అనుగురాజు తర్వాత పల్నాటి ప్రభువైన నలగామరాజు కూతురు పేరిందేవి. నలగామరాజుకు పేరిందేవి ఏకైక సంతానం. పల్నాటికంతా అందమైన పిల్ల. నాయనమ్మ మైలమాదేవి దగ్గర ఆ పిల్లకు గారాబమైతే, చిన్నాన్న నరసింగరాజు పేరిందేవిని కంటికి రెప్పల్లే చూసుకుంటాడు. (నలగామరాజూ భార్య మరణించి ఉండాలి. పేరిందేవి తల్లిని గురించి, పల్నాటి చరిత్రలో ఎక్కడా, ఎవరూ ఉటంకించలేదు. నిజానికి నలగాముని భార్య మరణిస్తే అది చాలా విచారించాల్సిన విషయమే. ఇవ్వాళ ఆవిడ పేరిందేవి ముద్దు పలుకులు వింటానిక్కానీ, ముద్దు చేష్టల్ని చూడ్డానిగ్గానీ లేదు.)
ఇప్పుడు పేరిందేవికి ఆరేళ్ళు. ఇల్లంతా కళకళలాడుతూ తిరుగుతూ ఉంటుంది. నిజానికి పేరిందేవికి తండ్రి దగ్గరకన్నా చిన్నాన్న నరసింగరాజుకు మాలిమి ఎక్కువ. నలగాముడు తన కూతురు పేరిందేవిని, తన బావమరిది కొమ్మరాజు కొడుకు అలరాజు కివ్వాలని అనుకుంటూ ఉండేవాడు. మైలమాదేవి నవ్వుతూ – “పేరిందేవీ! మీ బావ అలరాజును చేసుకుంటావా?” అంటే – చక్రాల్లాంటి కళ్ళని తిప్పుతూ “ఓ…చేసుకుంతాను” అనేది పేరిందేవి.
**********
అలరాజుకు అప్పటికి పదేళ్ళు. చదువులో, కత్తిపట్టటంలో, గుర్రపుస్వారీలో మాహాయోధుడనిపించుకునేంత నైపుణ్యం సంపాయించాడు. పుట్టగానే పరిమళించే పువ్వుకు విలువెక్కువ కదా? – అలరాజు నెలరాజులాంటివాడు. నెలరాజు కళలు పెరుగుతున్నట్లు అలరాజు ధైర్యసాహసాలు పెరుగుతూ వచ్చాయి.
సింహానికి పంజా వొడుపు – వీరుడికి విల్లంబు విడుపూ ఎవరూ నేర్పనక్కర్లేదు.
అలరాజును చూసుకుని, వీరుడైన కొమ్మరాజు మీసం దువ్వుకుంటూండేవాడు.
పేరిందేవిని కొమ్మరాజు కోడలిగా అంతఃపురంలో చెప్పుకునేవాళ్ళు.
నలగాముడు పేరిందేవిని ఎత్తుకుని – “కొమ్మరాజు కోడలా” అంటే ఆరేళ్ళ పేరిందేవి తండ్రి గుండెల మీద వాలి, సిగ్గుతో నవ్వి “ఊ!” అనేది.
కాలచక్రంలో మరో పదేళ్ళు ముందుకు సాగింది.
EXPLORE UNTOLD HISTORY
******
తన తమ్ములతో నలగామరాజు ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నడు.
ఒక ఉదయం నలగాముడు రాజసభలో ఉన్నాడు. మంత్రి బ్రహ్మనాయుడు రాచకార్యం నిమిత్తం పొరుగూరికి వెళ్ళాడు.
దూత వొకడు సవినయంగా నమస్కరించి “తమ దర్శనార్థం జిట్టగామాలపాడు వాస్తవ్యురాలు ఆరవల్లి నాగమాంబ వచ్చియున్నారు. లోపలికి పంపమని తమరు ఆజ్ఞ ఇస్తే…”
“అవశ్యం” అన్నాడు నలగాముడు.
పరస్పర పరిచయాలయ్యాక –
“ప్రభూ…తమ తండ్రిగారైన అనుగురాజుగారు ఒకనాడు నాకు వ్రాసి ఇచ్చిన పత్రమిది. ఏలినవారు దీనిని చదివి తమ అభిప్రాయం విన్నవించగలరు” అన్నది.
“సోదరా…నరసింగరాజా! పత్రాన్ని చదివి వినిపించు”
నరసింగరాజు చదివాడు..
