అధ్యాయం 12 – పల్నాటి వీరభారతం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

మండాది గుట్టుమట్టులు తెల్సుకోవడానికి అతనికి రెండు మూడు రోజులు పట్టింది.

“యాదవ లంకన్న” ఆలమందలకు అధికారి.

వేగులవాళ్ళు చెప్పిన మాటలతో పల్నేటి ఇరుకున పడాల్సివచ్చింది. లంకన్న, వట్టి చేతులతో మనుష్యుల్ని చంపగలడు. వీరపడాలు, వీరన్న లాంటి వాళ్ళు మందల్ని కాస్తున్నారని, బ్రహ్మనాయుడి ఆలమందల్ని అదిలించటం మంచిది కాదనీ హెచ్చరించాడు.

మూర్ఖంతో అతిశయుడైన పల్నేటి వేగుల మాటల్ని వెనక్కునెట్టి – ” ఏమైనాసరే! ఆలమందలను హతంజేస్తా”నని పట్టుబట్టాడు.

ప్రొద్దు గుంకింది.

కృష్ణమ్మ కడుపులో దాక్కున్నది పడమటి సంధ్య-చిరుచీకటి-చిరుగాలీ కలిసి ఆడుకుంటున్నాయి.

ఆవులు పొదుగులను ఒప్పజెప్పి నెమరువేస్తున్నాయి. లేగదూడలు “అంబా-అంబా”అని అరుస్తున్నాయి.

ఏమరపాటుతో బాటు ఆయుధహీనులైన మండాది యాదవుల మీద తన అనుచరులతో విరగదీసుకుపడ్డాడు పల్నాటి.

**********

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

అసలు ఏంజరిగిందో తెలియని అనిశ్చిత స్థితి.

శత్రువులు వచ్చి పడ్డారని ఊహించుకున్నాడు లంకన్న. వెంటనే వీరుల్ని పేరుపేరునా పిల్చాడు.

ఆయుధ సమీకరణ జరిగేలోపలే గొల్లవీరులు నెత్తురు మడుగుల్లో విలవిలా తన్నుకుని చచ్చిపోయారు.

అట్లా ఐదారుగురు వీరులు అప్పటికప్పుడు మండాది ఆలమందల రణక్షేత్రానికి బలైపోయారు.

ఆవులు చెదిరిపోయి, ఎటుపదితే అటు కట్టు కదిలి పరుగెత్తడం మొదలుపెట్టాయి.

లంకన్నకూ, పల్నేటికీ భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పల్నేటి చచ్చాడు. కానీ లంకన్నకు భయంకరమైన గాయాలు తగిలాయి. అతని నాడినాడినా నెత్తురు విరజిమ్మింది.

“చెన్నకేశవా!” అని ఆఖరి పిలుపు పిలిచి తన ఆఖరి శ్వాస వదిలాడు లంకన్న.

చావగా మిగిలిన చెంచు వీరులు ఆలమందల్ని తోలుకుని వెనక్కు మళ్ళారు.

వెన్నెల మెరుస్తోంది. బ్రహ్మన్న మాటలను శ్రద్ధగా వింటున్న మలిదేవాదులకు ఆలమందల వద్ద నుంచి కబురు వచ్చిందని ఒక వార్తాహరుడు వచ్చి చెప్పాడు.

“తక్షణం ప్రవేశపెట్టు” అన్నాడు బ్రహ్మన్న.

వార్తాహరుడు తెచ్చిన మాట వినగానే, బ్రహ్మన్న మహోదగ్రుడై, కుంతం పట్టుకుని – “అందర్నీ హతమారుస్తా”నని లేచి నిలబడ్డాడు.

ప్రక్కనే వున్న కన్నమ “ఈ చిన్న పనికి మీరు కావలా తండ్రీ? ఆ పనిని నేను నిర్వర్తించుకు వస్తాను.” అన్నాడు.

