క్రితం భాగంలో: శాంతిపూర్ణమైన సంధిని ఆశించి భట్టును రాయబారిగా పంపుతాడు బ్రహ్మన్న. అధికార, భోగ లాలసుడైన నలగాముడు రాయబారాన్ని తిరస్కరిస్తాడు. గురజాల వీరులు గాజులు తొడుక్కోలేదని, కారెంపూడి రణక్షేత్రంలోనే సమాధానమిస్తామని అంటాడు. ఆవిధంగా భట్టు సంధి విఫలమౌతుంది. |
ప్రస్తుత కథ:
పేరిందేవి సహగమనం తర్వాత బాలచంద్రుడిలో చాలా మార్పులొచ్చినాయి. అదివరికటిలాగా అతను స్వేచ్ఛగా సంచరించటం లేదు. ఐతే, స్వతహాగా సంక్రమించిన కొన్ని సుఖాలకు అతను బానిసైపోయాడు. స్త్రీ ప్రలోభిగా అతన్ని పల్నాటి చరిత్ర వర్ణిస్తున్నది.
ప్రపంచంలో గొప్పవాడనుకున్న ప్రతివాడికీ కొన్ని బలహీనతలున్నాయి. బాలచంద్రుడి బలహీంత స్త్రీ, ఆటలు.
ఐతే చితి ఎక్కబోయిన పేరమ్మ అన్న చివరిమాటలు అతని చెవిలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనేవున్నాయి. వీరరక్తం ఇప్పుడిప్పుడే అతని రక్తనాళాల్లో ఉరకలు తీయటం మొదలెట్టింది.
కొడుకులో వస్తున్న ఈ మార్పులను ఐతాంబ గ్రహిస్తూనేవున్నది. ఐనా కొడుకుతో ఆమె ఈ విషయాలను ఎన్నడూ ముచ్చటించలేదు. నిజానికి బ్రహ్మన్న కోరుకుంటున్నది కూడా అదే.
కర్తవ్యం నుంచి, వీరత్వం నుంచి, యుద్ధంనుంచి బాలచంద్రుణ్ణి విముఖుడిగా చేయటమే ఆ దంపతుల ప్రయత్నం. ఎందుకంటే, జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం అతను యుద్ధక్షేత్రంలో చిచ్చర పిడుగు. అమిత ఉద్రేకి. కత్తిపట్టుకుంటే కాలుడే.
కారెంపూడిలో వీరులంతా యుద్ధానికి సమాయత్తమైవుంటే, మేడపిలో బాలచంద్రుడు కాలాన్ని నిర్లక్ష్యంగా గడుపుతున్నాడు. యుద్ధవార్త ఎప్పుడు వచ్చినా, అతను దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. దాదాపూ సమవయస్కులైన అన్ని జాతులవారు బాలచంద్రుడికి స్నేహితులుగా ఉన్నారు.
బాలచంద్రుడికి ఇష్టమైన ఆట “బొంగరాల” ఆట. ఆ ఆటలో అతను సిద్ధహస్తుడు.
బాలచంద్రుడు రేపు బొంగరాల ఆట తన స్నేహితులతో ఆడుతున్నాడనే వార్త మేడపిలో పొక్కింది. (ఆ రోజుల్లో బొంగరాల ఆటకు పల్నాటిలో అంత ప్రాముఖ్యత ఉండిఉండవచ్చు. అంతేకాక బాలచంద్రుడు బొంగరాల ఆటకు ఆ ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైన ఖ్యాతిని పొందివుండాలి – రచయిత)
‘రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా?’ అన్నట్లు, ఐతాంబ కొడుక్కు బంగారపు బొంగరాన్ని చేయించి ఇచ్చిందట.
ఐతే ఐతాంబకు బాలుడు బొంగరాల ఆట ఆడటం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకనో ఆమె ఆత్మలో అశుభం పొడసూపుతున్నది. అవన్నీ లక్ష్యపెట్టేవాడు కాదు బాలచంద్రుడు.
నయాన-నయగారానా ఎన్నో హితవులు చెప్పి “నీ కొద్దు నాయనా ఈ ఆట!” అన్నది ఐతాంబ. బాలుడు ఇదేమీ వినబడనట్లు నటించి పయనమయ్యాడు.
