మంత్రద్రష్ట – రెండవ తరంగం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]

మొదటి భాగం ఇక్కడ చదవవచ్చు: మంత్రద్రష్ట – ఒకటవ తరంగం

 

బ్రహ్మర్షి ఆశ్రమంలో ఆ మహానుభావుని చేత సన్మానించబడి కౌశిక మహారాజు ఘన సంతోషం, ఆశ్చర్యం, సంభ్రమం నిండిపోగా తన శిబిరంలో కూర్చున్నాడు.

తాను పొందిన సత్కారం తన ఊహ కందనంత గొప్పగా ఉంది. అటువంటి సత్కారం చేయడం తనవంటి మహారాజుకైనా సాధ్యమా? అన్నట్లుంది. రాజు మొదలుకొని సేవకుని వరకు, ఏనుగు మొదలు ఎలుక వరకూ అందరికీ, అన్నిటికీ సత్కారం లభించింది. నిజంగా ఇది సత్కారం కన్నా సమారాధన అనడం సరైంది.

కౌశికుడు ఈ విధమైన ఆలోచనలో పడ్డాడు – “ఇతడు కులపతి అనేది నిజం. అయినా, ధర్మ పరాయణుడైన ఇతని వద్ద ఒక సంవత్సర కాలానికి సరిపడినన్ని సంభారాలు, దినుసులు, సరకులు ఉండవచ్చును. ఈ ఒక్కదినపు సత్కారాలకు ఖర్చైన ద్రవ్య సంభారాలను చూడగా అవి యీ ఆశ్రమానికి కనీసం అయిదు సంవత్సరాలకు సరిపోయేలాగున్నాయి! నేను సపరివార సమేతంగా వచ్చి ఇతనికి అదేమి అసౌకర్యం కలిగించానో? నావల్ల ఇబ్బంది కలిగిందో ఏమో? ఈ వస్తు సామగ్రి అంతా ఇప్పటికిప్పుడు ఎలా వచ్చేలా చేసాడోఈ ఘటికుడు! లేక ఈ బ్రహ్మర్షి దేవలోకం నుండీ ఏమైనా తెప్పించుకొన్నాడా? ఇతనికి శిష్యులైన రాజులు చాలా మందే ఉన్నారు. ఇతని కోసం తమ సర్వస్వాన్నీ అర్పించేవారు అనేకులున్నారు. అయినా ఇంత వేగంగా ఇన్ని సంభారాలను సంపాదిండం ఎలా సాధ్యమయింది?”

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

 

“ఇదంతా ఏదయినా మాయా సృష్టి కావచ్చు! నేను చూచినదంతా ఒక స్వప్నం కావచ్చు..” అని కూడా అనిపిస్తున్నది. తాను నిలచిన ఈ పర్ణకుటీరం నిజంగా రాజయోగ్యమైనది. తాను సేవించిన అమృతాన్నం ఇంకా కడుపులోబరువుగా ఉంది. మరి ఇది కల ఎలా అవుతుంది?

కౌశికుడు పంపిన దూత విశేష సమాచారంతో వచ్చాడని పరిచారకుడు వచ్చి తెలిపాడు. దూతని రమ్మని సైగ చేసాడు. ఆ వచ్చిన దూత ఇలా చెప్పాడు – “మహారాజా! ఆశ్రమంలో ’ నందిని ’ ధేనువు ఉంది. అది కామధేనువు ’ సురభి’ కూతురు. ఆ ఆవుకు తన తల్లికున్నట్టే గొప్ప మహిమలున్నాయి. గురుదేవుల హోమధేనువు అదే. ఈ రోజు అతిథిపూజ అంతా దాని మహిమ వల్లనే నడచింది. ఇటువంటి సమారాధనలు అప్పుడప్పుడు యీ ఆశ్రమంలో నడవడం మామూలేనట! కానీ ఈసారి జరిగినంత వైభవంగా ముందెప్పుడూ జరగలేదుట!”

రాజు ఈ మాటలను ఒళ్ళంతా చెవులు చేసుకొని విన్నాడు.

“ఒక్క గోవు. ఆ గోవు ప్రభావం ఇంత గొప్పదా? ఆ గోవు కామధేనువు కూతురు. మహిమలున్న ఆమె వలన యింత అతిథిపూజ సాధ్యమయింది! ఇదా వశిష్ఠుని రహస్యం! ఎవరెన్ని కానుకలు తెచ్చి ఇచ్చినా వశిష్ఠుడు వాటిపై ఆశ పడక వద్దనడానికి ఇదా కారణం? మంచిది. సామ్రాట్టులకు కూడా సాధ్యం కాని కార్యాన్ని చేయగల సమర్థుడితడు. ఈ ధేనువును ఇక్కడ ఉంచుకొని ఈ మహర్షి చేయగలిగేదేముంది? ఇటువంటి రత్నం సామ్రాజ్య అధిపతుల దగ్గర ఉండవలసిందే కానీ దొరికిన దానితో పొట్ట పోసుకుని తృప్తిచెందేవారితో నిండిన ఈ ఆశ్రమంలోఉండడమేమిటి? కానీ అలాగని చెప్పి దీనిని నేను భయాన తీసుకోవడం బాగుండదు కదా! మరి నయాన దీనిని తీసుకొనడం ఎలా ?”

