శ్రీః
నా మాట
మొదటగా ’నా మాట’ అని ఇక్కడ రాసుకొన్నందుకు క్షమాపణలు.
ఎందుకంటే, అత్యంత నిబద్ధతతో, నియమ నిష్ఠలతో, అనేక సంవత్సరాలు శ్రమించి, ఎన్నో పుస్తకాల నుండి ఎన్నో విషయాలను సేకరించడమే కాక ఇతరుల అనుభవాలను, స్వానుభవాన్నీ క్రోడీకరించి రాసిన దేవుడి నరసింహశాస్త్రి గారి రచనలో ’నా మాట’గా చెప్పుకోవడానికి ఏముంటుంది? “ఆయన పక్కన నిలుచుకోవాలన్న ఉద్దేశం కాకపోతే!” అని నాకే అనిపించింది.
ఇది తప్పే !
ఈ పుస్తకాన్ని అనువాదం చేయడానికి నాకున్న అర్హత ఏమిటి? అని తరచి ఆలోచించిన తరువాత ఆయనే తన ముందుమాటలో చెప్పినట్లు – విశ్వామిత్రుడి సిద్ధులు పొందిన, పొందగలవారు ఎందరో ఉన్నారు. ఆ సిద్ధులు లేకున్నా, రాకున్నా ఆ దారిన తప్పటడుగులు వేసే భాగ్యం నాకు కలిగింది. వారు వివరించిన విషయాలను ప్రత్యక్షంగా కాకపోయినా, అనుమాన ప్రమాణము చేత అర్థం చేసుకోగల శక్తి గురుకృప, దైవకృప వలన నాకు కలిగింది. దైవోపాసన వలన ఆయన చెప్పిన మాటల లోని సరియైన అర్థాన్ని గ్రహించగల శక్తి కలిగినది.
ఉపాసకులకు అంతర్ముఖంగా వచ్చే మార్పులు, అవి ఏ విధంగా అనుభవానికి వస్తాయన్నవి కొంతవరకూ అర్థమయింది. ఇందులోని వేదాంత విషయాలు అర్థం కాకుంటే అనువాదం చేయడానికి అది అనర్హతే అవుతుంది.
అర్థం తెలియని అనువాదముంటుందా?
రెండవది – ఇది కేవలం అనువాదమని చెప్పడానికి లేదు. దేవుడు గారి కథా, కథనాల్లో ఎక్కడా మార్పులుగానీ, తగ్గించడంగానీ చేయలేదు. కానీ అక్కడక్కడా, అవసరమనిపించిన చోట నేను నా అనుభవానికి వచ్చినవి, అర్థమయిన వాటిల్ని అదనంగా చేర్చి వ్రాసాను. ఆ వ్రాయడంలో వీలయినంత వరకూ దేవుడు గారి మనస్సులోకి తొంగి చూచి, “ఈ మాట వారైతే యెలా రాసేవారు” అని యోచించి, వారి శైలిలోనే రాయడం జరిగింది. సంభాషణలు, సన్నివేశాలు మూలరచనకు భంగం కానీ, విపరీతార్థాలు గానీ రాకుండు ఉండేట్లు జాగ్రత వహించి వ్రాయడం జరిగింది.
వీటన్నిటికీ మించి ’మహా బ్రాహ్మణ’ను మొదటిసారి చదివినపుడు ఏదో అంతఃశ్శక్తి నన్ను తట్టి లేపినట్లు, ఇది తప్పక అనువాదం కావలసిన పుస్తకమని నాకు తోచింది. అది చదివిన తరువాత నాకు వచ్చిన ప్రేరణ అంతా ఇంతా కాదు.
’మహా బ్రాహ్మణ ’ పేరును ’ మహా బ్రాహ్మణుడు ’ గా మార్చి ఉండవచ్చు. కానీ, నేటి కాల పరిస్థితులను బట్టి మరియు పేరేదైనను ఇది వశిష్ఠ విశ్వామిత్రుల కథ. కథ చదువుతుండగా పాఠకులకు వారిలో ఎవరు గొప్ప అన్నది ఒకరు చెప్పకుండానే విశదమవుతుంది.
దేవుడుగారు చివరికి గాయత్రి మంత్రము , సంధ్యా వందనము మొదలైన విషయాలపై తమ దృష్ఠిని కేంద్రీకరించినందున దానికి పరోక్షంగా వశిష్ఠుని పాత్ర ఉన్నా కూడా గాయత్రీ మంత్రాన్ని దర్శించినది విశ్వామిత్రుడే గనక ఆయనకు అన్వయించేట్లు “మంత్రద్రష్ట” అని పేరు పెట్టాను. ఇది అనువాదకుని అందుబాటులో ఉండే స్వేచ్ఛకు లోబడే ఉందని నా నమ్మకం.
ఈ అనువాదాన్ని చదివిన, చదవబోతున్న పాఠకులందరికీ నా ధన్యవాదాలు.
’విభాతమిత్ర’
మంత్రద్రష్ట – ఒకటవ తరంగం తరువాతి పుటలో
తప్పక చదువుతాను. ఐనా ఒకమాట చెప్పండి. విభాతవీచికలు అనే బ్లాగులో లోగడ ధారావాహికగా.వచ్చిన పుస్తకమే కదా ? మీఅవగాహనను కూడా జోడించి.అందిస్తున్నారు. అంతేనా?
ధన్యోస్మి….