మేడపిలో విశలమైన రాజవీధులున్నాయి. రచ్చల్నీ, రాచబాటల్నీ వదిలి, ఊరికి దూరాన వున్న విశలమైన రావిచెట్టు నీడన బొంగరాలాట మొదలైంది. ఈ బొంగరాల ఆట చూడటానికి జనం కిటకిటలాడారని పల్నాటి చరిత్ర చెబుతున్నది.
కంటిగింపైన ఆట అది. వయసుతో పిటపిటలాడే జవరాళ్ళు గిర్రున బొంగరం నేలలో దిగుతున్నప్పుడు ఏదో అవ్యక్తమైన మధుర భావనలతో తేలిపోవడం మొదలెట్టారు.
బాలుడు బొంగరాల ఆట ఆడే రావిచెట్టుకి దగ్గరలో ఒక స్వచ్ఛమైన మంచినీటి కొలను వున్నది. ఆ కొలనుకు దగ్గరలో ఉన్న పేటలో ఇద్దరు అక్కచెల్లెళ్ళవంటి స్నేహితురాళ్ళు ఉండేవారు. ఒకరు బ్రాహ్మణ కన్యైతే, మరొకరు వైశ్యకన్య.
బాలుడి బొంగరాల ఆట చూట్టానికి ఇద్దరూ నీళ్ళు తెచ్చే వంకబెట్టుకుని బిందెలు తీసుకుని బయలుదేరారు. వాళ్ళ అసలు ఉద్దేశ్యం అందగాడైన బాలచంద్రుణ్ణి దగ్గరనుంచి చూడాలని. “అపర మన్మథుడు, పుష్పబాణాల్లాంటి నూనూగు మీసాలతో, తుమ్మెద రెక్కలాంటి కంటి రెప్పలతో, వాడి చూపులతో కన్నె వయసు గుండేల్ని ఝల్లుమనిపించగల అందగాడటే అతను. చూసివద్దాం పద” అని ఒకరినొకరు చూసుకుని చెప్పుకున్నారు.
వాళ్ళు వచ్చేసరికే ఆట మొదలైపోయింది.
EXPLORE UNTOLD HISTORY
ప్రజలు కేరింతలు కొడుతున్నారు. వెళ్ళ మధ్యనుంచి విడివడి, సర్రునమని నేల మీద జారి, చిత్ర చిత్ర ప్రదక్షణాలు చేస్తున్న ఈ విచిత్రమైన బొంగరాలాట ప్రజల్లో అద్భుతాశ్చర్యాలను కలిగిస్తున్నది.
బాలచంద్రుడు అందగాడు, వీరుడనే ఖ్యాతితోబాటు చిలిపి చేష్టలు చేసేవాడన్న అపప్రథ కూడా వున్నది. మొత్తానికి ఆడవాళ్ళు బాలుడికి దడుస్తారన్నది నిర్వివాదాంశం. అలాంటి బాలుణ్ణి చూడ్డానికి బయలుదేరిన ఈ ఇద్దరు యువతుల్లో బ్రాహ్మణ యువతి పేరు తెలియరాదు. వైశ్య పడుచు పేరు “అన్నమ్మ”.
ఆలస్యంగా వచ్చిన ఈ ఇరువురు స్త్రీలు ప్రజల్ని తోసుకుంటూ ముందు వరుసలోకి వచ్చారు.
