పితరులు – శ్రాద్ధకర్మ – పితృ స్తోత్రం

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.5]

పితరులు – శ్రాద్ధకర్మ

 

ఈ వ్యాసంలో పితరులు, శ్రాద్ధకర్మ గురించి వ్రాసిన కొన్ని అంశాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను.

 

పితరులు – పితృదేవతలు:

జన్మనిచ్చిన తల్లిదండ్రులను “పితరులు” అని పిలుస్తారు. ప్రపంచంలో జీవించడానికి కావలసిన వ్యవహారాల పట్ల జ్ఞానాన్ని, అవగాహనను కల్పించడంలో వీరు ప్రధాన పాత్రను పోషిస్తారు.

బిడ్డలను ఎల్లప్పుడూ రక్షించడానికై తపన పడే వ్యక్తి కనుక తండ్రిని “పిత” అని పిలిచింది శాస్త్రం. బిడ్డల మనసును తెలుసుకొని వారిని ఊరడించి, పోషించే తల్లిని “మాతా” అని ప్రేమతో పిలిచింది శాస్త్రం. వీరిద్దరినీ కలిపి “పితరులు” అని ఉమ్మడిగా పిలుస్తారు.

ఆవిధంగా పుత్రులు తమకు రక్షణను, ప్రేమను, పోషణను అందించిన పితరుల పట్ల గౌరవాన్ని కలిగివుండాలి. పితరులు జీవించివున్నప్పుడే కాక వారు గతించిన తరువాత కూడా వారి అనుగ్రహాన్ని కోరుతూ పూజించాలని గరుడపురాణం స్పష్టం చేస్తోంది.

శ్రాద్ధ కర్మ:

మరణించిన పితరుల తృప్తికై అత్యంత శ్రద్ధతో చేసే కార్యమే “శ్రాద్ధ కర్మ”గా ప్రసిద్ధికెక్కింది. జన్మను ఇచ్చి, ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన మానవ దేహాన్ని ఇచ్చి, రక్షణను, పోషణను అనుగ్రహించిన తల్లిదండ్రులను స్మరించుకొంటూ వారు గతించిన రోజున అత్యంత శ్రద్ధతో చేసే పూజాక్రమమే “శ్రాద్ధం.”

“ఆయురారోగ్య మర్థం చ పుత్రపౌత్రాదికం తథా-వాంఛద్బిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వై యతః” పవిత్ర కార్యమైన శ్రాద్ధకర్మను నిర్వహించి, పితరులను స్మరించిన వారికి ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యాభివృద్ధితో సహా పుత్రలాభం కూడా కలుగుతుందని గరుడపురాణంలో సాక్షాత్ శ్రీకృష్ణపరమాత్మ విశదీకరించాడు.

“దేవైర్ అపి హి తర్ప యంతే యే శ్రాద్ధేశు స్వధోత్తరైః” అన్న పురాణ వచనాన్ని స్వయంగా ఆచరించి చూపిన ఆదర్శ పుత్రుడు శ్రీరామచంద్రుడు. అనాదినిత్యుడు, ఆదిమధ్యాంతరహిడు, దేవదేవోత్తముడైన శ్రీమన్నారాయణునికి తల్లిదండ్రులు లేరు.

శ్రీరామ, కృష్ణాది అవతార రూపాలలో ఈ భువిపై వెలసినప్పుడు తల్లిదండ్రులను విశేషంగా గౌరవించి, పూజించాడు. వారు గతించిన తరువాత అంత్యకార్యాలను, శ్రాద్ధకర్మలను అత్యంత శ్రద్ధాభావంతో వినీతుడై ఆచరించాడు. కర్మబంధాలు లేని ఆ కర్మదూరుడు కర్మల్ని ఆచరించడం మానవులకు ఆ కర్మల గొప్పదనాన్ని పరిచయం చేయడనికే అని జ్ఞానులు ఉపదేశించారు.

“తస్య పాప విముక్త్యర్థం/ యత్క్షణం తర్పయామ్యహమ్/ ఇతి గౌతమీ తటే త్రీణి/ అంజలి ఉదకాని ప్రక్షిపేత్” అంటూ ఎవరు మూడు దోసిళ్ళ తో గోదావరీ జలాన్ని తీసుకుని పితృదేవతలకు జలతర్పణం చేస్తారో వారు సర్వపాపాల నుండి విముక్తులవుతారని పురాణాలు చాటుతున్నాయి.
“గతులన్నీ ఖిలమైన కలియుగమందున గతి ఈతడే” అని అన్నమయ్య ప్రార్థించిన పరమపురుషుడు శ్రీనివాసుడే శ్రీరామునిగా అవతరించి పితృకార్యాన్ని నిర్వహించాడు.
dhvani telugu podcast app

పితృ దేవతల వల్ల కలిగే శుభఫలితాలు:

 

“సింహం గతే దేవగురౌ పితౄణాం తారణాయ చ

సర్వపాప విముక్త్యర్థంతీర్థస్నానం కరోమ్యహమ్”

అర్థం: “ఓ గోదావరీ! దేవతలకు గురువైన బృహస్పతి సింహరాశిలో ప్రవేశించాడు. నా పితృవులకు పుణ్యలోకాలు కలగాలని, నేను చేసిన సమస్త పాపాలు తొలగాలని నీ పవిత్రజలాలలో తీర్థస్నానాన్ని చేస్తున్నాను.”

