సూర్యాయ విశ్వ చక్షుషే – భాగం 2

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

సూర్యునికి సంబంధించిన యెన్నెన్నో ఆసక్తిదాయకమైన విశేషాలు మన పురాణాలలో అనేకం ఉన్నాయి. అసలు ప్రతిరోజూ సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల, అనేక వ్యాధులు కూడా దూరమౌతాయని పురాణాలు చెబుతూనే వున్నాయి.

కఫమూ, దగ్గూ, చర్మ రోగాల వంటివే కాక భయంకరమైన కుష్టు వ్యాధి కూడా మటుమయమౌతుందట! ఇలా రోగాలే కాక, శతృ బాధను కూడా నివారిస్తాడా సూర్యనారాయణుడు.

తమోఘ్నాయ హిమఘ్నాయ శతృఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

(అంధకారమూ, శీతమూ, శత్రువులూ కృతఘ్నులూ – ఇటువంటి వాటిని నాశనం చేసే ఓ విశాలాత్మన్! జ్యోతులన్నింటికీ శాసకుడా! నీకు నమస్కారము!)

అని కదా వాల్మీకి రామాయణంలోని ఆదిత్యహృదయం చెబుతున్నది!

SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY

పురాణాలలో సూర్యు స్తుతులు:

మన అనేక పురాణాల్లో సూర్యోపాసన విధానం గురించిన వివరాలెన్నో లభిస్తున్నాయి. భవిష్య పురాణంలో మాంధాత రాజు సూర్య వ్రతాన్ని గురించి తమ కులగురువు వశిష్టులవారిని అడిగినప్పుడు వారీ వివరాలు చేప్పారట!

మాఘమాస సూర్య (ఆది)వారం నాడు ‘వరుణాయ నమః‘ అనీ,
ఫాల్గుణమాసంలో ‘సూర్యాయ నమః‘ అనీ,
చైత్ర మాసంలో ‘భానవే నమః‘ అని,
వైశాఖమాసంలో ‘తపనాయ నమః‘ అని,
జ్యేష్టమాసంలో ‘ఇంద్రాయ నమః‘ అని,
ఆషాఢమాసంలో ‘రవయే నమః‘ అని,
శ్రావణమాసంలో ‘గభస్తయే నమః‘ అని,
భాద్రపదమాసంలో ‘యమాయ నమః‘ అని,
అశ్వయుజమాసంలో ‘హిరణ్య రేతసే నమః‘ అని,
కార్తిక మాసంలో ‘దివాకరాయ నమః‘ అని,
మార్గశిర మాసంలో ‘మిత్రాయ నమః‘ అని,
పౌష్యమాసంలో ‘విష్ణవే నమః‘ అనీ

యీ విధంగా వివిధ మాసాలలో, వివిధ నామాలూ, వివిధ నైవేద్యాలతో సూర్య వ్రతం చేసిన తరువాత, ఉద్యాపన కూడా చేయవలసి వుంటుంది.

కృష్ణుని కుమారుడు – సాంబుడు కుష్టు రోగగ్రస్తుడైనపుడు సాక్షాత్తూ వాసుదేవుడే సూర్యోపసన చేయమన్నాడట. పైగా, సూర్య భగవానుడు అతనికి స్వప్న దర్శనమిచ్చి తన ఏకవింశతి నామావళిని వినిపించి, పారాయణం చేయమన్నాడట కూడా.

భాస్కరో భగవాన్ సూర్యః చిత్రభానుర్విభావసుహు
యమః సహస్రాంశుమాలీయమునా ప్రీతిదాయకః
దివాకరో జగన్నాధః సప్తాశ్వస్య ప్రభాకరః
లోక చక్షుః స్వయంభూశ్చ ఛాయారతి ప్రదాయకః
తిమిరారిర్దినధవో లోకత్రయ ప్రకాశకః
భక్తబంధుః దయాసింధుః కర్మసాక్షీ పరాత్పరః
ఏకవింశతి నామాని, యః పఠేదుదితే మయి
తస్య శాంతిం ప్రయచ్ఛామి సత్యం సత్యం వదామ్యహమ్

(కపిల సంహిత – ఆరవ అధ్యాయము)

సౌర పురాణంలో మనుమహారాజు కృత సూర్య స్తుతి ఇది.

