అధ్యాయం 20 – పల్నాటి వీరభారతం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

గత భాగంలో: ప్రతి చోటా తనను అవమానిస్తున్న అలరాజు అంతం చెయ్యాలని నిశ్చయిస్తుంది నాగమ్మ. అందుకు నరసింగరాజు మద్దతును కూడగడుతుంది. నాగమ్మ, నరసింగరాజు చేయించిన విషయప్రయోగంతో మరణిస్తాడు అలరాజు. ఈ విషయం పేరిందేవికి చెప్పమన్న అలరాజు కోరిక మేరకు గురజాల వైపుకు మళ్ళుతాడు మాల కన్నమ దాసు.



ప్రస్తుత కథ:

రాత్రి రాని భర్త తెల్లవారాకయినా తనను చూడడానికి వస్తాడనుకున్న పేరిందేవి, చీని చీనాంబరాలు అలంకరించుకుని తుదిమెరుగ్గా బొట్టుపెట్టుకోబోతున్నది.

“అమ్మా…పేరిందేవీ!” అనే కన్నమదాసు కేక వినగానే, చేతిలో వున్న కుంకుమభరిణె ఖణేలుమని జారికిందపడింది. ఒక విచిత్రమైన శబ్దం చేసింది. కుంకుమ నేలను రక్తవర్ణంలోకి మార్చింది.

జారిపోతున్న పైటతో, నేలరాలిపోయిన కుంకుమ భరిణె వంక చూస్తూ – “భగవాన్ ! ఏమిటీ అపశకునం” అనే మాటలు అప్రయత్నంగా ఆమె నోటి నుంచి వచ్చింది.

“పేరిందేవీ!”

తనను ఎవరో పిలుస్తున్నారు. ఎక్కడో పరిచితమైన గొంతు. కన్నమునిది కాదుగదా?

“కన్నమా! ఏమిటయ్యా ఆ కన్నీరు?”

“నీ బ్రతుకును కన్నీటిలో కలిపి అలరాజు అస్తమించాడమ్మా. చెల్లెమ్మా! మన నెలరాజు అస్తమించాడమ్మా!” అన్నాడు కన్నమదాసు.

“స్వామీ!” అంటూ కుప్పకూలింది పేరిందేవి.

అలరాజు మరణవార్త భయంకర దావానలంలాగా రచనగరు అంతా చిటికెలో పాకిపోయింది.

గురజాలలో ఎక్కడవిన్నా ఇదే మాట – “అలరాజు విషయప్రయోగంతో మరణించాడు” అని. నలగాముడు, నాగమ్మో – ఎవరో ఒకరు ఈ ఘోరాన్ని చేసివుంటారన్న మాటలు కూడా చాప క్రింద నీరులా పాకాయి.

ఈ వార్త విన్న నలగాముడు కుప్పకూలిపోతే, మొసలి కన్నీటితో “అయ్యో!” అని ఆక్రోశించాడు నరసింగరాజు. “ఎంత ఘోరం జరిగింది మా పేరిందేవికి?” అన్నది నాగమ్మ.

ఈ వార్త విన్న క్షణాన తండ్రీ-పినతండ్రీ-నాగమ్మ ముగ్గురూ నలగాముని మందిరంలో ఉన్నారు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

కాలి మట్టెలు మ్రోగించుకుంటూ, అవతరించిన శోకదేవతలాగా, అక్కడ ప్రత్యక్షమైంది పేరిందేవి. కరుడుగట్టిన స్మశాన నైరాశ్యంలో, ఘోరమైన నిశ్శబ్దం అంతహ్పురాన్ని అలుముకున్నది.

“విన్నారా నాన్నా?” అన్నది పేరిందేవి.

కూతురును ఆ స్థితిలో చూసిన నలగాముడు గుండె బద్దలౌతుండగా – “విన్నాను తల్లీ” అన్నాడు.

తన తలను నలగాముడు నిమరబోతే – “అంటుకోవద్దు. దూరంగా వుండు. నీకు మైల అంటుకుంటుంది” అంది

పేరిందేవి.

“తల్లీ!” అని నలగాముడు తల్లడిల్లితే – ” మరణించింది నా భర్త. నా ఇంటి మైల నీకు సోకడం ఎందుకులే నాన్నా!” అంది పేరిందేవి.

నలగాముడు భరించరాని శోకంతో విలవిల్లాడిపోతున్నాడు. తను చేసిన పాపమేమిటో ఆయనకు తెలిసివచ్చింది. ఇంత దురాగతానికి తనే పాల్పడ్డాడా? రాజ్యకాంక్ష కన్న కూతురి పసుపుకుంకుమకన్నా ఎక్కువా?

