ఇలా సూతులవారు కథ మధ్యలో ఆపి, ఇంతకుముందు ప్రశ్నించిన స్త్రీ గురించి చూడటమేమిటి? అనుకుంటూ, తామూ వెనుదిరిగి చూశారు.
విచిత్రం! ఆవిడ అక్కడ కనిపించలేదు. ఆమె ఎవరైఉంటుంది?
ఆవిడ కనిపించకపోవటానికి కారణం సూతులవారికి అర్థమైపోయింది.
మహిషాసురుడికి స్త్రీ చేతిలోనే చావు మూడటమని విధాత వరమున్నప్పుడు, స్వయానా విష్ణువే మహిషుడితో యుద్ధానికి దిగటం కూడా ఆ అహంకారపూరిత చర్యేనని గుర్తుచేసేందుకే యీ అపజయం కూడ సంభవించింది. ఆ విషయం పామరులకూ అర్థమవ్వాలంటే, కథాప్రవాహానికి అడ్డువేయక తప్పదు. ఆ తల్లిదే చిన్న లీల కూడా!
మహాదేవి అడుగడుగునా తన అస్థిత్వాన్నీ, ఆధిక్యతనూ యీ విధంగా సామాన్య మానవులు మొదలు తమనే సర్వోత్కృష్టులుగా సంభావించుకునే దేవ సమూహం వరకూ – అందరికీ స్పష్టపరుస్తూనే ఉంటుంది.
సూతులవారు మనసులోనే ఆ మహాదేవికి మ్రొక్కులిడి, కథను ముందుకు నడిపించసాగారు.
EXPLORE UNTOLD HISTORY
*****
అటు స్వర్గ సుఖాలలో మాహిష్మతీ వల్లభుడు మహిష చక్రవర్తి, స్వర్గ సుఖాల్లో తులతూగుతుంటే ఇటు భూమి మీద కొండలలో, అడవులలో అమరపురి వాసులు బిక్కచచ్చి జీవనం కొనసాగిస్తున్నారు.
ఎన్నో ఏళ్ళు ఇలా గడచిపోయాయి.
కాలం గడిచేకొద్దీ ఇంద్రాదులకు తమ దైన్య స్థితి పట్ల వెగటు కలిగింది.
ఆ త్రిమూర్తుల అండదండలున్నాయని తాము మహిషునితో యుద్ధానికి దిగితే, వాళ్ళు ముగ్గురూ సమరాంగణం నుండీ చల్లగా జారుకున్నారు. చివరికి, తామే అక్కడినుంచీ, దొంగలకు వలె తప్పుకోవలసి వచ్చింది. ఇదెంత అన్యాయం?
అందరూ కలిసి చర్చించుకుని, బ్రహ్మ దేవుని ముందు నిలబడ్డారు.
గోడుగోడున విలపిస్తూ, తమ బాధలు చెప్పుకున్నారు.
ఇంద్రుడు గొంతు విప్పాడు – “స్వర్గసుఖాలనే కాదు, యజ్ఞ హవిర్భాగాలనూ స్వాహా చేస్తూ మహిషుడు ఇంద్రాసనాన్ని అధిరోహించి, తక్కిన నృపులందరికీ రాజ్యం – వీర భోజ్యం అనే సంకేతాలిస్తున్నట్టే ఉన్నది. ఓ శతధృతీ, నీవు మా తండ్రివి కదా మా యీ దీనావస్థకు యెప్పుడు విముక్తి,? “‘
బ్రహ్మ ఇంద్రుని మాటలు ఆలకించాడు. తనను శతధృతీ అని సంబోధించటంలోనే అతని ఆర్తి అర్థమైంది.
నిజానికి ఇంద్రునికీ ఆ పేరుంది.
“నా పేరూ, నీపేరూ ఒకటే కదా! నన్నేమో అడవుల పాలు చేసి నీవు మౌనధారివయ్యావే?” అని ప్రశ్నించటం కూడ ఇందులో ఇమిడి ఉంది.
