మంత్రద్రష్ట – అయిదవ తరంగం

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4.7]

మూడవ భాగం ఇక్కడ చదవవచ్చు – మంత్రద్రష్ట – నాల్గవ తరంగం

 

రాజభవనపు ముత్తైదువలు, బ్రాహ్మణులు వేదఘోషలతో, మంగళవాద్య పూజాద్రవ్యాలతో నందిని వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. రాజపురోహితుడు ఆ సురభికి పూజ చేసి, భయభక్తులతో వినమ్రుడై – “దేవీ, మహారాజు మీకు రాజభవనంలో నిత్యపూజలు చేసి కృతార్థులు కావాలని కోరుకొంటున్నారు. తమరు అక్కడే వుండి ఆతని కోరికను నెరవేర్చవలసిందిగా ప్రార్థన!” అని సాష్టాంగ ప్రణామం చేసాడు.

నందిని ఆ పూజను సాంగంగా స్వీకరించి – “ఓ బ్రాహ్మణా! మీ రాజు నుండి నిత్యపూజను తీసుకోవడానికి సరిపోయే గోవు ఇంకా అవతరించలేదు. ఈ నందిని దేవతలనుండి వశిష్ఠులకై దత్తతగా ఇవ్వబడింది. కాబట్టి, బ్రహ్మదత్తమైనదానిని వెనుకకు తీసుకోవడం కానీ లేదా అన్యథా ఉపయోగించడానికి గానీ ఆ దేవేంద్రునికి కూడా అధికారం లేదు. అటువంటిది నేను మీ రాజు కోసం ఎలా రాగలను?” అన్నది.

బ్రాహ్మణుడు ఏమీ చెప్పలేక ” మాతా! రాజాజ్ఞను నేను తెలిపాను. దానిని మన్నించడమా లేదా తిరస్కరించడమా అన్నది నీకు చెందిన విషయం. నా అపరాధమేమయినా ఉంటే నన్ను క్షమించు!” అని నమస్కరించాడు.

నందిని గంభీరంగా – “బ్రాహ్మణా! రాజాజ్ఞ సర్వదా మాన్యనీయమే. అయినా ఇవ్వకూడని ఆజ్ఞను ఇచ్చినప్పుడు దానికి కట్టుబడివుండడం ఎందుకు? నన్ను కోరడానికి ముందు ఈ దత్తురాలికి బంధవిమోచనం అయిందా లేదా అని గమనించాలి కదా!” అని అన్నది.

పురోహితుడు నిరుత్తరుడయ్యాడు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY

 

అతడు, అతని పరివారంలోని వారందరూ వెను తిరిగిపోతున్న సమయంలో కౌశికుని దళపతి ముందుకు వచ్చి నమస్కరించాడు.

“మాతా! రాజాజ్ఞను గౌరవించాలి కనుక మిమ్ముల్ని అన్ని విధాల ప్రార్థించమని నన్ను ఆజ్ఞాపించారు మా రాజుగారు.” అని విన్నమించాడు.

అందుకు నందిని నవ్వి – “ఓయి వీరుడా! చేయకూడని ఆజ్ఞ చేసిన రాజు యొక్క ఆజ్ఞ బ్రతికినా చచ్చినదానివంటిదే. దానిని పాలించడం దండగ!” అని అనింది.

అతడు మరలా చేతులు జోడించి వినయం చూపుస్తూనే హఠంతో కూడిన స్వరంతో – “తల్లీ, రాజాజ్ఞను విమర్శించడం నా పని కాదు. ఆ ఆజ్ఞను అందరూ పాలించే విధంగా చూడడమే నా ధర్మం. అందరూ రాజాజ్ఞను పాలించక తప్పదు. అది ప్రజల ధర్మం. ఆ ధర్మాన్ని ఉల్లఘించిన వారిని మరియు ఆ ధర్మ మార్గాన్ని వదలిపెట్టిన వారిని సరైన దారిలో పెట్టడానికే నేనుండేది.” అన్నాడు.

నందిని కూడా సామరస్యంగానే సమాధానమిచ్చింది – “మీకు చేతనైతే అలాగే చేయండి!”

దళపతి ఆజ్ఞాపించగనే నలుగురు ముందుకు వచ్చారు. తమ చేతిలో ఉన్న బంగారు పలుపుతాళ్ళతో నందినిని బంధించేందుకు ప్రయత్నించారు.

నందిని తల విదిలించింది. పలుపు తాళ్ళు తెగి ముక్కలవడం చూసిన పరిజనం భయపడ్డారు.

దళపతి చెలరేగిపోయి – “ముందుకు వచ్చి కొమ్ములు పట్టి కట్టివేయండి” అన్నాడు.

సైనికులు వచ్చి చుట్టుముట్టారు. కొందరు ఆవు పైన పడ్డారు. ఆ తోపులాటలో నందినికి గట్టి దెబ్బ ఒకటి తగిలింది. వెంటనే ఆమె ఆర్భాటంతో పైకి ఎగిరింది. ఒళ్ళు విదిలించింది.

ఆమె ఒంటినుండి కదలిపోయిన వెంట్రుకల నుండి అనేకానేకులైన ఆటవిక మనుషులు పుట్టుకొచ్చారు. అనేక యుద్ధ విద్యలలో ఆరితేరి అనేక యుద్ధాలను జయించి గర్వంతో ఉన్మత్తులైన కౌశికుని సైనికులందరినీ ముహూర్త కాలంలోనే ఆ ఆటవికులు చిత్తుగా తరిమి, పెరిగి నిలచిన పైరును కోసిపారవేసినట్టు విసరి పారేసారు.

