క్రితం భాగంలో: బాలచంద్రుణ్ణి యుద్ధ విముఖుణ్ణి చెయ్యాలని భార్య మాంచాల వద్దకు పంపుతుంది బాలచంద్రుని తల్లి ఐతాంబ. వేశ్యాలోలుడైన భర్త మొదటసారిగా తనను చూడ్డానికి వచ్చాడన్న ఆనందంలో ఉన్న మాంచాలకు “వీరపత్ని”కర్తవ్యాన్ని బోధిస్తుంది ఆవిడ తల్లి రేఖాంబ. ఆవిధంగా యుద్ధోన్ముఖుడైన బాలచంద్రుణ్ణి వీరగీతాలతో ఉత్తేజపరుస్తుంది మాంచాల. బ్రాహ్మణుడైన అనపోతును యుద్ధానికి తీసుకెళ్ళకూడదని కోరుతుంది. “తథాస్తు” అంటాడు బాలచంద్రుడు. |
ప్రస్తుత కథ:
కారెంపూడికి బయలుదేరిన బాలచంద్రునికి భార్య మాంచాల కోరుకున్న చివరి కోరిక గుర్తున్నది. అనపోతును యుద్ధరంగానికి తీసుకుపోకూడదు. అందుకని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక్క అనపోతుకు తప్ప అందరికీ ఈ విషయాన్ని చెప్పాడు.
కొన్ని క్రోసుల దూరం పోయాక, బాలచంద్రుడు తన స్నేహితుడైన “పట్టి” అనే పేరున్న కుమ్మరి వీరుణ్ణి “తమ్ముడా! వీరహారం మర్చిపోయి వచ్చాను. ముద్దుటుంగరమూ మర్చాను. మీ వదినమ్మ మాంచాల గదిలో వుండి వుంటాయి. నేనివ్వమన్నాని చెప్పి మీ వదిన్నడిగి పట్టుకురా” పట్టి పరికించి బాలుడి ముఖంలోకి చూసి – “అన్నా! ఆయాసంగా వుంది. వెళ్ళలేను క్షమించు.” అన్నాడు.
చాకలి చందు, కమ్మరి ముత్తు, వెలమల దోర్నీడు – ఇత్యాదులంతా ఏదో ఒక కుంటిసాకు చెప్పారు.
ఆఖరుకు మిగిలిందొక్క అనపోతు మాత్రమే.
“తమ్ముడా! అనపోతు! ఈ ఒక్క సాయమూ చేసిపెట్టు. ముత్యాలహారమూ, ముద్దుటుంగురమూ పట్టుకురా” అన్నాడు. బాలచంద్రుడి మాట కాదనలేక అనపోతు బల్దేరుతూ “వదినమ్మ అడిగితే ఏమి ఆనవాలు చెప్పనూ?” అన్నాడు.
బాలచంద్రుడు స్నిగ్ధంగా నవ్వి “కంఠాన వున్న ముత్యాలహారం తెగి క్రిందపడిందనీ, పూసలు ఏరబోయే వేళ అవి తీసి తల్పం తలగడక్రింద దాచానని చెప్పు” అన్నాడు.
ఈ మాటలు యథార్థమని నమ్మిన అనపోతు శీఘ్రంగా బయల్దేరాడు.
EXPLORE UNTOLD HISTORY
ఇది రాసి – అనపోతు వచ్చే మార్గంలో అతనికి కంపించేట్లుగా చెట్టుకు కట్టివచ్చాడు. శీఘ్రమే కారెంపూడికి బయల్దేరాడు. మార్గంలో వీరగాధలను వల్లించుకున్నారు. బ్రాహ్మణ అనపోతును ఇంటికి పంపినందుకు చాలా సంతోషించారు.
మధ్యలో నాయకురాలి కనుమ వున్నది. వీరులైనవారు కాళ్ళ మధ్యనుంచి దూరరాదు. బాలచంద్రుడు తన తమ్మ్ళ్ళతో వస్తున్నాడని విన్న నాగమ్మ ఈ కొండ నుంచి ఆ కొండ మీదకు కాళ్ళు జాపి నిలబడితే, బాలచంద్రుడు తన కత్తితో ఆ కొండను నరికి దోవ ఏర్పరిస్తే ఆ దారికి “నాయకురాలి కనుమ అని పేరొచ్చిందని కట్టుకథల్ని చెబుతారు.