బ్రహ్మ ఉన్న ఫళాన లేచాడు. ఇంద్రుని భుజం తట్టాడు.
“దేవతలారా! మీ బాధ తెలియనిది కాదు. కానీ, ఒక మాట. తనను ఏకంగా అమరుణ్ణే చేయమని వరమడిగిన ఆ దానవుణ్ణి స్త్రీ వల్ల మాత్రమే ప్రాణభయముండవలెనన్న ఒడంబడికకు ఒప్పించగలిగాను. లేకుంటే, పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు, కనీసం మనం యీ దుస్థితి నుంచీ బైట పడే మార్గమైనా ఒకటి కనిపిస్తున్నది. మనం ఆ సర్వ సమున్నత శక్తి స్వరూపిణికోసం ప్రయత్నించాలి. మొదటగా ఆ లయకారుని వద్దకు వెళ్దాం పదండి!” అంటూ ముందుకు అడుగు వేశాడు.
కైలాసవాసుడీ విషయం ముందుగానే పసిగట్టి, వారికెదురువచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. బ్రహ్మ సైతం ఆర్తులైన దేవతలతో గొంతు కలపటం చూసి, మందస్మితంతో – “విరించీ! ఇప్పుడైతే విమనస్కుడవై ఇలా మాట్లాడుతున్నావు కానీ అతనికా వరమిచ్చింది నీవే కదా? స్త్రీ శక్తి వల్ల మాత్రమే ఆ ఎనుబోతుకు మరణముంటుందంటున్నావు. ఆ పశుబలాన్నెదుర్కునే స్త్రీ మూర్తిని నీవైనా నేనైనా తీసుకు రాగలమా? ఆ మోహినీ రూపధరుడైన ఆ మరునయ్యనే శరణు వేడుదాం, పదండి!” అంటూ వైకుంఠ మార్గం పట్టాడు.
వైకుంఠం సమీపించే కొద్దీ అక్కడి వివిధ పరీమళ పుష్పాలపై వాలిన భ్రమరనాద ఝంకారం వీనుల విందుగా నాదస్వరంలా వారినాహ్వానించింది.
సరస్సులలో సరసిజములు వెల్లివిరిసి, తాము వైకుంఠవాసుని సేవలో తరిస్తున్నామని చెప్పకనే చెబుతున్నట్టున్నాయి.
కోకిల కలకూజితాలలో హరికీర్తనలే వినిపిస్తున్నాయి.
కైలాసవాసుని నేతృత్వంలో వారందరూ ఒక సుందరోద్యానవనంలోకి ప్రవేశించారు.
ఓ వైపు మహర్షుల స్తుతులు. మరోవైపు దేవగంధర్వుల గానాలు. ఇంకో వైపు అప్సరసల రమణీయ నాట్య విన్యాసాలు.
వీటన్నిటినీ ఆస్వాదిస్తూ కొలువుదీరిన దానవారి.
ఇన్నిటి మధ్యా ఆనంద పరవశుడుగా కనిపిస్తున్న ఆ మాయడు తమ బృందం అక్కడికి చేరగానే, జయ విజయుల ద్వారా వార్తనందుకుని, వారిని స్వయంగా లోపలికి ఆహ్వానించేందుకు రావటం బ్రహ్మాది దేవతలను ముఖ్యంగా ఇంద్రుణ్ణి ఆనందింపజేసింది.
శుభ శకునాల మధ్య, సిరిమగడి ఆదర పూర్వక ఆహ్వానం మరిన్ని శుభవార్తలను మోసుకొచ్చేలాగానే అనిపించింది కూడా!
అందరినీ సుఖాసీనులను చేసిన తరువాత విషయం తెలుసుకుని ఆ భక్త వత్సలుడు మెల్లగా బదులిచ్చాడు.
