అధ్యాయం 1- పల్నాటి వీరభారతం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]




తెలి వులిపిరి తెరల మధ్య తెల్లవారీ ఆరకముందే, పక్షులన్నీ గూళ్ళనుంచి బైటికి వొచ్చీ రాకముందే – తేనెటీగలు పూవుల మీద ముసిరీ ముసరకముందే, “జిట్టగామాలపాడు” ఉత్తరాన వున్న బీళ్ళలో ఆరవల్లి రామిరెడ్డి అరక దున్నుతున్నాడు.

సూర్యుడు మబ్బుల మీద షికారుకు బైల్దేరినవేళ రామిరెడ్డి “చుట్ట” అంటించుకోవటానికి నిలబడ్డాడు. చేను నానుకుని, నాలుగ్గజాల దూరంలో, గట్టు మీద పెద్ద పాముపుట్ట ఉంది. రామిరెడ్డికి సుప్రభాతపు వెలుగు పర్చుకుంటున్నప్పుడు “కేర్ … కేర్ ..” మనే ఏడుపు వినిపించింది.

అతను ఛటక్కున ఆగిపోయాడు.

అరక దున్నే దాపలిగిత్త “అంబా” అన్నది.

రామిరెడ్డి చుట్టుపక్కల కలయజూసాడు.

పచ్చటి వెలుగు వ్యాపించుకుంటున్న పల్లెల మీద పడి మెరుస్తున్న నీరెండ.

మళ్ళా “కేర్ … కేర్ ..”మన్న రోదన.

***********

రామిరెడ్డి అరక ఆపి, గట్టుకొచ్చాడు. పుట్ట పక్కన బుట్టలో ఏడుస్తున్న నెత్తురుగుడ్డుగా వున్న పిల్ల. చిన్ని నోరు తెర్చి, కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటూ ఏడుస్తున్నది.

రామిరెడ్డికి ఆశ్చర్యంగా వున్నది.

చుట్టు ప్రక్కల ఎక్కడా నరసంచారం లేదు. ఐతే ఈ బుట్టలోకి ఎక్కణ్ణుంచి వచ్చిందీ పసిపాప?

రామిరెడ్డి ఛటుక్కున పిల్లకు ఉత్తరీయం ఒత్తుగా పెట్టి భుజానికెత్తుకుని ఊళ్ళోకివచ్చాడు.

పిల్లల్లేని తనకు “నాగదేవత” కరుణించి ఇచ్చిన ఈ పిల్లకి “నాగమాంబ” అని పేరు పెట్టాడు.

తను భుజాన వేసుకొచ్చిన ఈ చిన్ని కూన, మున్ముందుటి పల్నాటి చరిత్రలో రక్తపాతాలు చేయిస్తుందని రామిరెడ్డి కేమి తెలుసు?

**********

గురజాలను రాజధానిగా చేసుకుని అనుగురాజు పరిపాలిస్తున్నాడు. అతని తమ్ముడు బిరుదురాజు. అన్న మాట జవదాటని వ్యక్తి.

అనుగురాజుకు ముగ్గురు భార్యలు.

మొదటి భార్య వీరవిద్యాదేవి. “విజ్జెలదేవీ” అని అనుగురాజు ఆవిణ్ణి ముద్దుగా పిలుస్తూండేవాడు.

రెండవ భార్య “భూరమాదేవి”. ఆఖరి భార్య “మైలమాదేవి”.

చందవోలు ప్రభువును యుద్ధంలో జయించిన అనుగురాజును పరిణయమాడిన మైలమాదేవి పల్నాటి సీమను ఆరణంగా తెచ్చుకున్నది.

మైలమాదేవిని అసమాన సౌందర్యవతిగా చెప్పుకుంటారు. ఐతే అనుగురాజు వైష్ణవుడు. అనుగురాజుకు కనకాద్రి చెన్నకేశవస్వామి ఇష్టదైవం.

కలలో కనిపించిన చెన్నకేశవుడు గురజాలను రాజధానిగా చేసుకోమని అనుగురాజుతో చెప్పాడని, అందువల్ల గురజాలే రాజధాని అయ్యిందనీ జనప్రతీతి.

ఏదిఏమైనా, అనుగురాజు ప్రజారంజకంగా ప్రజల్ని పరిపాలించి దేశాన్ని సుభిక్షం చేసాడు.

**********

ముగ్గురు భార్యల్లో చిన్నదైన మైలమాదేవికి పుట్టిన ఏకైక సంతానం నలగామరాజు జ్యేష్టుడై ఉండాలి. ఎందుకంటే, అనుగురాజు తర్వాత రాజ్యపాలనాధికారం అతనికే సంక్రమించింది.

ఇక మొదటిభార్యకు జన్మించిన ముగ్గురు కొడుకుల్లో పెదమల్లిదేవుడు పెద్దవాడైతే, పినమల్లిదేవుడు, బాలమల్లిదేవుడు ఆ తర్వాతివాళ్ళు.

రెండవభార్య శివభక్తురాలు. ఆవిడకు కామరాజు పెద్దకొడుకైతే, నరసింగ, జెట్టి, పెరుమాళ్ళురాజులు ఆ తర్వాతివాళ్ళు.

ప్రజారంజకుడైన ప్రభువూ, పతివ్రత ఐన ఇల్లాలు దేశ శుభానికి చిహ్నాలు.

అనుగురాజు దగ్గర ఉన్న సేనాని “వీర తెప్పలి నాయుడు”. కత్తి పట్టుకుంటే కదనరంగాన ఎదురు లేదనిపించుకున్న మహావీరుడతను.

వీర తెప్పలి నాయనికి అజమాయిషీ క్రింద పల్నాటి పౌరులు శత్రుభయం లేకుండా నిశ్చింతగా నిద్రపోయారు. వీరతెప్పలి నాయుడు చాలా రాజ్యాల్ని జయించాడు. అతని కత్తికి, పల్నాటి ప్రతిపత్తికి ఆనాడు ఎదురులేదు. ఆఖరుకు అతను చెక్కించిన శిలాశాసనాల్లో —

అవని రాజులెల్ల అతివలే –
అనుగురాజొక్కడే పురుషుడనగ నొప్ప”

– అని ఉండేది.

అనుగురాజుకు ముఖ్యమంత్రి “దొడ్డనాయుడు”. దొడ్డవాడే గాక దొడ్డ ఆలోచనలు గలవాడు.

అతనికి “పెద్దన్న నాయుడు”, “బ్రహ్మన్న నాయుడు” అని ఇద్దరు కొడుకులు.

అందులో చిన్నవాడైన బ్రహ్మనాయుడు అఖండమైన తేజస్సుగలవాడు. విశాలమైన బాహువులతో, చురుకైన కళ్ళతో పదునుపెట్టిన పల్నాటి వీరఖడ్గంలా ఉండేవాడు.

దొడ్డనాయుడికి తన చిన్నకొడుకు బ్రహ్మనాయుడి మీద చాలా ఆశలుండేవి.

పల్నాటి చరిత్రలో అతగాడు వహించవలసిన ప్రముఖ పాత్ర చాల ఉన్నదని, దొడ్డనాయుడు బ్రహ్మనాయని చిన్ననాటే పసిగట్టాడు.

సశేషం

**********

Your views are valuable to us!