ఈ శ్లోకం వల్ల మనకు తెలిసేదేమిటంటే – పితృ దేవతలను పూజించడమన్నది ఒక అవశ్య కర్తవ్యం. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆచరించాల్సిన విధి. 

పుష్కర పర్వకాలంలోనే కాదు ఆదివారం, పౌర్ణిమ, అమావాస్య, మాస సంక్రమణాలు మొదలైన ’పైతృక కాలాల్లో” గతించిన పితరులు మరియు పితృదేవతల తృప్తి కోసం వదిలే తర్పణలు, మరణించిన వారికై చేసే పిండ ప్రదానాలు తప్పక ఆచరించ వలసిన పుణ్యకార్యాలని పురాణాలు ఉపదేశిస్తున్నాయి.

పుష్కర సమయంలో, మరణించిన తల్లిదండ్రులకు, అత్తమామలకు, సమీప బంధువులకు పిండప్రదానం, తర్పణాలను అర్పించవచ్చునని శాస్త్రాలు వివరిస్తున్నాయి. వీరితో బాటు అత్యంత ఆత్మీయులైన స్నేహితులకు కూడా పిండప్రదానం చేయవచ్చునని పురాణాలు చెబుతున్నాయి.

మరణించిన వారికి ఉత్తమ గతులు కలగాలనే మంచి సంకల్పంతో చేసే పిండప్రదానాల వల్ల ఉత్తమ సంతానం కలిగి వంశాభివృద్ధి కలుగుతుందని పురాణాలు వివరిస్తున్నాయి.

పితృదేవతలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల రుచిర అనే ఒక సాధారణ ఋషి, రౌచ్య మన్వంతరానికి అధిపతి ఐన కథనం గరుడ పురాణంలో ఉంది. ఈవిధంగా పితృదేవతలను, గతించిన పితరులను ఆయా ’పైతృక కాలా’ల్లో పూజించిన వారు ఉత్తమమైన ఫలితాలను సాధిస్తారు.

బృహద్ధర్మ పురాణంలోని బ్రహ్మదేవుడు చెప్పిన పితృ స్తోత్రమ్:

పితృదేవతలకు సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే నమస్కరించి, కీర్తించిన ఒక అపురూపమైన స్తోత్రం బృహద్ధర్మపురాణంలోని రెండవ అధ్యాయంలో ఉంది. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధకాలంలో గానీ లేదా తమ పుట్టినరోజున గానీ లేదా తమ తల్లిదండ్రుల సాన్నిధ్యంలో గానీ పఠించినవారికి సమస్త శుభాలు కలుగుతాయన్న ఫలశ్రుతిని బ్రహ్మదేవుడే చెప్పాడు.

బ్రహ్మోవాచ

నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ|
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే||

సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే|
సర్వతీర్థావలోకాయ కరుణా సాగరాయ చ||

నమః సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః|
సదాऽపరాధాయ క్షమిణే సుఖాయ సుఖదాయ చ||

దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయా వపుః|
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః||

తీర్థస్నాన తపో హోమ జపాది యస్య దర్శనమ్|
మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః||

యస్య ప్రణామ స్తవనాత్ కోటిశః పితృతర్పణమ్|
అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమోనమః||

ఫలశ్రుతి

ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః|
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధ దినేऽపి చ||

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోऽపి వా|
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞాతాది వాంఛితమ్||

నానాऽపకర్మ కృత్వాపి యః స్తౌతి పితరం సుతః|
స ధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్||

పితృః ప్రీతికరో నిత్యం సర్వ కర్మాణ్యథార్హతి||

ఇతి బృహద్ధర్మపురాణే పితృస్తోత్రం సంపూర్ణమ్
శ్రీకృష్ణార్పణమస్తు

*****

 

గరుడపురాణంలో వచ్చే రుచి ముని రచించిన పితృస్తోత్రంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందిన ప్రతి ఒక్కరు తమ తమ వర్ణాచారాల ప్రకారం పితరులను, పితృదేవతలకు కొలవాలని చెప్పడం జరిగింది. కనుక మహత్తరమైన ప్రాశస్త్యం, పవిత్రత, ప్రాముఖ్యత కలిగిన పితరులను, పితృదేవతలను ’పైతృకకాలం’లో స్మరిస్తూ, వారిని పూజిస్తూ, తర్పణాలను అందించడం ప్రతి హిందువు యొక్క కనీస కర్తవ్యం.

 

*****

Your views are valuable to us!