అధ్యాయం 9 – పల్నాటి వీరభారతం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

ఆత్మ గౌరవం కోసం ఈ పందానికి ఒప్పుకున్నాడన్న మాటేగానీ, బ్రహ్మన్నకు ఎందుకనో బెరుగ్గానే వున్నది. ఈ పందాలవల్ల సంభవించే విపరీత పరిణామాలు ఊహించలేని అమాయకుడు కాడు బ్రహ్మన్న.

పాచికలాటతో కురు-పాండవ యుద్ధం సంభవించింది. మరి ఈ కోడిపోరు ఏం తెచ్చిపెట్టనున్నదో?

“రాజ్యాన్ని పణంగా పెట్టి కోడిపోరుకు ఒప్పుకున్నాం మలిదేవా – ఓడినవారు రాజ్యాన్ని వదిలి ఏడేళ్ళు వనవాసానికి పోవాలి” అన్నాడు బ్రహ్మనాయుడు.

పెదమలిదేవుడు తలెత్తి –

“మీ గౌరవమే మా గౌరవం మహామంత్రీ! అభిమానం లేని రాజ్యం అక్కరలేదు. క్షాత్రం వుంటే క్షత్రియుడు. నాగమ్మ ఉబలాటం తీరుద్దాము” అన్నాడు.

“ఐతే పందెం నిర్ణయించిన రోజేది?” అని అడిగాడు బ్రహ్మన్న అన్న పెద్దన్న.

“ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి, కోడేరు పొలిమేరలో”

“అట్లాగే కానీ!” అన్నాడు కన్నమనాయుడు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

**********

కళ్యాణపురం వీరులైన యాదవులకు ప్రసిద్ధి.

పల్నాటి రాజ్యానికి చెందిన “భీముడు” బలగర్వంలో తనకు మించిన బలవంతుల్లేరనుకునేంత మూర్ఖుడు.

కళ్యాణపురం పెళ్ళివేడుకల్లో, భోజనపంక్తిలో కూర్చున భీముడు, “వీర పడాలు”ను ఎద్దేవా చేసాడు –

వీరపడాలు నవ్వి “నీకేం కావాలి?” అన్నాడు.

“అసలైన నువ్వుల నూనె కావాలి. బంతిలో నెయ్యి వడ్డించుకోన్నేను” అన్నాడు భీముడు.

“అదెంత పని” అని వీరపడాలు చేతుల మధ్య నువ్వులను పిండి, విస్తట్లో నూనె వడ్డిస్తే – “పర్వాలేదు. మీ వూళ్ళోనూ మగవాళ్ళున్నారు” అని భీముడు నవ్వితే – “మగతనం పెళ్ళి భోజనాల విస్తళ్ళ ముందు కాదు; బైట గోదాలో” అని నిర్లక్ష్యంగా నవ్వాడు వీర పడాలు.

“ఎక్కడ? ఎప్పుడు?” అన్నాడు పల్నాటి యోధుడొకడు.

“మీ ఇష్టం” అన్నాడు వీరపడాలు.

కళ్యాణపురంలో వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన గొల్ల యోధుల్లో వీరపడాలు ఒకడైతే; ద్వంద్వయుద్ధంలో అతనికతనే సాటి. చాణూర, ముష్టికుల్ని జయించగల్గినంత యోధు డతను.

పెళ్ళి వేడుకల్లో ఒక భాగంగా పల్నాటి భీముడికీ, కళ్యాణపురం వీరపడాలుకూ ద్వంద్వయుద్ధం జరిగింది. మహా పరాక్రమవంతుణ్ణని విర్రవీగే భీముణ్ణి క్షణాల్లో చిత్తుచేసిన వీరపడాలును చూసి బ్రహ్మన్న ఆశ్చర్యపోయాడు. ఇటువంటి వీరులు ఇప్పుడు మాచెర్లకు అవసరం.

అత్తగారింటికి రావటానికి సిద్ధంగా వున్న శ్రీరమాదేవి దగ్గరకు వెళ్ళి “తల్లీ” అని సంబోధిస్తే శ్రీరమాదేవి సిగ్గుతో తలవంచి, భక్తితో బ్రహ్మనాయుడికి నమస్కరించింది.

“అమ్మా! అత్తగారింటికి రాబోయే ముందు ఆరణంతో పాటు, ఆవుల్నీ, ముగ్గురు యాదవ వీరుల్నీ కావాలని అడుగమ్మా. అందులో ముఖ్యంగా “వీరపడాలు”ని కావాలని కోరు” అని చెప్పాడు.

వీరసోముడు బ్రహ్మన్న అనుకున్నట్లు – వీరబోయడు, వీర పడాలు, బాల గోపన్నలను పంపాడు.

ద్వంద్వయుద్ధంలో వీరు ముగ్గురూ వేలాది వీరుల్ని మాచెర్లలో తయారుచేశారు.

