అధ్యాయం 11 – పల్నాటి వీరభారతం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

 

న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు.

మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది.

“ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు” అని కొంతమంది అన్నారు.

“మాట పాటించనివాడు బ్రతికున్నా చచ్చినవాడితో సమానం. ఆడి తప్పని జాతి మనది – పందెంలో మోసం జరిగినా, మనం ఓడినట్టే లెక్క!”

మలిదేవాదులు బ్రహ్మన్నను సమర్థించారు,

తమ పరివారమూ, అంతపురకాంతలూ – మలిదేవాదులతో ఆరోజున అరణ్యవాసానికి ప్రయాణమైనాడు
బ్రహ్మన్న.

“తల్లీ కృష్ణమ్మా!” అని నమస్కరించాడు బ్రహ్మన్న. కృష్ణవేణీ నదీమతల్లి తన చల్లనిహస్తంతో ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది బ్రహ్మన్నకు.

ఒకనాటి పాండవుల అజ్ఞాతవాసం గుర్తుకొచ్చింది బ్రహ్మన్నకు – “చెన్నకేశవా! నీ ఇచ్ఛ తండ్రీ!” అని అనుకున్నాడు.

పరివారంతో బాటు ఆలమందలున్నాయి. మందీమార్బలం మాములే.

కప్పెరకప్పెర చీకటి పడుతున్న వేళ, బ్రహ్మన్న తన పరివారంతో దిగిన చోటు – “పెందోట”.

ఆ రాత్రి గడిచిపోయింది.

సూర్యభగవానుడు కృష్ణమ్మకు ఉదయపు అందాల్ని చెక్కుతున్నవేళ, బ్రహ్మనాయుడు తన జనంతో కృష్ణను దాటి ఒక చిన్నపల్లెకు చేరుకున్నాడు. దాన్నే నివాసస్థానంగా చేసుకున్నాడు. అ వూరి పేరు “మండాది”.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

******

అలరాజుతో పేరిందేవి పెళ్ళి ఎప్పుడైయిందీ – పేరిందేవి బాల్యంలోనా? కోడిపోరుకు ముందా? మలిదేవాదులు అరణ్యవాసం వెళ్ళకముందా? అన్నది స్థిరపర్చటం కష్టం. ఐతే ఖచ్చితంగా ధృవీకరించాల్సిన విషయమేమిటంటే పేరిందేవి అలరాజు భార్య.

అరణ్యవాసాన్ని మలిదేవాదులతో గడిపాడు అలరాజు.

మాయాకోడిపందెంలో కత్తి విసిరిన అలరాజు మీద కుత్తుక దాకా కోపమున్నది నాగమ్మకు – తన శత్రువు (అలరాజు), నలగాముడికి బంధువు (అల్లుడు) – పైగా రేపు గురజాలకు కాబోయే ప్రభువు కూడా.

ఈ అలరాజును హతం చెయ్యకపోతే తన ఉనికికి ప్రమాదం. అలరాజును ఎలా హతమార్చాలని నాగమ్మ పథకాలు వెయ్యడం మొదలుపెట్టింది. జీవితంలో మనుషుల బ్రతుకులతో ఎలా చెలగాటమాడాలో బాగా వంటబట్టించుకొంది నాగమ్మ.

మార్గం నిష్కంటకమూ, సురక్షితమూ కావాలంటే రాజకీయంగా ఆలోచించాల్సినవి కొన్ని వున్నాయి.

తన అమోఘమైన మేధస్సుతో, నాగమ్మ వేసిన కోటలో పాగా తిరుగులేనిది. నలగాముడిని చెప్పు కింద తేలులా మార్చుకోగల్గిన నాగమ్మ, నరసింగరాజును “కుక్క”గా మార్చుకుంది. నరసింగరాజు

నాగమ్మ “తానా” అనకముందే “తందానా” అని పలికే స్థితిలో వున్నాడు.

అంతేగాదు, నాగమ్మ నెమ్మదిగా నెమ్మదిగా పేరిందేవిని మచ్చిక చేసుకున్నది. ముక్కుపచ్చలారని ముద్దరాలు పేరిందేవి, నాగమ్మ మంత్రాంగంలో పడిపోయింది.

“అలరాజు ఇల్లాలా! ఓ పేరిందేవీ” అని పలకరించేది.

పాము పడగనీడలో కప్పకు రక్షణ లేదనే విషయం అమాయకురాలు అలరాజు ఇల్లాలికి తెలీదు.

**********

కాలం మహాప్రవాహంలాంటిది. ఏది ఎట్లా జరిగినా కాలానికి, ప్రపంచంతో సంబంధంలేదు.

వత్సరాలు దొర్లిపోతున్నాయి.

మండాదిలో బ్రహ్మనాయుడు కొత్తరాజ్యాన్ని దాదాపూ నిర్మించుకున్నాడు.

బ్రహ్మన్న ఎక్కడవున్నా బలపడిపోతున్నాడన్న భయం ఒకటే నాగమ్మకు వుంది. ఎలాగైనా అతన్ని సాధించాలి.

శైవమతాన్ని అణగద్రొక్కిన బ్రహ్మన్న – తన తండ్రిని హత్యజేసిన బ్రహ్మన్న – తన మీద కత్తిగట్టిన బ్రహ్మన్న – ఎప్పుడూ ప్రమాదకరమైన వ్యక్తే. ఋణశేషమూ, శత్రుశేషమూ ఎప్పుడూ పీకల మీద కత్తిలాంటివే. ఏంచెయ్యాలి?

