క్రితం భాగంలో: మాంచాల కోరిక మేరకు బ్రాహ్మణ అనపోతును యుద్ధరంగానికి రానివ్వకుండా చేసేందుకు తన ముద్దుటుంగురం, ముత్యాలహారం తీసుకు రమ్మని వెనక్కి పంపుతాడు బాలచంద్రుడు. మాచెర్ల సైన్యాన్ని చూసిన తర్వాత, ధైర్యం దిగజారిన నాగమ్మ నలగామరాజును ఒప్పించి సంధి ప్రయత్నం చేస్తుంది. నరసింగరాజును అప్పగించడానికి నలగాముడు అంగీకరించడంతో నాగమ్మ సంధిని ఒప్పుకుంటారు బ్రహ్మన్న, మలిదేవుడు. ఇంతలో, తన తమ్ముళ్ళతో బాటు అక్కడకు చేరుకుంటాడు బాలచంద్రుడు. సహజ ఉద్రేకీ, మహావీరుడైన బాలచంద్రుడి ఆగమనాన్ని చూసి మాచెర్ల వీరుల్లో కలకలం మొదలౌతుంది. |
ప్రస్తుత కథ:
కొండ దిగి వచ్చిన దోర్నీడు, మిగతా వీరులు బాలచంద్రుణ్ణి కలుసుకున్నారు.
బాలచంద్రుణ్ణి చూడగానే – “నరసింగరాజు మృత్యువు కొండ దూకి వచ్చింది” అని వీరులు మనస్సుల్లో అనుకున్నారు.
బాలచంద్రుణ్ణి చూసి విస్తుబోయిన బ్రహ్మన్న “నువ్వెందుకు వచ్చావు?” అని ప్రశ్నించాడు.
“వీరుల్ని అడిగే అధికారం ప్రభువులకు కూడా లేదు!”
బాలచంద్రుడి వదనం చూడగానే సంధికొచ్చిన రాజుల గుండెలు ఝల్లుమన్నాయి. “ఉద్రేకీ – నిష్కపటి – అజేయుడూ అయిన బాలచంద్రుడు వచ్చి వాలితే ఇక సంధి పొసగదు” అని అనుకున్నారు
“ఇంతకూ నీవు వచ్చిన పనేమిటి?” అన్నాడు కన్నమదాసు.
“ప్రభువులను చూడాలి!”
“వీలుపడదు”
“ఎందుకని?”
“వారు ఏకాంత మందిరంలో ఉన్నారు”
“అందుకే చూడాలి!”
కన్నమ కళ్ళెర్రజేసి “ఇక్కడ కన్నమ వుండగా అది అసాధ్యం!” అన్నాడు.
ఈమాటలతో ఉగ్రుడైన బాలుడు కన్నమ తొడమీద కాలువేసి – సముద్రం దాటటానికి బయల్దేరిన వీరహనుమంతుడిలా, కుప్పించి దూకి, అడ్డొచ్చిన సైనికులను పక్కలకు నెట్టి మలిదేవుని ముందుకు వచ్చి నిలబడ్డాడు.
EXPLORE UNTOLD HISTORY
బాలచంద్రుడు శాంత గంభీర స్వరంతో “ప్రభూ! నేను చేసిన నేరమేమిటి? ప్రభువులు పలికని వైనమేమిటి?” అని ప్రశ్నించాడు.
బాలచంద్రుడు చేసిన ఈ పనికి మాల కన్నమ కుపితుడై, ఒరనుంచి కత్తి తీసి “ఇంతమంది పెద్దలుండగా నువ్వొక్కడివే వీరుణ్ణనుకున్నావా? ఈ ఆగడమేమిటి? ప్రభువులతో ఎలా మెలగాలో తెలియని పసివాడవు! నీకు యుద్ధమేమిటి? ఈ కత్తితో రెండుగా నరుకుతాను, వీరుడివైతే కాసుకో!” అన్నాడు.
