భీమఖండము లో పార్వతీపరమేశ్వరుల సాక్షాత్కారం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పవిత్ర “మహాశివరాత్రి” పర్వదిన సందర్భంగా ఆ పరమశివుని ప్రసన్నదృక్కులు అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ “భీమఖండము” లో ఎంత హృద్యంగా వర్ణించాడో మీ అందరి దృష్టికి తేవాలని అనిపించింది.

ముందుగా పద్యాన్ని చిత్తగించండి. 

 

చంద్రబింబానన, చంద్రరేఖామౌళి 
నీలకుంతలభార, నీలగళుడు 
ధవళాయతేక్షణ, ధవళాఖిలాంగుండు 
మదనసంజీవని, మదనహరుడు 
నాగేంద్రనిభయాన, నాగకుండలధారి 
భువనమోహనగాత్ర , భువనకర్త 
గిరిరాజకన్యక, గిరిరాజనిలయుండు 
సర్వాంగసుందరి, సర్వగురుడు 

గౌరి, శ్రీ విశ్వనాథుండు కనకరత్న 
పాదుకలు మెట్టి, చట్టలు పట్టుకొనుచు 
నందికేశుండు ముందట నడచిరాగ 
నరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు.

పద్యము సులభగ్రాహ్యంగానే ఉన్నప్పటికీ, తెలియనివారి కోసం కొద్దిగా వివరిస్తాను.

పై సీసపద్యములోని 4 పాదాల్లోనూ పార్వతిని, పరమేశ్వరుణ్ణి ప్రతి పాదములో ప్రస్తుతించాడు శ్రీనాథుడు! 

  • గౌరీదేవి చంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. (ఆననము అంటే ముఖము). మరి, శంకరుడేమో చంద్రరేఖను (నెలవంకను) తలపై ధరించివున్నాడు.
  • ఆమె నల్లని దట్టమైన కురులను కలిగివుంది. అతడు నల్లని కంఠం కలవాడు. (సంస్కృతములో ‘ నీల ‘ అనే పదానికి ‘ నలుపు ‘ అనే అర్థం వుంది.) క్షీరసాగరమధన సమయములో బయల్వెడలిన హాలాహలాన్ని లోకరక్షణార్థమై పరమేశుడు స్వీకరించి తన కంఠాన నిలిపిన గాథ సుప్రసిద్ధం కదా! 
  • ఆమె తెల్లని విశాలమైన కన్నులు కలిగివుంది. అతడు తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తున్నాడు. 
  • మరణించిన మన్మథుణ్ణి సైతం తిరిగి బ్రతికింపజేయగల సౌందర్యం ఆ తల్లిది. ఆయనేమో తన ఫాలాగ్నిలో మదనుణ్ణి భస్మం చేసినవాడు. 
  • ఆమె ఏనుగు నడక వంటి మందగమనం కలిగివుంది. (‘ నాగము ‘ అంటే ఏనుగు అనే అర్థం వుంది.) స్త్రీలను ‘ గజగమనలు ‘ అని వర్ణించడం కవులకు పరిపాటే! మరి, శివుడేమో నాగాభరణుడు. సర్పములనే అలంకారములుగా ధరించినవాడు.
  • సర్వలోకాలనూ సమ్మోహితం చేయగలిగిన సురుచిర శరీర సౌందర్యం సర్వమంగళది. ఆయనేమో సాక్షాత్తూ విశ్వనాథుడే! సర్వలోకాలకూ కర్త.
  • ఆమె గిరిజ. అనగా గిరులకే రాజైన హిమవంతుని ముద్దులపట్టి. ఇక ఆయన కైలాస పర్వతమునే తన నివాసంగా చేసుకున్నవాడు.
  • అన్ని అవయవములు పొందికగా అమరిన సర్వాంగసుందరి ఆమె. ఆయన సర్వులకూ గురువు; జగద్గురువు.

పైవిధంగా ఆ ఆదిదంపతులు, తమ వాహనమైన నందీశ్వరుడు ముందు నడవగా అద్భుతమైన రీతిలో సాక్షాత్కరించారు. 

మహాదేవుని అర్ధనారీశ్వరతత్వం ప్రతిఫలించేలా, శ్రీనాథ కవీంద్రుడు వారిద్దరినీ ఒకేవిధమైన విశేషణాలు వినియోగిస్తూ విలక్షణరీతిలో వర్ణించిన ఈ పద్యప్రసూనం సహృదయరంజకం. 

ఆస్వాదించే అభిరుచి, ఆసక్తి ఉండాలేగాని, మన తెలుగు సాహిత్యములో ఇటువంటి రసగుళికలు ఎన్నో!………..

 

Your views are valuable to us!