అధ్యాయం 19 – పల్నాటి వీరభారతం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

 

నాగమ్మ హృదయంలో కార్చిచ్చు రేగుతోంది. కత్తిని తన మీద విసరబోయిన అలరాజే మాటిమాటికీ గుర్తుకువస్తున్నాడు.

అతన్ని నిర్మూలించి తీరాలి. అతను బ్రతికివుంటే తన బ్రతుక్కు రక్షణ లేదు. తన మీద కత్తికట్టినవారు ఎవరైనాకానీ అంతం గాక తప్పదు. ఇది నిర్ణయంగా నిశ్చయించుకున్నది నాగమ్మ.

ఐతే ఇక్కడ ప్రచారంలో వున్నా నాకు (రచయిత చిట్టిబాబు) తెలిసిన రెండు కథల్ని వినిపిస్తాను.

మామగారైన నలగామరాజు మాటను కొట్టివెయ్యలేక, స్వతహాగా పెద్దమనసున్నఅలరాజు విడిదికి విచ్చేశాడు. విడిది ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. ధూపదీపాల్తో ఆ మేడకు కళ వచ్చింది.

నిజానికి నాగమ్మ మీద పౌరుషంతో కత్తి ఎత్తిన అలరాజు ఆ విషయాన్ని “కానున్నది కాకమానదు” అనే ఉద్దేశంతో మర్చిపోయాడు. కానీ నాగమ్మ ఎట్లా మరుస్తుంది?

తన మందిరంలో ఏకాంతంగా కూర్చుని నరసింగరాజును మరొక్కసారి వున్నపళంగా రమ్మని కబురుచేసింది. కబురు వినీ వినంగానే రయ్యిమని పరుగెత్తుకొచ్చాడు నరసింగరాజు.

“కూర్చోండి మహాప్రభూ!” అన్నది నాగమ్మ.

ఈ కొత్త సంబోధన వినగానే మతిపోయింది నరసింగరాజుకు – “అదేమిటి మహామంత్రిణీ?” అన్నాడు.

నాగమ్మ నరసింగరాజు ముఖంలోకి చూసి – “సమయం ఆసన్నమైనది నరసింగరాజా, బాగా ఆలోచించుకో! విజ్ఞులైన మీకు చెప్పగల్గిందేమీ లేదు. నలగామరాజు వెనుక చేతులు కట్టుకుని, గంగిరెద్దులాగా తలవూపి, ఆయన చెప్పిన ప్రతి పనీ చేస్తూ, ప్రత్యేకతలేక జీవిస్తారో, ఈ నాగమాంబ మాటలు విని, గురజాల ప్రభువై ప్రజారంజకంగా పరిపాలిస్తారో ఆలోచించి చెప్పండి!” అన్నది.

తనే మళ్ళీ కొనసాగిస్తూ “ఇవ్వాళ వచ్చిన దూతా….?” అని ఆగింది.

“అలరాజు”

“అనగా మీ అన్న అల్లుడు. ఒక్కమాటగా పేరిందేవి భర్త.”

“ఐతే…”

నాగమ్మ చిత్రంగా నవ్వి “మీ తల సరిగ్గా పనిచెయ్యటం లేదు. అలరాజు పేరిందేవి భర్త. కావున నలగామరాజు తర్వాత గురజాలకు కాబోయే ప్రభువు” అన్నది.

“అవును. నిజమే!” అన్నాడు నరసింగరాజు.

“ని…జ…మే” – మాటను విరిచి చాలా ఎద్దేవగా అన్నది నాగమాంబ. “అలరాజు ఈ గద్దెమీద కాలుపెట్టిన రోజున మీరు కేవలం ఈ ఇంటి పనిజేసే మగదాసీవారు. నేనో? బైటకువెళ్ళగొట్టబడబోయే ఓ అనామక స్త్రీని. ఆహా! కోపం వద్దు నరసింగరాజా! కొంచెం శాంతంగా ఆలోచించండి.” మిమ్మల్ని ఈ గురజాలకు తిరుగులేని ప్రభువుగా నిలిపి – మీ మంత్రిణిగా, ఆంతరంగికురాలిగా ఉండిపోవాలనేది నా చిరకాల వాంఛ” అన్నది.

