మంత్రద్రష్ట – నాల్గవ తరంగం

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 5]

మూడవ భాగం ఇక్కడ చదవవచ్చు: మంత్రద్రష్ట – మూడవ తరంగం

 

ఆశ్రమంలో ఎక్కడ చూసినా కోలాహలం. ఇంతవరకూ అతిథి పూజ సంభ్రమంలో కోలాహలం. ఇప్పుడు అతిథుల సంభ్రమపు కోలాహలం. రాజు వైపు వారంతా నందినిని తమ రాజధానికి పిలుచుకొని పోతున్నారని సంభ్రమంలో మునిగున్నారు.

నయానో భయానో నందినిని రాజధానికి తీసుకొనే వెళ్ళవలెనని రాజపరివారం అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నది. ఆ వార్త తెలిసి ఆశ్రమవాసులందరూ కలవర పడుతున్నారు.

ఆశ్రమవాసులంతా యథావిధిగా సంధ్యాకార్యాలను ముగించుకున్నారు. ఎవరూ రాత్రి భోజనం గురించి పట్టించుకోలేదు.

అందరికీ ఒకటే యోచన – ” రాజుకు ఎంతటి దుర్బుద్ధి? ” అని కొందరు, “ఇది సాధ్యమేనా?” అని మరికొందరు, “క్షత్ర-బ్రహ్మ యోగపు కాలం గడచి క్షాత్రం బ్రాహ్మం ఒకదానినొకటి వ్యతిరేకించే కాలం వచ్చిందా?” అని ఇంకొందరు.

ఒక్కొక్కరు తమకు తోచినట్లు మాట్లాడు కొంటున్నారు.

అరుంధతీదేవి సంధ్యాహోమాన్ని ముగించుకొని బయటకు వచ్చింది. ఆశ్రమపు కలవరం ఆమెనూ పట్టింది. ఆమెకు “మేమిచ్చిన సత్కారాన్ని పొంది తృప్తి పడిన అతిథి మా ఆశ్రమంలోనే ఇంతటి అత్యాచారాన్ని చేస్తాడా? ఆశ్రమపు ధేనువునే తనకిమ్మని అడుగుతాడా? ఆశ్రమపు బ్రహ్మభూమిపై రాజుకు అధికారం ఉందా? ” అని అనేక ప్రశ్నలు, సందేహాలు, శంకలు ఒకదానిపై నొకటి మనస్సును వేధిస్తున్నాయి.

ఆ రోజు ఉదయం పతిదేవులు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. – “ఆశ్రమంలో రక్తపాతం కావలసి ఉన్నది అవుతుంది.” అన్న మాట చెవిలో మళ్ళీ మారుమ్రోగింది.

“అలాగైన జరగవలసినది జరగవలసినదే. అయినా, ఎందుకు దానిని తప్పించకూడదు? నేను ప్రయత్నం చేయనా?” అనిపించెను. మనసులో అదే ఆలోచన.

అంతలో దూరం నుండి లీలగా వినిపించు గంటల మ్రోత. ఎక్కడో ఆలోచనలో మునిగిన మనసుని తట్టి లేపింది.

అరుంధతి తిరిగి చూసింది.

నందిని వస్తున్నది.

శాంతి, సమృద్ధి మూర్తీభవించినట్టు సౌభాగ్యలక్ష్మి ప్రతిబింబమా అనునట్లు మెడలో గంటలు మోగుతుండగా నెమ్మదిగా, హుందాగా నడచి వస్తోంది.

తల అటు ఇటు ఊపుతూ, “ఎవరికి యేమి కావాలి? ఎవరికే వరం కావాలి?” అని వెదకుతున్నట్టు వున్నది.

కేసరి వర్ణపు ఎర్రావు. జగత్తులోని సౌభాగ్యానంతటినీ రాశి పోసి, దానిపై ఒక తిలకం దిద్దినట్టు ఆ గోవు ముఖంపై ఒక వెండివర్ణపు తిలకం. సౌభాగ్యదేవి మందిరపు గోపురం పైన అమర్చిన శిఖరాల వంటి వెండి తొడుగులు తొడిగిన కొమ్ములు. కాలి గిట్టలకు ఘల్లుఘల్లుమనే మువ్వలు.

నందినిని చూడగానే అరుంధతీ దేవికి అపారమైన ఆనందమైంది. మనసులోని ఆలోచనలన్నీ ఒక్క గడియ ఎక్కడికో మాయమయ్యాయి. అంతలోనే ఆ గోమాత తమ ఆశ్రమంలోనే ఉండి, పరిసరాలన్నింటినీ ఇదే విధంగా పావనం చేస్తుందో లేదో అన్న శంక కూడా కలిగింది.

ఆ శంక కలిగించిన విషాదాన్ని సహించలేక దానిని తరిమి వేయడానికన్నట్టు దేవి పరుగెత్తి ఎదురు వెళ్ళి నందినిని హత్తుకొంది. ఆ ధేనువు కూడా ఆ కౌగిలి ఉపచారాన్ని సంతోషంగా స్వీకరించి, తాను కూడా అంతే ప్రీతిగా అరుంధతికి తన ముఖాన్ని రాస్తూ ఉపచారం చేసింది.

“అమ్మా నీవు వెళ్ళిపోతావా? మా దగ్గర ఉండవా?” అని అరుంధతి అడిగింది.