“లోగడ మనమంతా మహిషుడితో యుద్ధం చేశాం. ఓడిపోయాం. కారణం , మనమప్పుడు అతనికున్న వరం గురించి ఆలోచించక పోవటమే. ముఖ్యంగా ఇంద్రపీఠం పై అతనికున్న ఆకర్షణకు కారణం తమ పెదనాన్న కరంభుడిని ఇంద్రుడు మట్టుపెట్టటమేనని నా భావన. ఇదంతా గతం గతః వంటిది. ఇప్పుడిక మనం సకల దేవతాంశలనూ, తేజశ్శక్తులనూ కలబోసుకున్న ఒక స్త్రీమూర్తిని సృష్టించాలి. మహిషుని కోరిక ప్రకారం ఆమే అతని ఎదుట నిలచి, అతన్ని దునుమాడాలి. మహిషాసురమర్దినిగా, సకలలోకవంద్యగా, అసుర సంహారిణిగా వినుతికెక్కాలి!”
దేవతలందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కైటభారి అలా అనగానే బ్రహ్మ దేవునిలోంచీ పద్మరాగ మణిప్రభలతో, సమశీతోష్ణ కాంతులలో, ఒక తేజోపుంజం అవతరించింది. వెనువెంటనే, అజితుని శరీరం నుండీ రజత కాంతులతో రూపుదాల్చిన తమోగుణంగా కనిపిస్తున్న పర్వతాకార తేజస్సు వేడి పొగలు చిమ్ముతూ ఆవిర్భవించింది. ఆ వెంటనే సత్వగుణ సుందరంగా నీల వర్ణంలో, చల్లని తేజస్సు విష్ణుమూర్తి నుండి వెలువడింది. ఆ మూడు తేజస్సులూ చూస్తుండగానే కలిసిపోయాయి.
ఇంద్రుడు, యమాగ్నికుబేర వరుణులూ ఇలా వివిధ దేవతలనుండీ కూడా తేజస్సులు వెలువడి, ఆ అఖండ తేజోరాశిలో సమ్మిళితమైపోతున్నాయి.
ఒక మహా హిమాలయంలా ఆవిర్భవించిన ఆ తేజస్సు నెమ్మదిగా ఒక సౌందర్యం మూర్తీభవించిన స్త్రీమూర్తిగా రూపుదాల్చింది.
అష్టాదశ భుజ, త్రివర్ణ, విశ్వమోహిని! కాలిగోరు నుంచీ కేశరాశి వరకూ నిండి నిబిడీకృతమైన దివ్యాభరణాలంకృత సమ్మోహన రూపం.
పద్ధెనిమిది బాహువులు క్షణకాలంలోనే వేయి బాహువులయ్యాయి!
ఇప్పుడా సహస్ర భుజ, మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన శక్తి సముపేత.
మహాలక్ష్మిగా కారణ భూతురాలిగా ఆవిర్భవించిన శక్తి పుంజమైనా ఆమె నిత్యురాలు. అరూప ఐనా అవసరాన్ని బట్టి యే రూపాన్నైనా ధరించగల నిపుణ.
శంకరుని తేజస్సు ముఖారవిందంగా, యముని తేజస్సు ఆమె నల్లని కురులుగా, వరుణుని మేఘ కాంతి వంకీల జుట్టుపై ప్రతిఫలిస్తుండగా, అగ్నిదేవుని కృష్ణ-శ్వేత-రక్త వర్ణాలు మూడు కన్నులు కాగా, ద్విసంధ్యాకాంతులు కనుబొమలుగా, మన్మథుని ధనుస్సు భ్రూలతగా, వాయుదేవుని తేజస్సు కర్ణములుగా, కుబేరుని తేజస్సు నాసికగా, ప్రాజాపత్య తేజస్సు దంతసిరిగా, తళుకులొలికే ఆ తేజోమయికి దేవతలంతా తమ తమ శక్తిని ఆయుధరూపంలో సమర్పించుకున్నారు.
మహా సముద్రుడందించిన కంఠాభరణమూ, ఉంగరాలూ అమ్మవారికి అతికినట్టుగా సరిపోయాయి.
వరుణుని కానుక – ఎన్నడూ వాడిపోని పద్మాలతో విరాజిల్లుతున్న దివ్య వైజయంతీ మాల.