ఏమీ మాట్లాడక మౌనం వహించాడు నరసింగరాజు.

“మీరు మహరాజు కావాలంటే ఒకేఒక మార్గమున్నది.”

“ఏమిటది?”

“అలరాజును ఈ ప్రపంచంనుంచి శాశ్వతంగా పంపించివేయాలి”

“అమ్మో!”

“ఏమిటా పిరికితనం?”

“పిరికితనం కాదు. విధవగా మా పేరమ్మను నేను ఊహించలేను. పేరిందేవిని చిన్నతనంనుంచి నా గుండెల మీద వేసుకుని పెంచాను.”

“మీ ఇష్టం. మహరాజుగా మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. కానీ కర్మ ఇలాగుంటే నేనేం చెయ్యగలను!”

నరసింగరాజు ఆలోచనలో పడ్డాడు. విషబీజం అంటూ మానస క్షేత్రంలో మొలవాలేగానీ, అది క్షణాల్లో శాఖోపశాఖలతో విస్తరించిపోతుంది. నరసింగుని ప్రస్తుత పరిస్థితి అదే. “నేను రాజును కావాలి. అంటే అలరాజు అడ్డు తొలగాలి” అని అతను మనసులో పదేపదే అనుకోసాగాడు. మనిషి రెండు భావాల సంఘర్షణలో పడినప్పుడు ఉచ్ఛనీచాల బేరీజు విషయంలో తికమకపడ్తాడు.

పేరిందేవి తను కంటికి రెప్పగా పెంచిన పిల్ల. సుఖాలను చవిచూడనిది. తొలకరివయసులో, భర్త కోసం కళ్ళల్లో దీపాలు వెలిగించుకుని – అనుభవించబోయే ముందు జీవితం కోసం, ఆశలతో బ్రతుకుతున్న ముగ్ధ.

హేయమైన రాజ్యం కోసం – చరిత్ర బ్రతికున్నంత కాలం, తన పేరు పల్నాటి చరిత్రలో కళంకితంగా నిల్చిపోవటమా? – “ఛీ…ఛీ..వద్దు వద్దు. ఈ పాపపు పని నేను చెయ్యలేను” అని అనుకున్నాడు కాసేపు.

మళ్ళీ అతని మనసు రాజ్యాధికారం వైపు మళ్ళింది. రాజ్యం వీరభోజ్యం. రాజైనవాడు వెలలేని ఐశ్వర్యాలతో, తులలేని సుఖాలతో హాయిగా బ్రతుకుతాడు. శాసనకర్తయై సమస్త సామంత, వందిమాగధ, పరివార జనాలతో, పాలితుల నీరాజనాలందుకుంటాడు. నాగమాంబ చెప్పింది ఈ వైభవం గురించే. ఆ వైభవ విలాసాన్ని తను కాకుండా అన్యులనుభవించడం అధర్మం.

అన్న తర్వాత అనుభవం, అర్హత ఉన్నది తనకే. అలరాజుకు దక్కే రాజ్యాధికారం కేవలం కాకతాళీయం. శత్రువుల్ని ఎదిరించి, మంత్రాంగాల్ని నెరిపి, ఈ రాజ్యాన్ని ఏకత్రాటిగా నిలిపే మహోన్నత ప్రయత్నంలో రాజుగారి తమ్ముడిగా కాక “నరసింగరాజు”గా తనదైన ముద్రవేసాడు, అలాంటి వాడికి కాక నిన్న లేక మొన్న, తన కళ్ళెదురుగా పుట్టిన ఓ కుర్రవాడికి అధికారం దక్కుతుందని అనుకోగానే అతని మనసులో విద్వేషాగ్ని ఒక్కసారిగా భగ్గుమంది.