నమో నమో వరేణ్యాయ, వరదాయాంశు మాలినే,
జ్యోతిర్మయ నమస్తుభ్యం, అనంతాయాజితాయ తే,
త్రిలోక చక్షుషే తుభ్యం, త్రిగుణాయామృతాయచ,
నమో ధర్మాయ హంసాయ, జగజ్జనన హేతవే,
నర నారీ శరీరాయ, నమో మీడుష్టమాతయే
ప్రజ్ఞానాఖిలేశాయ, సప్తాశ్వాయ త్రిమూర్తయే,
నమో వ్యాహృతి రూపాయ, త్రిలక్షాయాసుగామినే,
హర్యశ్వాయ నమస్తుభ్యం, నమో హరిత బాహవే,
ఏకలక్ష, విలక్షాయ, బహులక్షాయ దండినే,
ఏక సంస్థ, ద్విసంస్థాయ, బహుసంస్థాయతే నమః
శక్తిత్రయాయ శుక్లాయ, రవయే పరమేష్టినే,
త్వం శివస్త్వం, హరిర్దేవ, త్వం బ్రహ్మాత్వం దివస్పతిహి,
త్మమోంకారో, వషట్కారః స్వధా స్వాహా త్వమేవహి,
త్వామృతే పరమాత్మానాం, నతత్పశ్యామి దైవతమ్

అసంఖ్యాక కిరణములతో సంశోభితమయ్యే ఓ అంశుమాలిన్! వరములు ప్రదానం చేయటంలో నువ్వే సర్వసమర్థునివి. హే జ్యోతిస్వరూపా! నీ స్వరూపం అంతములేనిది. నీ నామములు అనంతములు. త్రిలోక చక్షువు నీవే! త్రిగుణాత్మకమైన నీ రూపము, అమృతమయము. జగత్సృష్టికర్తవు నీవే! ధర్మస్వరూపా! హంస అని కూడా పిలువబడే నీవు, సప్తాశ్వయుతమైన రథముపై త్రిలోకాలలోనూ సంచరిస్తూ ఉంటావు! ఓ జ్ఞానభాండారమా! అఖిలేశునిగానూ, శివస్వరూపునిగానూ, సతత గతిశీలునిగానూ, వినతులందుకునే భగవన్! ఏకలక్ష, విలక్ష, బహులక్ష, ఏకసంస్థ, ద్విసంస్థ, బహుసంస్థాది నామాలన్నీ నీ పర్యాయ పదాలే! పరమేష్టి సంజ్ఞతో సుశోభితుడవైన హే భగవన్! నీలో బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల మూడు శక్తులూ నెలకొని వున్నాయి. ఓంకార, వషట్కార, స్వాహా, స్వధా స్వరూపమైన నీవే పరమాత్మవు. సదా నిన్నే నేను శరణు వేడుతాను.

*****

సాహిత్యంలో సూర్యుడు:

దక్షిణ భారత దేశంలో పల్లవ రాజుల కాలంలో, మయూర మహాకవి విరచిత సూర్య శతకంలో:

ప్రభా వర్ణనం (1-43)
అశ్వ వర్ణనం (44-49)
అనూరు వర్ణనం (50-61)
రథ వర్ణనం (62-72)
మండల వర్ణనం (73-80)
రవి వర్ణనం (81-100)

అన్న విభాగాలున్నాయి. ఇందులోని వర్ణనలు, అత్యంత సుందరాలు. కల్పనాచమత్కృతి అమోఘం. అర్థవంతం కూడా!

