గండు కన్నమకూ – రేఖాంబకు వున్న ఒకే ఒక కూతురు “మాంచాల” – అపురూపంగా పెరిగింది. ఇటు పేరిందేవి ఎంత గారాల కూచో, అటు మాంచాలా అంతే గారాల కూచి.
పేరిందేవి అందం జాతిపూవు చందమైతే – మాంచాల అందం స్వచ్ఛ పౌర్ణమి చందబింబంలాంటిది.
అక్కడ, గొల్ల చంద్రమ్మ ఇంట్లో బాలచంద్రుడు కళల్ని పెంచుకుంటూ పెరిగే బాలచంద్రునిలా దినదిన ప్రవర్ధమానమౌతున్నాడు. కత్తి పట్టుకుంటే ఒళ్ళు ఝల్లుమనిపించే పరాక్రమమతనిది.
చంద్రమ్మ బాలచంద్రుణ్ణి కంటికి రెప్పల్లే పెంచింది. అమిత పరాక్రమోపేతుణ్ణిగా తయారు చేసింది.
**********
మనస్సులో ఒక భావానికి అంకురార్పణ జరగాలేగానీ ఇక అడ్డూ ఆపులుండవు. నాగమ్మ నలగాముని హౄదయక్షేత్రంలో వేసిన విషబీజం పెరిగి పెద్దదై, శాఖోపశాఖలుగా విస్తరించింది.
నాగమ్మ మాటలను నమ్మిన నలగాముడు – మలిదేవాదుల మీద కూడా మత్సరాన్ని పెంచుకున్నాడు.
“నాగమ్మ చెప్పేదీనూ; నలగాముడు చేసేవాడూనూ? చెట్టు చెడే కాలానికి కాచే కుక్కపిందెకాయల్లాగా, ఆడదాని చేతుల్లో చిక్కి, కీలుబొమ్మలా తైతక్కలాడుతున్న నలగాముడి రాజ్యం నాలుగురోజులే – మలిదేవుడు రాజుగా, బ్రహ్మన్న మంత్రిగా రాజ్యపాలన చేసే రోజు దగ్గరలోనే వున్నదని” బ్రహ్మన్న అంటునట్లుగా నలగాముడికి వింపించింది నాగమ్మ.
ఆలోచనాశూన్యుడైన నలగాముడు ఈ మాటలను నమ్మి – మలిదేవాదులను సోదరులని జాలిదలచక చెరసాలలో వేయించాడు.
ఈ సంగతి తెలిసిన బ్రహ్మనాయుడు మహోదగ్రుడైనాడు. చెయ్యాల్సిన కార్యమేమిటో ఆయన క్షణాల్లో నిర్ణయించుకున్నాడు.
కులమతాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన బ్రహ్మన్నకు కుడిభుజమైనవాడు, కడజాతిలో పుట్టిన వీర (మాల) “కన్నమదాసు”. కన్నమ మహావీరుడు. పల్నాటి రక్తంలో పౌరుషముండితీరాలి.
నాగులేటి నీళ్ళల్లో శౌర్యం ప్రవహించి వుండాలి. కాకపోతే, పల్నాడు ఇంతమంది మహావీరులను కనివుండదు.
వీర కన్నమదాసు బ్రహ్మన్నకు కుడిభుజంగానే కాక కన్నకొడుకులాగా బ్రహ్మన్న దగ్గర పెరిగాడు.
“తండ్రీ – అర్ధాంతరంగా ఎందుకో కబురు పంపారు” అన్నాడు.
“కన్నమా! నీ భుజం మీద మరో మహత్తరమైన కార్యాన్ని మోపబోతున్నాను. నాయకురాలి మాటలను విన్న పల్నాటి ప్రభువు నలగాముడు – పశువై, తన సోదరులనే మాటైనా జ్ఞప్తికి వుంచుకోక, తన పెదతల్లి విజ్జెలదేవినీ, పెదమల్లి దేవుడిని, అతని ఇద్దరు సోదరులనూ చెరసాలలో వేయించాడు.
కాలం ఇచ్చే తీర్పులో ఈ నాగమ్మగానీ, నలగాముడుగానీ పొందే శిక్ష ఏమిటో ఇప్పుడిప్పుడే తెలియదు గానీ, నీవు నీ బలపరాక్రమంతో చెరసాలలో ఉన్నవాళ్ళను విడిపింపజేయాలి. తప్పదు” అన్నాడు.
“ప్రాణం పోయినా ఈ కార్యాన్ని నేను నిర్వహిస్తాను” అన్నాడు వీర కన్నమదాసు.
**********
రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో – చీమ చిటుక్కుమనని కౄష్ణపక్షపు చీకటి రాత్రిలో, కాపలాదారులను వధించి – కోటకు కన్నం వేసి – ప్రభువులైన ముగ్గురన్నదమ్ముల్నీ, పెద్దరాణి వీరవిద్యాదేవిని విడుదల చేసి తీసుకొచ్చాడు, ఘనుడు కన్నమదాసు.