సర్వాలంకార భూషిత అయిన ఆ దేవి అధిరోహించిన సింహ వాహనంను హిమవంతుడు భక్తితో సమర్పించుకున్నది.
శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచీ, అటువంటిదే మరొకటి వేయి అంచులతో ఒకేసారి వెయ్యిమందిని తుదముట్టించగల సుదర్శనాన్ని సృష్టించి ఇచ్చాడు. శంకరుని త్రిశూలాన్ని బోలిన మరో త్రిశూలమూ, వరుణుని నుండీ శ్వేతశంఖమూ, అగ్నిదేవునినుండీ శతఘ్నీ, వాయుదేవుని నుండీ అపురూప ధనువూ, ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరాజిల్లే అమ్ముల పొదీ, దేవేంద్రుని వజ్రాయుధం నుంచీ మరో వజ్రాయుధమూ, యముని కాలదండం వంటి మరో కాలదండమూ, వరుణుని కానుకగా పాశమూ, కాలుని ఖడ్గమూ-డాలూ, విశ్వకర్మ గండ్ర గొడ్డలీ, మోదకీ గదా, అభేద్యమైన కవచమూ – ఇవన్నీ ధరించిన ఆ మహాదేవి చేతికి బ్రహ్మ పావన గంగాజలాలతో నిండిన కమండలువునూ, కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణపాత్రను అందించగా, ఆమె సూర్యుడందించిన దివ్య తేజస్సులతో నవ్వుతూ వాటిని అందుకున్నది.
*****
“అన్నీ బాగానే ఉన్నాయి సామీ! అమ్మోరు యుద్ధానికి గదా పోతుండాది ఇన్ని సొమ్ములవసరమా? అసలే ఆ గేదె మొగమోడు సరైనోడు గాదుగందా! అసలొక్క ఇష్ణుచక్రంతోనే ఆణ్ణి నరకానికి బంపిచ్చొచ్చు గదా మా తల్లి?”
మునులందరికీ యీ మాటలు వినగానే సర్రున కోపమొచ్చేసింది. కానీ, సూతులవారికీ మాటలు ఏమాత్రం కోపం తెప్పించలేదు.
“లేదు నాయనా! దివ్య కార్య సిద్ధికోసం అవతరించిన ఆ మహాశక్తికి తమ తమ కానుకలు సముచిత రీతితో సమర్పించుకోవటం, ఆ అసమాన శక్తి సంపన్న సార్వ భౌమత్వాన్ని అంగీకరించామని తెలియజేయటమే. ఆమెకు ఆయుధాలు కూడ సమర్పించారు కదా దేవతలందరూ! సర్వాయుధధారిణిగా ఆమెను దర్శింపజేయటం కూడా మహిషునికి ఆమె శౌర్య పరాక్రమాలను విశదపరచడానికే. ఇక కథలో ముందుకు వెళ్దాం.”
*****
దివ్యాభరణ భూషిత, దివ్యాయుధ సముపేత, మహాలక్ష్మిగా అవతరించిన ఆ ప్రబలను దేవతలందరూ వినయ వినమితాంగులై సంస్తుతించారు.
“ఓ జగన్మాతా! దానవ పీడితులమైన మాకు దారి చూపు. మా తప్పులను మన్నించి అక్కున చేర్చుకో. సిద్ధి, బుద్ధీ, వృద్ధీ, తుష్టీ, పుష్టీ, శాంతిప్రదమైన రుద్రాణివి నీవే. ఇంద్రాణివీ, కల్యాణివీ, వైష్ణవివీ నీవేనమ్మా! మాయామయ జగత్తును నడుపుతూ, మాయారూపిణిగా తెరవెనకనుంటూ, మమ్ము ఆడిస్తున్న ఓ అంతఃశ్శక్తీ మా అంతరంగాలలో ఎప్పటికీ కొలువై ఉండు తల్లీ!”
