సైకిలెక్కిన వేళ
మరిన్ని చక్కటి అనుభూతుల్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చదువుపై శ్రద్ధ చక్కగానున్నా
స్కూలు కూలికి నే సెలవుచెప్పి
సగటు మార్కులు చాలునంటూ
సైకిలెక్కిన వేళ మరువగలనా నే మరువగలనా
పట్టుమన్పదమూడు నిండదు
పక్కతొక్కుడు తొక్కుకుంటూ
సీటు పైనకి ఎగరబాకుతూ
పెడలు అందక పడ్డ కష్టము
ప్లేనులెక్కినా మరువగలనా నే మరువగలనా
గేటుమూసే ఘడియ వరకూ
గానుగెద్దులా గాడితప్పక
గొందుసందులు తిరుగుచుండి
గడిపివేసిన ఘట్టమును మరువగలనా నే మరువగలనా
పాత సైకిలు పైన పయనము
పంటకాల్వల ప్రక్కనంబడి
పాలి దాటి పోరంకి మీదుగ
అల’కంకి’ తాకుటన్మరువగలనా నే మరువగలనా
మండుటెండన మానికొండన
మానుక్రిందన మట్టిగట్టున
మఠము వేసుకు మజ్జిగన్నము
మరిభుజించుట మరువగలనా నే మరువగలనా
గుడివీధిలో నుండి గుడివాడ వరకును
గోలిసోడాకైన గవ్వ లేకుండ
గొంతెండిపోతున్నా గాడ్పులెనున్నా
గాఢమైనస్స్వేచ్ఛని మరువగలనా నే మరువగలనా
విశృంఖలమ్మైన విజయకృష్ణమ్మ
వడిలోన జనియించి విజయపురినుంచి
లాకులున్తాకుతూ లలితముగపారుతూ
వీరంకి దాటంగ వీరంగమాడుతూ
వేనూళ్ళుకున్నట్టి వెలనాటికింపయ్యి
వేవేల రాజనాల్మురియు పండించి
కొండపైనున్నట్టి అమ్మ దీవెనల్దెచ్చి
కండతో పాటుగా గుండె నిబ్బరమిచ్చి
కడు పెంచినటువంటి పిల్లకాల్వల మంచి
వేలండనుల్వెళ్ళి ఆథేమ్సులన్తాకి
వెస్టెండులందాడు వెఱ్ఱివేషముల్జూసి
వింతలెన్నంటినన్మరువగలనా నే మరువగలనా
*****
అందమైన అనుభూతులను మా ధ్వని పాడ్కాస్ట్ లో పంచుకోండి, ఆనందించండి. Subscribe to Dhvani Podcast.