ఆ చిత్రభానుని కిరణాలను వివిధ రీతుల వర్ణిస్తూ – “అవి కిరణాలు కావు, ఆ పద్మ బాంధవుని పవిత్ర పాదాలు. ఆ కిరణలు శుభములకు ఆవిష్కరణలు. ప్రకృతికి అలంకారాలు. చాలా శక్తిమంతాలు. భక్తి భరితాలు. వీటి స్వభావం చాలా చిత్రంగా వుంటుంది. ఇవి అతి సుకుమారమైనవి. అతి కఠినమైనవీ కూడా! పద్మాల హృదయాలలో చేరి ఆనందం అందించి చక్కిలిగిలి పెడతాయి. పర్వత పాషాణ చిత్రాలలో ప్రవేశించి చైతన్యాన్ని అందిస్తాయి” అని ఇలా మొదలై పోనుపోనూ అభివ్యక్తిలో చిక్కదనం ఇనుమడిస్తూ ఇనుమడిస్తూ సూర్యునికీ, శ్రీమన్నారాయాణునికీ అభేదం సూచించేంతవరకూ వెళ్ళటం – నిజంగా అద్భుతం.

సూర్యుడెలా వున్నాడు? ప్రకృతికి బంగారు భూషణం వలె, పద్మరాగమణి వలె, ఆకాశమనే నీలి కలువపై పసుపు వన్నె పుప్పొడివలె, కాల పన్నగ శిరముపై మహారత్నము వలె, విశ్వసుందరి కంఠాన మెరుస్తున్న శుభకర మంగళసూత్రము వలె కాంతులు ప్రతిఫలింపగా మంగళకరముగా సూర్యమండలం కనిపిస్తున్నదనటం మయూరకవి అపూర్వ కల్పనాచాతురికి పరాకాష్ట!

ఇంతేనా? “ఆదిత్య దీప్తి అఖిల ప్రపంచానికి రక్షణ కవచం. రవిమండలం మహాయోగీశ్వరులకు ముక్తి మార్గం చూపించే అఖండ దీప్తి. కడుపులో పెనుమంటలు పెట్టుకుని, లోకం కోసం ప్రాణికోటికి చాలినంత వరకే కాంతిని వారి ఉపయోగం కోసం ప్రసారం చేసే ఆదిత్యుని యేమని కీర్తించగలం? మహాత్ముల మనస్సులే అంతగదా!” అంటాడు.

ఆయన నడకలో చంచలుడైనా, లోకోపకారిగా అచంచలుడే! భూమికి వర్షమూ, హర్షమూ ప్రసాదించే ఆయన గ్రహపతి. సూర్యరధ సారధి అనూరుడూ, శ్రీమన్నారాయణుడి రధసారధి గరుడుడూ ఇద్దరూ వినతా సూనులే! పైగా అనూరుడు గరుడుడికి అగ్రజుడు కూడా!

శ్రీమన్నారాయణునివలెనే సూర్యుడూ తన రధారూఢుడై, నిరంతరమూ లోకాలలో సంచరిస్తూ, వెలుగును ప్రసాదిస్తూ వుంటాడు. ఒక ద్వీపంలో ఆయన వెలుగు మండుటెండవుతుంది. అదే వెలుగు మరో ద్వీపంలో పండువెన్నెల కాస్తుంది. అన్ని వెలుగులూ ఆయనవే!

దేశకాలాలకు ఆయన అధిపతి. ఆయన ఒక్కడే అన్ని దేశాలకూ, ద్వీపాలకూ అన్నిలోకాలకూ అధిపతి” అంటూ సూర్య సార్వభౌమత్వాన్ని ప్రతిపాదించిన మయూరుడు తన కావ్యం యొక్క ఫల శృతిలోయీ తన శతకాన్ని భక్తి శ్రద్ధలతో పాఠం చేసిన వారు సర్వ పాపాలనుంచీ విముక్తులవటమే కాక వారికి ఆరోగ్యం, సత్కవిత్వం, అతులనీయమైన బలం, విద్య, ఐశ్వర్యం, సంపదలూ – అన్నీ సూర్య ప్రసాదాలుగా లభిస్తాయని ఘంటాపథంగా చెబుతున్నాడు.