వారందరి స్తోత్ర పాఠాలకూ సంతసిల్లిన మహాదేవి చిరునవ్వుతో ఇలా పలికింది – “భయం లేదిక మీకు! మహిషుడికి యీ భువిపై కాలం చెల్లింది. కాల మహిమకు లొంగిన త్రిమూర్తుల వల్ల తెలిసిన సత్యమేమిటి? కాలోహి దురతిక్రమః అనే కదా! శుభ ఘడియలు సమీపించాయి. దిగులు మరచి, పరిణామాలను తిలకించి, పులకించండి.” అంటున్న మహాదేవి దరహాసం కాస్తా మహాట్టహాసంగా మారి దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించింది.
అక్కడ మహిషుని గుండె దడ హెచ్చింది.
“చెవులు చిల్లులు పడే యీ ధ్వని ఎక్కడినుంచీ వచ్చింది? ఖచ్చితంగా ఇది నా వశంవదులైన వారి పని కాదు. ఇంక యీ ధ్వని కారకులెవరైనా నిర్దాక్షిణ్యంగా నా దగ్గరకు ఈడ్చుకు రండి. వెళ్ళండి!” అంటూ హుంకరించాడు.
ప్రాణాలు అరచేత పట్టుకుని దూతలు పరుగులు తీశారు.
తీరా ఆ ధ్వని వచ్చే చోటికి వెళ్తే, అక్కడ దర్శనమిచ్చింది – అష్టాదశ భుజాలతో, దివ్య మణిమయ భూషణాలతో, దివ్యాయుధాలను ధరించిన ఒక మహిళ. జంకూ గొంకూ లేకుండా సురాపానం చేస్తూ, వికటాట్టహాసం చేస్తున్న దివ్యాంగన.
ముందే ప్రాణాలు అరచేత పెట్టుకుని వచ్చిన వాళ్ళకీ దృశ్యం చూడగానే, పై ప్రాణాలు పైనే పోయాయి. అదే వేగంతో వెనక్కి మళ్ళి తమ దానవేంద్రునికీ విషయం విన్నవించారు.
*****
“సామీ! దూతలందరికీ పైప్రాణాలు పైనే పోయ్నాయన్నావు గందా? మల్లీ ఆ దున్నపోతు పెబువు దగ్గరికెట్టా పొయ్నారు? ఎట్టా ఆయమ్మ సంగతి జెప్పినారబ్బా!” – వెనకనున్న వరుసల్లోంచీ, ఒక వృద్ధుని సందేహం.
ఇంక ముందున్న మునుల్లో ఒకతను లేచి – “ఏమిటయ్యా? పోనీ పాపం అని మిమ్మల్నీ ఇక్కడ కూచుని యీ దివ్యగాధ వినేందుకు అనుమతిస్తే, సూతులవరి వాక్ప్రవాహానికిలా పదేపదే అడ్డురావటం ఏమైనా బాగుందా చెప్పు? ఇలా ఐతే మీరంతా ఇప్పుడే వెళ్ళిపోండి. మేమైనా ప్రశాంతంగా కథను వినగలం. ప్రభాత వేళ మొదలైన కథను మధ్యాహ్న సమయం సమీపిస్తున్నా ఇంకా అలుపూ సొలుపూ లేకుండా చెబుతున్నారు ఓపిగ్గా సూతులవారు. వారినిలా ఇబ్బంది పెట్టటం భావ్యం కాదు. ఇకమీదటైనా అడ్డుపుల్లలు వేయకుండా కథ వినండి.” అన్నాడు చీకాకుతో.