అలరాజు సింహాసనమెక్కితే, పక్కనే తను చేతులు కట్టుకుని నిలబడ్డ దృశ్యాన్ని ఊచించుకుంటేనే కంపరమెత్తిపోతోంది. ఔను. అది దుస్సహమే – దుర్భరమే. అంతేకాదు హృదయవిదారకం కూడా. పారంపర్యంగా లభించాల్సిన అధికారం పరుల పాలైనప్పుడు తను అనుభవించబోయే దైన్యం, హైన్యం, మానసిక క్లేశం ముందు, పేరిందేవి వైధవ్యం అల్పంగా తోచసాగింది నరసింగుకు.

చరిత్ర దుమ్మెత్తిపోసినా, పేరిందేవిని విధవను చేసైనా సరే తను గురజాలకు మహాప్రభువు కావలసిందేనన్న కృత నిశ్చయానికి వచ్చేసాడు నరసింగు.

“మహామంత్రిణీ! ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?” అన్నాడు.

“కార్యమైతే ఉంది గానీ చేసేందుకు ధైర్యముందా?” అంది నాగమ్మ.

“ఆ(…కావలసినదానికంటే ఎక్కువే” అన్నాడు నరసింగరాజు పొగరుగా.

“ఒప్పుకున్న తర్వాత నీరుకారిపోకూడదు సుమా!” అంది నాగమ్మ కవ్వింపుగా.

“ఊహూ” అని తలనడ్డంగా ఆడించాడు నరసింగు.

“ఐతే జాగ్రత్తగా వినండి. విడిది ఇంటికి విచ్చేసువున్నాడు ఈ ఇంటి అల్లుడు. విందుభోజనాన్ని అతగాడు సుతరామూ అంగీకరించడు. తగినన్ని జాగ్రత్తలు చెప్పకుండా పంపివుండడా బ్రహ్మన్న. ఆ ప్రక్కనే వీరకన్నమదాసు వున్నాడు. ప్రభుభక్తిలో అతన్ని మించినవారు లేరు. కానీ కనీస మర్యాదగా పానీయాన్నైనా స్వీకరించమని అర్థిస్తే కాదనడు అలరాజు. ఇదే అదనుగా మనం తీసుకోవాలి.

మందిరంలో మీరు, నేను, నలగాములు, అలరాజు మాత్రమే ఉంటాము. నాలుగు పాన పాత్రలూ వుంటాయి. అందులో ఒకదానిలో విషం కలిపిన పానీయముంటుంది. అది నలగామరాజుకు ఇస్తాము.”

“ఆ(…అన్నగారికి విషపాత్రనా?”

“హాహాహా…అక్కడే ఉంది కిటుకు నరసింగరాజా – అలరాజు ఒప్పుకున్నా పానీయం తీసుకోడానికి ఒప్పుకోడు కన్నమదాసు. స్వతహాగా మంచివారు, అల్లుడిపై అవ్యాజ్యమైన ప్రేమ ఉన్న నలగామరాజు తన పాత్రను అల్లుడికిచ్చి, అల్లుడి చేతి పాత్రను తను తీసుకుంటారు.”

“వినడానికి బాగానే వుంది. కానీ అనుకున్నట్టుగా జరగకపోతే?”

“నిజమే. కీడెంచి మేలెంచటం విజ్ఞుల లక్షణం. మీరు అన్న ఆ ప్రమాదం లేకపోలేదు. కానీ అది జరగదని నా నమ్మకం. ఒకవేళ అదే జరిగితే నలగాముడు పరలోకానికి, మీరు మహరాజ స్థానానికీ చేరుతారు.”

“నాగమాంబా!”

“కంగారు పడకండి! ఒకవేళ మీరనుకున్నట్లే జరిగినా ఇది నీ మంచికే. విషాన్ని మీరిచ్చినట్లు ఎవ్వరూ నమ్మరు. అధికారం మీ చేతుల్లోకి సుఖంగా వచ్చి చేరుతుంది.”

“అదీ నిజమే!” అన్నాడు నరసింగుడు.