(ఇటువంటి ఉత్ప్రేక్షాపూరితమైన కథలతోనే పల్నాటి చరిత్ర పంకిలమైపోయింది. సుమారు ఆరున్నర శతాబ్దాల క్రితం జరిగిన పల్నాటి చరిత్రలో ఇటువంటి ఉత్ప్రేక్షలు చాలా వున్నాయి. పాఠక సౌలభ్యం కోసం వాటిని చాలా వదిలివేసాను. కొన్నింటిని వద్దనుకున్నా వ్రాయకతప్పలేదు – రచయిత)
నల్లగొండ శిఖరం మీద కొద్దికాలం విశ్రాంతి తీసుకుని బాలచంద్రుడు కనుమలు, గిరులు దాటి కారెంపూడి దరిదాపులకు వచ్చేసాడు. బాలచంద్రుడి మనస్సులో ఉన్నది ఒక్కటే – “అలరాజును హతం చేసిన నరసింగరాజు తలకొట్టి పెదమలిదేవుడికి కానుకగా ఇవ్వాలి”
కారెంపూడిలో మాచెర్ల సేనలు సమాయత్తమయ్యాక గురజాల ప్రజల, వీరుల గుండెల్లో లేనిపోని భయాలు ఆవహించాయి. అందరిదీ ఒకే ప్రశ్న.- “ఈ యుద్ధం ఎందుకు వచ్చిందో”నని.
ఐతే పెదమలిదేవుడు, బ్రహ్మన్నల అపూర్వ పర్యవేక్షణలో కారెంపూడిలో కాలుపెట్టాక అప్పటి దాకా బింకంతో వున్న నాగమాంబ ధైర్యస్థైర్యాలు వడలిపోవటం మొదలుపెట్టాయి. గెలుపు తమది కాదేమోనన్న భయం పట్టుకున్నది.
నలగాముని ఏకాంత మందిరంలో కల్సుకుని “విన్నారా ప్రభూ?”
“ఏమిటి?”
“మలిదేవుడు తన సేనలతో కారెంపూడికి కదలివచ్చాడు. ఈ యుద్ధం అనివార్యమా?”
“మహామంత్రిణీ! తీరా అంతా నిశ్చయమయ్యాక ఇదేం ప్రశ్న?”
“మనం సంధికోసం ప్రయత్నిస్తే?”
“నగుబాటు కాదా ఈ నలగాముడికి!”
“ప్రజాశ్రేయస్సు కోసమైనా – ఈ పని చెయ్యాలి!”
“మరి భట్టు రాయబారం నాడే సంధి చేసుకుంటే పోయేదిగదా?”
నాగమ్మ తలపంకించి “ఇంత తొందరగా మాచెర్లవాళ్ళు మన మీదకి దండెత్తి వస్తారని ఊహించలేకపోయినాను. ఏమీ ఫరవాలేదు. నేను సంధి ప్రయత్నాలు చేస్తాను” అన్నది.
“మీ ఇష్టం” అన్నాడు నలగాముడు.
నాగమ్మ నలగాముని ఏకాంతమందిరం నుంచి బైటకు వచ్చి, తక్షణమే తమవైపు ముఖ్యమైన నలుగురు రాజులను పిల్చి బ్రహ్మనాయుడి దగ్గరకు రాయబారం పంపింది. అందులో –
“పెదమలిదేవా! జరిగిన పాత పగలు ప్రజాశ్రేయస్సు కోసం మర్చిపోదాం. మీకు ధర్మంగా రావలసిన రాజ్యభాగాన్ని మీకు ఇస్తాను. అలరాజును మా నరసింగరాజు చంపాడని మీరు భావిస్తే నరసింగుని మీకు అప్పగిస్తాను. ఇట్లు, నలగామరాజు, గురజాల ప్రభువు” అని.
సంధి కుదర్చటానికి వచ్చిన నలుగు రాజుల్లో ఒకడైన “చింతపల్లి రెడ్డి” ఈ పత్రాన్ని చదివి వినిపించాడు.
కొలువు దీరివున్న పెదమలి దేవుడు “యుద్ధరంగంలో సేనలు సమాయత్తమైనాక గానీ, నలగామరాజుకు కళ్ళు తెరిపిడి పడలేదా? తీరా అంతా నిశ్చయమయ్యాక ఈ సంధి సంప్రదింపులేమిటి? నలుగురూ నవ్వరా? మనమూ నగుబాట్ల పాలుగామా?” అని ప్రశ్నించాడు.
బ్రహ్మన్న కోరమీసం దువ్వి “రణరంగంలో బలాబలాలు తేల్చుకుందామనుకున్న నాగమాంబ ఇప్పుడు ఇట్లా మారిందేమిటి? స్త్రీలకు చపలత జన్మహక్కు కాదుగదా?” అన్నాడు.
దీర్ఘకాల తర్జనభర్జనలు జరిగాక లోకకళ్యాణం కోసం, పల్నాటి పచ్చదనం కోసం, ఈ సంధిని ఆమోదించారు.