సూతుల వారు నొచ్చుకుంటూ – “నాయనా! పామరులైన వాళ్ళకు అర్థమయ్యేలా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈ ఆశ్రమ జీవితంలో వారు మనకందించే సేవలవల్ల కూడా కొంత నిశ్చింతగా జపతపాదులు చేసుకోగలుగుతున్నారు. మీరంతా కాస్త సమ్యమనం అలవరచుకోవాలి!” అంటూ ఆ వృద్ధుని కేసి చూస్తూ…
“నాయనలారా! పై ప్రాణాలు పైనే పోయినా ప్రభువు ఆజ్ఞను పాలిచే విషయంలో వాళ్ళ స్వామిభక్తి విదితమౌతున్నది. పైగా చండాశాసనుడాయె! అందువల్ల, పడుతూ లేస్తూ ఏదోవిధంగా మహిషుని ముందు యీ సమాచారం చెప్పేశారు…”
*****
“ప్రభో! ఆ ప్రౌఢాంగన ఎవరో, ఎందుకొచ్చిందో తెలియదు. ఆమె భూమ్మీద లేదు. అంతరిక్షంలోనే ఉంది. దేవతలు ఆమెను స్తుతిస్తున్నారు. ఆమె దివ్య తేజస్సును పూర్తిగా చూడలేకపోయాము. కానీ చూసిన కాసింత సేపట్లో, ఆమె శృంగార, వీర హాసాలూ, రౌద్ర అద్భుత రసాలూ కలగలిసిన రూపసి. కనీ వినీ ఎరుగని సౌందర్య రాశి! నీవు చూసి రమ్మన్నావు కాబట్టి ఇంతే చెయ్యగలిగాము. అంతకు మించి చెయ్యగలిగే శక్తి యుక్తులూ మాలో లేవు. ఇదీ ఆ వికటాట్టహాసం వెనుక కథ!” అని చెప్పి ఆగారు దూతలు.
మహిషాసురుడికి నవ్వాగలేదు.
అంతలోనే ఆ దూతలపై కోపమూ ముసురుకొచ్చింది.
ఒక ఆడది! ఆకాశంలో సింహాసనం వేసుకుని దానిపై కూర్చుని సురాపానం చేయడమా?
ఆ దృశ్యాన్ని చూస్తూ సురాపాన మత్తులైన దేవతలు ఆమెకు జేజేలు పలకటం!
వీళ్ళంతా భయపడి పరుగులు పెడుతూ వచ్చి, నా ముందే ఆ ప్రౌఢాంగనను దివ్య శక్తిగా వర్ణించటం!
ఇది దుస్సహనీయమైన స్థితి.
కానీ, వీళ్ళు వర్ణించిన విధానం చూస్తే ఆమెవరో సుందరాంగి వలెనే ఉంది. నా అందం, నా శౌర్యం, నా వైభవ విలాసాలూ ఇంతకుముందెన్నడూ చూసి ఉండదు! ఇప్పుడు ఆమెకొక అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నాడు.
తన మంత్రివర్యుణ్ణొకణ్ణి పిలిచి – “ఓ అమాత్యా! నాకూ ఆమె అందాన్ని అనుభవించాలని అనిపిస్తున్నది. సామ దాన భేద దండోపాయాలనన్నిటినీ ఉపయోగించి, ఆమెనిక్కడికి తీసుకురా!” అని చెబుతూనే “ఆ…మరచిపోయాను! గజాశ్వరధాదులనూ తీసుకుని వెళ్ళు. ఆమెను సగౌరవంగా తీసుకురావాలి సుమా!” అన్నాడు ముసిముసిగా నవ్వుతూ.
చెప్పినట్టుగానే ఆ అమాత్యుడు గజాశ్వరధాలతో వెళ్ళి, ఆ మహాదేవికి చాలా దూరంగా నిలబడి, వినయానుసంధానంతో తాను వచ్చిన పనిని, తమ ప్రభువు ఆమె పట్ల అనురాగాన్ని పెంచుకున్న విషయాన్నీ వివరించి “ఇప్పుడిక నీ అభీష్టమేమిటో చెప్ప”మని అడిగాడు.