అంత విశ్వాసమున్నదన్నమాట తన రచనమీద మయూరునికి!

*****

వివిధ దేశాలలో సూర్యారాధన:

ప్రపంచవ్యాప్తంగా సూర్యారాధన విభిన్న నామాలతో అనాది కాలం నుంచీ జరుగుతూనే వుందన్నది అక్షర సత్యం.

“సూర్య ఆత్మా జగత్ స్తస్థు షశ్చ” – ఋగ్వేదం సూర్యుణ్ణే జగదాత్మ అంటున్నది.

పూషన్, భగ్, మిత్ర, అర్యమన్, విస్వత్ – ఇవన్నీ ఆ భాస్కరుని నామాలే!

రామాయణ, మహాభారతాల్లో సూర్య సంబంధమైన వివరణలనేకం ఉన్నాయి. సూర్యోపాసన గురించిన అనేక ప్రమాణాలూ పురాణల్లో చాలా దొరుకుతాయి. విష్ణుపురాణం సూర్యుని రథ విస్తారమే, నూరువేల యోజనాలంటున్నది. దీనికి రెండింతలు దీని ఈషా దండము. దీని ఇరుసు (ధుర) ఒకటిన్నర కోటీ యేడు లక్షల యోజనాల పొడుగట! దీనికే యీ రథ చక్రమున్నది. ఆ అక్షయ రూపమైన సంవత్సరాత్మక చక్రములో సంపూర్ణ కాలచక్రమున్నది.

గాయత్రి, బృహతి, వుష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అన్న యేడూ సూర్య రధాశ్వాలు.

మత్స్య, భవిష్య, విష్ణుధర్మోత్తర, అగ్నిపురాణదులలో సూర్యమూర్తికి సంబంధించిన అనేక విశేషాలు లభ్యాలు. భారతీయ శిల్ప కళల్లో, సూర్యుని రూపాలు ప్రాచీన కాలం నుంచే కనిపిస్తున్నాయి.

సూర్య విగ్రహాలు – వివరాలు:

భారతదేశంలో లభ్యమైన ప్రాచీన సూర్య ప్రతిమలలో, కొన్ని రధారూఢునిగా, కొన్ని నిలుచుని ఉన్న భంగిమలోనూ వున్నాయి. రధారూఢుడైన సూర్య ప్రతిమలలో, ఒకే చక్రమున్న రధం పై, ఒకటినుండీ యేడు అశ్వాలు నడుపుతున్న విధానం కనిపిస్తుంది.

కొన్ని ఉత్తరభారత ప్రతిమలు విచిత్రంగా చక్కటి పాదరక్షలూ, పైజామా, పెద్ద చొక్కా, కిరీటంతో కనిపిస్తుండగా కొన్నింటిలో భుజాలక్రింద రెండు రెక్కలూ ఉండటం గమనార్హం.

ప్రాచీన దక్షిణభారత సూర్యుడు కమలాలవంటి పాదాలూ, ధోతీ, ఆచ్ఛాదనలేని విశాలమైన వక్షస్థలంతో దర్శనమిస్తున్నాడు.

క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శుంగ కాలంలో నిర్మితమైన ఒక స్థంభం పైన నాలుగు అశ్వాలు పూన్చిన రధంపై ఆరూఢుడైన సూర్యుని విగ్రహం బుద్ధగయలోని పురాతత్వ సంగ్రహాలయంలో వుంది.

ఒరిస్సాలోని ఖందగిరి లోని అనంత గుహలో లభించిన సూర్య ప్రతిమ కూడా ఇలాగే నాలుగు గుర్రాలు పూంచిన రధంపైనున్న మూర్తిదే!

