అధ్యాయం 13 – పల్నాటి వీరభారతం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

మనిషి జీవితంలో కాలానిదెప్పుడూ చిత్రమైన పాత్ర. కాలం మనిషినెప్పుడైనా కనికరించవచ్చు; కాటు వేయావచ్చు.

అధర్మపు పందెంలో రాజ్యాన్ని పోగొట్టుకున్న మాచెర్ల ప్రభువులు మండాదిలో అనుభవించిన జీవితం అంత సుఖకరమైనది కాదు.

రాజప్రాసాదాలలో, హంసతూలికా తల్పాల మీద పవళించిన ప్రభువులు, దుర్భరమైన వనవాసంలాంటి బ్రతుకునే గడిపారు.

వీరులైన తన పరివారం మరోసారి హృదయవిదారకమైన దెబ్బతిన్నారు. ఆత్మశాంతి లేక అలమటించిపోయిన బ్రహ్మన్న, కాలం తీసిన దెబ్బకు లొంగిపోక తప్పింది కాదు.

నాలుగైదురోజులు భయంకరమైన మౌనముద్రను దాల్చిన బ్రహ్మన్న రూపాన్ని తల్చుకుంటే మలిదేవాదులుకు ఒళ్ళు జలదరించడం మొదలుపెట్టింది.

బ్రహ్మన్నలో వచ్చిన ఈ మార్పుకు మండాది ప్రజలంతా బెంబేలెత్తిపోతే, మలిదేవులకు కుడిభుజం విరిగినంత పనయింది. “మన లోకంలోకి బ్రహ్మన్న ఎప్పుడు వస్తాడు?” అని అనుకోవటం మొదలుపెట్టారు.

మలిదేవాదులు, బావ గండు కన్నమ మొదలైన వాళ్ళంతా ఆయన దగ్గరకు పోయి – “బ్రహ్మన్నా! మేమంతా నీ బిడ్డల్లాంటివాళ్ళం. నీ పరిస్థితే ఇట్లా ఉంటే మా గోడు వినేవారెవరు? మమ్మల్ని రక్షించు” అని వేడుకున్నారు.

బ్రహ్మనాయుడు తల పైకెత్తి –

“దొంగచాటుగా మన మందలను పొడిపించిన గురజాల రాజు నలగామరాజు గుండెల్లో నిద్రించకపోతే నా ఆత్మ శాంతించదు. మలిదేవా! ఇక విను. గురజాలకు నేనే స్వయంగా దండెత్తి – నలగాముణ్ణి లొంగదీసుకుంటాను.” అని ప్రకటించాడు.

బావ గండుకన్నమ నివారించినా – మలిదేవాదులు అడ్డు చెప్పినా వినక – బ్రహ్మన్న యుద్ధానికి బయలుదేరాడు.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

*****

మహావీరుడైన గండ భైరవుడు, బండారి, దామెన – మొదలైన వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన కొంతమంది వీరుల్ని వెంటబెట్టుకుని గురజాల వైపుకు ప్రయాణించాడు.

ప్రయాణానికి ముందు వీరవిద్యాదేవి వద్ద ఆశీర్వాదం పొంది – “తల్లీ! ఈ యాత్రలో నాకు జయం కలిగేటట్లు ఆశీర్వదించు” అని వేడుకున్నాడు.

వీరవిద్యాదేవి “నాయనా బ్రహ్మన్నా! నీవు అసామాన్యుడివి. ఎప్పుడూ జయించేది ధర్మమే. వెళ్ళిరా తండ్రీ!” అని దీవించింది.

బ్రహ్మనాయుణ్ణి సాగనంపడానికి వచ్చిన పెదమలిదేవుడు “మాలో అగ్రజుడైన నలగాముణ్ణి సంహరించవద్దని ప్రార్థిస్తున్నాను” అని ప్రాధేయపడ్డాడు.

మలిదేవుని సోదరప్రేమకు సంతోషించిన బ్రహ్మన్న “అలాగే” అన్నాడు.

ఈ యాత్రలో తనను విజయుణ్ణిగా చేయమని చెన్నకేశవుణ్ణి కోరాడు బ్రహ్మన్న.

*****

కొంతమంది వ్యక్తిత్వం అపూర్వమైనది. ఇంకొంతమంది కళ్ళల్లో అపూర్వమైన తేజస్సు ప్రకాశిస్తుంది. వారి మాటలకు తిరుగు ఉండదు. ఆ మాట వేదం – బ్రహ్మన్న ముఖవర్చస్సు అలాంటిది. బ్రహ్మన్న తన యోధులతో మరలి మాచెర్ల పట్టణానికి విచ్చేశాడు.

నిద్రబోతున్న కొండచిలువలా స్థబ్దుగా ఉన్నది మాచెర్ల. చంద్రవంక నది కూడా దిగులుగా ప్రవహిస్తున్నట్లుగా వున్నది. కళాకాంతుల్లేని మాచెర్లను చూడగానే బ్రహ్మనాయుడి కడుపులో పెదపేగు కలుక్కుమన్నది. తుప్పలతో, తుమ్మలతో పాడుబడిన అడవిలా వున్న మాచెర్లలో అడవి జంతువులు అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయి. తను నిర్మించుకున్న మాచెర్లకు పట్టిన దుర్గతి ఇది.