“ఏడుస్తున్నావా నాన్నా? ఏడ్వద్దు. కావాలని చేసినదానికి ఏడుపెందుకు? నా బదులు నీవు కన్నీరు పెట్టుకుంటున్నావా? నీ రాజ్యాన్ని ఇక నిశ్చింతగా ఏలుకో! కడసారిగా ఒక్క మాట చెప్పాలని వుంది. బహుశా ఇవి నేను నీతో మాట్లాడే ఆఖరు మాటలనుకుంటాను. పేరిందేవి కన్నీరొలికిన చోట శాంతి ఉండదు. పేరిందేవి నల్ల పూసలు తెగిన ఈ పల్నాటి సీమలో నాలుగు మణుగుల నల్లపూసలు తెగుతాయి. ఇది నా శాపం!” అన్నది.

అటువైపుకు తిరిగి నిలబడివున్నాడు నరసింగరాజు.

“చిన్నన్నా! ఒకసారి నా కళ్ళలోకి చూడు. నీ చిన్నారు పేరిందేవి ముఖంలోకి చూడు. నన్ను నిద్రబుచ్చిన నీ గుండెలను అడుగు – నీవు చేసింది ఎంత క్షమించరాని పాతకమో! కాలి పారాణి ఇంకా ఆరలేదు. కన్నకల తీరలేదు. జీవితపు తొలిభాగం కదలలేదు. కంటి కాటుక రవ్వంత మాయలేదు. కట్టుకున్న బాసికపు ముడిక్రింద కందిన చర్మపు రంగు పోలేదు. తండ్రి తర్వాత తండ్రి వంటి వాడివి – ఏ చేతుల మీద పెళ్ళికూతురుని చేశావో, అదే చేతుల మీదే నన్ను కాటికంపుతున్నావా? నేనుపోయాక ఈ పల్నాటిలో తుమ్మలూ, జిల్లేళ్ళు మొలుస్తాయి. తర్నాల సీమలో రాళ్ళే దొరుకుతాయి. ఇది తథ్యం” అని నాగమ్మ వైపుకు తిరిగింది పేరిందేవి –

“మహామంత్రిణి…నాగమ్మా! నన్ను చూసి ప్రేమతో నవ్వితే, వెన్ను నిమిరితే నమ్మ మోసపోయాను. ఏ ఆడది చెయ్యలేని పాపం చేసి చరిత్రలో ఆడవాళ్ళు చెయ్యలేని పాపమేదీ లేదని ఋజువు పరిచావు. విధవగా, తాత్కాలిక రాజ్యభోగాలతో తుచ్ఛమైన జీవితం గడుపుతున్నావు నీవు. నీ తెలివి నా భార్తను చంపటానికే ఉపయోగపడితే, నీలాంటి దుర్మార్గురాలు ఈ పల్నాటి చరిత్రలో మరొక్కరు పుట్టరు. నీలాగా విధవగా బ్రతకలేను. సూర్యచంద్రుల సాక్షిగా, పల్నాటిసీమ సాక్షిగా, నాగులేటి నీటి సాక్షిగా, గతించిన నా పతిదేవుని పాదాల సాక్షిగా నేను నా భర్తతో సహగమనం చేసి ఇక్కడ అనుభవించలేని సుఖాలను అక్కడ అనుభవిస్తాను. ఇదే నా నిర్ణయం.”

వడివడిగా పేరమ్మ అడుగులు వేసుకుంటూ అంతఃపురం వదిలి బైటికొచ్చింది. అప్పటికే మాచెర్లలో కార్చిచ్చులాగా అలరాజు మరణవార్త చేరిపోయింది.

కన్నమనాయుడు క్రింద కూలి, తట్టుకోలేని శోకంతో “కొడుకా!” అన్నాడు.

అలరాజు తల్లి రేఖాంబ తమిలేని దుహ్ఖంతో “తండ్రీ! నా కడుపున చిచ్చుపెట్టిపోయినావా?” అని కొడుకు ముఖాన్ని గుండెల కదుముని, రాళ్ళు కరిగేట్టు, సర్వ ప్రపంచమూ విలవిల్లాడేట్టు కన్నీరు కారుస్తున్నది.

బ్రహ్మన్న నిరుత్తరుడైపోతే, మలిదేవుడు “అలరాజా! మా కోసం మరణించావా నేస్తం” అన్నాడు.