కంట్లో నలుసూ, కాలిముల్లూ, కత్తికి ఎదురు ఎప్పుడూ ఉండకూడదు. బలిసిన శత్రువు ఏమారిన క్షణాన ఎప్పుడైనా కబళించవచ్చు.

ఇవన్నీ ఆలోచించిన నాగమ్మ, నలగాముడికి దుర్బోధలు చేసింది. మలిదేవాదుల ఆలమందలను పొడిపించమన్నది.

“ఎందుకు?” అన్నాడు నలగాముడు.

“కాళ్ళూ, చేతులూ కూడాదీసుకోకముందే – ఈవిధంగా బ్రహ్మన్నను మనం యుద్ధానికి పురికొల్పితే – దెబ్బ మీద దెబ్బగా మలిదేవాదులు నిర్వీర్యులైపోతారు.”

“ధర్మం కాదు” అన్న నలగాముడి మాటలకు –

“విన్నారా నరసింగరాజా?” అన్నది నాగమ్మ.

“మహారాజా! మన మంత్రి నాగమాంబ చెప్పిందే నిజం. మలిదేవాదులు బలపడుతున్నారు. అరణ్యవాసం గడుస్తూనే వున్నది. ఆ తర్వాతైనా మనం రాజ్యం పంచిపెట్టక తప్పదు. ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. అసలు మనం రాజ్యం ఎందుకు పంచిపెట్టాలి?”

నలగాముడు నిశ్శబ్దంగా వూరుకున్నాడు.

“మౌనం అర్ధాంగీకారమా?” అన్నది నాగమ్మ.

“కాదు. సంపూర్ణాంగీకారమే!” అన్నాడు నరసింగరాజు.

ఐతే మండాదిలో వున్న ఆలమందలను హతం చెయ్యడానికి ఎవర్ని నియమించాలి? అన్నది ఇప్పటి ప్రస్తుత ప్రశ్న.




**********

నిజానికి, బ్రహ్మన్న మీద చెంచురాజు “వీధుల పల్నేటి”కి కోపమున్నది. అందుకని నాగమ్మ కీలెరిగిన వాతను “పల్నేటి”కి కబురంపితే, కబురందిన మరుక్షణం పల్నేటి గురజాలకు వచ్చి వాలాడు.

ఉచితగౌరవాలతో ఉచితాసనం పొందిన మూర్ఖుడు – అల్పసంతోషి పల్నేటి – “ప్రభూ! తమరు కబురంపిన కారణమేమిటో?” అన్నాడు.

“పరాక్రమతేజో విరాజా, పల్నేటి రాజా” – అని నాగమ్మ అతిశయోక్తి బాణం విసిరితే, ఆ మాటకు పడిపోయిన పల్నేటి – “చెప్పండి మహామంత్రీ! మీ మాటే మా మాటగా వింటాం” అన్నాడు.

“కేవలం వింటేనే సరిపోదు; ప్రభువుల కార్యం నిర్వర్తించాలి” అన్నది.

వికటాట్టహాసం చేసి, పల్నేటి – మూతి మీసం తిప్పుతూ “అభయం – చెంచురాజులు అన్నమాట తప్పరు. మీ మాటే మా కార్యంగా నిర్వహిస్తాము.” అన్నాడు.

“చెప్పండి ప్రభూ” అన్నది నాగమ్మ.

“మహత్తర భోగాలను అనుభవిస్తూ మండాదిలో మలిదేవాదులు బలపడిపోతున్నారు. బ్రహ్మన్న దేవుడిలా చెలామణి అవుతున్నారు; వ్యక్తిపూజ జరుగుతోంది బ్రహ్మన్నకు. బ్రహ్మన్న బ్రతికివుంటే గురజాలకు భద్రత లేదు.

పల్నేటి! యోధానయోధులు నీ చేతికింద వున్నారు. మంచితరుణం మించకుండానే, మండాదిలోవున్న బ్రహ్మన్న ఆలమందల్ని మరలించి మన రాజ్యానికి చేర్చు.

వీరులనుకున్నవాళ్ళనంతా మండాదిలోనే తెగటార్చు. కృష్ణలో పీనుగులు తేలాలి. చచ్చిన తన ప్రజల్ని చూసుకుని, బ్రహ్మన్న క్రుంగిపోవాలి.” అన్నాడు నలగాముడు.

ముందుచూపు, మంచీ-చెడుల్ని మర్చిన చెంచు పల్నాటి – “చిటికెలో మీ కార్యాన్ని నిర్వర్తిస్తాను” అన్నాడు.

“ఈ పని మీతోనే సాధ్యం చెంచురాజా” అన్నది నాగమ్మ.

“మా తండ్రిని, నా చిన్నతనంలో పొట్టనబెట్టుకున్న బ్రహ్మనాయుడి మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని చూస్తున్నాను. కాలం కలసివచ్చింది. ఇంతకన్నా అదును దొరికేదెప్పుడు? రేపే నా ప్రయాణం” అన్నాడు పల్నేటి.

కట్నకానులు, ఖర్చు వెచ్చాల్నీ అందుకున్న పల్నాటి తన ప్రజలతో తెప్పలు దాటి మండాది దరిదాపులో చేరుకున్నాడు.

**********

సశేషం…

 

Your views are valuable to us!