సూర్యుని విశ్వ చక్షువు (ప్రపంచానికి కళ్ళవంటి వాడు) అని తైత్తరియోపనిషత్ అంటోంది.
నిజమేకదా!
సూర్యుని ప్రకాశం లేనిదే, జగత్తు తమోమయం. సూర్యోదయం లేనినాడు, ప్రపంచం అంధకార బంధురం. అందుకే సూర్యుడే, జగతికి నేత్రములవంటివాడు అనటం యెంతో యుక్తి యుక్తం.
అంతే కాదు, సూర్యుని ఒక గ్రహంగా కాక ప్రత్యక్ష దైవంగా కొలిచే సంప్రదాయం అనూచానంగా వస్తున్నది. సూర్య గమనంతో ముడివడివున్న్న ప్రధాన ఘట్టాలను, దేశ వ్యాప్తంగా, శుభపర్వాలుగా జరుపుకోవటం మన సంస్కృతిలో భగంగా అల్లుకుపోయింది. వాటిలో ప్రశస్తమైనది రథ సప్తమి.
మాఘమాసం లో శుద్ధ సప్తమి – రధసప్తమి పర్వదినం. హిందువులకు అత్యంత పవిత్రమైన శుభదినం. కర్మసాక్షిగానూ, సాక్షాత్తూ భగవంతునికి ప్రతిరూపంగానూ సూర్యభగవానుణ్ణి కొలవటం మన ఆచారం.
మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
పురాణాలలో రథ సప్తమి:
భవిష్య పురాణంలో రధసప్తమి మహత్యాన్ని సాక్షాత్తూ వాసుదేవుడే వివరించి చెప్పాడు. దీనిలో బ్రాహ్మ పర్వము, మధ్యపర్వము, ప్రతిసర్గ పర్వము, ఉత్తర పర్వము అని నాల్గు పర్వాలున్నాయి.
బ్రాహ్మపర్వములో 42వ అధ్యయం నుంచీ 140 వ అధ్యయం వరకూ సూర్యోపాసన గురించి అనేకానేక విశేషాలున్నాయి. సూర్యనారాయణుని నిత్యార్చన మొదలు సూర్యరధం, సూర్య గమనాదులు, అతని గుణాలూ, వివిధ ఋతువుల్లో అతని వివిధ వర్ణనలు, ఆ రధ సారధి, అశ్వాలూ, చత్రం, ధ్వజం, రధసప్తమి వ్రత విధానం, శతానీకుని సూర్య స్తుతి, సూర్య నారాయణ స్తోత్రం, ద్వాదశాదిత్యుల వివరాలు మొదలైన ఎన్నో వివరణలు ఇందులో వున్నాయి.
భవిష్యోత్తర పురాణంలోనూ, సూర్యోపాసన గురించి అనేకానేక వివరాలున్నాయి.
రథసప్తమి ఆచరణ:
రధసప్తమిని సూర్య జయంతి, సౌర సప్తమి, భాస్కర సప్తమి, మాఘ సప్తమి, మన్వాది అనే వేరు వేరు పేర్లున్నాయి. కర్మసాక్షి , ప్రత్యక్ష భగవానుడు అయిన శ్రీ సూర్యనారాయణుని పుట్టిన రోజుగా దీనిని జరుపుకుంటాము.
కశ్యపునికి, అదితికి జన్మించిన వాడు సూర్యుడు. ఈయనకు వివస్వంతుడు అనే నామాంతరము ఉంది. ఈ రోజు నుంచి వరుసగా అయిదు రోజులు అంటే – సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశిలను “భీష్మ పంచకం” అని అంటారు.
భారత యుద్ధంలో అర్జునుని శరాఘాతానికి కుప్పకూలిన భీష్మ పితామహుడు అప్పటికి ఇంకా దక్షిణాయనం అవటం వలన ఉత్తరాయణ పుణ్యకాలం రావటం కోసం అంపశయ్య మీద ఎదురుచూసి ఈ అయిదు రోజులలో రోజు కొక్కటి చొప్పున పంచ ప్రాణాలు వదిలేసాడని పురాణ గాధ. అందుకే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే ఆచారం కూడా ఉంది.