గుసగుసలతో మాచెర్ల కుతకుతలాడిపోతున్నది.

************

పేరమ్మ అంతఃపురం వదిలి బయలుదేరబోయే ముందు కన్నతండ్రివంక చూసి ఇట్లా అన్నది – “నా పసుపు కుంకుమలు నిండిన ఈ నేలలో క్షామం విలయతాండవం చేస్తుంది. గురజాల వీరులంతా కారెంపూడి రణక్షేత్రంలో నేలరాలిపోతారు. నాలాగా వేలాదిమంది స్త్రీలు విధవలౌతారు.” అని భవిష్యత్తును పలికింది.

మేడిచెర్లలోనే ఉన్న అలరాజు భౌతికదేహం వద్ద పల్లకీ దిగిన పేరిందేవి, భర్త ముఖాన్ని చూస్తూ క్షణం దిమ్మెరపోయి నిలబడి, ఆ తర్వాత ఆపుకోలేని దుహ్ఖోద్వేగంతో, పాదాల మీదపడి “వీరులైన భర్తలు రణభూమిలో మరణిస్తే, భార్యలు వీరపత్నులౌతారు. అధర్మంగా మరణిస్తే విధవలౌతారు. నేను విధవగా గాక సధవగా బ్రతుకుతాను. మీతోటే చితియెక్కి కాలి భస్మమౌతాను.” అన్నది.

ఎవరు చెప్పినా పేరిందేవి వినక, చితినెక్కింది.

(రచయిత వివరణ: చరిత్రలు ఎప్పుడూ ఒకేరకంగా వివరించబడి ఉండలేదు. ఒక చిన్న విషయం మీద రకరకాల అపప్రథలు, నిర్ధారణలూ, విమర్శలూ మనం చూస్తూనే వుంటాము. సాహితీ పరమైన విమర్శలతో, పాక్షికమైన అనుభవాన్ని, అనుభూతులనూ, స్పష్టమైన నిర్ధారణలనూ ఏర్పరచుకోవడం విజ్ఞులైన పాఠకుల వంతు.

ఐతే, ఈ వీరభారతంలో, ‘ఇట్లా ఖచ్చితంగా జరిగిందీ అనే విషయాన్ని రచయితగా నేను (చిట్టిబాబు) నిర్ధాకరించకపోవటానికి కారణం అదే. నాకు తెలిసినంత వరకూ – నాకు తెలిసిన విషయాలను ఉల్లేఖించాను. రసజ్ఞులైన పాఠకులు తమకు ఇష్టమైన దానిని, ఖచ్చితం అనుకున్నదానిని మాత్రమే తీసుకోమని ప్రార్థిస్తున్నాను.

కొన్ని చరిత్రల్లో పేరిందేవి పల్లకీ ఎక్కి మేడిచర్ల వచ్చేదాక, కొనవూపిరితో కొట్టుకుంటున్న అలరాజు ఉన్నాడని రాయబడ్డది. విషయప్రయోగం జరిగిన తర్వాత ఇన్ని గంటలు అలరాజు బ్రతికి ఉండడం వీలుపడని విషయమని అనిపిస్తుంది. ఒకవేళ అట్లా బ్రతికివుంటే, మనుషులు జాలి చూపకపోయినా మృత్యువు జాలిచూపి, తన భార్యను కడసారి చూసుకోవటం కోసం అలరాజును బ్రతికించిఉండాలి. లేక పేరిందేవి భర్తతో ఆఖరి పల్కులు పల్కటం కోసమైనా అలరాజు బ్రతికి ఉండిఉండాలి.

తండ్రులు మోసం చేసినా, చావు మోసం చెయ్యక, కనీస సానుభూతులతో పేరిందేవి కోసం అలరాజును కొద్దిక్షణాలు బ్రతికించివున్నట్లైతే, మనుష్యుల ఇష్టజన సఖీసఖ పరివారం కన్నా మృత్యువు స్నేహపాత్రురాలు, విశ్వాసమరమైనదని రూఢిగా చెప్పవచ్చు. అలరాజు పేరిందేవి వచ్చేదాక బ్రతికేవున్నడన్న కథ ఇలా సాగుతుంది.)

పల్లకీ దిగిన పేరిందేవి భర్తను చూసి కంటికి కడివెడుగా కన్నీరు కార్చి – “ప్రభూ! వీరుడవైన మీకు ఈ దుర్గతి ఏమిటి?” అని వాపోయింది.