ఆలోపే బాలుడు బొంగరాన్ని వేగంగా తిప్పి వదిలిపెట్టేసాడు. అది గిర్రున తిరిగి, జర్రున జారి, అన్నమ్మ కాలిని అంటుకున్నది. వాడిగా వున్న బొంగరం ములుకు ఆవిడ కాలిలో లోతుగా దిగింది. బాధను భరించలేని అన్నమ్మ మూర్ఛపోయింది. శైత్యోపచారాలతో తేరుకున్న అనంతంరం, అన్నమ్మ కళ్ళు తెరిచి ఆ భయంకరమైన బాధను భరించలేక ఇట్లా అన్నది:
“పిరికిపందా! ఆడవాళ్ళను బాధించటమే ప్రజ్ఞ అనుకున్నావు కదూ! మేడపిలో ఇప్పుడు మిగిలింది ఆడవాళ్ళు, పిరికిపందలైన మగవాళ్ళు మాత్రమే. మీ తండ్రులు, పెద్దలు, మిగిలిన వీరులందరూ కారెంపూడి రణక్షేత్రంలో కత్తులు నూరుతుంటే, పిరికిపందవై బొంగరాల ఆటలో ఆడవాళ్ళను హింసిస్తున్నావు నువ్వు. మలిదేవుడిచ్చిన అపార ధనాన్ని చూసుకుని మదమెక్కిపోయివున్నావు. వీరుడివైతే, మగతనమే వుంటే యుద్ధంలో సాటి మగవాళ్ళతో పోరాడు. ఇలా ఊరిమీద పడి పోతుటెద్దులా తిరక్కు. నీకు సిగ్గెయ్యడం లేదు?”
ఈ మాటలతో, ఐతాంబ పెంచుకున్న ఆరుగురి బిడ్డల్లో ఒకడైన అనపోతు కోపం తెచ్చుకుని, మహోగ్రుడై, ఈటెతో అన్నమ్మను పొడవబోయినాడు. కానీ, బాలచంద్రుడు అడ్డుపడి “సోదరా అనపోతు! తప్పు. అన్నమ్మ పనిగట్టుకు అనలేదు. స్త్రీ సహజమైన కోమలత్వంతో, తీవ్రమైన బాధను ఓర్చుకోలేక నన్ను అన్నది. దానికి నీవు ఉద్రేకపడాల్సిన పనిలేదు.’ అని – అన్నమ్మ వైపు తిరిగి
“తల్లీ! క్షమించు! నాకు జ్ఞానోదయం కలిగించావు. నీవు అన్న మాట అక్షరాలా నిజం. అజ్ఞాతంగా, స్థబ్దుగా బ్రతుకుతున్న నాకు సరైన మార్గాన్ని చూపించావు. వీరభిక్ష పెట్టావు. ఔను! వీరులైన వాళ్ళు అబలల్లాగా ఇళ్ళల్లో బ్రతక్కూడదు. బ్రతక్కూడదు” అని అక్కడునించి కదిలాడు.
బొంగరాల ఆట ఆవిధంగా సమాప్తమైంది.
వీరుడైన బాలచంద్రుడు, మండే సూర్యునిలా ఇంటికొచ్చి, గంభీరమైన స్వరంతో “అమ్మా!” అన్నాడు.
సంధ్య వాలిపోయింది. పశ్చిమాద్రికి కుంకుమ రంగు పులిమి, సూర్యభగవానుడు, సముద్ర గర్భంలోకి కుంకిపోతున్నాడు. ఆ అసుర సంధ్యా క్షణాన ఐతాంబ సంధ్యా దీపం వెలిగిస్తున్నది.
కొడుకు గొంతులో వచ్చిన మార్పును పసిగట్టి “ఏమిటి నాయనా?” అన్నది.
“ఈ బ్రతుకు దుర్భరంగా ఉందమ్మా” అన్నాడు బాలచంద్రుడు.
“అంటే – “
“కారెంపూడి రణక్షేత్రంలో ధర్మాధర్మాలకు సమరం జరుగబోతున్నది కదామ్మ. నేనేమో పిరికిపందనై ఇక్కడే ఉంటున్నాను. కత్తులతో కుత్తుకలు తెగబోతున్న సమయాన మేడపిలో ఆడదానిలా బ్రతికే నా తుచ్ఛ జీవితం వెగటు కల్గిస్తున్నది. ఇప్పటికైనా అనుజ్ఞ ఇవ్వమ్మా. నన్ను నేనుగా బ్రతకనివ్వు”
ప్రొద్దున ఆటకు వెళ్ళబోయే కొడుకులో కేవలం బాల్య ఉద్రేకాన్ని చూసింది. బాలుడైన బాలచంద్రుణ్ణి చూసింది. కానీ ఇప్పుడు అదే కొడుకులో ప్రభంజనమైన వీరత్వాన్ని చూస్తోంది. అందుకని –
“నాయనా, ముక్కు పచ్చలారనివాడివి. పట్టుమని పదహారు వయసుకూడా నిండని పసివాడివి. పసికూనకు యుద్ధనీతులు తెలియవు. ఎత్తుకు పై ఎత్తు వేసే శక్తి ఉండదు నాయనా!” అన్నది.