******
మృగయా వినోదార్థం వేటకెళ్ళి – అలసిన ప్రభువులకూ, పరివారానికి నాగమ్మ చేసిన సేవలు అద్భుతములు. రాజభక్తిపరాయణురాలైన నాగమ్మకు, ఆమె కోరిన్నాడు పల్నాటి సీమను ఎవరు పరిపాలిస్తున్నా ఆమె అభ్యర్థించినట్లు, ఏడుగడియల కాలం మంత్రిత్వాన్ని మంజూరు చేస్తున్నాము. – అనుగురాజు, పల్నాటి ప్రభువు”
రాజముద్రతో, కన్నతండ్రి చేవ్రాలుతో వున్న పత్రాన్ని చూసిన నలగామరాజు తండ్రి వాగ్దానం ప్రకారం నాగమ్మను మంత్రిణిగా చేసాడు.
నాగమ్మ “నాయకురాలు”గా మారింది. చేతిలో కొచ్చిన అధికారాన్ని పదిలపర్చుకోవడం మొదలెట్టింది.
నాగమ్మలో ధైర్యమెక్కువ. కత్తి పట్టటం నేర్చుకున్న నాగమ్మ, రాజకీయరంగంలో మోసాన్ని బాగా ఆకళింపు చేసుకున్నది.
సదా గంభీరంగా చిరునవ్వు నవ్వే నాగమ్మ పెదవుల వెనుకవున్న కుటిలత భయంకరమైనది.
యుక్తి, కుయుక్తుల్లోనూ ఆవిడ స్థితప్రజ్ఞురాలు.
**********
నరసింగరాజు బోళామనిషి. బ్రహ్మనాయుణ్ణి సాధించాలనుకుంటే ఒకేఒక మార్గమున్నది. అది నమ్మకంతో గానీ, నయవంచనతోగానీ అతగాణ్ణి తన వైపుకు తిప్పుకోవటం.
బ్రహ్మనాయుణ్ణి సాధించాలంటే తను కోటలో పాగ వేయాలి. కాబట్టి నలగామరాజు మనసులో విషబీజం నాటాలి. బ్రహ్మన్నను గురజాలనుంచి, మంత్రిత్వం నుంచీ బహిష్కరింపజేయాలి. అలా కాకపోతే తను బ్రహ్మన్నను సాధించలేదు.
బ్రహ్మన్న మాటే వేదంగా చెలామణీ అవుతున్నది. నలగామరాజును తన మార్గానికి మల్చుకోవటం అనుకున్నంత తేలికకాదు. విజ్ఞూలైనవరు మార్గాన్ని నిష్కంటకం చేసుకోవటానికి ఏదో పద్ధతి అవలంబించక మానరు. రాజకీయమెప్పుడూ కత్తి మీద సామే. రాజగౌరవమెప్పుడూ కుత్తుక మీది కత్తే.
నలగాముడు ఏకాంత మందిరంలో కూర్చున్నవేళ నాగమ్మ లోపలికొచ్చి – “ప్రభూ!” అన్నది.
“ఏమిటి?”
“ఏలినవారు ఏకాంత మందిరంలో అంతులేని ఆలోచనతో అలమటించిపోతున్నట్టున్నారు?”
“ఔను”
“అన్యధా భావించకపోతే అదేమిటో మేము తెలుసుకోవచ్చునా?”
“పల్నాటిలో దొంగల భయం జాస్తిగా వున్నది. పౌరులనుంచీ, గూఢచారులనుండీ వార్తలొస్తున్నాయి”
“ఐతే నేను ప్రభువులకు ఒక మాట విన్నవించుకుంటున్నాను.”
“అట్లాగే..”
“బహుశా ఈ మాత మీరు నమ్మలేకపోవచ్చు”
“నలగాముడు న్యాయానికి ప్రాణమిస్తాడు.”
“ఆ సంగతి ఈ సేవకురాలికి తెలుసు. ఈ దొంగతనాలు మహామంత్రి బ్రహ్మనాయుడు చేయిస్తున్నట్లు విశ్వాసపాత్రులైన వేగులనుంచి వార్తలు..”
“నాగమాంబా..” అన్నాడు నలగాముడు కోపంగా.
“తమకు ముందే విన్నవించాను; మీరు నమ్మలేరని. తన పలుకుబడి కోసం బ్రహ్మన్న చేయని దురంతమూ, దురాగతమూ లేదు. అన్ని కులాలనూ, ఆఖరుకు అంటరాని మనుష్యులనూ కలిపి, చాపకూటి సిద్ధాంతాన్ని లేవదీశాడు. వైష్ణవులు ఏం చేసినా కిమ్మనకుండా ఊరుకుంటున్నాడు. నలగముడు పరిపాలించే గురజాలలో పెత్తనం చెలాయిస్తున్నాడు. ప్రభువులు నిజం చెబితే నమ్మలేరు.”
నలగాముడు నిశ్శబ్దంగా వూరుకున్నాడు.
సశేషం
**********