అందుకు మహాదేవి అన్నది – “మంత్రివర్యా! నేను దేవతామాతను. నన్ను ‘మహాలక్ష్మి’ అంటారు. దేవతలను అడవులపాలు చేసిన ఆ దానవాధముణ్ణి మట్టుపెట్టేందుకు ఒంటరిగానే వచ్చాను. నీవేదో వినయంగా మాట్లాడావు కాబట్టి బతికిపోయావు. నీ మాటల్లో ఏమాత్రం శృతి మించి ఉండినా యీపాటికి నీవు నరకద్వారం దగ్గర తేలి ఉండేవాడివి. ఇప్పుడిక నీ రాజుకు నా హెచ్చరికను వినిపించు. ప్రాణాల మీద తీపి ఉంటే యే పాతాళానికో పారిపో! లేదంటే నాతో యుద్ధం చేసి నరకానికి వెళ్ళేందుకు సంసిద్ధంగా ఉండు. నీవాళ్ళందరితోనూ ఒకేసారి వస్తే అందరినీ ఒకేసారి యమపురికి పంపించివేయగలను. మన్మథ పీడితుడనయ్యానని చెప్పుకోవటానికి సిగ్గుగా లేదూ! యుద్ధ చేయమని నేనంటుంటే నీకు రతికేళి గుర్తుకు రావటం పశులక్షణమే! నీకు స్త్రీ చేతుల్లోనే చావు వున్నదన్నమాట మరచిపోబోకు! చివరిసారిగా చెబుతున్నాను – బతకాలని ఉంటే, పాతాళం లేకుంటే సంగరం!”
ఆ అమాత్యుడు స్వామిభక్తిని మళ్ళీ ప్రదర్శించాడు.
“దేవీ! మా స్వామి నిన్ను మోహించాడు కాబట్టి నిన్నేమీ అనలేకుండా ఉన్నాను. లేకుంటే, యీపాటికి నిన్ను నా ఒక్క బాణంతో తెగటార్చి ఉండేవాడిని! ఇప్పటికైనా మించి పోయింది లేదు. రోషానికి పోయి మరణం కొని తెచ్చుకోకు. సమరం కాదు రతి సమరానికి సిద్ధంకా!” అన్నాడు జాలి చూపుతున్నట్టుగా.
మహాదేవి మరొక్కసారి నవ్వింది – “ప్రభువుకు తగ్గ అమాత్యుడివే! ఇంత స్పష్టంగా నా రాకకు కారణం చెబుతుంటే మళ్ళీ మొదటికే వస్తున్నావు. కోరి కోరి స్త్రీ చేతిలో మరణాన్ని ఆహ్వానించాడు మీ రాజు. వాడో మూర్ఖ శిఖామణి. అతగాని ఆఖరి కోర్కె తీర్చేందుకు స్త్రీరూపంలోనే వచ్చాను. మీ మహిషుడికి కాలం ఆసన్నమైంది. దైవం ప్రతికూలించిన వాడికి గడ్డిపరకే పామై కాటేస్తుందని నీకు తెలుసు కదా! ఇంక మాటలేల? మరొక్క మాట – మొన్నటి యుద్ధంలో విష్ణువుతో సహా అందరినీ జయించాననుకుంటున్నాడేమో! అది బ్రహ్మ ఇచ్చిన వర ప్రభావమే కానీ తన పరాక్రమ ప్రభావం కానేకాదని నా మాటగా చెప్పు.”
మహిషుని మంత్రికి ముచ్చెమటలు పట్టాయి.
ఇంత స్పష్టంగా మాట్లాడుతున్న యీమె ఖచ్చితంగా సామాన్య స్త్రీ కానేరదు. నన్ను యీ సుందరితో మాటలాడి, మరుని సమరానికి సన్నద్ధను చేసుకు రమ్మన్నాడే కానీ ఆమెతో సమరం చేయమనలేదు. కాబట్టి అతనికి యీ సమాచారమంతా ఉన్నదున్నట్టు చెప్పటమే నా విధి అనుకున్నాడు. వెనువెంటానే మహిషుడి ముందు నిలబడ్డాడు.
“ఒక మహిషాన్ని వరించటానికి నేను కూడా మహిషిననుకుంటున్నాడేమో! నేను మహిషుని పాలిటి మృత్యు దేవతను. ప్రాణాల మీద తీపి ఉంటే పాతాళమే మీకు గతి అంది. లేదా యుద్ధంలో కలుద్దామనుకుంటే నరక ద్వారాలు తెరచి ఉన్నాయంది. ఇంతకంటే ఏమి చెప్పను?” అన్నాడా విశ్వాసపాత్రుడైన అమాత్యుడు.