వీరవిద్యాదేవిని, మలిదేవాదులనూ సురక్షిత మార్గాన చేర్చాక, కన్నీరు పెట్టుకుంటున్న వీరవిద్యాదేవితో బ్రహ్మనాయుడు ఇట్లా అన్నాడు – “తల్లీ! మీరు కన్నీరు పెట్టుకోనవసరం లేదు. కలకంఠి కంట కన్నీరొలికిన చోట, కరువు కాటకాలొస్తాయంటారు. మీ బిడ్డల్ని రాజులుగ చేస్తాను. పల్నాడు రెండు ముక్క అయినా సరే – ఒక ముక్కను నీ బిడ్డల్లో పెద్దవాడైన పెదమల్లి దేవుడు రాజవుతాడు; ఇక మీరు నిశ్చింతగా వుండండి.”
చెయగల్గింది లేక విజ్జెలదేవి –
“నీ ఇష్టం నాయనా బ్రహ్మన్నా! నీవు నా కొడుకులాంటివాడివే. నీ తమ్ములకు అన్యాయం కలక్కుండా చూడు.”
బ్రహ్మన్న భారతం గుర్తుకొచ్చింది –
అరివీరభయంకరుడైన కర్ణుడి దగ్గరకు మేలిముసుగు వేసుకుని, పుత్రభిక్ష నర్థించటానికి వెళ్ళిన నిర్భాగ్యురాలైన కుంతి గుర్తుకొచ్చింది.
తన బిడ్డ కోసం యాచనకైనా సిద్ధపడని తల్లి, స్త్రీ అవుతుందేనోగానీ “అమ్మ” అవటానికి వీల్లేదు.
పెద్దభార్యగా రాణివాసానికొచ్చిన వీరవిద్యాదేవి కళ్ళ ముందే పల్నాటి చరిత్రలో దురూహ్యమైన మార్పులు వచ్చిపడ్డాయి.
**********
నలగాముడు రక్తసంబంధ మమకారాల్లేని కటిక కసాయిగా తయారయ్యాడు. “ప్రస్తుత కర్తవ్యమేమిటి నాయనా బ్రహ్మన్నా?” అన్నది వీరవిద్యాదేవి. “ఆలోచిస్తున్నాను” అన్నాడు బ్రహ్మన్న.
“కన్నమా..”
“చిత్తం తండ్రి”
“మన సైన్యాల్ని సమీకరించుకుని గురజాల మీద దండయాత్ర చెయ్యి. కావలసింది కాకమానదు. అర్ధరాజ్యం అడగడం ఒక్కటే మన ప్రస్తుత కర్తవ్యం. నలగాముడు ధర్మంగా, మన రాజ్యభాగాన్ని మనకిస్తాడా సరేసరి, కాదంటే ఆ తర్వాతి సంగతి కత్తులతోను, కాల్బలంతోనూ – యుద్ధక్షేత్రంలో తప్ప తేల్చుకోవటానికి వీలుండదు.”
వీర కన్నమదాసు బ్రహ్మనాయుని ఆజ్ఞను పాలించి గురజాలను చుట్టుముట్టాడు.
(కాని కొన్ని చరిత్రలలో తన బావమరిది కన్నమనాయుడునితో ఈ పనులన్నీ చేయించాడని వున్నది. ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. ఏమైనా అటు కన్నమనాయుడు గాని, ఇటు కన్నమదాసుగానీ, ఒకర్నొకరు మించిన సాహిసికులు; బలపరాక్రమ తేజోవిరాజితులు)
బ్రహ్మనాయుడి బలగం, మలిదేవాదుల పక్షాన ఉండి, గురజాల మీద దండయాత్ర కొచ్చిందని తెలియగానే – నలగాముడు కలవరపడి, రాయబారానికి వెళ్ళిన కన్నమనాయుడితో ఇలా అన్నాడు –
“యుద్ధం ఎందుకు? బ్రహ్మనాయుడు కాకితో కబురు చేస్తే ఆయన మాట కాదంటానా? అన్నదమ్ముల మధ్య యుద్ధమేమిటి? సగం రాజ్యాన్ని నేను మలిదేవాదులకిస్తాను.”
ఈ తంత్రాంగమూ – రాజ్య విభజనా నాయుకురాలు చేయించినదే. ఎందుకంటే, బ్రహ్మనాయు డితనికి దూరంగా వుండకపోతే, తన పంజరంలో చిక్కుకున్న నలగాముడు, ఏదో క్షణాన ఎగిరిపోవటానికి వీలున్నది. అదీగాక తను ఆడే ఆటలు చెల్లవు.రాజకీయ పరిజ్ఞానమూ – పదవీ స్థిరమనుకునేవాళ్ళు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతారు. నాయకురాలి ప్రస్తుత పరిస్థితి అలాగే ఉన్నది.
నలగాముని మాటను మన్నించి బ్రహ్మనాయుడు మలిదేవాదుల పక్షాన, రాజ్యవిభాగం కోసం గురజాల బయలుదేరి వచ్చాడు. నలగాముడు బ్రహ్మన్నకు ఎదురేగి – మేళతాళాలతో తీసుకొచ్చి సపర్యలు చేసాడు. ఐతే ఈ రాజ్యపు పంపకాల్లో న్యాయం జరగలేదని బ్రహ్మనాయుడూ, అతని పక్షాన వున్న వీరులూ అభిప్రాయపడ్డారు. కానీ గంభీరుడైన బ్రహ్మనాయుడు, నలగాముని మాటలను మన్నించి తన రాజ్యభాగాన్ని పొంది వెనుదిరిగాడు.
************
సశేషం
************