ఎడ తెగని కౌశుకుని ఆలోచనలు ఇలా ముందుకు ఉరికాయి…

“ధర్మ నిరతుడైన తపస్వి ఆశ్రమంలోనిదంతా దేవతల కోసమే. రాజుకు దేవతల సొమ్ముపై అధికారం ఉందా? మరి రాజ్యమంతా రాజుదే అన్న మాట ఉంది కదా! రాజ్యం లోనిదంతా రాజుదే అన్నప్పుడు ఆ రాజ్యంలోదే కొంత ఇవతలికి తీసి, ’ఇది దేవతల సొమ్ము’ అనడం ఏమైనా బాగుందా? రాజు తనకు తానుగా దానిని వద్దనుకుంటేనే కదా అది ఆశ్రమానికి చెందేది! మొదట వద్దన్నవాడు అవసరమైనపుడు కావాలనుకుంటే తప్పేమున్నది?”

ఇలా దారి మారిన కౌశుకుని మనస్సు మరింత దూకుడుగా పోసాగింది.

“ఈ ధేనువు ఎప్పటికీ రాజు దగ్గర ఉండవలసినదే. ఇది కానుకగా గానీ, డబ్బు ఇచ్చి గానీ లేదా బలవంతానైన గానీ రాజ భవనానికి తీసుకెళ్ళవలసిందే!”

అంతలోనే అతని అంతఃసాక్షి కల్పించుకుని – “ఈ ఆవు దేవతాలోకం నుండి వచ్చింది. దేవతల సొమ్మును లాక్కోవచ్చునా? అదీ వశిష్ఠుని వంటి బ్రహ్మర్షి అధీనంలో ఉన్నదానిని? ఇది ఎంతమాత్రమూ తగని పని అని ఇతరులు అంటారేమో! దేవతల సొమ్మును తీసుకుంటే నిప్పుని తీసుకొని ఒడిలో కట్టుకున్నట్లే కదా? జీర్ణమవడం అసాధ్యం. ఇది పథ్యమైనది కూడా కాదు…ఎంత మాత్రమూ వద్దు.”

అంతఃసాక్షిని ప్రశ్నిస్తూ కౌశికుని మనస్సు తన వాదన వినిపించింది.

“దీనిలో లాక్కొవడమంటూ ఏముంది? లోకమంతా దైవాధీనంలో ఉండేదే. ఈ భూలోకంలో దేవతలందరూ రాజులోనే ఉంటారు. రాజదండనం వల్లనే కదా అంతా సరిగ్గా నడిచేది! సమాజంలో పెద్ద చేప చిన్న చేపను మింగకుండా కాపాడే రాజుకు అందరూ ఋణగ్రస్తులే! బ్రాహ్మణుడైనా, బ్రహ్మజ్ఞుడైనా తన తపస్సులో ఒక భాగాన్ని రాజుకు కప్పంగా కట్టేవాడే కదా! కనుక ఆ శుల్కానికి బదులుగా యీ ధేనువును ఇస్తే తప్పేమి? అలా కాదన్న పక్షంలో తనకు ఇష్టం వచ్చింది మరేదైనా తీసుకొని యీ ధేనువును ఇవ్వాలిందే. అంతే కాదు, రాజు దైవాంశ సంభూతుడు కాబట్టి యీ దేవ ధేనువు రాజుకు చెందాలి. కానీ చూడగా చూడగా ఈ గోవును బలవంతంగా లాక్కుపోవల్సిందేనని అనిపిస్తోంది!”

“నిజం. రాజైనవాడు భౌతిక సుఖాన్నిచ్చే దేన్నీ వదల కూడదు. రాజు యొక్క లక్ష్యం సమృద్ధిని పొందడమే గానీ త్యాగం చేయడం కాదు. తనకున్న సర్వ సామర్థ్యాన్నీ ఉపయోగించి సమృద్ధిని గడించాలి. పారుతున్న నీటికి ఆనకట్ట కట్టి ఉపయోగించుకొన్నట్లే, పెరిగి నిలుచున్న అడవిని వంట చెరకుకో, సమిధలకో ఉపయోగించుకొన్నట్లే లోకంలో పనికి వచ్చే అన్ని వస్తువులను సమృద్ధి కోసం ఉపయోగించుకోవడమే రాజధర్మం. దొరికిన దానిని ఏవో కుంటిసాకులు చెప్పి వదలివేస్తే అది దుర్బలత్వమే అవుతుంది.”