ఏడుస్తున్న పేరిందేవి కన్నీటిని తుడిచి, హీనమైన స్వరంతో “దేవీ!” అని, చెప్పదల్చుకున్న చివరి మాటను తనలోనే మిగుల్చుకుని అలరాజు మరణించాడు.

మరణించిన అలరాజు శరీరాన్ని మేడపి చేర్చారు. మాచెర్ల వీరులంతా తలో కొమ్ము కాసారు.

మరణించిన అలరాజు శరీరాన్ని సుగంధద్రవ్యాలతో, రుద్రాక్ష, బిల్వ పత్రాలతో కప్పారు. పెద్దబొట్టు పెట్టుకుని, పెదాల మీద గంభీరమైన చిరునవ్వు నుంచుకుని, పేరమ్మ చితినెక్కింది.

ఎక్కి – “పల్నాటి వీరులారా – ప్రజలారా – ప్రభువులారా! నేడు నా భర్తతో సహగమనం చేస్తున్నాను. మీ తోబుట్టువు పేరిందేవి చివరి కోరిక ఒకటి ఉంది. పల్నాటి చరిత్ర తన రాజకీయ పాచికలాటలో నా భర్తను మ్రింగేసింది. నా భర్తను అక్రమంగా, ఘోరంగా చంపిన నరసింగరాజు శిరచ్ఛేధం చేస్తామని వీరులైనవారెవరైనా తమ మాటగా చెబితే, తృప్తిగా సహగమనం చేస్తాను. అలాంటి వారు ఎవరైనా వున్నారా?” అన్నది పేరిందేవి.

చేరిన జనసందోహం మౌనం వహించింది.

అలరాజు అంత్యక్రియలను చూడ్డానికి వచ్చిన వాళ్ళల్లో బాలచంద్రుడు కూడా ఉన్నాడు. పేరిందేవి మాటలు అతనిలోని కావేశాన్ని రగిల్చాయేమో, చటక్కున ముందుకు వచ్చి “నీ భర్త చావుకూ, నీ సహగమనానికీ, మీ పచ్చని బ్రతుకులిలా అర్థాంతరంగా ముగియడానికీ మూలకారణమైన ఆ నరసింగరాజు తల నరికి, బల్లానికి గ్రుచ్చి వాడి చరితను నేను ముగిస్తాను సోదరీ! నీవు హాయిగా నీ భర్తతో స్వర్గభోగాలనుభవించు. పల్నాటి చెన్నకేశవుని మీద ఆన” అన్నాడు.

పేరమ్మ తృప్తిగా బాలచంద్రుని వంక చూసి, భర్త పార్థివదేహం ప్రక్కనే పడుకుంది.

నాలుగు మూలలా నిప్పంటుకున్నది. భగభగలతో, భుగభుగలతో అగ్నిహోత్రుడు ఆ పవిత్ర దంపతులిద్దరినీ తనలో కలిపేసుకున్నాడు.

అలరాజు మరణంతో పల్నాటి చరిత్రలో మొదటి అంకం పరిసమాప్తి అయిందనే చెప్పవచ్చు.

**********

ఈ మొదటి అంకం ముగింపుగా చిన్న సమీక్ష చెయ్యాలి.

కీ.శే. త్రిపుర్నేని రామస్వామి చౌదరిగారు పల్నాటి చరిత్రను గురించి విపులమైన పరిశోధనలు చేసారు. వారు ఈ క్రింది అర్థం వచ్చేలా ఒక వాక్యాన్ని వ్రాసారు:

“ఉత్తర హిందూస్తానంలో జరిగిన భారత కథను (వ్యాస భారత కథను) తలచుకునే తెలుగు జాతి, తన కళ్ళ ముందే జరిగిన పల్నాటి వీరభార కథను ఎందుకు తలచుకోదు?” అని.

దానికి ఒకేఒక్క సమాధానం కనిపిస్తుంది. ఆంజనేయుడి బలంలాగా, తెలుగువారు తమ వీరచరిత్రల జోలికి, తమ కీర్తి ప్రతిష్టల జోలికి పోరు. అందుకే తెలుగువారు అన్ని రంగాల్లోనూ రాణించగలిగినా, సరైన గుర్తింపుకు నోచుకోరు.

ఈ విషయంలో శ్రీనాథ కవిసార్వభౌముడు తెలుగువాడయివుండి, తెలుగుజాతికి తీరని మహాపకారం చేశాడని చెప్పాలి. ఆయన వ్రాసిన ప్రతి కావ్యమూ, సుశాస్త్రీయమైన పద్య, గద్యాలలో వుంటే పల్నాటి కథను మాత్రం కేవలం “ద్విపద”గా వ్రాసాడు. ఎందుకలా అన్న ప్రశ్నకు “ఏమో!” అనే సమాధానం చెప్పాలి.