**********

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
అలరాజు విడిదిలో కొచ్చేటప్పటికే, నెలరాజు మసక వెన్నెల మలామా వేశాడు భూమికి. ప్రకృతి రవరవలతో పులకించిపోతున్నది. విడిదిమందిరంలో విలాసినులు, పట్టు పరుపుల మీద కూర్చున్న ప్రభువులకు వింజామరలు విసురుతున్నారు.

“భోజనాలు కానిద్దామా?” అన్నాడు నరసింగరాజు.

“దూతగా వచ్చాన్నేను. విందుల కోసం కాదు.” అన్నాడు అలరాజు.

“నీవు భోంచేయకపోతే నాకు తృప్తిగా ఉండదు నాయనా” అన్నాడు నలగామరాజు.

“వీల్లేదు” అన్నాడు అలరాజు.

“కనీసం పానీయాన్నైనా తీసుకో నాయనా” అని అభ్యర్థించాడు నలగాముడు.

అలరాజు వీరకన్నమదాసు వంక కన్నెత్తి చూసాడు. కన్నముడు వద్దన్నట్టు సైగ చేసి “బ్రహ్మన్న గారి మాట మరవకండి ప్రభూ!” అన్నాడు.

అప్పటికే పాత్రలు సిద్ధమైనాయి.

విషపాత్ర నలగాముని చేతిలో ఉంది.

“అంటే ఏమిటి కన్నమా నీ ఉద్దేశ్యం?” అన్నాడు నలగాముడు.

క్షణం నిశ్శబ్దం.

“కూతురి కాపురం కూలదోసుకునేటంత పాషండుడు కాడు నలగాముడు. నీకు అంత భయం ఉంటే నా పాత్ర తీసుకో అల్లుడూ”

“ఫరవాలేదు” అన్నాడు అలరాజు.

“కన్నమ తృపతి కోసం తీసుకో” అన్నాడు నలగాముడు.

నలగాముని చేతిలోని పానపాత్ర అలరాజు చేతిలోకెళ్తే, నాగమ్మ పాచిక పారినట్టుగా ఓ చిరునవ్వును పెదాల మీదికి తెచ్చుకుంది.

ఇచ్చకాలతో, ముచ్చట్లతో కాసేపు గడిచింది.

“వెళ్ళివస్తాను. సెలవ్” అన్నాడు అలరాజు.

“శుభం. అంతా మంచే జరగాలి నాయనా” అన్నాడు నలగాముడు.

దీవించడమైతే దీవించాడు గానీ, తన చేతుల మీదే అశుభం కల్గుతుందనీ, తన చిన్నారి కూతురు పచ్చని బ్రతుకులో చిచ్చు రేగబోయే భయంకరమైన క్షణం ఆసన్నమవబోతోందనీ అతగాడు ఉహించలేకపోయాడు.

తన్న తమ్ముడు, తన మంత్రీ పన్నిన పన్నాగం తన చేతులారా ఇంతటి విపత్కర పరిస్థితికి దారి తీస్తుందని అనుకోవటానికి మాత్రం నలగామునికి ఆస్కారం ఎక్కడున్నది?

అలరాజు గుర్రమెక్కాడు. వెనకనే వీరకన్నమ.

అశ్వాలు ఆఘమేఘాలతో మాచెర్ల వైపు పరుగెత్తుతున్నాయి. రెండు యోజనాలు దూరం రాగానే అలరాజుకు కడుపులో దేవుతున్నట్లైయింది. వాంతి అయింది. భళుక్కున చారెడు రక్తం కక్కాడు. అప్రయత్నంగా అతని చెయ్యి గుర్రం కళ్ళాన్ని బిగదీసింది. ఉరుకులు, పరుగుల మీదనున్న గుర్రం ఒక్కసారిగా ఆగిపోయింది. వెనకనే వస్తున్న కన్నమ అలరాజును అందుకున్నాడు.

“కన్నమా”

“ప్రభూ!”