రాజు ఇతర సైన్యం సన్నద్ధంగా ఉన్నా ఇలాంటి విచిత్ర యుద్ధానికి సిద్ధంగా లేదు. అయినా యుద్ధాలు చేయడంలో అనుభవం ఉన్నవారు గనక ఓడిపోయిన వీరుల పోరాటం అయిపోయిందనుకొనే లోపలే కొత్త వ్యూహం రచించారు.

పదాతులు రెండు పక్కల నడవగా మధ్యలో గుర్రాలు ముందుకు దూకాయి. ఇంకొక గడియ లోపలనే ఒకవైపు ఏనుగులు, మరొకవైపు రథాలు వచ్చాయి.

కౌశికుడే స్వయంగా రణభూమికి వచ్చి సైన్యాన్ని నడుపుతున్నాడు. మ్లేఛ్చుల మాయా సైన్యం కౌశికుని సైన్యాన్ని విరిచివేస్తున్నది. మదించిన ఏనుగుల కాళ్ళకింద పడి పటపటమని విరిగిపడుతున్న చెరకు గడల్లా కౌశికుని సైన్యం ఆతని ఎదురుగనే నామరూపాలు లేకుండా పోయింది.

మరొక ముహూర్తం లోపలే యుద్ధం ముగిసిపోయింది.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

భూలోకపు ప్రసిద్ధవీరుల రక్తాన్ని త్రాగిన కౌశికుని బాణాలన్నీ వ్యర్థమయ్యాయి. ఏదో తెలియని భయం అతన్ని, అతని సైన్యాన్ని ఆవహించినది.

శత్రువులు దెబ్బతీసే లోపలనే సైనికులు అరుస్తూ, క్రింద పడి నశించి పోతున్నారు. చూస్తుండగనే వెనుక్కు తిరిగి పరుగెత్తుతున్న సముద్రమంత సైన్యం మొత్తం కరిగిపోయింది. అక్కడక్కడా బ్రతికి, మిగిలిన వారిని నందిని సృష్టించిన మాయా సైన్యం సంహస్తోంది.

ధర్మ ద్రోహం వలన రాజు హతాశుడైతే, పామరుల వలన అతని సైన్యం హతమై శేషం కూడా మిగలకుండా పోయింది. కల్లోలాన్ని కలిగించే సముద్రంలా వచ్చిన సైన్యం నిర్మూలమై పోగా తన ప్రాణాలను నిలుబెట్టుకోవడమే కష్టమయింది కౌశికునికి.

అంతవరకూ ఏ యుద్ధంలో కూడా వెన్ను చూపించని క్షత్రియ వీరుడు ఇప్పుడు బెదరి, జీవకళ తప్పి, ప్రాణరక్షణకై పారిపోతున్నాడు.

దూరాన నిలబడిన అరుంధతి కన్నీరు నిండిన కన్నులతో జరుగుతున్నదాన్ని చూస్తోంది. “సౌమ్యము, శాంతిప్రదమూ అయిన ఆశ్రమపు కీర్తి వలె సాధుస్వరూపిణి అయిన నందిని ఈ విధంగా కాళికలా మారగలదు. ధర్మద్రోహుల్ని సంహరించనూ గలదు!” అని ఆమె మనసులో అనుకొనలేదు. “ఈ కౌశికునికి తగిన శాస్తి జరిగిం”దని గర్వపడనూ లేదు.

“అయ్యో! నందినిని అనవసరంగ కొట్టారే! ఆమెను హింసించడమంటే ఈ చతుర్దశ భువన సహితమైన బ్రహ్మాండాన్నే బద్దలు కొట్టినట్లే కదా!” అన్న వ్యథతో ఆమె కన్నీరు చెరువై ప్రవహిస్తోంది. మరొకవైపు ఆ గోవు ఆత్మరక్షణా సామర్థ్యాన్ని చూసి సంతోషంతో కూడా కళ్ళల్లో నీరు కురిస్తోంది.

సంహార క్రియ పూర్తి అయిన తర్వాత నందిని మళ్ళీ సౌమ్యంగా మారింది. తిరిగి చూసింది.

అల్లంత దూరంలో ఉన్న అరుంధతిని చూసి, తల్లిని చూచి పరుగెత్తివచ్చే లేగదూడలా “అంబా…అంబా” అని అరుస్తూ బంతిలా వలే ఎగురుతూ, దూకుతూ పరుగెత్తి వచ్చింది. ఆ పుణ్యమాత కూడా తన చీర కుచ్చిళ్ళు అడ్డువచ్చి పడిపోతున్నట్లు అవుతున్నా, చీర చెరగు జారిపోతున్నా లెక్కచేయకుండా ఎదురు పరుగెత్తి వెళ్ళి ఆప్తులను ఆదరించినట్లే ఆ నందినిని ఆదరించింది.

“అగ్నిపర్వతంలా మండుతూ నిలచిన ఆ సైన్యాన్ని సృష్టించింది నువ్వేనేమమ్మా? రాజ సైన్యం అంతటినీ ధూళిపటలం చేసింది నువ్వేనేమమ్మా? ఇప్పుడు నన్ను మాతృభావంతో చూస్తూ పరమ సౌమ్యంగా ఉన్నదీ నువ్వేనేమమ్మా? ఆ కౌశికుని పాలిట మహమ్మారిగా మారినదీ నువ్వేనా? అయ్యో! మా తల్లీ! ఎంత బాధపడ్డావో? ఎంత కష్టపడ్డావో?నీకు ఎంత దిష్టి తగిలిందో ఏమో! ఒక పిడికెడు గడ్డి పరకతీనైనా దిష్టి దిగదుడుస్తాను!” అని అంటూ కదిలింది అరుంధతి.

ఏమీ ఎరుగని లేత లేగదూడలా ఆమె వెంటనే వెళ్ళింది నందిని.

ఇంకా ఉంది…

Your views are valuable to us!