మహిషుడు ఆలోచనలో పడ్డాడు.
వృద్ధ మంత్రులతో చర్చలు జరిపాడు.
వాళ్ళన్నారు – “ప్రభూ! ఈ విషయంలో యేకాభిప్రాయానికి రావటం కష్టం. విడివిడిగా అందరి అభిప్రాయాలూ విని మీ నిర్ణయం మీరు తీసుకోవటమే సమంజసం.” అన్నారు.
విరూపాక్షుడు, దుర్ధరుడూ యుద్ధం వద్దన్నారు.
తామ్రుడు అందుకున్నాడు – “రాజా! ఆవిడ విచిత్ర స్త్రీ. ఆవిడ ఇక్కడికి వచ్చినప్పటినుండీ ఏవో దుశ్శకునాలు కనబడుతూనే ఉన్నాయి నాకు. ఆవిడ అటు మానవకాంతా కాదు. దానవ కాంత అసలే కాదు. గంధర్వాంగనా అంటే అదీ కాదనే అనిపిస్తున్నది. నిన్ను సమ్మోహన పరచిన దివ్య నారీమణే ఐవుంటుంది. యుద్ధం రాసిపెట్టి ఉంటే తప్పదు కదా!”
మహిషుడికి తామ్రుడి మాటలు నచ్చాయి. “ఐతే నీవే వెళ్ళి ఆమెను జయించి, పట్టుకు రా!” అన్నాడు.
‘అలాగే’నని చెప్పి బయల్దేరిన తామ్రుడు మహాదేవి ముందు మహిషుని మదన వేదన గురించి వివరించాడు.
ఆ మాటలను విన్న మహాలక్ష్మి మేఘగంభీరంగా పలికింది – “తామ్రాసురా! నేనిక్కడికి వరుణ్ణి వెదుక్కుంటూ రాలేదు. నాకు సర్వకర్త, సర్వసాక్షి ఐన భర్త ఉన్నాడు. అతగాడు సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు. శాంతుడు. అటువంటి ఉన్నతుడైన భర్త ఉండగా యీ ఎనుబోతు వెంటపడవలసిన పని నాకుంటుందా? నేను యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తుంటే అతగాడు ప్రేమ పాఠాలు వల్లె వేస్తాడేమిటి? యుద్ధమే దిక్కు అతనికి. ఎటూ ఓడిపోతాడు. యమునికి వాహనంగా చక్కగా పనికి వస్తాడు లేదా మనుషులకు నీళ్ళుతెచ్చేందుకైనా పంపించగలను. మరో మాటలేదు.”
భీకర గర్జన లాంటి ఆ పలుకుల్ని విన్న తామ్రుడికి ముచ్చెమటలూ పట్టాయి. క్షణమైనా ఆగకుండా మహిషుడి దగ్గరికి పరుగులు పెట్టాడు.
తన బంటు మాటల్ని విన్న మహిషుడు గంభీరంగా అన్నాడు – “ఆ సుందరి ఒంటరిగా వచ్చింది కాబట్టి దుర్బల అనుకోనవసరం లేదు. నేను సర్వసైన్యాన్నీ వెంటబెట్టుకు వెళితే నేను బలవంతుడననీ చెప్పలేము. జయాపజయాలు దైవాధీనాలు. మీ మీ సలహాలను మరొక్కసారి చెప్పండి” అన్నాడు.
కొంతమంది “ఆడది ఏమి చేయగలదని” దంభాలు పలికితే, మరి కొందరు “మాకొక అవకాశమివ్వు. ఆమెను నీముందు నిలబెడతాం” అని బీరాలు పోయారు.
అలా పలికి ఆమె ముందు నిలచిన బాష్కల, దుర్ముఖులు, రక్తపు మడుగులో ఒరిగి, అసువులు బాశారు. ఇప్పుడిక చిక్షురుడి వంతు వచ్చింది.
(సశేషం)