“కడుపులో మంటలు రేగుతున్నాయి. విషప్రయోగమే జరిగింది. గుండెలు బరువెక్కుతున్నాయి. శరీరం తూలుతున్నది. నువ్వొక్కసారి వెనక్కువెళ్ళి, పేరిందేవితో చెప్పిరా. వేగిరం వెళ్ళిరా” అన్నాడు.

“స్వామీ” అన్నాడు కన్నమదాసు. “ఎంత ఘోరం జరిగిపోయింది ప్రభూ” అని దుఃఖించసాగాడు.

ప్రభువాజ్ఞ మేరకు గుర్రాన్ని వెనక్కు మళ్ళించాడు కన్నమ.

పక్కనే వున్న నాగులేరు నెమ్మదిగా ప్రవహిస్తోంది.

ఆ నాగులేటి గట్టున మహావీరుడు, శత్రుభయంకరుడూ, నిష్కల్మషుడూ ఐన అలరాజు, కత్తిపట్టుకుంటే శత్రుసేనావాహినిని గజగజలాడించగల్గిన యువ వీరుడు, బ్రతుకు చివరి క్షణాల్లో, మృత్యువుకౌగిట్లో చేరబోతున్నాడు.

నాలుక పిడచగట్టుకుపోతున్నది. “తండ్రీ!” అన్నాడు గుర్రన్ని. ఆ క్షణంలో అదొక్కటే అతనికి తోడు, స్నేహితుడు, ప్రియబంధువు. యజమాని మాట విన్న గుర్రం చెవులు నిక్కబొడిచింది.

“దిగలేకపోతున్నాను నాయనా. నువ్వే ముందుకు వంగు” అన్నాడు.

ప్రభువు పలుకులు విన్న గుర్రం నాగులేటి నీళ్ళల్లోకి ముందుకు వంగింది. మరొక్క చారెడు రక్తం కక్కుకున్నాడు అలరాజు. దావానలమైన మంటలు మందుతున్నాయి లోన. గుర్రం నుండి క్రిందకు జారాడు అలరాజు.

బాధను భరించలేక సర్రున కత్తిదీసి పొడుచుకోబోయినాడు. యజమానికి గుర్రం తన డొక్కను అడ్డుపెట్టింది. కత్తి దెబ్బకు ముందుకు తూలింది గుర్రం. దోసిళ్ళలోకి నీళ్ళు తీసుకున్నాడు అలరాజు. ఆ నీళ్ళు నోట్లోకి పోకమునుపే అతని ప్రాణాలు పోయాయి. యజమాని పోయిన కొన్ని క్షణాల్లోనే తనూ ప్రాణం విడిచింది గుర్రం. నాగులేటి నీళ్ళల్లో ఆ ఇద్దరి రక్తం కొట్టుకుపోసాగింది.

పైన చెప్పినది ఒక కథ ఐతే, అలరాజు మరణం పై మరో కథ కూడ ఉంది.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
అలరాజు మీద పగబట్టిన నాగమ్మ ఏకాంత మందిరంలో నలగాముని కలుసుకున్నది. “ప్రభూ! నేను మంత్రి పదవినుంచి విరమించదలచుకున్నాను” అన్నది.

నలగాముడు ఉలిక్కిపడి – “అదేమిటి మహామంత్రిణీ! గురజాల-మాచెర్ల కత్తులు దూసుకుంటున్న ఈ పరిస్థితుల్లో మీరు ఇలా చెయ్యడం బావోలేదు” అన్నాడు.

“ఒక్క షరతు మీద మాత్రమే ఉంటాను”

“ఏమిటది?”

“మాటనిచ్చిన తర్వాత తప్పకూడదు”

“నిశ్చయంగా”

“ఐతే అలరాజును అంతమొందించడి”

“నాగమాంబా?” అన్నాడు ద్గ్గున పీఠం మీదనుంచి లేచిన నలగాముడు. “ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అలరాజు నా స్వంత అల్లుడు. నా చిన్నారి కూతురి సౌభాగ్యం.”

