బాలచంద్రుడికి తన మీద ఇష్టమని సబ్బాయికి తెలుసును గానీ భార్య ముఖమైనా చూడకుండా, తొలిరాత్రి తనకోసం వస్తాడని ఊహించలేదు.
“ప్రభూ!”
“శ్యామా!”
“మీరు ఇలా వస్తే లోకం నన్ను ఆడిపోసుకొంటుంది. వెలయాలి వలలో చిక్కి మగనాలిని వదిలి వచ్చాడనే అపప్రధ నాకు నిలిచిపోదా?” అన్నది.
“అది నా ఇష్టం” అన్నాడు బాలచంద్రుడు.
దిక్కుమాలిన రాత్రి గడిచి మాంచాలకు తెల్లవారింది.
కోడలు ముఖం చూసి ఏం జరిగివుంటుందో ఊహించింది ఐతాంబ.
“రాత్రి అబ్బాయి లేడా?” అని అడిగింది ఐతాంబ.
రాబోయే కన్నీటిని కష్టం మీద అదుపులో పెట్టుకుని “మీ అబ్బాయి సంగతి ఇన్నేళ్ళు పెంచిన మీకే తెలియకపోతే నిన్న వచ్చిన నాకు ఎట్లా తెలుస్తుంది?” అని అన్నది మాంచాల.
బాలచంద్రుడు జీవితాన్ని ఇంత నిరర్థకంగా గడిపేస్తున్నాడనే సంగతి తెలిసి కూడా
బ్రహ్మనాయుడు ఏమీ మాట్లాడలేదు. “ఎట్లా జరగాలని వుంటే అట్లా జరుగుతుంది” అన్నాడాయన.
మలినిద్ర అయి మరలిపోబోతున్నప్పుడాఇనా భర్తను కంట చూడలేకపోయిన మాంచాల పగిలిన మనసుతో పుట్టింటికి పోయింది.
మోహం పాము విషం కన్నా బలమైనది.
దానికున్న శక్తి అపారమైనది. బాలచంద్రుడులాంటి వీరుణ్ణి కేవలం తుచ్ఛమైన స్త్రీ వలపులో, ఏటి ఇసుకమేటలాంటి స్త్రీ పొందులో, నీటి చలమ వుందని భావించటమేననీ, స్వతహాగా ఉద్రేకీ, చిన్నవాడూ ఐన బాలచంద్రుడికి ఎవరూ బోధించలేదు.
జీవితం అలా గాడితప్పింది.
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
*****
ఏది ఏమైనా తమ రాజ్యభాగం తమకు కావాలని, భట్టును రాయబారానికి పంపుదామనుకున్న మలిదేవుడు, బ్రహ్మనాయుడు ఇత్యాదులు ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుని ‘అలరాజు”ను రాయబారిగా పంపాలనుకున్నారు.
మలిదేవుని ఆస్థానంలో సేనాపతిగా వుంటున్న కొమ్మరాజు కొడుకైన అలరాజును రాయబారిగా పంపటం ఉచితమని అందరూ భావించారు.
అలరాజు ఇటు పక్షానికి ఎంత ముఖ్య్డో అటు పక్షానికీ అంతే ముఖ్యుడు. అదీగాక ధర్మాధర్మాలను సరిగా తూచగల అలరాజు ఉచితానుచితాలు తెలిసిన వ్యక్తి. కత్తి పట్టుకుంటే ఎదురు లేడనిపించుకోగల అసహాయశురుడు. అతనే రాయబారానికి పోవడం రాజకీయంగా మంచి ఆలోచన.
నలగాముడు ఎంత మూర్ఖుడైనా, రాక్షసుడైనా, తన ఏకైక ముద్దుల కూతురు పేరిందేవి పసుపు, కుంకుమలను హరించేటంత నీచుడు కాడు. అందుకని అల్లుణ్ణి రాయబారినికి పంపితేనే నలగాముని మనసులోని ఉద్దేశ్యం తేటతెల్లమౌతుంది.
కానీ ఈ ఆలోచన కొమ్మరాజుకు నచ్చలేదు.
“నలగాముడు మూర్ఖుడూ, ఆలోచనాశూన్యుడు. అతనికి ఉచితానుచితాలు ఇసుమంతైనా తెలీదు. అలరాజును రాయబారానికి పంపటం నాకు సుతరామూ ఇష్టంలేదు” అన్నాడాయన.
“కొమ్మరాజా – అలరాజుకొచ్చిన భయం ఏమీ లేదు. నిస్సందేహంగా అతన్ని గురజాల పంపుదాం. ప్రభువుల కార్యాన్ని నిర్వర్తించగల గొప్ప సమర్థుడు మరొక్కడు కనిపించడంలేదు” అన్నాడు బ్రహ్మన్న.
“మునుపు భట్టును రాయబారిగా పంపుదామనుకున్నాం గదా! ఇంతలో మార్చుకోవలసిన అవసరమేమి వచ్చిందని? భట్టునో, మరే బ్రాహ్మణుణ్ణో రాయబారిగా పంపటం అనాదిగా జరుగుతున్నదేగదా!” అన్నాడు కొమ్మరాజు.
“నిజమే; ఐతే పెదమలిదేవుడు అలరాజును సూచించాడు. నాకూ అది సమ్మతంగానే కనిపించింది. ఎందుచేతనంటే, అల్లుడైన అలరాజు మాట మామగారైన నలగాముడు కాదనలేడుగదా!” అన్నాడు బ్రహ్మన్న.
“కానీ…” అన్నాడు కొమ్మరాజు.