కుషాణ కాలం (క్రీ.శ. 2-3 శతాబ్దాలు) నాటి చాలా సూర్య ప్రతిమలు మథుర ప్రాంతాలలో లభించాయి. ఇవి ఒక విధమైన ఎర్రటి యితో తయారైనవి. నాలుగు గుర్రాలు లాగుతున్న ఒకే చక్రమున్న రధంపై ఆసీనుడైన సూర్య ప్రతిమలూ కొన్ని వీటిలో వున్నాయి.

క్రీ . శ. 325 నుండి ఆరవ శతాబ్దం మధ్య కాలంలో ఎన్నో దేవాలయాల నిర్మాణమూ జరిగింది. ఈ కాలం నాటి విశిష్ట ప్రతిమొకటి ఆఫ్ఘనిస్తాన్ లోని ఖైర్ ఖనేహ్ లో దొరికింది. ఈ పాలరాతి ప్రతిమ అరుణుడు నడుపుతున్న, నాలుగు అశ్వాలు పూన్చిన రధం పైనున్న భాస్కరునిది.

ఉత్తర గుప్త యుగానికి చెందిన మరో సూర్యమూర్తి కి ఇరువైపులా దండ, పింగళులున్నారు. ఇది ప్రస్తుతం లండన్ లోని సంగ్రహాలయంలో వుంది.

పూర్వ మధ్య యుగంలో కాశ్మీర దేశంలో సూర్యోపాసన చాలా ప్రచారంలో వుండేది. లలితాదిత్యుడనే రాజు చాలా పెద్ద సూర్య దేవాలయాన్ని కట్టించాడు అప్పట్లో, అది ఇప్పుడు శిధిలావస్థలో ఉంది.

మధ్య యుగం నాటి ఉత్తర భారత దేశం సూర్యారాధనకు పెద్ద పీట వేసింది. ప్రతిహార వంశానికి చెందిన చాలామంది శాసకులు సూర్య భక్తులే. యెన్నో దేవాలయాలను వాళ్ళు కట్టించారు.

రాజస్థాన్ లోని ఓషియా అన్న చోట పదవ శతాబ్దానికి చెందిన ఒక సూర్య దేవాలయం ఉంది. కానీ అందులో సూర్య ప్రతిమ లేదు. ఇదే కాలంలో మట్టితో చేసిన ఎన్నో సూర్య ప్రతిమలూ దొరికాయి. ప్రతిహార వంశం తరువాత రాజస్తాన్ లో చౌహాన్ వంశం అధికారం లోకి రాగా అటు వుత్తర ప్రదేశంలో గాహడ్ వంశస్తులు పరిపాలన చేశారు. వీరి కాలం నాటి సూర్య ప్రతిమలు అజ్మేర్ మరియు ఢిల్లీ సంగ్రహాలయాలలో వున్నాయి.

గుజరాత్ లో చాళుక్య వంశ కాలంలో, మోధేరా అన్న చోట నిర్మితమైన సూర్య దేవాలయం ఇప్పుడు శిధిలావస్థలో వుంది. బడౌదాకు సమీపంలొని కాయంద్రా అన్నచోట సూర్యమందిరం తాలూకు తోరణ ద్వారం, తొమ్మిది-పది శతాబ్దాల నాటిదట.

మధ్యప్రదేశ్ లో చందోల్ శాసకుల కాలంలో ఖజురహోలో సూర్యమందిర నిర్మాణం జరిగింది. ఇక్కడున్న ఇతర దేవాలయాల పైన ఆసీన ముద్రలో సూర్య ప్రతిమలు కాన వస్తాయి.

మధ్య ప్రదేశ్ లోనే భేటాఘాట్ అన్న ప్రదేశం లో గౌరీశంకర ప్రతిమలతో పాటూ,11-12 శతాబ్దాలకు చెందిన రధారూఢుడైన సూర్యుని ప్రతిమ వుంది.

ఈశాన్య భారతంలో పాల శాసకులు బౌద్ధ మతానుయాయులైనా ఆనాటి సూర్య ప్రతిమలెన్నో పాట్నా, కోల్కత్తా, గవుహతి సంగ్రహాలయాల్లొ భద్రపరుపబడ్డాయి.