బాలచంద్రుడు కళ్ళు నిప్పుల్లా చేసి “కన్నమా! వీరత్వాన్ని గురించి, వీరులు బీరాలు పోవక్కర్లేదు. అది వీరత్వం కాదు. యుద్ధం చేయటానికి మీ చేతుల్లో చేవలేదు. ఉంటే ఇప్పుడు సంధి ప్రయత్నాలేమిటి? అడవుల్లో, కొండల్లో, కోనల్లో బ్రతకరాని బ్రతుకు బ్రతికిన మీలో శౌర్యలక్ష్మి స్థానం వీడిపోయింది.. చేవచ్చిన చేతులతో, తుప్పుబట్టిన కత్తులు పట్టుకుని ఏదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు కబుర్లు కావు, కార్యం కావాలి. నాపై కళ్ళెర్రజేయడం కాదు, కదనరంగంలోకి దూకడం నీ ప్రస్తుత కర్తవ్యం. కారెంపూడి రణదేవతలకు మనుష్యరక్తం కావల్సివస్తే నన్ను నరుకు, కానీ ఇలా వ్యర్థమైన కబుర్లు చెప్పకు” అన్నాడు.
“కుర్రతనంపోని బాలుడివి! అతి ప్రేలాపనలు వద్దు. ప్రభువుల ముందు ఎలా పల్కాలో తెల్సుకో పో!” అన్నాడు కన్నమ.
బాలచంద్రుడు కోపాన్ని సంభాళించుకుని – “యుద్ధం చేయదల్చుకోక కారెంపూడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. మహామంత్రులు బ్రహ్మన్న గారు ప్రభువుల ముందు నిర్భీతిగా మాట్లాడే అధికారం నీకు ఇచ్చారనుకుంటాను. ఐతే తెలియక అడుగుతున్నాను, వారికి నీవేమవుతావు?”
కన్నమ సూటిగా బాలుడి ముఖంలోకి చూసి – “పసివాడని పసివాడివి. ఐనా అడిగావు గనుక చెబుతాను – బ్రహ్మనాయుడు నాకు తండ్రితో సమానం. నాకు ప్రత్యక్ష దైవం. ఆయనే నా తండ్రి. అందువల్ల నీకు అన్నను. మొదట నేను, ఆ తర్వాతే నువ్వు. తెలిసిందా!” అన్నాడు.
బాలచంద్రుడు చిత్రమైన నవ్వు నవ్వి – “నా కన్నా ముందుపుట్టిన అన్నా! కన్నమా! నీ తమ్ముడు, నీ తొడ ఎక్కడం తప్పు కాదే? ఆ మాత్రానికే ఇంత కోపం తెచ్చుకోవాలా?” అని ప్రశ్నించాడు.
ఆ మాటలు వినగానే కన్నమ కోపం కరిగిపోయింది. బాలచంద్రుడి పసిముఖాన్ని చూడగానే ఆర్ద్రతతో ద్రవించి -“తమ్ముడూ! నన్ను క్షమించు! అలవిమానిన కోపంతో నిన్ను అనరాని మాటలన్నాను”.
అప్పటికీ నిశ్శబ్దంగా కూర్చున్న మలిదేవుడి వైపు తిరిగి, కుపితస్వరంతో బాలుడు ఇట్లా అన్నాడు –
“కోడిపందెం మోసమని తెల్సినా ఆనాడు నోరు మెదపలేదు. అలరాజును చంపినా, ఆలమందలను పొడిపించినా, ‘శాంతం, శాంతం’ అని పల్నాటి క్షాత్రాన్ని మంటగలిపారు. పేరమ్మ కన్నీటిని ఆనాడు తుడవలేకపోయారు. అడవుల్లో ఆకుల్ని అలమల్ని తిని, జీవించడంలోనే మీకు ఆనందం లభించివుండవచ్చు. కానీ, అధర్మమని తెలిసినా, రాజ్యాన్ని తెచ్చుకోకపోవడం తప్పు. నేను బాలుణ్ణనీ, పిరికిపందననీ, అర్హత లేనివాణ్ణని పలకరించకుండా వున్నారా లేక ప్రభువులమన్న అహంకారమా?”
బాలచంద్రుడి మామ గండు కన్నమ కోపం వచ్చిన అణుచుకుని “జరిగిపోయిన వాటిని త్రవ్వుకుని ప్రయోజనం లేదు నాయనా! ధర్మం అనేది ఒక జ్యోతి. వెలుగు కావాలంటే ధర్మానికి కట్టుబడక తప్పదు. విజ్ఞుడైన బ్రహ్మన్న మాటలను మేము పాటిస్తున్నాం. యుద్ధం చేయలేక కాదు; చేతకాకా కాదు. ఇక తప్పులంటావా? అవి ఇరుపక్షాల్లోనూ ఉన్నాయి.