“నేను ధర్మం గూర్చి మాట్లాడుతున్నాను మహారాజా. అతను మీకల్లుడు కావొచ్చు. కానీ మనకు ప్రబల శత్రువు. మీ మంత్రినై మంత్రాంగం నెరపుతున్నది ఎందుకు? మీ క్షేమం, ఈ దేశ క్షేమం కోరి. మహరాజులై మీరు మాత్రం ప్రజా శ్రేయస్సును కోరరా? ఈరోజు సభలో నాపైన కత్తి ఎత్తిన అలరాజు, రేపు మీ మీద ఎత్తడని ఏమిటి నమ్మకం. అతని అడ్దులేకపోవడమే మనకు క్షేమం” అన్నది నాగమ్మ.

నలగాముడు బిత్తరపోయి, అచేనంగా కూర్చుండిపోయాడు. ఆతని మౌనమే అంగీకారంగా భావించింది నాగమ్మ. ఆమె పెదవులపై అప్పుడు పుట్టిన విషపు నవ్వు పల్నాటి చరిత్రలో రక్తపుటేరుల్ని పారించింది.

గురజాలలో “తంబళ్ళ జియ్యరు” అనే పూలమ్ముకునేవాడున్నాడు. పూలమాలలను అందంగా అల్లడంలో వాడు సిద్ధహస్తుడు. పూవు లోపల కాలకూట విషాన్ని కూడా నేర్పుగా కూర్చగల పనివాడు. నాగమ్మ కబురు విని, చిక్కబట్టిన గుండెలతో ఆమె విశల సౌధంలోని ఏకాంత మందిరంలో ప్రవేశించాడు.

“జియ్యరూ! పరమ రహస్యమొకటి చెబుతున్నాను. శ్రధ్ధగా విను. ప్రభువుల మన రాజ్య క్షేమం కొరకు, ప్రజాశ్రేయస్సు కొరకు ఓ కఠినకార్యాన్ని నాకు అప్పగించారు. నీవు అందమైన జాతి పూలతో మాలను కట్టి అందులో విషాన్ని ఉంచాలి. అది వాసన చూసిన వారు తక్షణమే మరణించాలి. నేను చెప్పిన వ్యక్తికి నువ్వే స్వయంగా ఆ మాలను అందించాలి. తెలిసిందా!” అని గద్దించినట్టుగా అన్నది నాగమ్మ.

“చి…చిత్తం. ఆ వ్యక్తి ఎవ్వరో?” అన్నాడు.

కుటిలమైన నవ్వొక్కటి తన్నుకురాగా, విలాసంగా నవ్వుతూ “అలరాజు. మహారాజుగారి ముద్దుల అల్లుడు” అన్నది.

“ఆ(….పేరిందేవిగారి పెనిమిటి. అమ్మా…నేనీ పాపపు పని చెయ్యలేను” అని ప్రాధేయపడ్డాడు జియ్యరు.

నాగమ్మ కనుసైగతో వీరభద్రుడు కత్తి దూస్తే, ప్రాణభయం గుండెల నిండా అలుముకుంటుంటే సరేనని తలవూపాడు జియ్యరు. స్వంత ప్రాణం కంటే తీపి కాదుగా అలరాజు ప్రాణం!

సంధికార్యం ముగించుకుని వెనుదిరుగుతున్న అలరాజు, కన్నమదాసులు “మేడిచెర్ల” అనే ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. సరిగ్గా అక్కడే వారికి ఎదురువచ్చాడు తంబళ్ళ జియ్యరు.

ఆ ఉషోదయపు చల్లగాలిలో జియ్యరు కట్టిన మాలల్లోని జాతి పూల పరిమళలాలు గుప్పుమంటున్నాయి.

ఆ పరిమళాలను ఆఘ్రాణిస్తూ ఆగాడు అలరాజు. “ఓయీ! నీ మాలల సౌరభం అంతా ఇంతా కాదు. ఎక్కడికిన్ని మాలల్ని తీసుకెళ్తున్నావు?” అన్నాడు. “మహామంత్రిణి నాగమ్మ గారి శివార్చన కోసం దొరా” అన్నాడు జియ్యరు.