అదే కాలం నాటి మరికొన్ని సూర్య ప్రతిమలు లండన్, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో శిల్ప సంగ్రహాలయాలలో వున్నాయి.

బెంగాల్లో పాల శాసకుల తరువాత సేన్ శాసకులు వచ్చారు. ఆనాటి చక్కటి సూర్య ప్రతిమలు ఈనాడు డిల్లీ సంగ్రహాలయంలో వున్నాయి.

ఒరిస్సాలో మధ్య యుగంలో గంగ శాసకుల పరిపాలన కూడా సూర్యోపాసనను ప్రోత్సహించింది. నరసింహ వర్మ అన్న రాజు పదమూడవ శతాబ్దిలో కుష్టు రోగం నుండి విముక్తి పొందడానికని సూర్య దేవాలయాన్ని నిర్మించాడంటారు.

మన భారతదేశంలో సూర్యునికి గల దేవాలయాలలో ప్రముఖమయినది ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం. గుజరాత్ నందున్న మోదెరాలో కూడా ఒక సూర్య దేవాలయం ఉంది.

ఇక దక్షిణ భారత దేశంలో పల్లవ రాజుల కాలంలో మయూరుడు సూర్య శతకాన్నే వ్రాశాడు. (ఈ వివరాలు ముందు ప్రస్తావించటం జరిగింది.) అనేక దేవాలయాల నిర్మాణమూ జరిగింది. చోళ రాజుల కాలంలోనూ సూర్యుని పాషాణ, దారు శిల్పాలు చాలా దొరికాయి.

ఇక కర్ణాటక లో మధ్యయుగం నాటి బేలూరు, హళేబీడు మందిరాలలో అనేక సూర్య ప్రతిమలు లభ్యాలు. హోయసల రాజుల కాలం నాటి సూర్య ప్రతిమలలో, దక్షిణ భారత శిల్ప కళా వైభవం సుస్పష్టం.

మన రాష్ట్రంలో శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం కూడా ప్రసిద్ధి చెందినదే. పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం ప్రముఖమయినది . పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ లో కూడా సూర్యదేవాలయం ఉంది.

భారత-గ్రీక్ దేశాలకు వారధి సూర్యుడు:

కేవలం భారతదేశం లోనే కాదు గ్రీక్ దేశంలోనూ మన సూర్యోపాసనను పోలిన భావధార కనిపిస్తుంది. అక్కడి అపోలో, డయానా కథల్లో కూడా మన ఉషాదేవి-సూర్యుని చుట్టూ తిరుగుతున్న కథలవలెనే చాలా పోలికలు కనిపిస్తాయి. రెండు దేశాల వివాహ పద్ధతులలోనూ సూర్య మంత్రాలను ఉచ్చరించటం చూస్తే యీ వాస్తవం అవగతమౌతుంది.

మెక్సికో దేశంలోనూ విశ్వ సృజనకు మూలం సూర్యుడనే నమ్ముతారు.

చైనా యాత్రికుడు హుయాన్సాంగ్, అరబ్ రచయిత అల్ ఇద్రిసీ, అబూఇషాక్, అల్ ఇస్తర్బీ వంటి వారి రచనల్లోనూ భారతదేశంలో ఆయా కాలాలలోవారు చూచిన సూర్య దేవాలయల ప్రస్తావన వుండటం చూస్తే భారతదేశనికీ, సూర్యోపాసనకూ వున్న అనుబంధం అతి ప్రాచీనమైనదే కాక అతి పవిత్రమైనదని కూడా అవగతమౌతున్నది.

అందుకే సూర్యునికున్న పేర్లలో ఒకటైన ‘మిత్రుడు’ అన్న పదం యుగయుగాలనుంచీ భూమండలంతో సూర్యునికున్న మైత్రీబంధానికి ప్రతీకగా, అర్థవంతమైనదిగా, సార్థకతతో కూడినదిగానూ కూడా అభివర్ణించవచ్చును.

*****

Your views are valuable to us!