**********

“మహామంత్రీ! మన తరఫున పోరాడే పుంజు సిద్ధంగా వున్నదా?” అన్నాడు పెదమలిదేవుడు.

“వున్నది”

“ఏది? ఎక్కడా?”

“తెప్పించుతాను. ఆ పుంజు ఇక్కడలేదు. పానుగల్లులో వుంది. ఆ పుంజు కోసం వీరపడాలును పంపిస్తున్నాను.”

“అలాగే కానీండి”

**********

బ్రహ్మన్న అనుజ్ఞ పొందిన వీరపడాలు, వీరబిరుదాలను ధరించి పానుగల్లు బయలుదేరాడు.

పానుగల్లు పొలిమేరల్లో అడ్డువచ్చిన కొంతమంది శూరుల్ని వధించి పుంజును పట్టుకొచ్చిన వీరపడాలును బ్రహ్మనాయుడు కట్నకానుకలతో సత్కరించాడు.

జాతిలక్షణాలు గల్గిన ఈ పుంజు వీరత్వానికి పెట్టింది పేరు.

(ఈ పుంజు పేరు – “చిట్టిమల్లు” అని కొన్ని చరిత్రల్లో వుంది. కానీ ఈ పుంజును గోదాలోకి దింపిన పల్నాటి పందెగాడి పేరు “చిట్టిమల్లు” ఐవుండవచ్చని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. పేరు ముఖ్యం కాకపోతే “మాచెర్ల పుంజు” అని పాఠక సౌకర్యార్థం పిలిస్తే బావుంటుందని అనుకుంటున్నాను.)

కోడి పందాలకు వెళ్ళేటప్పుడు, శుభ శకునాల కోసం పందెగాళ్ళు నిరీక్షిస్తారు. ఇది ఒక్క కోడిపందాలప్పుడే కాదు; ఏ శుభకార్యానికైనా ఈ పట్టింపులు హిందూ రక్తంలో పేరుకొనిపోయి వున్నాయి.

నిజానికి బ్రహ్మన్న కోడిపందానికి బయలుదేరినప్పుడు అన్నీ అపశకునాలే కనిపించాయట.

బయలుదేరి వెనక్కు రావటం మంచిదికాదని, ఏదైతే అదే అవుతుందని బ్రహ్మనాయుడు కోడేరుగుట్టల్లో కోడి పందానికి బయలుదేరి వెళ్ళాడు.

**********




 

“పాలువాయి”ని ఆనుకుని వున్న కోడేరు గుట్టల్లో కోడిపందాల కోసం, నాగమ్మ అన్ని ఏర్పాట్లూ గావించింది.

నాగమ్మ తెప్పించిన పుంజు “పెట్టమారి”. పెట్టమారి పుంజు చూట్టానికి గమ్మత్తైనది. అది సగం పెట్టగానూ, సగం పుంజుగానూ కనిపిస్తుంది.

నాగమ్మకు ఇంకో భయం వుంది. ఈ కోడిపందెంలో బ్రహ్మన్నే జయిస్తే ఏం చెయ్యాలి? అందుకని గురజాల వీరుల్ని నాలుగువైపులా సిద్ధం చేయించింది. తురక యోధులకు గుర్రాలూ, కట్నకానుకలనూ ఇచ్చింది.

ఇన్నీ చేసిన నాగమ్మ రాజమర్యాదలను తూచా చప్పకుండా పాటించింది. నాగమ్మ చెప్పినట్లు నలగాముడు, నరసింగరాజుతో కలిసి – బ్రహ్మనాయుడు, మలిదేవాదులను రాచమర్యాదలతో సగౌరవ స్వాగతాన్ని ఇచ్చాడు.

నాగమ్మ కోడిపందానికి స్థలం నిర్ణయించి – చుట్టూ ఖరీదైన కంబళ్ళను, పట్టు తీవాచీలనూ పరిపించింది. ఎవరి వైపు వారు కూర్చునేట్టు అమర్చింది.

నలగాముని మర్యాదల్ని చూసి బ్రహ్మన్న సంతోషించాడు. తమకై అమర్చిన రత్న పీఠాల మీద రాజులు, ప్రముఖులు కూర్చుంటే, సామాన్య ప్రనలు తీవాచీల మీద, ఎత్తైన మంచెల మీదా కూర్చున్నారు.

అశేష ప్రజానీకమంతా కోడేరు కోళ్ళపందెంలో పాల్గొన్నారు. పెళ్ళికి తరలచి వచ్చినట్టు, తిరుణాళ్ళకి మూగినట్టు వున్నది జనసందోహం. మాచెర్ల-గురజాల వీరుల్లో, ప్రజల్లో మంచి ఉద్రేకం నిండుకొని వున్నది.

అనుకున్న కాలానికి పుంజులను గోదాలోకి దించారు.

**********

సశేషం

Your views are valuable to us!