**********

కన్నమ తన సైన్యంతో పరుగుపరుగునపోయి, ఆలమందల్ని తోలుకుపోతున్నవారిని అడ్డగించి, దొరికిన వారిని దొరికినట్టు తెగనరికి, పారిపోతున్న ఇద్దరు చెంచుల్ని పట్టుకుని మలిదేవాదుల వద్దకు హాజరు పరిచాడు.

కన్నమ ముందుకు తోస్తే – పెదమలిదేవుడు ముందుకొచ్చిపడిన చెంచు భటుడ్ని కాలితో నెత్తిన తన్ని “ఏమిట్రా ఈ దారుణం?” అని ప్రశ్నించాడు.

ఉన్నది ఉన్నట్లుగా వివరించాడు ఆ చెంచు భటుడు.

“నాగమ్మ మాటలతో నాశనమైపోయిన నలగాముడు ఏం చేస్తున్నాడో అర్థం కానంత మూర్ఖుడైపోయాడు. అన్యాయంగా మా మందను పొడిపించిన నేరానికి నేను గురజాల గుండెల్లో నిద్రపోతాను. ఫో! పోయి నీ ప్రభువుకు మేము మా వీరులతో దండెత్తి వస్తామని మా మాటగా చెప్పు” – అన్నాడు పెదమలిదేవుడు.

బ్రహ్మన్న క్షణం నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

పులిపాలు తేగల్గిన “లంకన్న” లేడు. ఎదురొచ్చినవాణ్ణి గుద్దుకు చంపగల్గిన వీర “వీరడు” కనిపించడు. దేవతల్ని సైతం యుద్ధంలో నిలువరించగలిగేంత చేవ వున్న మిగతా యోధులంతా అధర్మయుద్ధంలో ఆఖరైపోయారు. ఎంత అన్యాయం జరిగింది?

ఆలమందలను కంటికి రెప్పల్లా, కన్నబిడ్డల్లా కాపాడిన యాదవ వీరులెవ్వరూ లేకుండాపోయారు.

పచ్చని పసరిక చేలల్లో వాళ్ళ రక్తం ప్రవహించిపోయింది. కృష్ణమ్మ యాదవ రక్తాన్ని తనలో కలుపుకుని నిర్వేదంతో ప్రవహించిపోతున్నది.

*******

“ప్రభూ – చెన్నకేశవా?” అనే మాట అప్రయత్నంగా బ్రహ్మన్న నోటినుండి వెలువడింది.

“ఏమిటీ పరీక్ష తండ్రీ?” అన్నాడు.

ఈ సంఘటనతో బ్రహ్మన్న బాగా క్రుంగిపోయాడు. తన మంచితనం సమూలంగా నాశనమైపోతున్నట్టు అనుకున్నాడు. ఎందుకు నాగమ్మ తన మీద ఇంత కక్షగట్టింది? నలగాముడు మాత్రం ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది?

రాచరికం – దాన్ని నిలబెట్టుకోవాలనే తపన మనుష్యుల్ని ఎంత దిగజారుస్తుంది?

ఏమైనాసరే; దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. మంచితనం హద్దులు దాటకూడదు. స్థబ్ధుగా నిద్రపోతున్న మృగరాజును నిద్ర లేపాడు నలగాముడు. పంజా వేటును అనుభవించాల్సిందే ఆ మూర్ఖుడు.

నాగమ్మ పెద్ద గొయ్యి తవ్వింది. అందులో నలగాముడు పడిపోవటానికి సిద్ధమౌతున్నాడు. తన గుండెల మీద వేసుకుని పెంచిన పసివాడు నలగాముడు. తన మీదే కత్తి గడితే, ఏం చెయ్యాలో అర్థంగాని స్థితిలోకి వచ్చాడు బ్రహ్మన్న.

రాత్రి చాలా భాగం గడిచాక నిద్రవచ్చింది మహామంత్రి బ్రహ్మనాయుడికి.

**********

సశేషం…




Your views are valuable to us!