“అవును ఇదే నిజం. సంగ్రహించ వలసిన వస్తువును సంగ్రహించ కుండా వదలితే లోకాన్ని పాలించడం ఎలాగ? కాబట్టి ఇదే నా కర్తవ్యం.”

రాజర్షికి తన సిద్ధాంతము సరైనదేనా అని ఇంకా అనుమానంగానే ఉంది. అయినా, రాజ సహజమైన పౌరుషంతో తన సిద్ధాంతమే సరైనదని తీర్మానించుకున్నాడు.

మనస్సు ఒక పని చేసి తీరాలన్న మొండిపట్టు పట్టినప్పుడు బుద్ధి మంచి-చెడుల విశ్లేషణ చేస్తుందా? వివేకంతో ఆలోచించే అవకాశం ఎక్కడుంది ? లేడికి లేచిందే పరుగు కదా!

రాజదూతకు ఆజ్ఞ అయినది – ” భగవానుల కెపుడు అనుకూలమో తెలుసుకొని రా!” అని.

రాజదూత వాయువేగంతో పరుగెత్తి వెళ్ళి సమాధానము తెచ్చాడు.

“గురు దేవుల అనుజ్ఞ అయింది. ఇప్పుడు సంధ్యాకాలంసమీపిస్తోంది. ఇది తమోగుణ వేళ. సంధ్య ముగిసిన తర్వాత అయితే మంచిది. కానీ ఈ క్షణమే రావలసిందిగా రాజు అభిప్రాయమైతే వారి ఆజ్ఞ నేను ఎప్పుడూ గౌరవిస్తాను.”

కౌశికుడు తల ఊపాడు – “ఔను! పాలించే రాజు లేకుంటే అందరూ పాలకులే అవుతారు. ఇప్పుడా స్థితి లేదు. నేను రాజును. అందరూ రాజుకు తల వంచవలసిన వారే. అన్ని తేజస్సులూ రాజతేజస్సు ముందు ఒక ఘడియ సేపైనా కళ తప్పవలసిందే. తమోగుణ సమయం అన్నారు కదా! అది మమ్మల్ని ఏం చేయగలదో చూద్దాం! ఆయనేమో బ్రహ్మర్షిగా, తపస్వులలో శ్రేష్ఠుడై, బ్రహ్మవిద్య తెలిసిన గుణాతీతుడైన బ్రాహ్మణుడు. అంతటి వాడైనా రాజును తిరస్కరించే వాడు కాదు. ఇంతటి ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని గౌరవించినవాడు. ఇక మేమూ అన్నివిధాలా అతనిలో ఉన్న ఆశ్రమోచితమైన వినయాన్ని వదలక ఎప్పుడూ ఇలాగే నడచుకోవాలన్న కోరిక ఉన్నవారం. ఒకరు సర్వతేజోమయుడైన రాజు, ఇంకొకరు సర్వ దేవతామయుడైన బ్రాహ్మణుడు. ఈ ఇద్దరి మధ్య కాలానికి ఏం పని?” అని అనుకొని దూతతో ఇలా అన్నాడు…

“మేము ఇప్పుడే వస్తామని బ్రహ్మర్షి సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయి.”

దూత తలవూపి వెళ్ళిపోయాడు. దూత వెళ్ళిన కాసేపటికి వెనకే కొద్ది పరివారం అనుసరిస్తూండగా పాదచారియై వశిష్ఠుల పర్ణశాల వైపుకు బయలుదేరాడు కౌశికుడు.

రాజు కొంత దూరం పోయేంతలోనే సమారాధనంలోని విశేష భోజనానికై వచ్చిన గ్రద్ద ఒకటి తన విశాలమైన రెక్కలు విప్పి, పైకి లేచి ఎగిరి, పళ్ళతో నిండి వంగిన ఒక చెట్టుకొమ్మ పై కూర్చుంది. దాని బరువు తాళలేకో మరి యెందుకోఆ కొమ్మ విరిగి పడిపోయింది.

“ఇదేమిటి? నేను బయలుదేరడం అప్పుడే గ్రద్ధ ఇలా వాలడం, కొమ్మ విరిగిపోవడం మంచిదేనా? శుభ సూచకమేనా?” అని ఒక్క క్షణం ఆలోచించాడు కౌశికుడు. వెంటనే – కార్యసాధకులైన క్షత్రియులు ఇటువంటి వాటిని లెక్క చేయరాదు అని ముందుకు సాగాడు.

ఇంకా ఉంది…

Your views are valuable to us!