“హు(…చేయించేవన్నీ కుటిలోపాయాలు, చేసేది మాత్రం శివపూజలా?” అన్నాడు అలరాజు పరిహాసంగా. గట్టిగా నవ్వాడు కన్నమదాసు.

“చూడు! నేను కూడా భగవద్భక్తుడనే. దొంగపూజలను చెయ్యను సుమా! మరి నాకూ ఓ మంచి మాలనిస్తావా?” అన్నాడు హాస్యంగా.

“దొడ్డవారు. మీరడిగితే కాదనగలనా ప్రభూ. నా అదృష్టంఏనని భావిస్తాను. ఈ మాల తీసుకోండి. జాతైన పూలతో అల్లింది. దీని సుగంధం ముందు మిగతావన్నీ తీసికట్టే” అన్నాడు.

కాలకూట విషమున్న మాల అలరాజు చేతికి చేరింది. వారి గుర్రాలలా ముందుకు కదలగానే “మేడిచెర్ల”కు పరుగెట్టి ఓ ఇంటి నెలమాళిగలో దాక్కున్నాడట జియ్యరు. అలరాజు మరణిస్తే ఆతని ప్రక్కనే వున్న కాలయముడులాంటి వీరకన్నమడికి తన మీద అనుమానం రావడం ఖాయమనీ, తన తల వ్రక్కలు కావడమూ తథ్యమని వాడు భయపడ్డాడు.

అఘ్రాణిస్తున్న ప్రతిసారీ కాలకూటం అలరాజు గుండెల్లోకి చేరసాగింది.

అలరాజుకు కళ్ళు తిరుగుతున్నాయి. శ్వాస మందగిస్తోంది. చూపు ఆనకుండా పోతోంది. పువ్వులో వున్నది పరిమళం కాదని, కాలకూటమనీ అర్థమైపోయింది.

“కన్నమా”

“ప్రభూ!”

“చెండులోని విషయం గుండెకెక్కింది. తాళికట్టినదాదిగా, ఏ సుఖమూ ఎరుగని పేరిందేవి, గురజాల అంతఃపురంలో నాగురించి కలలు కంటుంటుంది. ఏనాటికైనా నేను తన దగ్గరికి వస్తానని నమ్ముకుని వున్న ఆ అమాయకురాలి దగ్గరకు వెళ్ళు. నీ అలరాజు రాడని, ఎన్నటికీ రాలేడని చెప్పు. వేగిరం వెళ్ళు. మరో మాట రాయబారం విఫలమయ్యిందని, నాగమ్మ మంత్రాంగానికి ప్రతి తంత్రం చెయ్యాలని నా మాటగా బ్రహ్మన్నకు చెప్పు. పో…పో…” అని కన్ను మూసాడు అలరాజు.

కాలం రాజకీయం పేరుతో, దాయాది వైషమ్యంతో మహావీరుడైన అలరాజును కౄరంగా మ్రింగివేయడాన్ని చూసిన కన్నమదాసుకు పాలుపోవడంలేదు. తను ప్రక్కనేవుండి కూడా ప్రభువును రక్షించుకోలేకపోయాడు.

కొమ్మరాజును ఎలా ఓదార్చాలి? ముద్దుల పేరిందేవికి ఈ విషయం ఎలా చెప్పాలి? మలిదేవుడు, బ్రహ్మన్నలకు ఎలా ముఖం చూపించాలి? చల్లనితల్లి రేఖాంబకు కన్నకొడుకులేడన్న సత్యాన్ని ఎలా చెప్పాలి?

కన్నమ గుర్రం డొక్కలో తంతే, అది సుడిగాలిలా గురజాల వైపుకు దూసుకెళ్ళింది.

పల్నాటి చరిత్రలో – అలరాజు పాత్ర అలా అంతమైపోయింది. పేరిందేవి కన్నీటితో మాత్రమే వ్రాయగల్గిన కథగా మిగిలిపోయింది. 

(సశేషం)

 

Your views are valuable to us!