బాలచంద్రుడు నవ్వి “కొదమసింగానికి పంజా విసురులో ఒడుపు సహజంగానే వస్తుందమ్మా. నేను సింగపు కూనను. కత్తి చేతిలో వుంటే ఫాలాక్షుణ్ణైనా ప్రతిఘటించగలవాణ్ణి. వీరమాత తన బిడ్డకు వీరత్వానికి బదులు పిరికిపాలు పోస్తున్నందుకు ఆశ్చర్యంగా వున్నది” అన్నాడు.
కాలం కాసేపు స్తబ్దుగా ఉంది. నిశ్శబ్దం.
నీలపు ఆకసాన జారే పువ్వుల్లా నక్షత్రాలు మెరుస్తున్నాయి. ప్రొద్దు ఇంకొంచెం పైకెగబ్రాకింది. ఐతాంబ వెలిగించిన దీపం రక్తం చిందుతున్నట్ట్లు వెలుగు నిస్తున్నది.
వెలిగే దీపపౌ కాంతిలో బాలచంద్రుడి ముఖం మండే ఇనబింబంలా వున్నది.
తన కడుపున పుట్టి, ఎక్కడో దూరంగా పెరిగిన కూన, తనకు వీరత్వాన్ని గురించి బోధిస్తుంటే, నీటిపొరతో మసకబారిన కళ్ళతో, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఐతాంబ. ఇలాంటి వీరుల్ని ఆపి ప్రయోజనం లేదని ఆవిడ మనసు అంటోంది.
ఆమె సంబాళించుకుని ” నాయనా! నీకు తోచిందే చేయడం తప్ప, నేను చెప్పేది వినే స్థితిలో నువ్వు లేవు. ఎన్నో నోములు నోచగా, పుట్టిన మురిపాల బాలచంద్రుడిని వదిలి బ్రతుకలేను తండ్రీ!” అంది.
“ఐతే, నా బ్రతుక్కు ప్రయోజనమేముందమ్మా?”
“నాయనా! యుద్ధమంటే ఏమిటో అనుకుంటున్నవు. ఏనుగులు, రథాలు, కత్తులు-బల్లాలు, కదం త్రొక్కే గుర్రాలు, వగ ఎక్కిన పగవారు – ఎందరో ఉంటారు. పాలుగారే పసికూనవు. యుద్ధ ధర్మాలు, మర్మాలు, మోసాలు, కాపట్యాలు నీకు తెలియవు నాయనా!” అంది.
“అమ్మా! వీరులు ధర్మయుద్ధంలో వీర మరణం చెందుతారు. తమ యశశ్చంద్రికలను దిగంతాల దాకా వ్యాపింపజేసుకుంటారు. నన్ను కన్నందుకు నీవు, నీ కడుపున పుట్టినందుకు నేను శాశ్వత కీర్తిని పెంపొందించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. నన్ను దీవించు!” అన్నాడు బాలచంద్రుడు. అతని గొంతులో స్థిరత్వం నిండివున్నది.
ఐతాంబ ఆవాక్కయిపోయింది.
నిజమే! సింహం పిల్లకు వీరత్వాన్ని గురించి ప్రత్యేకంగా బోధించాల్సిన పని లేదు. ఆఖరి అస్త్రంగా కొడుకును యుద్ధవిముఖుణ్ణి చేయడానికి ఐతాంబ అంది – “నాయనా, నీ భార్య మాంచాలను ఒక్కసారి చూసిరా. యుద్ధరంగానికి వెళ్ళబోయేముందు నిన్ను కోరే నా తుది కోరిక. హెచ్చరిక కూడా”
“అలాగే అమ్మా!” అన్నాడు బాలుడు.
సశేషం…
*************