నూత్నాశంస

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 5]

నవ వత్సర రూపమ్మున
ప్లవ వచ్చెను వేగిరముగ పరుగుడి రారే
యువ భావన రేకెత్తగ
నవ జీవన రాగ రీతి నామతి జేయన్!

 

     వీచెను జల్ల గాలియదె వీణియ విన్పడె దివ్య వల్లరుల్

     తోచెను నూత్న మార్గముల  దూగిస లాడెను భవ్య జ్యోత్స్నలున్

     గాచును నిన్ను, నీ జనుల, గామ్యము స్వాస్థ్యము సవ్య శోభలన్

     దోచుగ, యీ యుగాది ప్లవ,  దోసిలి నింపును హర్ష సంపదల్!

 

వచ్చెనుగా వాసంతము

 తెచ్చెనుగా ద్రాక్ష తీయ తేనియ లిటకున్

విచ్చెనుగా తొలి రేకలు

 నచ్చెనుగా  కోయిలమ్మ నవ రాగము నన్!

 

   గడచిన మూడు వర్షముల గాలిన వత్తుల మైతిమీ గతిన్

   జెడినది విశ్వ మంత యును జేతుల మూతుల శాటి వాడకన్

   వడి వడి నాదు దేశమిదె  వాసిగ గన్గొనె నౌషధిన్ భళా!

   మడమను ద్రిప్ప బోదు గద, మామక సంస్కృతి ముందు ముందికన్!

 

ఒక రసావేశము  ఓలలాడును గదా

   క్రొత్త వత్సర వేళ కోర్కె మదిని ,

ఒక భావనాలోక మూహాజనిత రాగ

    వల్లరై మ్రోగును వైభవముగ

ఒక నిర్వచన వ్యాఖ్య కొదవని యర్థమ్ము

 రవళించు హృది గాదె లాలనమున

ఒక చోట నిలువగా నోర్పు జూపని వెడ

   జాడ లెరుగలేని సౌరదేదొ

     నాటి మేటి కవుల ననలెత్తు భావాల

         వేడుకౌను దివిగ  విపుల    జూడ 

     నేటి మాటలందు నీటైన రీతుల

         కోవిదు కథ వినుట ఘోరమయ్యొ!

 

తొలగెను శార్వరి నేడిక,

మలగునులే నేటితోను   మాయ కరోనా

గలతలు వెట్టిన ఘడియలు,

వెలుగును మన భావి మేటి వేవే వెలుగుల్!

 

ప్లవమనగా తెప్పట, మరి   

ప్లవ మన వానరము గూడ,  పవనాత్మజుడౌ

ప్లవ వత్సర మీ విధిగా

ప్లవ, పవ నాత్మజుని రీతి భవ మొసగునుగా!

 

క్రొత్త వర్షము క్రొత్త హర్షము క్రొత్త తర్షము తెచ్చెగా

క్రొత్త వేడుక క్రొత్త వాడుక క్రొత్త తోడుగ మారెగా

క్రొత్త వన్నెల క్రొత్త చిన్నెల క్రొత్త   వెన్నెల పూవుగా

క్రొత్త   ఈడుగ క్రొత్త జోడుగ , క్రొత్త తోడుగ సాగుగా!

Your views are valuable to us!