ఒక్క వీరభద్ర కవి మాత్రం పల్నాటి చరిత్రను “వీరభారతం”గా మధుర గంభీరమైన పద్యకావ్యంగా వెలయించాడు. కానీ అది తెలుగువారి ప్రజాదరణ పొందలేదు. “ఎందుకలా?” అన్న ప్రశ్నకు సాహితీప్రియులందరూ తమకు తామే సమాధానం వెదుక్కోవాలి.

ఇలాంటి వీరోచిత చరిత్రను, సాహిత్యాన్ని మర్చిపోయి, తెలుగునాడు-తెలుగువాడు స్వయంకృతాపరాధులైనారా? లేదా?

అచ్చమైన తెలుగు చరిత్రకు ఆలవాలమైన “పలనాడు” మీద శ్రీనాథుడు వ్యంగ్యపూరిత, హీనమైన పద్యాలను కొన్నింటిని చెప్పాడు. చాటువులుగా చెలామణి అయ్యే ఈ పద్యాలను ఆయనే చెప్పాడా? లేక ఎవరో చెప్పి ఆయన మీద రుద్దారా? అనేది కూడా ఇవ్వాళ పరిశోధకులు దీర్ఘంగా ఆలోచించవలసిన విషయం.

తెనాలి రామకృష్ణ కవి వ్రాసినవి చెప్పుకుని, పిచ్చి సాహిత్యం విచ్చలవిడిగా ప్రచారం చేసినప్పటి శ్రధ్ధను ఇలాంటి వీర కావ్యాలపై కూడా పెడితే వచ్చే నష్టమేమిటి? కష్టమేమిటి?

ఐతే ఇక్కడో మరో తిరకాసు కూడా ఉంది.

ఒక్క బాలచంద్రుడి యుద్ధఘట్టాన్ని మాత్రమే వ్రాసి శ్రీనాథుడు ఊరుకుంటే, కొండయ్య, మల్లయ్య అనేవారు మిగతా భాగాలను పూర్తిచేశారనే విషయం ఒకటి చర్చలోనే ఉంది. ఒకవేళ అట్లాగే జరిగితే, ఈ మంజరీ ద్విపద కావ్యం శ్రీనాథుని పేర ఎట్లా బైటికొచ్చింది?

నిజానికి ఈ వీరచరిత్రకు సంబంధిచిన పుణ్యం “శ్రీ అక్కిరాజు ఉమాకాంతం” గారికి చెందాలి. ఎందుకంటే తెలుగుల వీరచరిత్రకు తెలుగుకే సమర్పించిన తొలి తెలుగు కవి ఆయన. కృతజ్ఞతతో నమస్కరించటం మినహా చేయగలిగినదిలేదు. ఆ తర్వాత, శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు సమగ్ర పల్నాటి చరిత్రను వెలువరించారు.

మహామహులైన ఈ ఇద్దరు “కాంతులూ” లేకపోతే, ఈ వీరచరిత్ర సాహితీ ప్రపంచంలో సముచిత స్థానాన్ని పొందలేకపోయేదేమో. ఈ వెలలేని విలువైన చరిత్ర – జానపదుల పిచ్చికుంటల, వీధిభాగవతుల బ్రతుకు తెరువుకు మాత్రమే ఉపయోగించడం విచారకరం.

సాహితీ ప్రయోజనం లేని, చౌకబారు కథగా ఇది మిగిలిపోతే సిగ్గుతో మనం “మన చరిత్రకు పట్టిన దుర్గతి ఇదా?” అని సిగ్గుతో తలదించుకోవద్దా?

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
పల్నాటి వీరభారతానికి సముచిత న్యాయం జరిగి తీరాలి. వ్యాస భారతం – తెలుగు భారతాన్ని క్లుప్తంగా సమీక్షిస్తే –

1. శ్రీకృష్ణుడు – బ్రహ్మనాయుడు:

భారతంలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో, పల్నాటి భారతంలో బ్రహ్మన్న అంటే గొప్పవాడు. ఇద్దరూ అఖండమైన తెలివితేటలుగల రాజకీయ చతురులు. ఇద్దరికీ వ్యక్తిపూజలు జరిగాయి. ఇద్దరూ తమ తమ కథాకాలంలో అగ్రగణ్యులు.

