బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు ఎలా ముఖ్యుడో, నాయకురాలు నాగమ్మకు “వీరభద్రుడు” అంతే ముఖ్యుడు.
వీరకన్నమదాసు-వీరభద్రుడూ ఒకేరకపు గొప్ప యోధులు. వీరత్వానికి పల్నాటి ప్రతీకలు.
మనిషి కన్నా భయంకరమైన జంతువుగానీ, అవిశ్వాసకరమైన ప్రాణిగానీ మరొకటి లేదు. మనిషి పాలు తాగి పెరిగిన పాప, పెద్దయ్యాక అవిశ్వాసకరంగా, దుష్టుడుగా మారటానికి అవకాశమున్నది. కాని మనిషికి కుక్కపాలు పోసి పెంచితే, విశ్వాసకరంగా పెరుగుతాడనేది నాగమాంబ నమ్మకం. అందుకే దిక్కూదివాణం లేని పసివాణ్ణొక్కణ్ణి కుక్కపాలు పోసి పెంచి పెద్దవాణ్ణి చేసింది. వాడే వీరభద్రుడు. “నాగభూషణుడి”కి అలనాటి వీరభద్రుడెంతో, నాగమాంబకు పలనాటి వీరభద్రుడూ అంతే.
కుక్క కన్నా మిక్కిలి విశ్వాసకరుడు వీరభద్రుడు. నాగమ్మ మాట అతనికి శిలాక్షరం. వీరభద్రుణ్ణి మరో రుద్రుడిగా, నాగమ్మ బీరాలు పోతూ వుండేది.
మున్ముందు ఎటువంటి విపత్తు సంభవించినా అతడు మరణించందే, తన మీద ఈగ వాలనీయడని ఆమె అభిప్రాయం. నిజానికీ అంతే.
(ఐతే కొంతమంది చరిత్రకారులు, పల్నాటి చరిత్రలో వీరభద్రుణ్ణి ఎక్కడా పేర్కొనలేదు. కానీ వీరభద్రుడు వుండి వుండాలి. ఎందుకంటే, వీరులైనవాళ్లంతా బ్రహ్మనాయుడి పక్షానే వున్నట్టు పల్నాటి చరిత్ర పేర్కొంటుంది. అమిత మేధాసంపన్నురాలైన నాగమ్మ కనీసం వీరభద్రుడులాంటి విశ్వాసపాత్రుడూ-వీరుడూ లేకుండా వుండి వుంటుందన్నది ఆలోచించదగ్గ విషయమే).
EXPLORE UNTOLD HISTORY
*********
కళ్యాణపురపు వీరసోముడితో మాచెర్ల ప్రభువులు వియ్యమందాలనుకున్న తర్వాత – నలగామరాజులకు కబురు పంపాలా వద్దా అన్నది ఇక్కడి వీరులకు – ప్రభువులకు వివాదాస్పదమైన విషయమయింది.
కొంతమంది “వద్దు” – కొంతమంది “తప్పు” అని నిర్ధాకరించారు. “పగ” సంగతి ఎలావున్నా అగ్రజుడైన నలగాముడికి కబురు పంపటం బాధ్యత, ధర్మమూ అని బ్రహ్మన్న అభిప్రాయపడితే, మలిదేవాదులు దీనికి అభ్యంతరం పెట్టలేదు.
కబురందినా నలగాముడు మాచెర్ల రాలేదు. ఐనా బ్రహ్మన్న తన బాధ్యతల ప్రకారం కట్నకానుకలతో చాలాకాలం తర్వాత గురజాల వచ్చాడు.
ఈ అనతికాలంలో బ్రహ్మన్న అపూర్వ పర్యవేక్షణలో మాచెర్ల పచ్చపచ్చగా – తేరిపార చూడరాని బలమైన రాజ్యంగా పేరు మోసింది.
ఐతే బ్రహ్మన్న బలపడటం నాగమ్మకు ఇష్టం లేదు.
పక్కన పొరుగు రాజ్యం బలపడుతూవుంటే అది ఎవరికైనా కంటిగింపే! అదీగాక తమ నుంచి రాజ్యం పంచుకున్న దాయాదులు గొప్పవారయితే నాగమ్మ సహించేదెట్లా?
ఈ పొరుగున వున్న రాజ్యం ఇట్లా పచ్చగా వుంటే, ఏదో ఒకనాడు తమకు ప్రమాదం తప్పదు. మంచివాడైన నలగాముడు నాగమ్మను మంత్రిణిగా చేసిన తర్వాత అతనిలో స్వార్థం నాగుపామై పడగ విప్పి బుసలు కొడుతున్నది.
కట్నకానుకలు తీసుకొచ్చిన బ్రహ్మనాయుణ్ణి గౌరవించిన నలగాముడు, ఉండటానికి బ్రహ్మన్నకో విశాలమైన రాజసౌధాన్ని విడిదిల్లుగా ఇచ్చాడు.