ఐతే –
నల్లకొండ మీద నుంచి క్రిందకు పరికించిన బాలచంద్రుడికి అసంఖ్యాక సేనావాహిని కారెంపూడి రణక్షేత్రం దాపున కనిపించింది. బాలుడు అపరిమితానందంతో, ఉద్రేకంతో పల్నేటి భుజాన చేయివేసి – “వీరపల్నేటీ – పల్నాటి వీరుల వీరత్వం ఖండఖండాంతరాలకూ తెలిసిపోయే క్షణం ఆసన్నమయింది. ఒక్కసారి ఈ ఆఖండ సేనావాహినిని వీక్షించు! నల్లకొండను చీల్చుకుని ప్రవహించే ఈ నాగులేటి వురవడి, పల్నాటి వీరుల వీరి రక్తంలో విజృంభిస్తున్న నాగులేటి నీళ్ళూ, ఈ కొండరాళ్ళూ వీరత్వం నాలుగు దిక్కులా పంచిపెడుతూ అమర సందేశాలు వినిపిస్తాయి.
కురుక్షేత్ర వీరుల్లగా నలగాముని సేనాధిపతుల్ని ఇప్పుడు పరిచయం చేస్తాను. విను –
పడమటి దిక్కుల్లో ‘పౌజుల్ల బ్రహ్మన్నా’
కదనరంగమ్ములో కొదమ సింగమ్ము
తూర్పుదిక్కున దిక్కు ‘గణపతీ’
యుద్ధ ధర్మములోన ‘గుణపతీ’
దక్షిణ భాగమ్ములో మంత్రి ‘నాగమ్మా’
మంత్రాంగమ్ములో ‘అమ్మలకు అమ్మా’
ఉత్తరమ్మున ఉన్నవాడు ‘రామన్నా’
కత్తియుద్ధములోన పెద్ద పేరన్న
వీర హెచ్చరిక జేయు ‘నరసింగరాజూ’
పేరమ్మ పెనిమిటిని కూల్చిన్నవాడు
మనసాటి ఎవ్వరూ మహిలోన లేరు
మనతోటి పోరు వీరు లింకెవరు?”
బాలచంద్రుడి మాటలు విన్న పేర్నీడు “అన్నా! నీవు చెప్పినట్లు నేల నాలుగు చెరుగులా సైన్యం సమాయత్తమై వున్నది. ఈ కొండనుండి మార్గం అర్థం కావటం లేదు. వెళ్ళాలంటే శత్రు సైన్యాన్ని వెనకనుంచి దాటాలి. వెనకనుంచి చెణికేవాడు వీరుడు కాడు, భీరుడు! అక్కడ పరిస్థితి ఎట్లా వుందో మనకు తెలియదు. ఈ మహాప్రవాహం లాంటి సైన్యాన్ని చూసి – తెలివిగల్గిన నాగమ్మ ఆఖరిక్షణాల్లో సంధి ప్రయత్నమూ చెయ్యవచ్చు. ఏం చేద్దాం?” అన్నాడు.
“ఇది ప్రస్తుతం ఆలోచించాల్సిన విషయమే!” అన్నాడు బాలచంద్రుడు.
దోర్నీడు క్షణం ఆలోచించి “వీరులకు వీరుడై పగవారి గుండెలో పదును బల్లానివై శత్రు శిరస్సులను తుత్తునియలు చేయగల నీకు చెప్పగలిగేదేమున్నది? మనం కనుమ దిగి, రాచబాటన పెదమలిదేవుణ్ణి కల్సుకుందాం. ప్రభువుల ఇష్టం వచ్చినట్లు చేద్దాము. ఏమంటావ్?” అని ప్రశ్నించాడు.
బాలుడు తలవూపి “అట్టాగే” అన్నాడు.
బాలచంద్రుడు ఆ తర్వాత “సవరాల గోడిగ” అనే జాతి గుర్రాన్ని అధిరోహించి – అలరాజు తనకిచ్చిన అమూల్య ఖడ్గాన్ని వరలో దోపి – కాలం వృధా అవుతున్నదని కళ్ళాలు బిగబట్టి, గుర్రంలో డొక్కలో ఒక్క తన్ను తంతే – అది కుప్పించి, గాలిలో తేల్తున్నట్లు నల్లగొండ నుంచి ఒక్క ఉదుటున క్రిందకు చెంగలించింది.
దూకిన గుర్రం సకిలించింది.
అప్పటిదాకా స్థబ్దుగా వున్న రణక్షేత్రం కొండ మీంచి దూకిన గుర్రాన్ని చూడగానే గుండెలవిసిపోయినట్లు బిత్తరపోయింది యుద్ధభూమి అతలాకుతలమయింది.
సశేషం…