ఊహ తెలిసిన నాటినుండీ మనసు కలలు కంటూనే ఉంది
అడుగడుగునా ఆనంద స్వప్న తీరాలు చేరుకోవాలని
చిన్ని చిన్ని ఆశలనుండి జీవిత గమ్యాలు
ఆపకుండా ముందుకు పరిగెట్టిస్తూనే ఉన్నాయి
కోరిన నెలవులకు చేరిననాడు
మరిన్ని తీరాలు దూరాన నిలిచి ఊరిస్తున్నాయి
కలగన్నది చేజారినప్పుడు
నిరాశ నిస్పృహలు పట్టి వెనక్కు లాగుతున్నాయి
అయినా సరే మనసు కలలు కంటూనే ఉంది
స్వప్న తీరాలు చేరుకోవాలని ఆశపడుతూనే ఉంది
ప్రయత్నాల అలలు దరి చేరాలని ఎగిసిపడుతూ
తీరం చేరే లోపలే కొన్ని ఫెళ్ళున విరిగిపడుతున్నాయి
ఊహకందని పరిణామాలు దశనే కాదు దిశను కూడా మార్చేవేళ
దిక్కుమాలిన దైన్యం నేలకేసి అదుముతుంది
“ఇంకెంత శ్రమ పడతావు..” చాలు రాజీ పడమంటుంది
“రాసిపెట్టి లేదు” అని వైరాగ్యాన్ని వల్లెవేస్తుంది
యే మూలనో అహం అంగీకరించదు..పోరాటం చేద్దామంటుంది
సర్వ శక్తులూ సమీకరించి ముందు ముందుకే పొమ్మంటుంది
కలల తీరాలు చేరి సేద తీరమంటుంది..!