**********
“ఐతే బ్రహ్మన్నలో వున్న బలహీనతేమిటి?” అని నాగమ్మ ఆరాలు తీయించింది.
ప్రతి మంచివాడికీ ఒక బలహీనత వుంటుంది. ధర్మరాజుకు జూదపు పిచ్చి ఉన్నది. అట్లాగే బ్రహ్మనాయుడికి కోడిపందాల పిచ్చి.
ఈ సంగతి తెల్సిన నాగమ్మ, నలగాముడితో బ్రహ్మనాయుణ్ణి కోడిపోరుకు ఒప్పించమని పురిగొల్పింది.
ఇటువంటి దురాలోచనలకు నలగాముడు దూరంగా ఉంటూ వచ్చాడు. ఐనా నాగమ్మ మంత్రాంగం ముందు అవన్నీ నిలవకుండాపోయాయి.
“పొరుగున మీ దాయాదులు బలవంతులైపోయారు. ఏదో ఒకనాడు వాళ్ళు మీ మీద ఉప్పెనలాగా విజృంభించే ప్రమాదం వుంది. కాబట్టి మాచెర్లని ఏదో రూపేణా వశపర్చుకోవాలి. ఇక మీ ఇష్టం.”
నలగాముడి నెత్తికి నాగమ్మ వ్రాసిన పసరు పనిచేసింది.
**********
తెల్లవారబోతున్నది.
బాలభానుడు గురజాల మీద రంగులు పూస్తున్నాడు.
సుప్రభాతం అందంగా నర్తిస్తున్నది.
నిజానికి నాగమాంబ ఆలోచించిన విధానంలోనూ తప్పులేదు. ఎందుకంటే, మాచెర్లను రాజధానిగా చేసుకున్న మలిదేవాదులు ఇవ్వాళ పెరిగి పెద్దవారయ్యారు. బ్రహ్మన్న మంత్రిత్వంలో నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అంతేకాక, వీరసోముడితో వియ్యమందాక, మలిదేవుల ప్రాభవం పెరిగింది. కాబట్టి ఏదో రూపేణా బ్రహ్మన్నను సాధించాలి.
ఉదయపు కాలకృత్యాలైనాక, చెన్నకేశవుణ్ణి ధ్యానించుకుని బయటకు రాబోతున్న బ్రహ్మనాయుడికి రెండు పుంజులు కత్తులు కట్టుకుని పోట్లాడడం కనిపించింది. ఒక పుంజు పారిపోయింది. నాగమాంబ చప్పట్లు కొట్టి, నవ్వి అంది-
మాచెర్ల పుంజులకు రోసాలు లేవు
మాచెర్ల ప్రజలకూ మీసాలు లేవు
గుండెగలిగిన పుంజులకు గురజాల పేరు
దండి మగవీరులకు పేరు మావూరు
బ్రహ్మనాయుడి పౌరుషానికి దీన్ని ప్రతీకగా చెప్పుకొస్తారు. నాగమ్మ మాటలను విన్న బ్రహ్మనాయుడు కళ్ళు చింతనిప్పుల్లా చేసి పారిపోయే పుంజును చూసి –
తిరిగిరావే పుంజ బ్రహ్మన్న ఆన
ఎరిగి తన్నవె తన్ను గుండెలోతుల్లోన
మాచెర్ల పుంజులకు కలవు రోసాలు
మంత్రి బ్రహ్మన్నకు “కలవె” మీసాలు
(“కలవె మీసాలు” అన్న మాట, నీచ సంబోధనలో నాగమ్మను ఉద్బోధించి అని ఉండవచ్చు. ఇది పుంజుకూ అన్వయిస్తుంది)
అని పారిపోయే పుంజును చూసి గట్టిగా అరిచాడు. పారిపోయిన పుంజు వెనక్కు తిరిగి వచ్చి, గురజాల పుంజు గుండెల్లో ఎగిరి తన్ని, చంపి – కూతకూసింది.
“మగతనం మగువల కేమి తెలుస్తుంది. నాగమాంబ ఇప్పటికయినా తెలుసుకో!” అన్నాడు.
పారిపోయిన పుంజు, వెనక్కు తిరిగివచ్చి – గురజాల పుంజును చంపటంతో నాగమ్మ నవనాడులూ క్రుంగిపోయాయి. ఐనా బింకం వదలక –
“పారుబోతు పుంజులతో పోరు పరువా, ప్రతిష్ఠా? ఆడిన మాటను తప్పని బ్రహ్మన్న రాజ్యాన్ని పణంగా పెట్టుకుని, పోరుకొస్తే – బలాబలాలు తేల్చుకోవచ్చు” అన్నది.
గురజాల ప్రభువులను, ఇంతలేసి మాటలాడుతూ వుంటే రక్తం కాగిన బ్రహ్మన్న – “అలాగే…నీ మక్కువా, నీ ప్రభువుల మక్కువా తీరుస్తాము” అని అభయం ఇచ్చాడు.
సశేషం