రాజ్యవిభాగం, అలరాజు హత్య, ఆలమందల్ని పొడవడం, భట్టు రాయబారాన్ని నిరాకరించడం – ఇవన్నీ నలగాముడి తప్పులే. అంత మాత్రాన రక్తపాతాలు చేసుకోవటం తగదు.
యుద్ధం వస్తే ఒక్కపూటతో అది ఆగదు. ధన, మాన, ప్రాణ నష్టాన్ని కలిగించకుండా మానదు. దాయాదిని మించిన శత్రువులు ఇంకెవరూ ఉండరేమో! రాజ్యం కోసం దాయాదుల మధ్య యుద్ధం రాక మానదు. అందువల్ల తాత్కాలిక సంధి ప్రయత్నాల్ని ఒప్పుకోవడంలో తప్పులేదు.” అన్నాడు.
దానికి బాలచంద్రుడు – “మామా! నన్ను పసివాడని ఎద్దేవా చేయడం తగదు. పేరమ్మ చితి ఎక్కినప్పుడు, ఆమె ఆత్మశాంతి కోసం నరసింగరాజు తల తెగ నరుకుతానని మాట ఇచ్చాను. ఆ మాట వమ్ముగావల్సిందేనా?” అని ప్రశ్నించాడు.
సభలో ఎవ్వరూ పలుకలేదు.
ఆ మౌనంతో, బాలుడు ఉదయించే సూర్యబింబంలా, ఎర్రబడ్డ ముఖంతో –
“కదలరా ఓ మామ గండు కన్నమ్మా
వీరమాతవ్వాలి నిను కన్న అమ్మ
దూకరా దూకరా కొదమ సింగమ్మా
పగవారి గుండెలో పదును బల్లెమ్మా
అలరాజు పోయేనే మామ కొమ్మన్నా
చచ్చెనా నీలో చేవ ఏమన్న!
అంబులను ధరియించు – ఆహవం చెయ్యి
వచ్చి వాలును తల్లి రణలక్ష్మి నీకు.
ఆవాలా నాయుడా! అసహాయ శూరా
యుద్ధక్షేత్రమునకై కదలిరా వీరా
కదన రంగమ్ముల్లో పదును కత్తుల్తో
పగవారి తలల్తో బంతులాడేమురా!
వీర పడవాలుడా – వీరులకు మగడా
ఆసన్న మాయెరా, అనుకున్న రోజు
బల్లెమ్ము ధరియించి బలిపెట్టవేరా
రణభూమి నెత్తుటా జలకమ్ములాడు
బాదన్న – నారన్న – బ్రహ్మనాయుండా
కదలండి కదలండి కదలరేమండి?
మెరిసె తూర్పున కాంతి, మేఘాల కొనల
శుభమస్తు మీకంటు దీవించు మనల
వీరులారా రండి – విజయమ్ము మనది.
శూరులారారండి – శుభమౌను మనకు.”
ఈ పల్కులతో సభలోని మాచెర్ల వీరుల్లో రోషం హెచ్చింది.
“ఔను! ఇంతకాలం సహించాం. ఇక సహించవలసింది లేదు. అన్నిసార్లు నాగమ్మే తన మాటను చెల్లుబాటు చేసుకుంటోంది. ఇక ఆగి ప్రయోజనం లేదు. బాలుడన్నట్లు యుద్ధరంగంలోకి కదుల్దాం.”
ఉన్నట్టుంది పరిస్థితి సంపూర్తిగా మారిపోయిందని గ్రహించిన బ్రహ్మన్న “వీరులారా! కాసేపు మీ ఉద్రేకాన్ని తగ్గించుకోండి. బాలచంద్రుడితో నన్ను మాట్లాడనివ్వండి.” అన్నాడు.
వీరుల్లో శాంతం వచ్చినా గుసగుసలు మాత్రం పోలేదు.
“బాలచంద్రా! రా నాయనా! కొమ్మరాజా, బావా గండ్ కన్నమా – మీరూ రండి.”
బ్రహ్మనాయుణ్ణి అనుసరించి వాళ్ళంతా వేరే గుడారంలోకి వెళ్ళారు.
*****
సశేషం