రధసప్తమి నాడు సూర్యోదయాన్నే ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నుంచుని తలపై ఏడు జిల్లేడు ఆకులు (అర్క పత్రం) , ఏడు రేగు ఆకులు లేదా రేగి పళ్ళు ఉంచుకొని స్నానము చేస్తారు. (సూర్యునికి అర్కః అన్న పేరు ఉన్నది. అందుకే అర్క పత్రము ప్రీతి అంటారు).
స్నానము చేస్తూ – “యత్యత్ జన్మ కురుమే పాపం మయా సప్తమ జన్మాసు, తన్మే రోగంచ, శోకంచ, మా కరేహంచు సప్తమీ” అని పఠిస్తారు.
ఈ విధంగా చేయడం వల్ల ఈ జన్మలో చేసినవి, జన్మాంతరంలోనివి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, మానసికంగా చేసినవి, వాచికంగా చేసినవి, శారీరకంగా చేసినవి అనే ఏడు జన్మల పాపాలను, ఏడు రకాల రోగాలను సూర్యుడు తొలగిస్తాడని భావిస్తారు.
రధసప్తమి నాడు సూర్యుడు సప్తాశ్వములను పూన్చిన బంగారు రధం మీద రధసారధి అరుణుడు (ఇతనికే అనూరుడు అనగా ఊరువులు లేనివాడు అని కూడా పేరు ఉన్నది ) నడుపుతుండగా, దక్షిణాయనం నుంచి ఉత్తారాయణానికి మరలి (ఉత్తర దిశ వైపు తన రధాన్ని మళ్ళిస్తాడని) వెళ్తాడని భావిస్తారు.
సూర్యునికి ఎదురుగా ఆవు పేడ పిడకలతో దాలిలో ఇత్తడి గిన్నెలో ఆవుపాలను పొంగిస్తారు. పొంగిన తరువాత బియ్యం, బెల్లం కలిపి పరమాన్నం చేస్తారు. చిక్కుడు ఆకులలో ప్రసాదంగా తీసుకొంటారు.
*****
జానపద సాహిత్యంలో సూర్యుడు:
అనాదిగా మానవునికి ప్రకృతిశక్తులను ఆరాధించే ఆచారం ఉంది. ముఖ్యంగా, సూర్యుడు తూర్పున ఉదయించనిదే జగత్తు మేలుకోదు. తిమిరాన్నితొలగించి, కాంతిమార్గంచూపే అగ్నిగోళం సూర్యుడు.
తూర్పుకొండల నుంచీ తొంగిచూసినప్పటినుంచీ అతని కాంతిలో క్రమక్రమంగా మారే కాంతిని కూడా అతి జాగ్రత్తగా గమనించి జానపదులు కూడా తమకు కనిపించే ఫలపుష్పాల వర్ణనలలో చేర్చడాన్ని చూస్తే, సూర్యునితో అనాదిగా మనిషికున్న అవినాభావ సంబంధం అవగతమౌతుంది.
లోకంలోని ప్రతి ప్రాణిని మేలుకొలిపి ప్రాణాధారం అయిన కాంతిని ఇచ్చే సూర్యునికి జానపదులు ఆనాడే పాడిన మేలుకొలుపు ఇది.
శ్రీ సూర్య నారాయణా! మేలుకో
హరి సూర్యనారాయణా మేలుకో !