“కొమ్మరాజా! నీ భయం నా కర్థమైంది. నాకూ ఒక కొడుకున్నాడు గదా! నీ బిడ్డ తిరిగివచ్చేదాకా, నా బిడ్డను నీ దగ్గరుంచుకో. బాలచంద్రుడి శౌర్యం నీకు తెలియంది కాదు. సాహసికుడైన నా కొడుకును నీకు కానుకగా ఇస్తున్నాను.” అన్నాడు బ్రహ్మన్న.
ఐన కొమ్మరాజు మనసెందుకో సమాధాన పడలేదు. అలరాజును పంపాలంటే అతనికి ఏమిటోగా ఉంది.
మలిదేవుడి మాటను తీసివేయటానికీ మనసొప్పటంలేదు. కొడుకును గురజాల పంపటానికి గుండె
చాలటం లేదు. అందుకని క్షణం ఆలోచించి – “బావా బ్రహ్మన్నా – నేనన్నానని నీవు ఏమీ అనుకోవద్దు. ఒక్కసారి నీ చెల్లెలిని కూడా కనుక్కో!” అన్నాడు.
“అవశ్యం” అన్నాడు బ్రహ్మన్న.
**********
కొమ్మరాజు భార్య ‘చల్లమాదేవి” ప్రస్తుతం వంకిదేవి అనే వూరిలో వుంది. బ్రహ్మనాయుడు వంకిదేవికి ప్రయాణమయ్యాడు.
బ్రహ్మనాయుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసిన చల్లమాదేవి, ఆయనకు సకల స్వాగతాలను ఎదురు పంపింది. దాసదాసీలు పన్నీటితో పాదాలు కడిగారు.
తలుపు చాటున నిలబడి, పరమసాద్వి, దొడ్డ ఇల్లాలు ఐన చల్లమా దేవి, ఉచితాసీనుడైన బ్రహ్మన్నతో ఇట్లా అంది –
“అన్నా! రాకరాక మా ఇంటికొచ్చారు. మా గృహాన్ని పావనం చేసారు. నాకు చాలా సంతోషంగా వుంది. వచ్చిన కారణమేమిటో సెలవిస్తే వినాలని వుంది” అన్నది.
“చెల్లమ్మా! నీ కొడుకు అలరాజును ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి, మన రాజ్యభాగం అడగడానికని గురజాలకు పంపాలనుకొన్నాము. బావ కొమ్మరాజు నీ అనుమతి కూడా పొందమన్నాడు” అన్నాడు.
ఈ మాటలు వినగానే చల్లమాదేవికి కళ్ళు తిరిగిన పనై, చిత్తరువులో బొమ్మలా బిత్తరపోయి-
“అన్నా! ఏమిటిది?” అన్నది.
“ఔనమ్మా! ప్రభువుల కార్యాన్ని నిర్వర్తించగల మరో సమర్థుడు కాన రావడం లేదు. అందువలన నువ్వు అనుమతినివ్వాల్సిందే తల్లీ!” అన్నాడు.
చల్లమాదేవి కళ్ళనీరు కళ్ళల్లోనే అదుముకుని, చలించిపోతున్న ఆత్మను అదుపులో పెట్టుకుని –
“అన్నా! మా అత్త కనిన ఐదుగురు కొడుకుల్లో, ఆ ఐదువంశాలకూ ఒక్కడే వారసుడీ అలరాజు. కళ్ళన్నీ వాడి మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాం. నా భర్త, నిన్ను నమ్ముకుని మలిదేవుల కొలువులో వున్నారు. జరగరానిదేదైనా జరిగితే, మాకెవ్వరు దిక్కు? అప్పుడు ఏ దేవుడు మా మొరలు వింటాడు? ధర్మనిర్ణయంలో నిష్ణాతుడివైన నీకు తెలియని ధర్మమేమున్నది అన్నా!” అన్నది.
బ్రహ్మనాయుడు గంభీరంగా నిట్టూర్చి – “చెల్లెమ్మా! నేనూ పిల్లలుగల తండ్రినే. నీకు ఒక్కడే కొడుకైన అలరాజు ఎలానో, నాకూ ఒక్కడే ఐన బాలచంద్రుడూ అలాగే. అందుకే నా కొడుకును నీ భర్తకు దానమిచ్చాను. వీరపత్నులు, వీరమాతలైన వాళ్ళు మాత్రమే తమ భర్తలను, సుతులను రాచకార్యాలకు పంపుతారు, రణాలు చేయించుతారు. అలరాజు శౌర్యపరాక్రమాలు తెలియక తల్లి మనసుతో ఆలోచిస్తున్నావే తప్ప, నీకు బిడ్డలైన పల్నాటి ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నావు. వారు సుఖంగా బ్రతికే మార్గాన్ని నిష్కంటకం చేసుకువచ్చి, పల్నాటిలో తన పేరును సుస్థిరం చేసుకుంటాడు అలరాజు. దీవించి పంపు తల్లీ – నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను” అన్నాడు బ్రహ్మన్న.
అంతటి బ్రహ్మన్నే దోసిలొగ్గి నిలబడేసరికి, ఎదురు చెప్పలేకపోయింది చల్లమాదేవి.
“అన్నా! నీకెదురు చెప్పలేకపోతున్నాను. కానీ గతి తప్పుతున్న నా మతిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. సరే! మీ ఇష్టప్రకారమే కానివ్వండి” అంది.
బ్రహ్మనాయుడు సంతోషంగా భోజన, తాంబూలాలను స్వీకరించి వెనక్కు మరలాడు.
చల్లమ్మ కళ్ళనుంచి రాలి పడిన కన్నీటి కళ్ళాపికి తడిసిన ఆ లోగిలోని ముగ్గులు మౌనంగా రోదించాయి.
*****
సశేషం