నందిని తల అటూ ఇటూ ఊపి గంటల సవ్వడి మృదువుగా వినిపిస్తుండగా మనోహరమైన మనుష్య వాక్కుతో ఇలా పలికింది – ” దేవీ! గురుదేవులకూ, కౌశికునికీ మధ్య జరిగిన సంభాషణ అంతా నాకు తెలుసు. కౌశికుడు రాజు అన్న మాట నిజం. అతనిలో దైవాంశ కూడా ఉన్నది. కానీ, కామధేనువు కూతురును తన ఇంటిలో ఉంచుకోవాలంటే ఎంతటి యోగ్యత ఉండాలో అంతటి యోగ్యత ఇంకా అతనికి సిద్ధించలేదు. ఈ దినం ఈ సంగతి అతనికి బోధపడుతుంది. తల్లీ! ఈ రోజు ఈ పుణ్యాశ్రమపు పుణ్యభూమి రక్తపానంను కోరి ’నందినీ, నాకు రక్త పానము చేయాలని ఉంది ప్రసాదించు’ అంటున్నది. అది జరగవలసినదే. తప్పక జరుగును. కానీ, తల్లీ నాపైన బలప్రయోగం జరిగేవరకూ నేనేమీ చేయను. ఈ ఆశ్రమపు పుణ్యభూమిలో నాపైన బలప్రయోగం చేయడం కౌశికునికి ఎంతమాత్రమూ తగని పని. అయినా అది కావలసినదే. అనివార్యం. అట్టి దుర్ముహూర్తం వస్తే నేను ఆత్మ రక్షణ చేసుకోవచ్చును కదా తల్లీ?” అనింది.

అరుంధతికి అంతా అర్థమైంది.

జ్ఞానాన్ని పొందడానికి సాధకమైన ఆశ్రమపు పుణ్యభూమిని ప్రశాంత సరస్వతి వలె కాపాడుతున్న భూదేవి ఈనాడు ఒక దుర్గగా, చండిగా, కాళిగా రక్తపానంను కోరుతోంది కదా అని కొంతసేపు మనసులో విషాదం కలిగింది. వెంటనే కావలసినది కాక మానదు అనే నిశ్చయంతో పలికింది – “అమ్మా, నీవు పుట్టినదే మమ్మల్ని అనుగ్రహించడానికి. నీవు అలాగే మాపై అనుగ్రహంతో ఉంటే చాలా సంతోషం. నీకు ఆగ్రహం వచ్చే సన్నివేశం రాకుండా ఉంటే పరమ సంతోషం. కానీ మీరు దేవతలు. లోకాన్ని రక్షించడం, శిక్షించడం మీ చేతిలో ఉన్నది. మీరు ఏమి చేసినా సరే ” అనింది.

నందిని కొంత నొచ్చుకుని – “తల్లీ! నీ మాట నిజం. అనుగ్రహించుటకై పుట్టినవారు ఆగ్రహించుట కష్టం. అయితే మేము కూడా అయినంతలో అనుగ్రహించడానికే ప్రయత్నిస్తాం. నీటి ప్రవాహం నిలుపడానికి కట్టిన ఆనకట్ట కూడా మన ప్రయత్నం లేకుండానే ఒక్కోసారి తెగిపోతుంది. అలాగే మేం ఆగ్రహాన్ని చూపాల్సివస్తుంది. తల్లీ! నీవు శోకించవద్దు. అంతటి దుర్ముహూర్తమే వస్తే నన్ను నేను రక్షించుకోగలను. ఏదేమయినా మీరు మాత్రం నన్ను దూరం చేయవద్దు. మీరు తల్లిదండ్రులు, నేను మీ కూతురును.” అంది.

అరుంధతీ దేవికి కంట నీరు చిప్పిల్లెను.

“నీ వలన మా ఆశ్రమం…” ముందరి మాట చెప్పడానికి అరుంధతికి గొంతు పూడుకు పోయింది. మాట పెగల్లేదు. తల్లిని నాకే లేగ దూడలా నందిని అరుంధతి ముఖాన్ని ప్రేమతో నాకింది. అరుంధతి చేసిన నమస్కారాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళిపోయింది.

గోమాత వెళ్ళిన కొంచంసేపటి వరకు ఈమె అలాగే స్థాణువై కూర్చొని ఉంది. వృద్ధ శిష్యుని ఒకరిని పిలచి – “అయ్యా, ఆశ్రమ వాసులందరికీ ఇది విన్నవించు. బయటి నుండి వచ్చినవారు ఎలాంటి దుర్మార్గాన్ని చేసినా మనమెవ్వరం భయభ్రాంతులు కాకూడదు. అతిథి దేవో భవ అనేదాన్ని మరువరాదు. అతిథి సత్కారాన్ని పొందిన వాడు చేసిన దౌష్ట్యాన్ని లెక్క చెయ్యరాదు. అది సాధ్యం కాకపోతే ఇప్పుడే దూరంగా వెళ్ళి నిలవండి. ఎంతదూరం వెళితే సాధుస్వభావంను కాపాడుకోవచ్చునోఅంత దూరం వెళ్లండి. ఇది అందరికీ తెలియాలి.” అనింది.

శిష్యుడు కన్నీరు నింపుతూ “తల్లీ! అతిథి దుష్టుడాయె. తపస్వులందరూ క్షోభిస్తున్నారు!” అని అన్నాడు.

అందుకు జవాబుగా అరుంధతీ దేవి – ” అయినదానికీ, కాని దానికీ క్షోభ పడేటట్లయితే ఆశ్రమానికి ఎందుకు రావాలి? ఆశ్రమంలో ఉన్నంతవరకైనా ఆశ్రమధర్మాన్ని పాటించాలి. అవునా?” అని నవ్వుతూ పలికింది.

వృద్ధ శిష్యుడు మారుపలుకలేదు. నమస్కారం చేసి ఆజ్ఞ నెరవేర్చడానికి ఉద్యుక్తుడయ్యాడు.

 

ఇంకా ఉంది…

Your views are valuable to us!