పొడుస్తూ బాలుడూ పొన్న పూవూ ఛాయ
పొన్నపూవూ మీద పొగడపూవూ ఛాయ… శ్రీ సూర్య
ఉదయిస్తు బాలుడూ వుల్లి పూవూ ఛాయ
వుల్లి పూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ… శ్రీ సూర్య
ఘడియెక్కి బాలుడూ కంబ పూవూ ఛాయ
కంబపూవూ మీదా కాకారి పూఛాయ… శ్రీ సూర్య
ఝామెక్కి భానుడూ జాజి పూవూ ఛాయ
జాజిపూవూమీద సంపంగి పూచాయ… శ్రీ సూర్య
మధ్యాహ్న బాలుడూ మల్లెపూవూ ఛాయ
మల్లెపూవూ మీదా మంకెన్న పొడి ఛాయ… శ్రీ సూర్య
మూడు ఝాముల బాలుడూ ములగపువ్వు ఛాయ
ములగపువ్వూ మీద ముత్యంపు పొడి ఛాయ… శ్రీ సూర్య
అస్తమాన బాలుడూ ఆవపూవూఛాయ
ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ… శ్రీ సూర్య
వాలుతూ భానుడూ వంగపూవూ ఛాయ
వంగపూవూ మీద వజ్రంపు పొడి ఛాయ… శ్రీ సూర్య
గ్రుంకుచూ బాలుడూ గుమ్మడి పూవూ ఛాయ
గుమ్మడి పూవూ మీద కుంకంపు పొడి ఛాయ… శ్రీ సూర్య
*****
ఖగోళశాస్త్రం – సూర్యుడు:
ఖగోళశాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుని సంచారానికి కూడా సంబంధం ఉందని చెప్పవచ్చును. సూర్యుని రధానికి గుర్రాలు ఏడు. ఇవి ఇంద్రధనుస్సు లోని రంగులుగా, లేదా వారంలోని ఏడు రోజులుగా భావించవచ్చును.
సూర్యుని రధచక్రాలకు గల ఆకులు పన్నెండు. వీటిని ఒక సంవత్సరం లోని పన్నెండు నెలలుగా లేదా పన్నెండు రాశులుగా భావించవచ్చును.
సూర్యోదయానికి ముందు కన్పించే అరుణ వర్ణాన్నే సూర్యుని రధసారధి అరుణుడు అంటారు. ఇతనికే అనూరుడు (ఊరువులు లేనివాడు) అనే పేరు ఉంది.
సూర్యుడు ఒక్కో రాశి లోనూ లేదా ఒక్కో నెలలోను ముప్పై డిగ్రీలు చొప్పున మూడు వందల అరవై డిగ్రీలు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై అయిదు రోజులు పడుతుంది. అది భూమి సూర్యుని చుట్టూ ఒకసారి భ్రమణం చేయడానికి పట్టే సమయంగా గుర్తించవచ్చును.
ఈ సమయం నుంచే ఋతువులలో మార్పులు వస్తాయి. నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి. అందుకే రైతులు మరల తమ పొలం పనులలో నిమగ్నమయేందుకు సిధ్ధమవుతారు.
విజ్ఞానశాస్త్ర ప్రకారం చూస్తే సూర్యోదయ కాలంలో సూర్యుని ఎదురుగా నుంచుని స్నానం చేయడం వలన సౌరశక్తి లోని అతినీల లోహిత కిరణాలు మన శరీరంలో విటమిన్ “డి” సంశ్లేషితమవుతుంది. లేత సూర్యకిరణాలలో సూర్య నమస్కారాలు చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం అదే.
జిల్లేడు, రేగు ఆకులకు సూర్యుని నుండి కాంతిని ఎక్కువగా గ్రహించే లక్షణం కలిగిఉంటాయి. వాటిని మన తలపై ఉంచుకొని స్నానం చేయటం వలన అవి గ్రహించిన సౌరశక్తి లోని కాస్మిక్ కిరణాలు మన శిరస్సు ద్వారా స్వీకరించే అవకాశం వుంది.
ఆవు పేడ పిడకలతో మంట మండించటం, ఆవు పాలు పొంగించటం అనేది సూక్ష్మక్రిమి రహితంగా చేయడానికి. ఆవుపేడలో, పాలలో సూక్ష్మజీవి నాశకాలు వుంటాయన్నది శాస్త్రసమ్మతం.
ఈ విధంగా ఆలోచిస్తే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన చాలా ఆచారాలు, పూజా పునస్కారాల వెనుక శాస్త్రీయ దృక్పధం కనిపిస్తుంది. మామూలుగా చేయం కనుక దేముడు, పూజలు అని ఒక కారణాన్ని చూపించారేమో!
సశేషం…
chaalaa baavundi