చర్ల గణపతి శాస్త్రి ఆంధ్ర సాహిత్య పారంగతునిగా అందరికీ తెలుసు. కానీ ఆయన సంగీతశాస్త్ర పారంగతుడు కూడా! ఆంధ్ర పత్రిక, మున్నగు పత్రికలకు సంగీతకళ గురించి, ఎన్నో విశేషాలను పరిశోధించి, ప్రజలకు అందించారు.
ఒకసారి” చర్ల గణపతిశాస్త్ర్త్రి ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. ఆతడు విశాఖపట్టణ నివాసి.ఆ కంపార్టుమెంటులో వేరొక సుప్రసిద్ధ గాయకుడు కూడా ఉన్నాడు. ఇరువురూ లోకాభిరామయణంలోకి దిగారు. చర్ల గణపతి శాస్త్రి ఆ గాయకుని అడిగారు. ఆరోజు రైలులోని ఆ బోగీ కొత్త ఆవిష్కరణల సారాంశాన్ని అవగతం చేసుకున్నది.
“ఏమండీ! సంగీత కచేరీలు చేసే వారందరూ – తదిరినాం, తదిరినాం…..
అంటూ ఉంటారు కదండీ! అంటే ఏమిటీ?
దానికి అర్ధం ఏమిటండీ?”
అకస్మాతుగా వేసిన ఆ ప్రశ్న, చర్ల గణపతిశాస్త్రి పెదవులనుండి వచ్చినది!!
అందాకా అతడు – చర్ల గణపతిశాస్త్రి సందేహాలన్నిటినీ టక టకా సమాధానాలిస్తూ తీర్చారు.
ఈ ప్రశ్నకు మాత్రం జవాబు తోచక తికమక పడసాగాడు అతడు.
“ దానికి ఎలాటి అర్ధ తాత్పర్యాలూ లేవు. రాగాలాపన చేస్తున్నప్పుడు ‘ తదిరినాం’ అనే ఉచ్ఛారణను ఊతపదంగా వాడుతున్నాము. అంతేనండీ!” అని ఆ తోటి ప్రయాణీకుని ఉవాచ.
ఈ సారి అతనికి డౌట్సును తీర్చే పనిని-చర్ల గణపతిశాస్త్రి అంది పుచ్చుకున్నారు. చర్ల గణపతిశాస్త్రి ఆషామాషీగా చెప్పినట్లుండే వాక్కులలో సైతం విజ్ఞానం వెల్లివిరిసేది. అత్యున్నత ఆధ్యాత్మికతత్వాన్ని మన ప్రాచీనులు,సర్వకళలకూ మేలిమి బంగరుపూతగా అలది, సౌందర్య భాసితమొనర్చిన సత్సంప్రదాయాన్నిమనకు అందించారు.ఈ సంగతులనే చర్ల గణపతి శాస్త్రి అచ్చట ప్రస్తావనలోకి తెచ్చారు.
“మన ప్రాచీన కర్ణాటక సంగీతం ఆధ్యాత్మికతత్వాన్నిప్రబోధించింది….” అంటూహిందూ సంగీత, లలిత కళల అంతరంగాన్ని కరతలామలకం చేస్తూ, చర్ల అనేక సంగతులను చెప్పారు. “ఇంతకీ తదిరినాం – అనే పదార్ధం ఏమిటండీ?”ఆ విశాఖ పట్టణ వాసి ప్రశ్నార్ధక సందేహం వెలిబుచ్చాడు.
“తదితరానాం – అనే మాటకు వికృతి – తదినారిం. = దానికంటే ఇతరమైనది – అని
ఆ పలుకుకు సారాంశము. సంస్కృతములో – న – అనగా లేదు – అనే వ్యతిరిక్తార్ధము.
అన నేమిటన్నమాట?ఆ నాదము కన్న ఇతరమైనది కనీ, వేరైనది కానీ లేనేలేదు – అని తాత్పర్యము.”
అలాగ సందేహ నివృత్తి చేసారు చర్ల గణపతిశాస్త్రి.
ఆయన అనేక గ్రంధాలను రచించారు. సంగీతశాస్త్ర పూర్వాపరాలను తన సునిశిత పరిశోధనలతో పరిగ్రహించి, సాహితీ జిజ్ఞాసువులకు అందించారు. “సామ వేద దిదం గీతం సంధ్యా గ్రహ…….” సామ వేదం నుండి సంగీత శాస్త్రము గ్రహించబడినది. శారఙ్గదేవుడు రచించిన “సంగీత రత్నాకరము” ప్రాచీనమైన గ్రంధాలలో ఒకటి.అందులో శ్రీమత్ ఆంజనేయస్వామి ప్రతిపాదించిన కొన్ని సంగీత మతాలు వివరించబడినవి. ఆంజనేయ విరచిత సంగీత, నవ వ్యాకరణాది గ్రంధాలు ఇప్పటికీ మనకు లభ్యం కాలేదు. అదృష్టవశాత్తూ, కంఠోపాఠం చేసే వేదమంత్ర సాంప్రదాయమే – మనకు అనేక పురాతన సూక్తులూ, ప్రవచనాలూ, సిద్ధాంతాలు – నిత్య వ్యవహారంలో, వాడుకలో,అనేక భాషలలో లభించేటట్లు చేసాయి. సంగీతజ్ఞుల నాలుకలపైన ఆడే సుభాషితం – “శిశుర్వేత్తి, పశుర్వేత్తి; వేత్తి గాన రసం ఫణిః” ఇత్యాది సుభాషితోక్తులు ఈనాటికీ జన వాక్కులుగా ప్రజలకు అందుబాటులో ఈ కారణము వలననే ఉన్నాయి కదా! ”
ఇలాగ మన సంగీతము యొక్క పునాదులను, విశేషాలనూ గణపతిశాస్త్రి తెలుపుతూంటే, రైలు బండి చుక్ చుక్ ధ్వని లయబద్ధంగా సాగింది. మొత్తానికి, ఆ రోజు తదిరినాన శబ్ద ధాతు వివరణలను ఆ బోగీలోని శ్రోత “అరటిపండు వలిచి, అరచేతిలో పెట్టినట్లు”అందుకోగలిగాడు.