2. ధర్మరాజు – నలగాముడు:

ధర్మరాజుకు జూదపు పిచ్చి ఉన్నది. నలగామునకు కోడిపోరు పిచ్చి. ఐతే, అధర్మయుద్ధంలో ధర్మజుడు ఓడి, నలగాముడు గెలిచాడు. ఎవరు గెల్చి, ఎవరు ఓడారన్నారన్న ప్రశ్న కాదు. యుద్ధం సంభవించడానికి ఎంతవరకు కారణభూతులు అన్నది.

3. ద్రౌపది – నాగమ్మ:

ఆభిజాత్యంతో ద్రౌపది. అహంకారంతో నాగమ్మ – ఈ యుద్ధాలను చేయించారు. ఐతే ద్రౌపది అవమానింపబడి, అలిగి, కన్నీరు పెట్టుకుంది. పుట్టింటివారితో కలిసి యుద్ధం చేయిస్తానని ప్రతిజ్ఞలు చేయిస్తే, నాగమ్మ రాజసంతో యుద్ధాన్ని చేయించింది. ఏమైనా నాగమాంబ తెలుగువారి ఆడపడచు, మానవంతురాలు.

4. అభిమన్యుడు – బాలచంద్రుడు:

వీరుడైన అభిమన్యుడు. పద్మవ్యూహంలో, దెబ్బలు తిని నిరుత్తడుడై ఆయుధహీనులనైనా చంపి వీరమరణం పొందాడు. వీరుడైన బాలచంద్రుడు రణరంగంలో చావుదెబ్బలు తిన్న ఆఖరి క్షణంలో కూడా రణసూత్రాలను పాటించాడు. చేతిలో ఆయుధం వున్నవారిని మాత్రమే సంహరించాడు. పేరిందేవికి ఇచ్చిన మాటప్రకారం నరసింగరావు తలతెగన్రికి, “వీర మరణం” పొందాడు. ఏమైనా బ్రహ్మన్న కొడుకు కదా!

కీ.శే.త్రిపుర్నేని రామస్వామి చౌదరిగారు ఏమన్నారంటే – “ఒకవేళ అభిమన్యుడు – బాలచంద్రుడూ బ్రతికి ఉండి, రణభూమిలో వదిలితే ఎవరు గొప్ప వీరులో అన్న విషయంలో బలాబలాలు తెలిసివుండేవి.” అన్నారు.

పాఠకులు ఈ విషయాల్ని ఆలోచించగలరు:

రాయబారాలు:

భారతంలో సంజయ రాయబారం జరిగితే, పల్నాటి వీరభారతంలో భట్టు రాయబారం జరిగింది. అలానే కృష్ణ రాయబారం తో పోల్చదగ్గది అలరాజు రాయబారం. కృష్ణుడు భగవంతుడు కాబట్టి కౌరవుల హత్యాయత్నాల్ని తిప్పికొట్టగలిగాడు. కేవల మానవుడైన అలరాజు వీరుడైనా కూడా ప్రత్యర్థుల కుట్రలకు బలయ్యాడు.

అజ్ఞాత, వనవాసాలు:

పాండవులు పన్నెండు సంవత్సరములు, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తే, మలిదేవాదులు ఏడు సంవత్సరాలు అరణ్యవాసం చేసారు. మొదటి కథలో మాయా పాచికలాట కారణమైతే, రెండవ కథలో కోడి పందేలు.

యుద్ధక్షేత్రాలు:

పాండవ, కౌరవ యుద్ధం “కురుక్షేత్రం”లో జరిగితే – నలగాము, మలిదేవుల యుద్ధం “కారెంపూడి”లో జరిగింది. రెండు చోట్లా జరిగింది దాయాది యుద్ధాలే.

అక్కసు పట్టలేని దుర్యోధనాదులు విరటుని ఆలమందల్ని పొడిస్తే, నలగాముడు చెంచుల పల్నేటితో ఆలమందలను పొడిపించాడు.

ఏది ఎట్లా జరిగినా – మహాభారతంతో సరిసమానంగా పల్నాటి వీరభారతం గౌరవాన్ని పొందలేకపోయింది. వ్యాస భారతం అఖండ భారతాన్నీ తన్మయత్వంలో ముంచెత్తితే, తెలుగు భారతాన్ని తెలుగువారే ఆదరించలేదు. దీన్ని మన ఖర్మ అని సరిపెట్టుకుందామా?

సశేషం…

Your views are valuable to us!