నిత్య ధూప దీప నైవేద్యాలతో – కనులపండువగా విలసిల్లిన మాచెర్ల చెన్నుడు ఖిన్నుడై వాడిన హారాలతో వున్నాడు.

“తండ్రీ! మా బ్రతుకులకు సుఖం ఎప్పుడు? విధి కల్పించిన వినోదంలో మేము నలిగిపోతున్నాము.” అన్నాడు బ్రహ్మన్న, చెన్నకేశవుణ్ణి చూసి.

కౄరమృగాలను అదలించి, చెన్నుణ్ణి చంద్రవంక జలాలతో అభిషేకించి – పట్టుశాలువా చించి వత్తి చేసి దీపాలను వెలిగించి చెన్నకేశవుణ్ణి ఆరాధించాడు.

వేసిన మాలలు కంఠాన అలంకరించుకున్న కేశవుడి కన్నుల్లో చిరునవ్వులు వెలిగినట్లుగా అనిపించింది బ్రహ్మన్నకు.

*****

ప్రొద్దు ఏడు గడియలు పైకెక్కింది.

ఇనుడు తన కాంతులతో గురజాలను రంగురంగులతో ముంచెత్తుతున్నాడు.

బ్రహ్మన్న తన మీద యుద్ధం చేయడానికి వచ్చాడన్న వార్త నలగామునికి అందింది. బ్రహ్మనాయుడి పరాక్రమం తెలిసిన నలగాముడు భయంతో –

“నాగమ్మా – మహాప్రళయం ముంచుకొచ్చింది. అభినవ పరశురాముడికిమల్లే, బ్రహ్మన్న వచ్చేశాడు. ఎంతమందిని యమపురికంపుతాడో, ఎంతమంది రక్తం నాగులేటిలో ప్రవహించాలో, ఎంతమంది రుధిరస్నానం చేస్తారో? తల్చుకుంటేనే గుండెలవిసిపోతున్నాయి” అన్నాడు.

కొంతమంది వీరులను తన చేతికింద ఉంచుకుని నాగమ్మ – బింకంతో అంది..

“నాగమ్మ ఉండగా నలగామరాజు దిగులు పడనవసరం లేదు. గంధర్వులు తీర్చబోయే కార్యం ఆసన్నమయింది. ఏ కుందేలు కోసం ఎదురుచూస్తున్నామో, అదే దారితప్పి, సరాసరి వంటింటిలోకి వచ్చింది. అందుకు సంతోషించాలిగానీ, విచారించాల్సిన పనిలేదు రాజా” అన్నది.

ఐతే నాగమ్మ అనుకున్న “కుందేలు” మృగరాజని మర్చిపోలేదు నలగాముడు. కానీ నాగమ్మ దుర్బోధలు విన్న నలగాముడు – చిటికెలో గొప్ప అశ్వికదళాన్ని, గొప్ప వీరుల్ని ఏర్పాటు చేశాడు. ఐతే బ్రహ్మన్న మీద యుద్ధం అంటే అతనికి ఇంకా బెరుగ్గానూ, భయంగానూ వున్నది.

సేనా నాయకులు – బ్రహ్మన్న రాక కోసం ఎదురు చూస్తూ, తమ వీరులతో నిలబడి వున్నారు.

*****

బ్రహ్మన్న తన కొలది సైన్యంతో రణరంగంలో వీర విహారం చేసాడు. రక్తం ఏరులై పారించాడు.మృగరాజు జూలు విదిలంచి, కారాటవిలో వేటకు వెళ్ళినట్ట్లుగా బ్రహ్మన్న రణరంగంలో విహరించాడు. ఎలా మృగరాజు దొరికిన జంతువును దొరికినట్టే హతమారుస్తుందో, అలా నలగాముడు మహావీరులనుకున్న వారినందరినీ పేరు పేరునా పిలిచి మరీ సంహరించాడు బ్రహ్మన్న. అది చూసి నలగాముని సేనాపతుల గుండెలు నీరయ్యాయి.

అది కుంతమో, శివుని త్రిశూలమో అర్థం కాలేదు. అతను చేస్తున్నది యుద్ధమా లేక ప్రళయప్రభంజన విలయతాండవమా? ఇంత తక్కువ సైన్యంతో సంఖ్యాబలం వున్న తమని నిర్వీర్యం చేస్తుంటే, నలగాముని సేనాధిపతులకు ఏం చెయ్యాలో పాలుపోకుంది. చెట్టు నిండి, పండిన పళ్ళలా తలలు నేల రాలుతుంటే నాగమ్మ తల దిమ్మదిరిగిపోయింది.

బ్రహ్మనాయుని వీరత్వం ముందు నాగమ్మ కుటిలిత్వం తాత్కాలికంగా తలవంచింది.

*****

సశేషం…

Your views are valuable to us!