నాయి.

తన రాజ్యమైన యీ ప్రాంతంలో ఎక్కడినుంచీ వచ్చిందీమె? ఎవరైనా తోడున్నారా? ఉంటే ఎవరు వాళ్ళు? – ఈ ప్రశ్నలన్నీ వెంట వెంటనే ఉదయించి, ఆమె అచూకీనెలాగైనా పట్టి తీరాలన్న పట్టుదలను తనలో పెంచాయి.

అప్పటినుంచీ ఓసారి పక్షిగానో, మరోసారి ఏ ఉడతగానో, ఇంకోసారి ఓ పువ్వుగానో మారి ఆమెనూ, ఆమె ప్రాణేశ్వరుడినీ, ఆమె మరిదినీ దూరం నుంచే గమనించేది.

అలా గమనిస్తున్న ప్రతిసారీ, తన కళ్ళముందు ప్రశ్నార్థకాన్ని నిలుపుతూనే ఉందా కల.

ఆ దంపతులే మహావిష్ణువూ, శ్రీమహాలక్ష్మి ఐనట్టూ, మరిదిగా తన అన్నావదినలకు రెప్పవేయక రాత్రీ పగలూ సేవ చేస్తున్న లక్ష్మణుడే ఆ ఆదిశేషువైనట్టూ…అబ్బ..యీ కల తననెందుకిలా వేధిస్తున్నదో అర్థమే కాదు మీనాక్షికి.

ఐనా సరే…ఆ కలను ఆవలకు నెట్టి, ఆ అపురూప దంపతుల జీవనశైలిని గమనిస్తూ ఆ కల నిజమౌతున్నట్టు అనుభూతి చెందేది తాను.

అదేమిటో వారిద్దరినీ చూడకుండా ఎక్కువ రోజులుండలేక పోయేది కూడా! జన్మ జన్మల బంధమేదో వారిరువురితో ఉన్నట్టే వారిరువురిని చూస్తుంటే, ఆమె అంతరంగంలో ఒక రకమైన తృప్తి నిండుకునేది!

అలా కామరూపిగా వారిని వెన్నంటిన కొన్ని సందర్భాల్లో వారి ముచ్చట్లలో ఒకరికొకరు తమ జన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పుకునేవారు. అటువంటి సంభాషణల్లోనే తెలిసింది ఆ ముగ్గురి నామధేయాలూ.

ఆ అన్నదమ్ముల మధ్య ఎంతటి అనురాగం! అప్పుడప్పుడు, అన్నదమ్ములిద్దరి సంభాషణల్లో మరో సోదరుడు భరతుని పట్ల ప్రేమాదరాలు కూడా తెలిసివచ్చేవి. అసలు, కుటుంబమంటే, వీరి కుటుంబం వలెనే ఉండాలనిపించేంత ఆత్మీయతలు.

పెళ్ళైన కొన్ని సంవత్సరాలు దశరధ మహారాజు ఇంట, సకల సుఖాలూ అనుభవించిందట యీ జంట. దానికి తోడు యీ జంట అపురూప దాంపత్యానికి వన్నెలద్దిన సంఘటనలెన్నెన్నో!

అటువంటి సంఘటనలను ఇరువురూ అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ, యీ విపిన వనినీ ఒక జీవన రసధునిగా మలచుకోవటం చూస్తూ, ఎంత ముచ్చట పడిపోయేదో తాను!

(ఇంకా ఉంది…)

 

Your views are valuable to us!